బ్లడ్ బ్రదర్స్: ఒకరి ప్రాణాలను మరొకరు కాపాడుకున్న ఇద్దరు అపరిచితులు

మారియస్, నిక్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, మారియస్ వెర్నర్ (ఎడమ), నిక్ ఎంబ్లెటన్ (కుడి)
    • రచయిత, షారన్ బార్బర్, నటాలీ రైట్
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

మారియస్ వెర్నర్ అనే జర్మన్ యువకుడు, డాక్టర్ నిక్ ఎంబ్లెటన్ అనే బ్రిటన్ వైద్యుడి ప్రాణాలను కాపాడేందుకు తన మూలకణాలను (స్టెమ్ సెల్) దానం చేశాడు.

డాక్టర్ నిక్ ఎంబ్లెటన్‌కు అరుదైన రక్త క్యాన్సర్ ఉంది, ఆయన బతకాలంటే ఉన్న ఏకైక అవకాశం బోన్ మారో ట్రాన్స్‌ప్లాంట్ (ఎముక మజ్జ మార్పిడి).

యూకేలో అతనికి సరిపోయే వ్యక్తిని కనుగొనలేకపోయారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆ వ్యక్తి కోసం గాలించారు.

అయితే రెండేళ్ల తరువాత బీబీసీ న్యూస్, ఆంథోనీ నోలన్ అనే స్వచ్ఛంద సంస్థ సాయంతో ఆ వ్యక్తిని కనుగొన్నారు.

అంతేకాదు, నిక్ జీవితాన్ని కాపాడే ప్రక్రియ మారియస్‌కు నూతనోత్తేజాన్ని ఇచ్చింది, ఎందుకంటే మారియస్ అప్పటికే ఆత్మహత్య ఆలోచనలతో పోరాడుతున్నారు.

మారియస్

ఫొటో సోర్స్, BBC NEWS

ఫొటో క్యాప్షన్, మారియస్ మరొకరికి ప్రాణదాతగా మారారు.

'చనిపోతానని వీలునామా రాశాను'

నిక్ ఎంబ్లెటన్ రెండు దశాబ్దాలకు పైగా న్యూకాజిల్ నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో పనిచేశారు.

ప్రపంచంలోని వేల మంది రోగుల ప్రాణాలు కాపాడేందుకు నిక్ కృషి చేశారు. కానీ 2021లో ఆయనకు వైద్యుడి సాయం అవసరమైంది.

నిక్ ఆసుపత్రి కారిడార్‌లో నడుస్తూ- "ఏం జరగబోతోందో తెలియదు. నేను చనిపోతానని నాకు తెలుసు, అందుకే వీలునామా కూడా రాశాను" అని చెప్పారు.

‘‘ఈ విషయాన్ని నా భార్యకు, పిల్లలకూ చెప్పాను. నా పిల్లల గురించే నా బాధంతా. వాళ్లు తండ్రి లేకుండా పెరగాలనుకోవడం లేదు" అని అన్నారు.

ఎముక మజ్జ మార్పిడి, దెబ్బతిన్న రక్త కణాలను ఆరోగ్యకరమైన వాటితో భర్తీ చేస్తుంది. అవి సరిపోలకపోతే శరీరం వాటిని తిరస్కరిస్తుంది.

"మేం ముందుగా యూకేలో వెతికాం, ఇక్కడే సరైన వ్యక్తి దొరుకుతాడనుకున్నాం'' అని ఆంథోనీ నోలన్ స్వచ్ఛంద సంస్థకు చెందిన షార్లెట్ హ్యూస్ చెప్పారు.

"ఒకవేళ దొరక్కపోతే, ప్రపంచవ్యాప్తంగా గాలించాలనుకున్నాం, ఎందుకంటే అతన్ని సరిపోలే వ్యక్తి ఎక్కడైనా దొరకొచ్చు'' అని తెలిపారు.

ఇద్దరూ ఇలా కలిశారు

ఎముక మజ్జ మార్పిడి విజయవంతమైందని తెలిసే వరకు దాత, రోగి ఇద్దరూ అజ్ఞాతంగా ఉండాలి. అది విజయవంతమైందని తెలిశాక, నిక్, దాత వివరాల కోసం బీబీసీ సాయం కోరారు.

దీని కోసం ఆంథోనీ నోలన్ సంస్థతో కలిసి పనిచేసింది బీబీసీ. చివరకు ఆ దాత డ్రెస్డెన్ సమీపంలోని చెమ్నిజ్‌కు చెందిన 24 ఏళ్ల మారియస్‌గా గుర్తించారు.

అనంతరం మారియస్ యూకే వెళ్లి నిక్‌‌ను కలవడానికి అంగీకరించారు.

మార్పిడి చికిత్స ఎక్కడైతే జరిగిందో అదే మ్యాగీస్ న్యూకాజిల్ క్యాన్సర్ సపోర్ట్ సెంటర్‌లోని ఫ్రీమాన్ హాస్పిటల్‌లో కలుసుకున్నారు.

ఇద్దరూ కౌగిలించుకున్నారు.

ఆ సమయంలో తన మనసు పులకించిందని మారియస్ చెప్పారు.

'చనిపోయేవాడిని'

"క్యాన్సర్ కణాలన్నీ పోయాయి. వారు నా రక్తాన్ని టెస్ట్ చేసినప్పుడు, ఆ రక్త కణాలన్నీ మీవే. మీరు లేకుంటే నేను చచ్చిపోయేవాడిని. నాకు నలుగురు పిల్లలున్నారు, వాళ్లకు తండ్రి లేకుండా పోయేవారు. మీకు నిజంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నా’’ నిక్ అతనితో అన్నారు.

'యు ఆర్ వెల్‌కమ్' అని మారియస్ భావోద్వేగంతో బదులిచ్చారు.

ఆ తర్వాత ఇద్దరి కళ్లల్లో నీళ్లు తిరిగాయి.

నిక్ మరోసారి, ''చాలా చాలా ధన్యవాదాలు'' అని చెప్పారు.

'కన్నీళ్లు వస్తాయి'

ఎముక మజ్జ మార్పిడి పని చేసిందని, రోగి ప్రాణాలతో బయటపడ్డారని తెలుసుకున్న ఘటనను మారియస్ గుర్తుచేసుకున్నారు.

"విషయం తెలియడంతో కన్నీళ్లు వచ్చాయి" అని అన్నారు.

"నేను ఒక పని కోసం వెళుతూ దారిలో ఉన్నా, విషయం తెలిసి నా కారును పార్క్ చేసి, స్వచ్ఛమైన గాలి కోసం బయటకు వెళ్లా. అప్పుడు కన్నీళ్లు వచ్చాయి'' అని గుర్తుచేసుకున్నారు.

ఇంతకుముందు ఆత్మహత్యకు ప్రయత్నించానని, ఒక విధంగా నిక్ తనను రక్షించడంలో సహాయం చేశారని మారియస్ తెలిపారు.

"13 సంవత్సరాల వయస్సు నుంచి మానసిక సమస్యలతో బాధపడ్డాను" అని మారియస్ గుర్తుచేసుకున్నారు.

''నేనేంటి, నా జీవితమేంటి అని తెలుసుకోవడం నాకు కష్టంగా అనిపించింది'' అని తెలిపారు.

"ఇప్పుడు నేను చెప్పగలను, నేను సరైన పని చేశాను" అని అన్నారు.

వారి సిరల్లో ఒకే రక్తం ప్రవహించడంతో, ఈ ఇద్దరు అపరిచితులు ఇప్పుడు "బ్లడ్ బ్రదర్స్"గా సన్నిహితంగా ఉండటానికి ప్లాన్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)