స్మైల్ సర్జరీ తరువాత పెళ్లికొడుకు మృతి.. అనస్తీషియా ఓవర్‌డోస్ కావడంతో చనిపోయారా?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
దంత వైద్యం చేయించుకున్న కాసేపటికే ఒక యువకుడు చనిపోయాడు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఈ ఘటన జరిగింది. వింజం లక్ష్మీనారాయణ అనే యువకుడు స్మైల్ డిజైనింగ్ సర్జరీ చేయించుకున్న కొంతసేపటికే అపస్మారక స్థితిలోకి వెళ్లి చనిపోయాడు.
అనస్తీషియా అధిక మోతాదులో ఇవ్వడంతోనే లక్ష్మీనారాయణ చనిపోయారని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇంతకీ లక్ష్మీనారాయణ చనిపోవడానికి కారణమేంటి? అనస్తీషియా మోతాదు మించితే చనిపోతారా? డాక్టర్లు ఏం చెబుతున్నారు? స్మైల్ డిజైనింగ్ సర్జరీ అంటే ఏమిటి? అసలిది ఎందుకు చేయించుకుంటారు?
అసలేం జరిగింది?
వింజం లక్ష్మీనారాయణది సూర్యాపేట జిల్లా మిర్యాలగూడలోని సరస్వతినగర్.
ప్రస్తుతం వారి కుటుంబం కూకట్‌పల్లిలోని హైదర్‌నగర్‌లో నివసిస్తోంది.
లక్ష్మీనారాయణకు ఇటీవల పెళ్లి కుదిరింది. ఫిబ్రవరి 15న నిశ్చితార్థమైంది. మార్చి 31న వివాహం జరగాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో స్మైల్ డిజైనింగ్ సర్జీ చేయించుకోవాలని లక్ష్మీనారాయణ నిర్ణయించుకున్నారు. ఈమేరకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ కు వెళ్లాడు.
‘‘మధ్యాహ్నం 2.30 గంటలకు లక్ష్మీనారాయణ ఆసుపత్రికి వచ్చాడు. ఆ తర్వాత 3.30 గంటలకు చికిత్స ప్రారంభమైంది. లోకల్ అనస్తీషియా ఇచ్చి సర్జరీ పూర్తి చేశాం’’ అని ఎఫ్ఎంఎస్ డెంటల్ క్లినిక్ కన్సల్టెంట్ ఫేషియో మాక్సిల్లరీ సర్జన్ డాక్టర్ బీవీ రామకృష్ణారెడ్డి చెప్పారు.
క్రౌన్ లెంథనింగ్ ప్రక్రియ తర్వాత పంటి నొప్పి వస్తున్నట్లు లక్ష్మీనారాయణ చెప్పారని వివరించారు.
‘‘రాత్రి 7.55 గంటల సమయంలో నీళ్లలో కలిపిన పెయిన్ కిల్లర్ ఇచ్చాం. కేవలం ఒక్క గుటక వేసి ఉమ్మేశారు. తర్వాత కడుపులో నొప్పి, కళ్లు తిరుగుతున్నాయి అనేసరికి విశ్రాంతి గదికి తరలించాం. యాంటాసిడ్, యాంటీ అలర్జీ మందులు ఇచ్చినా.. వేసుకోలేక ఉమ్మేశారు. ఆ సమయంలో బీపీ 80/50కు పడిపోయింది. పల్స్ రేటు కూడా పడిపోయింది. వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ అందించి అడ్రినలిన్ ఇంజెక్షన్ ఇచ్చాం. తర్వాత సీపీఆర్ చేశాం. పరిస్థితి విషమించడంతో జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించాం. అప్పటికే లక్ష్మీనారాయణ చనిపోయారు’’ అని రామకృష్ణారెడ్డి చెప్పారు.

ఫొటో సోర్స్, UGC
కుటుంబ సభ్యుల ఆరోపణ ఏమిటి?
పంటి చికిత్స కోసం వెళితే తమ కొడుకు ప్రాణాలు కోల్పోయాడని తండ్రి వింజం రాములు మీడియాకు చెప్పారు.
‘‘మా అబ్బాయి చనిపోయినట్లు ఆసుపత్రివాళ్లు ముందుగా చెప్పలేదు. కేవలం ఎమర్జన్సీ అని చెప్పారు. తీరా ఆసుపత్రికి వెళ్లేసరికి చనిపోయి ఉన్నాడు.
దంత వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయాడు. అనస్తీషియా కూడా ఎక్కువగా ఇచ్చారు.’’ అని రాములు చెప్పారు.
ఎఫ్ఎంఎస్ ఆసుపత్రి ఏమంటోంది?
లక్ష్మీ నారాయణ చనిపోవడం వెనుక నిర్లక్ష్యం ఏమీ లేదని చెబుతోంది ఎఫ్ఎంఎస్ డెంటల్ ఆసుపత్రి. ఈ విషయంపై బీవీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. ‘‘చికిత్స జరుగుతున్నంతసేపు పేషెంట్ బాగానే ఉన్నాడు. ఫోన్ చూసుకున్నారు.
కానీ, అతను చాలా ఆందోళనగా ఉండటం గమనించాం. అది తనకు పెళ్లి కుదరడం వల్ల కావొచ్చని భావించాం. మరోవైపు లక్ష్మీనారాయణకు ఏడాదిన్నర కిందట వేరొక ఆసుపత్రిలో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ జరిగింది. ఆ సమయంలోనూ అనస్తీషియా కచ్చితంగా ఇచ్చి ఉంటారు. అందుకే అనస్తీషియాతో అలర్జీ వచ్చిందని అనుకోవడానికి లేదు.’’ అని చెప్పారు.
లక్ష్మీనారాయణకు క్రౌన్ లెంథనింగ్ చికిత్స రెండు దశలో చేశారు.
‘‘రెండు దశలో కలిపి అనస్తీషియా ఒకసారి 0.6ఎంఎల్, మరొకసారి 0.5 ఎంఎల్(రెండూ కలిపి 1.1 ఎంఎల్) డోసులు ఇచ్చాం. ఇది చాలా తక్కువ మోతాదు.’’ అని చెప్పారు బీవీ రామకృష్ణారెడ్డి. అతను చనిపోవడానికి కారణాలు త్వరలోనే తెలుస్తాయని చెప్పారు.
పోలీసులు ఏం చెబుతున్నారంటే..
లక్ష్మీ నారాయణ తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసుస్టేషన్ లో కేసు నమోదైంది.
ఐపీసీ 304ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు జూబ్లీహిల్స్ ఎస్.హెచ్.వో కె.వెంకటేశ్వరరెడ్డి ‘బీబీసీ’కి చెప్పారు.
నిర్లక్ష్యంగా వ్యవహరించి, వ్యక్తి మరణానికి కారణమయ్యారన్న అభియోగాలపై ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తుంటారు.
‘‘అనస్థీషియా ఓవర్ డోస్ లేదా వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తమ కొడుకు చనిపోయి ఉంటారని రాములు ఫిర్యాదు ఇచ్చారు. పోస్టుమార్టం నివేదిక రావడానికి సమయం పడుతుంది. వైద్యుల నివేదిక(ఈస్ట్రో పాథాలజీ), ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు.. రెండు కలిపి వచ్చాక యువకుడి చావుకు కారణంపై స్పష్టత వస్తుంది. ఆ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటాం.’’ అని చెప్పారు వెంకటేశ్వరరెడ్డి.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
మరి యువకుడు ఎలా చనిపోయినట్టు?
అనస్తీషియా అధిక మోతాదులో ఇవ్వడంతోనే లక్ష్మీనారాయణ చనిపోయినట్టు తండ్రి ఆరోపిస్తున్నారు.. తాము మాత్రం 1.1ఎంఎల్ మాత్రమే ఇచ్చామని ఆసుపత్రివర్గాలు చెబుతున్నాయి. మరి, యువకుడు ఎలా చనిపోయి ఉంటాడనే విషయం ఇప్పుడు తేలాల్సి ఉంది.
ఈ విషయంపై పల్స్ హార్ట్ సెంటర్ ఎండీ డాక్టర్ ముఖర్జీ మడివాడ తన అభిప్రాయాన్ని ఎక్స్ హ్యాండిల్ లో పంచుకున్నారు.
‘‘అనస్తీషియా డోసు ఎక్కువైతే సాధారణంగా చనిపోరు. ఒకవేళ డోస్ ఎక్కువైతే సుదీర్ఘ పర్యవేక్షణ అవసరం పడుతుంది. యువకుడి మరణానికి కారణం ఏమై ఉండొచ్చు అంటే.. మొదటిది తీవ్రమైన అలర్జీ రియాక్షన్ కారణంగా చనిపోయేందుకు అవకాశం ఉంది. దీన్ని అనఫైలాక్టిక్ రియాక్షన్ అంటారు. గతంలో రోగికి అదే డ్రగ్ ఇచ్చినా.. అలర్జీ వచ్చేందుకు అవకాశం ఉంది.
ఇక రెండోది.. లోకల్ అనస్తీషియా కింద జైలోకైన్ ఇచ్చిన సందర్భంలో చాలా అరుదైన కేసులో అనస్తీషియా రక్తనాళాల్లోకి చేరితే ఫిట్స్(మూర్చ) వచ్చే అవకాశం ఉంది. మూర్చ చాలాసేపు ఉంటే ఊపిరి ఆగిపోతుంది.’’ అని పేర్కొన్నారు.
అనస్తిషీయా ఎన్ని రకాలు? ఎంత మోతాదులో ఇవ్వాలి?
సర్జరీల సమయలో నొప్పి తెలియకుండా ఉండేందుకు అనస్తీషియా ఇస్తుంటారని తెలంగాణకు చెందిన ప్రభుత్వ అనస్తీషియా వైద్యులు పరీక్షిత్ బీబీసీతో చెప్పారు.
జనరల్ అనస్తీషియా, స్పైనల్ అనస్తీషియా, లోకల్ అనస్తీషియా అని మూడురకాలుగా రోగులకు మత్తు మందు ఇస్తారని ఆయన తెలిపారు.
‘‘జనరల్ అనస్తీషియా(జీఏ) అనేది మొత్తం శరీరంపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల రోగి స్పృహలో ఉండడు. ఆ సమయంలో కృత్రిమంగా ఆక్సిజన్ అందిస్తారు.ప్రతి పదినిమిషాలకు రెస్పాండ్ అయ్యేలా చూస్తారు. రోగి స్పృహలో లేని సమయంలో వైద్యులు సర్జరీ పూర్తి చేస్తారు. మేజర్ సర్జరీలకు, నడుము పైభాగంలో చేసే సర్జరీలకు ఎక్కువగా ఈ జనరల్ అనస్తీషియా ఇస్తుంటారు’’.
‘‘ఇక స్పైనల్ అనస్తీషియా అనేది నడుము కింది భాగంలో చేసే ఆపరేషన్లకు ఇస్తారు. ఇది నాలుగు గంటలపాటు పనిచేస్తుంది. ఆ సమయంలో డాక్టర్లు సర్జరీ పూర్తి చేసేస్తారు. ’’
లోకల్ అనస్తీషియా అనేది చిన్నచిన్న సర్జరీలకు ఇస్తుంటారు. ఎక్కడైతే సర్జరీ చేస్తున్నారో.. ఆ భాగం వరకే మత్తు వచ్చేలా చేస్తారు. ఉదాహరణకు డెంటల్ సర్జరీ ఏ దంతాలకు చికిత్స చేస్తున్నారో అక్కడే మత్తు వచ్చేలా మందు ఇస్తారు.’’ అని ఆయన బీబీసీకి చెప్పారు
అనస్తీషియా డోసు ఎక్కువ కావడం వల్ల రోగులు చనిపోవడం చాలా అరుదు అని ఆయన వివరించారు.
ఇదే విషయంపై డాక్టర్ పులివర్తి శ్రీలేఖ బీబీసీతో మాట్లాడారు.
‘‘దంత వైద్యంలో చాలావరకు అనస్తీషియా ఇచ్చినా, అది లోకల్ అనస్తీషియానే అవుతుంది. అంటే మత్తుమందు ఆ భాగానికే పరిమితం. రక్త నాళాల్లోకి కూడా వెళ్లే అవకాశం తక్కువ. రోగికి ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉండి ఉండవచ్చు.’’ అని చెప్పారు.
మోతాదు ఎలా నిర్ణయిస్తారు?
‘‘ఒక రోగికి అనస్తీషియా ఎంత మోతాదు(డోస్) ఇవ్వాలనేది చేయబోయే సర్జరీ, రోగి బరువుపై ఆధారపడి ఉంటుంది. రోగి బరువు బట్టి మోతాదు ఎంతనేది అనస్తీషియా డాక్టర్ నిర్ణయిస్తారు. 45 ఏళ్లు దాటిన రోగులకు ఛాతీ ఎక్స్ రే, 2డీ ఎకో తప్పకుండా చేయాలి. అప్పుడే అనస్తీషియా ఇస్తారు. దానివల్ల డ్రగ్ మోతాదు మించి చనిపోయారని చెప్పడానికి ఉండదు. అంతకుముందే రోగికి ఏవైనా ఇతర సమస్యలు ఉండి.. వైద్యులకు చెప్పకపోవడంతోనే ఏవైనా సంఘటనలు జరగవచ్చు’’ అని చెప్పారు డాక్టర్ పరీక్షిత్.
అనస్తీషియా ఇవ్వడానికి ముందుగా ఒక పద్ధతిని అనుసరించాల్సి ఉంటుందని ఆయన చెప్పారు.
‘‘సర్జరీల సమయంలో ప్రీ అనస్తీషియా చెకప్ చేస్తారు. అందులో రోగికి సంబంధించిన అన్ని వివరాలను సేకరించి షీట్ తయారు చేస్తారు. రోగి బీపీ, పల్స్ రేటు, ఈసీజీ, ఎక్స్ రే, ఎత్తు, బరువు, కమ్యూనిటీ వివరాలు సహా రాసుకుంటారు. ’’
కొన్ని కమ్యూనిటీలకు జన్యుపరమైన మార్పుల కారణంగా కొన్ని డ్రగ్స్ ఇవ్వరని వైద్యులు చెబుతున్నారు. ప్రీ అనస్తీషియా చెకప్ అయ్యాక.. ముందుగా టెస్ట్ డోస్ ఇస్తారు. అప్పుడు ఎలాంటి రియాక్షన్ రాకపోతే మిగిలిన ప్రోసీజర్స్ అనుసరిస్తారు.
బీపీ, షుగర్ ఉంటే అనస్తీషియా ఇవ్వొచ్చా?
ఆరోగ్య సమస్యలతో సంబంధం లేకుండా శరీర బరువు ఆధారంగానే అనస్తీషియా ఇస్తారని చెప్పారు డాక్టర్ పరీక్షిత్. డోసు అనేదికి అందరికీ సమానంగా ఉంటుంది.
‘‘బీపీ, షుగర్, గుండె, ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి కొన్ని కొన్ని డ్రగ్స్ ఇవ్వడానికి వీలుండదు. అందుకే డ్రగ్ మార్చి వారికి తగిన డ్రగ్స్ ఇస్తుంటారు. డోసు పరంగా ఎలాంటి తేడాలు ఉండవు. ఉదాహరణకు బీపీ ఉన్న వారికి జీటామిన్ వంటివి ఇవ్వరు. గుండెలో సమస్యలు ఉంటే పెంటనిల్ డ్రగ్ ఇచ్చి సర్జరీ చేయాల్సి ఉంటుంది. కొన్ని సర్జరీలు కొన్ని గంటలపాటు జరుగుతుంటాయి. అలాంటప్పుడు సప్లిమెంటరీ డోసులు ఇస్తారు. ’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, UGC
అసలేమిటీ స్మైల్ డిజైనింగ్?
స్మైల్ డిజైనింగ్ సర్జరీని స్మైల్ ఎన్‌హాన్స్‌మెంట్ సర్జరీ అని కూడా పిలుస్తారు. అందమైన నవ్వు కోసం ఈ తరహా సర్జరీలు చేయించుకోవడం ఈ మధ్య కాలంలో ఎక్కువైందని దంత వైద్యులు చెబుతున్నారు.
ఎగుడుదిగుడుగా, దంతాలు వంకరగా ఉన్నప్పుడు, చిగుళ్లు సరిగా లేనప్పుడు.. వాటిని సరిచేసి అందంగా మలుచుకునేందుకు స్మైల్ డిజైనింగ్ సర్జరీ చేయించుకుంటారు.
ఇదొక కాస్మొటిక్ సర్జరీ అని చెప్పారు హైదరాబాద్ లోని హ్యాపీ స్మైల్స్ డెంటల్ క్లినిక్ డాక్టర్ పులివర్తి శ్రీలేఖ.
’’దంతాలు వరుసగా కనిపించడం లేదా తెల్లగా కనిపించేందుకు ఈ సర్జరీ చేయించుకుంటారని వివరించారు. ఈ సర్జరీలో స్మైల్ మేకోవర్ జరుగుతుంది. రూట్ కెనాల్, ఇంప్లాంట్ తదితర ప్రోసీజర్స్ కూడా అవసరమైతే చేస్తారు’’ అని తెలిపారు.
ఏ వయసులో చేస్తారు? ఖర్చు ఎంత?
సాధారణంగా స్మైల్ డిజైనింగ్ చికిత్స అనేది దంతాలు వంకరగా ఉండి చిన్నవయసులో ఆర్థో డాంటిక్ చికిత్స చేయించుకోని వాళ్లకు అవసరమవుతుందని వైద్యులు చెబుతున్నారు.
వయసుతో సంబంధం లేకపోయినా, ఎక్కువగా 18ఏళ్లకుపైబడిన వారే ఈ చికిత్స చేయించుకుంటుంటారు.
‘‘చిన్నవయసులో స్మైల్ డిజైనింగ్ సర్జరీలు చేయించుకునే వారు చాలా తక్కువ. వయసు పెరిగాక ఈ తరహా చికిత్సలవైపు వెళుతుంటారు. ఇది శాశ్వతంగా ఎప్పటికీ ఉండే చికిత్స. . రోగి అవసరాలను బట్టి చికిత్స ఉంటుంది.’’ అని చెప్పారు డాక్టర్ శ్రీలేఖ.
ఈ సర్జరీలలో భాగంగా చేసే చికిత్సను బట్టి రూ.లక్ష నుంచి రూ.2లక్షల పైదాకా ఆసుపత్రులు ఛార్జీ చేస్తుంటాయి. ఈ చికిత్సలో ఆసుపత్రిలో ఉండాల్సిన అవసరం ఉండదు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
దుష్ప్రభావాలు ఉన్నాయా?
స్మైల్ డిజైనింగ్ సర్జరీలలో కొన్నిసార్లు దుష్ప్రభావాలు కూడా ఉంటాయి.
‘‘సైడ్ ఎఫెక్ట్స్ట్ అనేవి రోగిని బట్టి ఉంటుంది. కొందరికి షుగర్ వంటివి ఉంటే చికిత్స విధానంలో మార్పులు చేయాలి. ఆరోగ్య సమస్యలను బట్టి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా జాగ్రత్తలు తీసుకుని చికిత్స చేయాలి.
అంతే తప్ప మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ. చికిత్స తర్వాత ఇచ్చే పెయిన్ కిల్లర్స్ కూడా కొన్నిసార్లు పడకపోవచ్చు’’ అని చెప్పారు డాక్టర్ పులివర్తి శ్రీలేఖ.
ఇవి కూడా చదవండి:
- రూ.2,800 కోట్ల జాక్పాట్ తగిలిన వ్యక్తికి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన లాటరీ కంపెనీ
- లాటరీ తగిలినట్లు ఈ దేశం ఒక్కసారిగా సంపన్న దేశంగా ఎలా మారింది?
- ఉపవాసం చేస్తే బరువు తగ్గుతారా? ఫాస్టింగ్తో శరీరంలో ఏం జరుగుతుంది?
- కొత్త మహాసముద్రం ఎక్కడ పుట్టుకొస్తోంది? భూమి గర్భంలో ఏం జరుగుతోంది?
- దేశంలో పంటలకు కనీస మద్దతు ధర అవసరం లేదా? రైతుల ఆదాయాన్ని పెంచేందుకు కావాల్సిన వేరే పద్ధతులేంటి
బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














