కాగ్ రిపోర్ట్: తెలంగాణ గొర్రెల పంపిణీ పథకంలో బయటపడిన అక్రమాలు, బైకు మీద 126, ఇండికా కారులో 168 గొర్రెల్ని కుక్కి తీసుకెళ్ళారట...

ఫొటో సోర్స్, yadadritelanganagovt
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
‘’సంగారెడ్డి జిల్లాలో ఒక హీరో హోండా స్ప్లెండర్ బండిపై 126 గొర్రెలు ప్రయాణం చేశాయి. మహబూబ్‌నగర్ జిల్లాలో ఆ రికార్డును బ్రేక్ చేస్తూ 168 గొర్రెలు టాటా ఇండికా కారులో వెళ్లాయి. ఖమ్మంలో 84 గొర్రెలు మారుతీ ఓమ్నీ అది కూడా అంబులెన్సులో సర్దుకుని వెళ్లాయి. ఇక నల్లగొండ జిల్లాలోని 126 గొర్రెలు ఒక ఆటోలో ప్రయాణం చేశాయి.’’
ఇదేం అతిశయోక్తి కాదు. తెలంగాణ ప్రభుత్వ రికార్డులు ఇవే చెబుతున్నాయి.
గొర్రెల పంపిణీ పథకంలో భాగంగా ఈ గొర్రెలన్నీ అలా ఇరుకుగా సర్దుకుని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లినట్టు స్వయంగా తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బిల్లుల్లో ఉన్నాయి.
గొర్రెల పంపిణీ పథకంలో ఇది చిన్న ఉదాహరణ మాత్రమే.
తెలంగాణలో ఈ పథకం అమలుపై మొత్తం 7 జిల్లాల్లో లెక్కలు చూసిన కాగ్ దృష్టికి వచ్చిన విషయాలు ఇవి.. ఈ నాలుగే కాదు మొత్తం ఇలా 336 బిల్లుల్లో 53 రెండు చక్రాల బైకులు, 219 ప్యాసింజర్ ఆటోలు, 35 కార్లు, 27 బస్సుల్లో గొర్రెలను తీసుకెళ్లినట్లు రాశారు. మరో ఇద్దరు రెండు అంబులెన్సుల్లో తీసుకెళ్లినట్టు రాశారు.
వీరంతా పర్వాలేదు. ఏదో ఒక బండి పేరు ఇరికించారు. ఇక మరో 262 బిల్లుల్లో అయితే వాళ్లు రాసిన బండి నంబర్ పేరుతో అసలు ఏ బండీ లేదు. రవాణా శాఖ దగ్గర లేని రిజిస్ట్రేషన్ నంబర్లను రాసి డబ్బు తీసుకున్నారు గొర్రెలు పంపిణీ చేసిన అధికారులు, కాంట్రాక్టర్లు.
ఇదంతా కేవలం 7 జిల్లాల లెక్క మాత్రమే. మిగిలిన 26 జిల్లాల్లో కాగ్ లెక్కలు చూడలేదు. ఖమ్మం, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూలు, నల్లగొండ, సంగారెడ్డి, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లో లెక్కలు తీస్తేనే ఇవన్నీ బయటపడ్డాయి. ఈ జిల్లాల్లో మొత్తంగా 253 కోట్ల 93 లక్షల రూపాయలు దుర్వినియోగం అయినట్టు కాగ్ చెబుతోంది.
ఇక పెన్నుతో నంబర్లు దిద్దడాలు, ఇన్వాయిస్ నంబర్ అంటే బిల్లు నంబర్ మార్చడాలు, అసలు బిల్లు నంబర్ కూడా మార్చకుండా పదుల సంఖ్యలో దొంగ బిల్లులు పెట్టడాలూ.. ఇలా చెప్పుకుంటూ పోతే కాగ్ బయట పెట్టిన బాగోతం అంతా ఇంతా కాదు..
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ – కాగ్ సంస్థ ప్రభుత్వ పద్దుల లెక్కల్లో లొసుగులు తీసే పనిచేస్తుంది. ఆ సంస్థ వివిధ పథకాలు, ప్రాజెక్టుల్లో ప్రభుత్వ సొమ్ము సక్రమంగా ఖర్చయిందా లేదా పద్దులు చెక్ చేసి, రాష్ట్ర అసెంబ్లీకి ఒక నివేదిక ఇస్తుంది. అయితే నివేదిక ఇవ్వడం వరకే ఆ సంస్థ పని.. దానిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
కాగ్ నివేదిక తాజాగా ముగిసిన తెలంగాణ శాసనసభలో చర్చకు దారితీసింది. దీంతో అప్పటికే రచ్చ రచ్చ అవుతోన్న గొర్రెల పథకం మరింత హాట్ టాపిక్ గా మారింది.
ఈ పథకంలో కాగ్ బయటపెట్టిన విషయాలు, ఏసీబీ విచారణ చూస్తే.. గొర్రెల మంద విషయంలో కూడా ఇంత అవినీతి చేస్తారా? అనిపిస్తుంది. ఆ వివరాలు అర్థం కావాలంటే, ఈ పథకం గురించి తెలుసుకోవాలి.

ఫొటో సోర్స్, Getty Images
అసలేంటీ పథకం?
తెలంగాణలో గొర్రెల పెంపకం విస్తృతంగా ఉంటుంది. కురుమ అనే కులం వారికి ఇదే ప్రధాన కుల వృత్తి కూడా. అయితే ఈ గొర్రెల ఖరీదు ఎక్కువ. దీంతో కొత్త గొర్రెలు కొనాలన్నా, సొంతంగా గొర్రెల మంద ఏర్పాటు చేసి మేపుకోవాలన్నా సామాన్యులకు కష్టం.
దానికి తోడు హైదరాబాద్ నగరంలో మాంసం కోసం విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీంతో హైదరాబాద్‌కు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రాల నుంచి మేకలు, గొర్రెలు దిగుమతి చేసుకుంటారు.
ఈ క్రమంలో తెలంగాణలో కురుమ కులంలోని గొర్రెల పెంపకందార్లకు ప్రభుత్వం గొర్రెలను ఇస్తే, వారికి ఆర్థిక సాయంతో పాటూ, తెలంగాణలో మాంసం ఉత్పత్తి పెరుగుతుందని కేసీఆర్ తలచారు.
అర్హులైన కుటుంబానికి 20 గొర్రెలు (ఆడ), ఒక పొట్టేలు (మగ) ఇవ్వాలని సంకల్పించారు. ఈ యూనిట్ విలువ ఒక లక్షా 58 వేల రూపాయలు ఉంటుంది. అందులో గొర్రెల పెంపకందారు రూ. 43,750 చెల్లించాలి. మిగతాది ప్రభుత్వమే సబ్సిడీ కింద ఇస్తుంది. 2017 ఏప్రిల్ లో ఈ పథకం ప్రారంభం కాగా, ఇప్పటి వరకూ మొత్తం రూ. 3,385 కోట్లు దీనిపై ఖర్చు పెట్టారు.
అయితే, ప్రారంభం నుంచీ ఈ పథకంపై అనేక విమర్శలు వచ్చాయి. అణగారిన బీసీ కులాల వారిని చదువుల్లో ప్రోత్సహించకుండా ఇలా కుల వృత్తుల్లో ఉంచేసేలా గొర్రెల పంపిణీ చేయడాన్ని ప్రగతిశీల భావాలున్న వారు తప్పుబట్టారు.
ఇక తెలంగాణ బీసీల్లో ఎక్కువ జనాభా ఉన్న కురుమ కులాన్ని ప్రసన్నం చేసుకోవడానికే కేసీఆర్ ఈ పథకం పెట్టారనీ, ఆ కులానికి చెందిన వ్యక్తి మల్లేశానికి ఎమ్మెల్సీ ఇచ్చారనేది మరో విమర్శ.
క్షేత్ర స్థాయిలో ఈ పథకం అమల్లోకి తీసుకురావాలని ప్రయత్నించినపుడు వచ్చిన అతి పెద్ద సమస్య ఒకేసారి అంత పెద్ద మొత్తంలో గొర్రెలు దొరక్కపోవడం. దీంతో చాలాచోట్ల నిజంగా గొర్రెలు కొనకుండా, మొత్తం డబ్బులో ఎందో కొంత రైతుకు ఇచ్చేసి, గొర్రెలు ఇచ్చినట్టుగా రాసేశారు అనేది ఒక అభియోగం.
ఈ పద్ధతిలో గొర్రెలను ఒక ట్రక్కులో లబ్ధిదారుడి దగ్గరకు తీసుకువచ్చి అతనితో ఫోటోలు దిగి, ఆ గొర్రెలు ఇవ్వకుండా డబ్బులు మాత్రం ఇస్తారు. తరువాత ఆ గొర్రెలను మరో లబ్ధిదారుడి దగ్గరకు తీసుకెళ్తారు.
ఈ పద్ధతిలో లబ్ధిదారుడికి కూడా ఎంతోకొంత ముడుతుంది కాబట్టి, పెద్ద అల్లరి కాలేదు. కానీ వాస్తవంగా ప్రభుత్వం చెప్పినంతగా గొర్రెల సంఖ్య పెరగలేదని మాత్రం ఆరోపణలు వచ్చాయి. దీనికి రీసైక్లింగ్ అని పేరు పెట్టారు.
దీనిలోనూ మోసమే..
దానికి మించిన తీవ్రమైన ఆరోపణ అసలు గొర్రెలే కొనకుండా కొన్నట్టు చూపించి డబ్బు ఎగ్గొట్టడం. లేని రైతుల పేర్లు వాడి గొర్రెలు కొని తెచ్చి వారికి పంచినట్టు చూపించారనేది మరో పెద్ద అభియోగం.. దీనిపై ఇటీవలే ఏసీబీ విచారణ కూడా ప్రారంభించింది.
రేపో మాపో ఏసీబీ బాధ్యులకు నోటీసులు ఇస్తుంది అనుకున్న సమయంలో కాగ్ నివేదిక కేసు తీవ్రతను ఇంకా పెంచేసింది.
మీరు రోడ్డు మార్గంలో కశ్మీరు నుంచి కన్యాకుమారి వరకూ రెండు రోజుల్లో ఇరవై ట్రిప్పులు కొట్టగలరా? ఎంత స్పీడుగా వెళ్లే బండి అయినా సరే.. సాధ్యం కాదు కదా.. కానీ తెలంగాణ గొర్రెల పంపిణీలో మాత్రం ఒకే బండి రెండు రోజుల్లో అక్షరాలా 74,364 కి.మీ ట్రిప్పు వేసింది.
మహబూబ్‌నగర్ కేటాయింపుల్లో బిల్లు నంబర్ 1808 కింద 9522 నంబర్ బండి 2018 ఫిబ్రవరి 20న మీటర్ రీడింగ్ 2,54,553 కి.మీ ఉంది. మళ్లీ ఫిబ్రవరి 22న మీటర్ రీడింగ్ 3,28,917 కి.మీ దగ్గర మొదలైంది. అంటే ఆ బండి ఆ మధ్యలో ఉన్న రెండు రోజుల్లోనే ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగేసిందని మన అధికారులు, కాంట్రాక్టర్ల లెక్క.
ఇక ఒకే బండి ఒకే రోజు శ్రీకాకుళం నుంచి మహబూబ్ నగర్, కడప నుంచి మహబూబ్ నగర్ తిరిగింది.
ఇక 2018 నుంచి 2020ల మధ్య చనిపోయిన 20 మంది రైతులకు 2021లో గొర్రెలు ఇచ్చినట్లు రాశారు. వాళ్లు చనిపోయారని ప్రభుత్వమే ఆ కుటుంబాలకు బీమా కూడా ఇచ్చింది.
గొర్రెలకు వేసే ట్యాగుల్లో ఉండే తప్పులు చెప్పక్కర్లేదు. కాగ్ లెక్కల ప్రకారం దక్షిణ తెలంగాణలోని ఐదు జిల్లాల్లో 96 వేల యూనిట్ల పంపిణీ అని లెక్కల్లో చూపారని, వాస్తవానికి 29 వేల యూనిట్లే ఇచ్చినట్టు తెలిపారు. అంటే మూడొంతుల గొర్రెల పంపిణీ జరగనట్టు రాశారు.
ఇప్పటికే రంగంలో ఏసీబీ, మాజీ మంత్రికి నోటీసులు?
ఈ గొర్రెల స్కామ్ ఇక్కడ మొదలు కాలేదు.. ఇప్పటికే ఏసీబీ దీనిపై విచారణ ప్రారంభించింది కానీ అది మరో కోణంలో సాగుతోంది.
తెలంగాణ బీఆర్ఎస్ పాలన పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే సమయంలో రాష్ట్ర పశు సంవర్థక శాఖ కార్యాలయం నుంచి రాత్రికి రాత్రి కొందరు ఫైళ్లను మాయం చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. దీనిపై అప్పట్లో ఆ కార్యాలయ వాచ్‌మన్ నాంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మరోవైపు గొర్రెల పంపిణీ పథకంలో అసలైన లబ్ధిదారులకు దాదాపు 2 కోట్ల 10 లక్షల రూపాయలు చెల్లించకుండా ఆ డబ్బు కొందరు అధికారులు తినేశారంటూ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదయింది. అయితే ఈ రెండూ కేసులూ ఒకే శాఖకు సంబంధించినవి. ఆ శాఖను తలసాని శ్రీనివాస యాదవ్ నిర్వహించారు.
ఇప్పుడు ఈ రెండు కేసులనూ ఏసీబీ విచారిస్తోంది. ఆ విచారణ సాగుతుండగానే కాగ్ నివేదిక వచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
గొర్రెలు కొన్నారు – పైసలు ఇవ్వలేదు:
ఆంధ్రలోని ప్రకాశం, గుంటూరు, పల్నాడు జిల్లాలకు చెందిన మొత్తం 18 మంది గొర్రెల పెంపకందారులు గచ్చిబౌలి స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తమ దగ్గర తీసుకున్న గొర్రెలకు డబ్బు అందలేదనీ, ఎన్ని సార్లు పశుసంవర్ధక శాఖ కార్యాలయానికి వెళ్లినా ఫలితం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
వారి ఫిర్యాదులో ‘‘పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు కేశవ సాయి, రవి కుమార్, గొర్రెల పంపిణీ కాంట్రాక్టర్లు మొయినుద్దీన్, ఆయన కొడుకు ఇక్రమ్‌లు ఒక్కో యూనిట్లో 21 చొప్పున మొత్తం 133 యూనిట్ల గొర్రెలను కొన్నారు. ఆగస్టులో ఈ కొనుగోలు జరిగింది. డబ్బులు ప్రభుత్వం నుంచి అకౌంట్లో వేసేందుకు బ్యాంకు వివరాలు కూడా తీసుకున్నారు. రోజులు గడిచినా డబ్బు పడలేదు. అడిగితే సమాధానం లేదు. మొత్తం రూ. 2.1 కోట్లు రావలి’’ అని తెలిపారు.
దీనిపై గత నెల 26న గచ్చిబౌలి స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదయింది. ఐపీసీ 406, 409, 420 కింద కేసు పెట్టారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఏడుకొండలు ఇందులో ప్రధాన ఫిర్యాదుదారు. ఈ ఫిర్యాదులో ఇప్పటికే 15 మంది రైతులను ఏసీబీ అధికారులు హైదరాబాద్ పిలిపించి విచారించారు.

ఫొటో సోర్స్, Facebook/Talasanisrinivas
ఈ ఎఫ్ఐఆర్ లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వద్ద ఓఎస్డీగా పనిచేసిన కళ్యాణ్ పేరు కూడా నమోదయింది. మాసబ్ ట్యాంకులోని పశు సంవర్ధక శాఖ కార్యాలయంలోకి అక్రమంగా వెళ్లి ఫైళ్లను ధ్వంసం చేసి, కొన్ని తనతో పాటూ తీసుకువెళ్లారన్న ఆరోపణ ఎదుర్కొన్నది కూడా ఈ కళ్యాణే.
ఆ కేసులో ఈయనతో పాటూ కంప్యూటర్ ఆపరేటర్, అటెండర్లపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ రెండు కేసుల్లో కీలకంగా ఉన్న కళ్యాణ్, మంత్రి తలసానికి సన్నిహితుడు.
అదే సమయంలో ఆ గొర్రెల డబ్బు అమ్మిన వారికి డిపాజిట్ చేసినట్టుగా పశుసంవర్ధక శాఖ రికార్డుల్లో ఉంది. అయితే అమ్మిన వారికి కాకుండా కోస్తాలోని వేరే జిల్లాలకు చెందిన శ్రీకాకుళం, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాలలోని వారి బ్యాంకు అకౌంట్లకు ఆ డబ్బు వెళ్లినట్టు అధికారులు గుర్తించారు. అంటే గొర్రెలు కొని ఆ డబ్బును తమకు కావల్సిన ఖాతాల్లో జమ చేశారనేది పోలీసుల అనుమానం.
ఈ కేసు నిమిత్తం ముందు దశలో కాంట్రాక్టర్, అధికారులను పోలీసులు విచారణకు పిలుస్తారని వార్తలు వస్తున్నాయి. తరువాతి దశలో స్వయంగా మంత్రిని విచారణకు పిలిచే అవకాశం ఉందని కొందరు అధికారులు బీబీసీకి చెప్పారు. ముఖ్యంగా ఈ కేసులోని కీలకంగా భావిస్తున్న కళ్యాణ్.. తలసాని దగ్గరే పనిచేయడం ఒక కారణం అయింది.
'కేసుకు కులం రంగు'
ఏసీబీ విచారణ సమయంలోనే ఈ కేసు కులం రంగు పులుముకుంది. అప్పట్లో ఈ కేసును ఏసీబీకి అప్పగించడాన్ని యాదవ సంఘాల జేఏసీ చైర్మన్‌గా ఉన్న గోసుల శ్రీనివాస యాదవ్ తీవ్రంగా ఖండించారు.
శాఖాపరమైన విచారణ జరగకుండా నేరుగా ఏసీబీకి కేసు అప్పగించడాన్ని తప్పు పట్టారు. తలసానిపై రాజకీయ కక్ష సాధింపుచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అయితే తాము ఎవర్నీ కక్ష సాధింపుకు పాల్పడడం లేదని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
‘‘ప్రభుత్వం తన పని తాను చేస్తోంది. 18 మంది ఆంధ్రా రైతులకు డబ్బు అందకపోతే కేసులు పెట్టరా? విచారణే చేయకూడదా? అదెలా సాధ్యం. తప్పు చేసిన వారిని పట్టుకోని, డబ్బు కక్కించాల్సిందే కదా.. ఇందులో కక్ష సాధింపులు ఏమీ లేవు. ప్రత్యేకంగా ఫలానా మంత్రులను టార్గెట్ చేశారు అనడం కూడా సరికాదు. అన్ని శాఖల్లోనూ అందరు మంత్రుల మీదా కేసులు పెట్టలేదు కదా?’’ అని అప్పుడు సమాధానం ఇచ్చారు కాంగ్రెస్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్.
‘‘కుల వృత్తిలో ఉన్న కురుమలకు మేలు చేస్తామంటూ కేసీఆర్ ఈ పథకం ప్రవేశపెట్టినప్పటికీ, పూర్తి స్థాయిలో లబ్ధి జరగలేదు. చాలాచోట్ల గొర్రెలు ఇవ్వలేదు. ఇవ్వకుండా ఇచ్చిన డబ్బులు కూడా పూర్తిగా అందలేదు. ఇక ఎన్నికల ముందు తెలంగాణవ్యాప్తంగా ఎన్నో వేల మంది గొర్రెల కోసం డీడీలు తీసినా ఇంకా ఆ డబ్బు అందలేదు. వేలకు వేలు అప్పు తెచ్చిన వారి పరిస్థితి అడకత్తెరలో పడింది. ఇక పంచిన గొర్రెల్లో కూడా చాలాచోట్ల నాణ్యతా సమస్యలున్నాయి. మొత్తానికి గొర్రెల పేరు చెప్పి మధ్యవర్తులు బాగా బాగుపడ్డారు. ఇప్పటికైనా కుల వృత్తినే నమ్ముకున్న పేద కురుమలకు న్యాయం చేయాలి.’’ అని తెలంగాణ కురుమ సంఘం నాయకులు శ్రీనివాస్ కురుమ కోరుతున్నారు.
దీనిపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పందించాల్సి ఉంది.
ఏసీబీ కేసు విచారణ సాగుతోంది. మరి సీఏజీ (కాగ్) నివేదికలోని అంశాలపై కూడా తెలంగాణ ప్రభుత్వం విచారణ చేస్తుందా? లేక విచారణ చేస్తుందన్న ప్రకటన అసెంబ్లీకే పరిమితం అవుతుందా చూడాలి..
ఇవి కూడా చదవండి:
- ఐశ్వర్యా రాయ్‌ను రాహుల్ పదేపదే ఎందుకు ప్రస్తావిస్తున్నారు?
- రైతుల ఆందోళన: ఖనౌరీ బార్డర్లో ఒకరి మృతి.. రైతులు, పోలీసుల మధ్య ఘర్షణ
- గ్రేట్ నికోబార్: భారత ప్రభుత్వ 74 వేల కోట్ల ప్రాజెక్ట్ ఆ తెగకు మరణ శాసనంగా మారనుందా
- అలెక్సీ నవాల్నీ: పుతిన్‌ను ఎదిరించిన నేతతో పెళ్లిపై యూలియా నవాల్నియా ఏమన్నారు?
- చరిత్రలో తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోతున్న టీడీపీ.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















