యుక్రెయిన్‌తో రెండేళ్ల యుద్ధం వల్ల రష్యాలో వచ్చిన మార్పులేంటి?

రష్యా
ఫొటో క్యాప్షన్, సోల్నెక్నోగోర్స్క్‌ పట్టణంలో రష్యన్ సైనికుల కుడ్యచిత్రం (వీరు యుక్రెయిన్‌లో మరణించారు)
    • రచయిత, స్టీవ్ రోసెన్‌బర్గ్
    • హోదా, రష్యా ఎడిటర్

ఇటీవల జైల్లో మృతిచెందిన రష్యా ప్రతిపక్ష నాయకుడు అలెగ్జీ నావల్నీకి ప్రజలు పుష్పాంజలి ఘటిస్తుండగా నేను చూస్తూ ఉన్నా. అప్పుడు ఒక యువకుడు, అలెక్సీ నావల్నీ మరణంపై తన అభిప్రాయాన్ని నాతో పంచుకున్నారు.

‘‘రెండేళ్ళ కిందట ఫిబ్రవరి 24న యుద్ధం మొదలైనప్పుడు ఎలా దిగ్భ్రాంతి చెందానో... ఇప్పుడు అంతే’’ అని ఆయన చెప్పారు.

ఆ యువకుడు చెప్పిన మాట.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం ప్రకటించినప్పటి నుంచి గడిచిన రెండేళ్ళలో రష్యాలో జరిగిన ప్రతి ఘటన గురించి నేను ఆలోచించేలా చేసింది.

అది రక్తపు మరకలు, విషాదాలు తదితర జాబితాలున్న నాటకం.

  • రష్యా యుద్ధం యుక్రెయిన్‌ను ధ్వంసం చేసి మరణశయ్యపై చేర్చింది.
  • రష్యా కూడా భారీగా సైనిక నష్టాన్ని చవిచూసింది.
  • రష్యన్ నగరాలు డ్రోన్ల దాడులకు గురయ్యాయి.
  • వేల మంది రష్యన్లను బలవంతంగా సైన్యంలోకి చేర్చుకున్నారు
  • వాగ్నర్ కిరాయి సైన్యం రష్యా ప్రభుత్వంపై సాయుధ తిరుగుబాటుకు ప్రయత్నించింది. కానీ తరువాత ఓ విమాన ప్రమాదంలో వారి నాయకుడు ప్రిగోజిన్ మృతి చెందారు.
  • యుద్ధ నేరాల అభియోగంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
  • తాజాగా పుతిన్‌ను తీవ్రంగా విమర్శించే అలెక్సీ నావల్నీ మృతిచెందారు

2022 ఫిబ్రవరి 24. ఓ కీలక మలుపు చోటు చేసుకున్న రోజు.

అంతకుముందు జరిగిన కీలక పరిణామాలను ఓసారి చూద్దాం.

2014లో రష్యా, యుక్రెయిన్ నుంచి క్రిమియాను తనలో కలుపుకుంది.

డాన్‌బాస్‌లో మొదటి సైనిక జోక్యం కూడా జరిగింది.

2020లో అలెక్సీ నావల్నీపై విషప్రయోగం జరిగింది.

2021లో నావల్నీని జైల్లో పెట్టారు.

యుక్రెయిన్‌పై దండయాత్రకు ముందే రష్యాలో అణచివేత మొదలైంది.

కానీ ఇప్పుడది పతాక స్థాయికి చేరింది.

ఒకసారి పుతిన్ వంక చూస్తే ఈ రెండేళ్ళ యుద్ధంలో ఆయన ఆత్మవిశ్వాసం పెరిగింది.

ఇంటా బయట శత్రువులను తుదముట్టించడానికి ఆయన కంకణం కట్టుకున్నట్టు కనిపిస్తారు.

ఆయన అమెరికాకు, నాటోకు, ఈయూకు వ్యతిరేకంగా నిలిచారు.

ప్రస్తుతం యుక్రెయిన్‌లో రష్యా కొనసాగిస్తున్న యుద్ధానికి ‘పశ్చిమ దేశాలే’ కారణమని చెబుతూ, ఈ యుద్ధం రష్యా మనుగడ కోసం చేస్తున్నదిగా వర్ణిస్తున్నారు.

రష్యా
ఫొటో క్యాప్షన్, నాటో మాజీ చీఫ్ లార్డ్ రాబర్ట్‌సన్ రష్యా సూపర్ పవర్ హోదాను కోల్పోయిందని చెప్పారు

తప్పెవరిది, ఎక్కడ జరిగింది?

ఈ యుద్ధం ఎప్పటికి, ఎలా ముగుస్తుంది? నేను భవిష్యత్తును ఊహించలేను.

కానీ గతాన్ని గుర్తు చేసుకోగలను.

నేనీ మధ్య ఇంట్లో కూర్చున్నప్పుడు కప్‌బోర్డులో దుమ్ముపట్టిన ఓ ఫైల్ కనిపించింది.

అందులో 20 ఏళ్ల కిందట పుతిన్ హయాం ప్రారంభ రోజుల్లో పంపిన కాపీలు ఉన్నాయి.

ఇప్పుడా కాపీలను చదవడమంటే కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న సరికొత్త నక్షత్ర మండలం గురించి చదివినట్టే ఉంటుంది.

‘‘ఇటీవల జరిగిన ఓ సర్వే ప్రకారం 59 శాతం మంది రష్యన్లు యూరోపియన్ యూనియన్‌లో రష్యా చేరాలని కోరుకుంటున్నారు’’ అని నేను 2001 మే 17న రాశాను.

‘‘ప్రపంచ శాంతికి నాటో, రష్యా ముప్పుగా లేవని చెప్పడానికి గుర్తుగా ఆ రెండూ పరస్పర సహకారాన్ని కోరుకుంటున్నాయి’’ అని 2001 నవంబర్ 20న రాశాను.

మరి ఎక్కడ తప్పు జరిగింది? ఈ విషయంలో ఆశ్చర్యపోయేది నేనొక్కడినే కాదు.

‘‘నేను ఒకప్పుడు కలిసిన పుతిన్ నాతో చక్కగా వ్యవహరించారు. కానీ ఆ పుతిన్ ప్రస్తుతం అధికార దాహంతో రెచ్చిపోతున్న పుతిన్ కంటే చాలా చాలా భిన్నమైనవారు’’ అని నాటో మాజీ చీఫ్ లార్డ్ రాబర్ట్‌సన్ ఈ మధ్య లండన్‌లో కలిసినప్పుడు నాతో చెప్పారు.

‘‘2002 మేలో నా పక్కనే నిలబడిన వ్యక్తి, యుక్రెయిన్ సార్వభౌమ దేశమని, స్వతంత్ర రాజ్యమని, అది తన భద్రతకు సంబంధించిన నిర్ణయాలు సొంతంగా తీసుకుంటుందని చెప్పిన వ్యక్తి ఇప్పడు యుక్రెయిన్ స్వతంత్ర రాజ్యం కాదని చెబుతున్నారు’’.

పుతిన్ నాటోలో సభ్యత్వం కోసం తీవ్రంగా ఆలోచించినట్టు లార్డ్ రాబర్ట్‌సన్ గుర్తు చేసుకున్నారు.

‘‘నేను రెండోసారి పుతిన్‌తో సమావేశమైనప్పుడు ఆయన, ‘నాటోలో చేరాలని రష్యాకు ఎప్పుడు ఆహ్వానం పలుకుతున్నారు’ అని అడిగారు. ‘నాటోలో చేరాలని మేము ఏ దేశాన్నీ ఆహ్వానించం. ఆ దేశాలే దరఖాస్తు చేసుకోవాలి’ అని బదులిచ్చాను. ‘మంచిదే. నాటో సభ్యత్వం కోసం మేం ఎలాంటి సామర్థ్యాలూ లేని దేశాలతో సమానంగా లైన్‌లో నుంచోలేం’ అని పుతిన్ చెప్పారు’’ అని లార్డ్ రాబర్ట్‌సన్ వివరించారు.

నాటో సభ్యత్వం కోసం నిజంగా పుతిన్ దరఖాస్తు చేసుకుంటారని తాను భావించలేదని లార్డ్ రాబర్ట్‌సన్ తెలిపారు.

‘‘పుతిన్ నాటో సభ్యత్వం తనకు బహుమతిగా లభించాలని భావించారు. ఎందుకంటే, ఆయన ఎప్పడూ ప్రపంచ పటంపై రష్యా చాలా గొప్ప దేశమని, సోవియట్ యూనియన్‌కు ఉన్న గౌరవమే రష్యాకూ ఉండాలని ఆయన భావించేవారు’’ అని లార్డ్ రాబర్ట్‌సన్ చెప్పారు.

ఒకనాడు సోవియట్ యూనియన్ ప్రపంచంలో రెండో సూపర్ పవర్‌గా గుర్తింపు పొందిందని లార్డ్ రాబర్ట్‌సన్ చెప్పారు. కానీ రష్యా ఇప్పుడు ఆ దిశగా ఎటువంటి వాదనలూ చేయలేకపోతోంది.

‘‘బహుశా అదే పుతిన్ అహంభావాన్ని తగ్గించి ఉంటుంది. అయితే క్రమంగా పశ్చిమ దేశాల బలహీనతలు, అనేక విధాలుగా ఎదుర్కొన్న కవ్వింపులతోపాటు ఆయన అహం పెరిగింది. అందుకే ఒకనాడు నాటోకు సహకరిస్తానని చెప్పిన వ్యక్తికి నేడు నాటో ఓ పెద్ద ముప్పుగా కనిపిస్తోంది.’’

పరిస్థితులను రష్యా భిన్నంగా చూసేది. తూర్పు దిశగా నాటో విస్తరణ యూరోపియన్ భద్రతను బలహీనపరిచి, యుద్ధానికి దారితీసిందని రష్యన్ అధికారులు చెబుతున్నారు. యూఎస్ఎస్ఆర్ చివరి రోజుల్లో నాటో క్రెమిన్ల్‌కు ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, మాస్కోలో భాగంగా ఉన్న దేశాలను ఆ కూటమి అంగీకరించదని వారు ఆరోపిస్తున్నారు.’’

‘‘ఎక్కడా కాగితంపై ఈ సంగతి లేదు’’ అని లార్డ్ రాబర్ట్‌సన్ నాతో చెప్పారు.

‘‘ఎక్కడా అటువంటిది లేదనేది అంగీకారమే. దానికి సంబంధించిన ఒప్పందం కూడా ఏమీ లేదు. కానీ 2002 మే 28న పుతినే స్వయంగా రోమ్ డిక్లరేషన్‌పై సంతకం చేశారు. అదే కాగితంపై నేను కూడా సంతకం చేశాను. ఇది ప్రాదేశిక సమగ్రతకు సంబంధించిన మౌలిక లక్ష్యాలను బలపరచడంతోపాటు, ఇతర దేశాల జోక్యం ఉండకూడదనే డిక్లరేషన్. దానిపై ఆయన సంతకం చేశారు. ఇప్పుడు ఆయన ఎవరినీ తప్పుపట్టడానికి వీల్లేదు.’’

‘జీవితమంతా యుద్ధమే’

రష్యా
ఫొటో క్యాప్షన్, సోల్నెక్నోగోర్స్క్ పట్టణంలోని యుద్ధ స్మారక మందిరంలో, ప్రత్యేక సైనిక ఆపరేషన్‌లో చనిపోయిన రష్యన్ సైనికుల పేర్లను చెక్కారు.

మాస్కో నుంచి 40 మైళ్ళ దూరంలో ఉన్న సోల్నెక్నోగోర్స్క్ పట్టణంలోని పార్క్‌లో గత రెండేళ్ళ రష్యా నాటకీయ చరిత్రను ప్రదర్శనకు ఉంచారు.

వాగ్నర్ కిరాయి గుంపునకు మద్దతుగా చిత్రీకరించిన గ్రాఫిటీని నేను గుర్తించాను.

అక్కడ అలెక్సీ నావల్నీ స్మృత్యర్థం పూలు కూడా ఉన్నాయి.

యుక్రెయిన్‌లో చనిపోయిన ఇద్దరు స్థానిక రష్యన్ సైనికుల కుడ్యచిత్రాలు ఉన్నాయి. ఆ పక్కనే ఓ యువ సైనికుడు శాల్యూట్ చేస్తున్నట్టుగా చిత్రించి ఉంది.

టౌన్ సెంటర్‌లోని స్మారక భవనం రెండో ప్రపంచ యుద్ధంలో చనిపోయినవారు, అఫ్గానిస్తాన్‌లో సోవియట్ వార్‌కు సంబంధించినది. ఈ భవనంలో, ‘‘ప్రత్యేక సైనిక ఆపరేషన్‌లో చనిపోయిన సైనికుల కోసం..’’ అనే కొత్త సెక్షన్ కూడా జత చేశారు.

మొత్తం 46 మంది పేర్లు రాతిపై చెక్కారు.

తన మనవడితోపాటు వెళుతున్న లిదియా పెట్న్రోవాను గడిచిన రెండేళ్లలో జీవితంలో వచ్చిన మార్పు ఏంటని అడిగాను.

‘‘విదేశాలలో మేం కొనుగోలు చేసే వస్తువులు ఇప్పుడు మా ఫ్యాక్టరీల్లోనే తయారవుతున్నాయి. అది మంచిదే’’ అని లిదియా చెప్పారు.

‘‘ కానీ చనిపోయిన యువకులను తలుచుకుంటేనే బాధగా ఉంది. పశ్చిమ దేశాలతో యుద్ధం అవసరమే లేదు. మేమంతా యుద్ధాన్ని తప్ప దేనిని చూడటం లేదు. జీవితం నిండా యుద్ధమే ఉంది’’ అని విచారం వ్యక్తంచేశారు.

నేను మరీనాతో మాట్లాడితే ఆమె రష్యన్ సైనికులను ప్రశంసించారు. ఆమె తన 17 ఏళ్ళ కొడుకు వంక చూస్తూ, యుక్రెయిన్‌లో వారు తమ కర్తవ్యనిర్వహణలో ఉన్నారని చెప్పారు.

‘‘కానీ ఒక తల్లిగా నా కొడుకును యుద్ధానికి ఎప్పుడు పిలుస్తారోనని భయపడుతున్నాను. సాధ్యమైనంత త్వరగా శాంతి నెలకొనాలని కోరుకుంటున్నాను. అప్పుడు రేపు ఏమవుతుందోనని బెంగ పడాల్సిన పని ఉండదు’’ అని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)