చంద్రుడి మీద స్పేస్‌క్రాఫ్ట్‌ను ల్యాండ్ చేసి చరిత్ర సృష్టించిన తొలి ప్రైవేట్ కంపెనీ

ఫొటో సోర్స్, INTUITIVE MACHINES
- రచయిత, జొనాథన్ ఆమోస్
- హోదా, సైన్స్ కరస్పాండెంట్
చంద్రుడిపై వ్యోమనౌక(స్పేస్‌క్రాఫ్ట్)ను ప్రయోగించిన తొలి వాణిజ్య సంస్థగా అమెరికాకు చెందిన ఓ కంపెనీ చరిత్ర సృష్టించింది.
హ్యూస్టన్‌కు చెందిన ఇన్‌ట్యూటివ్ మెషీన్స్ కంపెనీ తన ఒడిస్సియస్ రోబోను చంద్రుడి దక్షిణ ధ్రువం సమీపంలో ల్యాండ్ చేసింది.
క్రాఫ్ట్(పరికరం) చంద్రుడిపై దిగినట్లు నిర్ధరించేందుకు కంట్రోలర్లకు కొన్ని నిమిషాలు పట్టింది, కానీ చివరికి సిగ్నల్ అందింది.
"మా పరికరాలు చంద్రుడి ఉపరితలంపైన ఉన్నాయి, సమాచారం అందుతోంది. కచ్చితంగా చెప్పగలం, అందులో ఎలాంటి సందేహం లేదు'' అని ఫ్లైట్ డైరెక్టర్ టిమ్ క్రెయిన్ ప్రకటించారు.
ఈ వార్త విన్న వెంటనే కంపెనీ సిబ్బంది చప్పట్లు కొట్టారు.

ఫొటో సోర్స్, Getty Images
అంతరిక్షంలో వాణిజ్యపరమైన ప్రయోజనాలకు మాత్రమే కాకుండా, అమెరికా అంతరిక్ష రంగానికి ఇదొక ముఖ్యమైన క్షణం.
చంద్రుడి ఉపరితలంపై అమెరికా అడుగుపెట్టి దాదాపు అర్థ శతాబ్దం గడచిపోయిన తర్వాత, ఇప్పుడు ఇన్‌ట్యూటివ్ మెషీన్స్ ఆ లోటును భర్తీ చేసింది. చంద్రుడి ఉపరితలంపై అమెరికా అడుగుపెట్టిన సందర్భం గురించి తెలుసుకోవాలంటే 1972లో ప్రయోగించిన చివరి అపోలో మిషన్ దగ్గరకు వెళ్లాలి.
ఒడిస్సియస్‌లో ఆరు సైంటిఫిక్ పరికరాలను అమర్చేందుకు అనువైన ప్రదేశాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కొనుగోలు చేసింది. మిషన్ విజయవంతం కావడంపై నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ ఇన్‌ట్యూటివ్ మెషీన్స్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.
''అమెరికా మళ్లీ చంద్రుడిపై అడుగుపెట్టింది'' అని ఆయన అన్నారు. ''ఈ రోజు మానవాళి చరిత్రలో మొదటిసారి ఒక వాణిజ్య సంస్థ, ఒక అమెరికన్ కంపెనీ తన ప్రయాణాన్ని ప్రారంభించి అక్కడి వరకూ నడిచింది. నాసా వాణిజ్య భాగస్వాముల శక్తిని, నమ్మకాన్ని నిరూపించుకున్న రోజు ఇది'' అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సజావుగా మిషన్ ప్రారంభం కావడానికి ముందు కూడా, దాదాపుగా మిషన్‌ను నిలిపివేసేంతటి సాంకేతిక సమస్యను కంట్రోలర్స్ సరిచేయాల్సి వచ్చింది.
క్రాఫ్ట్ ఎత్తు, వేగాన్ని లెక్కించాల్సిన ఒడిస్సియస్ రేంజింగ్ లేజర్లు సరిగ్గా పనిచేయలేదు.
అదృష్టవశాత్తూ, నాసాకి చెందిన కొన్ని ప్రయోగాత్మక లేజర్లు అందుబాటులో ఉండడంతో ఇంజినీర్లు వాటిని నావిగేషన్ కంప్యూటర్లతో అనుసంధానం చేయగలిగారు.
ఒడిస్సియస్ 23:23 (GMT- లండన్ కాలమానం ప్రకారం)కి చంద్రుడి ఉపరితలంపై దిగింది. మొదట రోబో నుంచి ఎలాంటి సిగ్నల్ లేదు. నిమిషాలు గడిచేకొద్దీ ఉత్కంఠ రేగింది. కానీ, చివరికి ఒక కమ్యూనికేషన్ లింక్ అనుసంధానమైంది, అయినా అది కూడా అస్పష్టంగా ఉంది.
ఇది ల్యాండర్ పరిస్థితిపై కొంత ఆందోళనకు దారితీసింది. అయితే, కొద్దిగంటల తర్వాత ఒడిస్సియస్ నిటారుగా నిల్చుని ఫోటోలతో సహా డేటాను పంపుతున్నట్లు ఇన్‌ట్యూటివ్ మెషీన్స్ తెలిపింది.
మలాపెర్ట్ అని పిలిచే 5 కిలోమీటర్ల ఎత్తైన పర్వతశ్రేణి సముదాయం పక్కన బిలం లాంటి భూభాగాన్ని ల్యాండింగ్‌కు లక్ష్యంగా ఎంచుకున్నారు. ఈ ప్రాంతం చంద్రుడి దక్షిణ ధృవంలో 80 డిగ్రీల దగ్గర, చంద్రుడి దక్షిణ ధృవానికి అత్యంత సమీపంగా ఉంటుంది. ఇంతవరకూ ఏ స్పేస్ క్రాఫ్ట్ కూడా చంద్రుడి దక్షిణ ధృవానికి ఇంత దగ్గరగా దిగలేదు.

ఫొటో సోర్స్, NASA
నాసా తన ఆర్టెమిస్ ప్రోగ్రామ్‌లో భాగంగా దశాబ్దం తర్వాత వ్యోమగాములను పంపాలని ఆలోచిస్తున్న ప్రదేశాల జాబితాలో ఇది కూడా ఉంది.
ఈ ప్రాంతంలో ఎన్నడూ సూర్యరశ్మి చూడని కొన్ని లోతైన బిలాలు ఉన్నాయి. అవి శాశ్వతంగా నీడలో ఉంటాయి. వాటి లోపల గడ్డకట్టిన నీరు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
"మంచు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే, చంద్రుడి ఉపరితలంపై ఉన్న మంచును నిజంగా మనం ఉపయోగించుకోగలిగితే, మనం తీసుకురావాల్సిన పదార్థాలు తగ్గినట్లే" అని నాసా ప్లానెటరీ సైన్స్ డైరెక్టర్ లోరీ గ్లేజ్ వివరించారు.
"ఆ మంచును వ్యోమగాములు శ్వాస తీసుకునేందుకు ఆక్సిజన్‌గా, తాగేందుకు తాగునీటిగా, ఇంధన అవసరాలకు హైడ్రోజన్‌గా మార్చవచ్చు. కాబట్టి, మానవ మనుగడకు ఇది దోహదం చేస్తుంది.''

ఫొటో సోర్స్, INTUITIVE MACHINES
ఒడిస్సియస్‌లో ప్రయోగించిన నాసాకి చెందిన ఆరు పేలోడ్లు టెక్నాలజీ డిమాన్‌స్ట్రేషన్, సైన్స్ సమ్మేళనం.
అపోలో వ్యోమగాముల పరికరాలు పాడైపోవడానికి, ఇబ్బందులకు కారణమైన చంద్ర ధూళి గురించి అధ్యయనం చేయడం ఇందులో కీలక పరిశోధన.
క్రాఫ్ట్ ల్యాండింగ్ సమయంలో దుమ్ము పైకి లేవడం, మళ్లీ ఎలా ఉపరితలంపైకి చేరుతుందో మరింత బాగా అర్థం చేసుకునేందుకు స్పేస్ ఏజెన్సీ శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
అందులో అమర్చిన ఆరు కమర్షియల్ పేలోడ్లలో ఎంబ్రీ-రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్ కెమెరా సిస్టమ్ కూడా ఉంది. అది చంద్రుడి ఉపరితలంపై 30 మీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఒడిస్సియస్ నుంచి వేరవుతుంది.
రోబో ఉపరితలంపై దిగిన తర్వాత సెల్ఫీ చిత్రాలు తీసుకునేలా దీనిని రూపొందించారు.
అమెరికన్ ఆర్టిస్ట్ జెఫ్ కూన్స్ కూడా ల్యాండర్‌కి ఒకవైపు ఒకచిన్న పెట్టెను జతచేశారు. అందులోని 125 చిన్న స్టెయిన్‌లెస్ స్టీల్ బాల్స్ నెలలో చంద్రుడి దశల గురించి తెలియజేస్తాయి.
ఇవి కూడా చదవండి:
- గ్రేట్ నికోబార్: భారత ప్రభుత్వ 74 వేల కోట్ల ప్రాజెక్ట్ ఆ తెగకు మరణ శాసనంగా మారనుందా
- ‘దంగల్’ నటి సుహానీ భట్నాగర్ ప్రాణం తీసిన వ్యాధి లక్షణాలు ఏమిటి?
- ఎస్. జైశంకర్: రష్యా విషయంలో భారత్ 'స్మార్ట్' అని అమెరికా విదేశాంగ మంత్రితో ఎందుకన్నారు?
- నదియా: బాలీవుడ్ సినిమాల్లో మగాళ్లకు ధీటుగా స్టంట్స్ చేసి ఉర్రూతలూగించిన ఈ విదేశీ మహిళ ఎవరు?
- తాజ్ మహల్ కంటే ముందే, ప్రియురాలి కోసం చోళరాజు నిర్మించిన ‘ప్రేమ చిహ్నం’ కథ తెలుసా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















