దివ్యభారతి: ఒకప్పుడు హీరోను మించిన రెమ్యూనరేషన్ తీసుకున్న అందాల తార కెరీర్ రెండేళ్ళలోనే ఎలా ముగిసిపోయింది?

ఫొటో సోర్స్, PUNEET KUMAR
- రచయిత, వందన
- హోదా, సీనియర్ న్యూస్ ఎడిటర్
ఆసుపత్రి గదిలో బెడ్ మీద ఆ యువతి అంతిమ ఘడియల్ని లెక్కిస్తున్నారు. కష్టంగా ఊపిరి తీసుకుంటూనే తన బంధువులతో “పరిస్థితి చేయి దాటి పోయింది” అని చెబుతున్నారు. సమయం చేతి వేళ్ల సందుల్లో నుంచి ఇసుక మాదిరిగా జారిపోతోంది. ఏడుస్తూ నన్ను సాగనంపకండి. నేనిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను. నా డిమాండ్లలో సింధూరం కూడా ఉంది.
1992 జనవరి 31న విడుదలైన “దిల్ కా క్యా కుసూర్” సినిమాలో ఓ సన్నివేశం ఇది. ఆసుపత్రి బెడ్ మీద ఉండి కుటుంబ సభ్యుల సమక్షంలో దివ్యభారతి ఈ మాటలు చెబుతుంది.
ఈ సినిమా విడుదలైన ఏడాది తర్వాత 1993 ఏప్రిల్‌లో నిజ జీవితంలోనూ ఆమె ఇదే పరిస్థితుల మధ్య చనిపోయారు. చనిపోయే నాటికి ఆమె వయసు 19 ఏళ్లు మాత్రమే.
1974 ఫిబ్రవరి 25న పుట్టిన దివ్య భారతి ఇప్పటికీ జీవించి ఉంటే 50 ఏళ్లకు చేరుకుని ఉండేవారు. సినిమా రంగంలో అడుగు పెట్టిన తర్వాత ఆమె కెరీర్ రెండు మూడేళ్లు మాత్రమే కొనసాగింది. రెండేళ్లలోనే అనేక సూపర్ డూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఆమె మరణించి మూడు పదులు దాటుతున్నా నటిగా ఆమెకున్న ఖ్యాతి, గుర్తింపు, చిరునవ్వు ఇప్పటికీ సజీవంగా ఉన్నాయి.
1992లో విడుదలైన దీవానా దివ్య భారతి కెరీర్‌లో చాలా పెద్ద హిట్. “దివ్య భారతి అద్భుతమైన నటి. సింగిల్ టేక్ యాక్టర్. డాన్స్ మాస్టర్ ఒక్కసారి స్టెప్స్ వేసిచూపిస్తే చాలు. దివ్య వెంటనే టేక్ చేద్దాం అని చెబుతారు. ఆమెకు రిహార్సల్స్ కూడా అవసరం లేదు. ‘ఎయిసీ దివానేగీ’ పాట షూటింగ్ సిమ్లాలో చేశాం. అప్పుడామెకు 104 డిగ్రీల జ్వరం ఉన్నాషూటింగ్‌లో పాల్గొన్నారు. ఆ పాటను మూడు రోజుల్లోనే తీయాల్సి ఉంది. మేము వద్దన్నప్పటికీ ఆమె విశ్రాంతి తీసుకోకుండా పాట పూర్తి చేశారు” అని దీవానా చిత్ర నిర్మాత గుడ్డు ధనోవా చెప్పారు.

ఫొటో సోర్స్, PUNEET KUMAR
జితేంద్రతో నటించాలని...
దివ్య భారతి ఫిల్మ్ కెరీర్ చాలా చిన్నది. అది ఎంత చిన్నదంటే ఆమె గురించి నేటి తరం తెలుసుకోవడానికి అందుబాటులో ఉన్నది రెండు, మూడు ఇంటర్వ్యూలకు సంబంధించిన వీడియోలు మాత్రమే. అందులో కూడా ఆమె మాటలకు అర్ధాలు తెలుసుకోవడం చాలా కష్టం.
ఉదాహరణకు ఒక పాత ఇంటర్వ్యూలో మీ కోరిక ఏంటన్న ప్రశ్నకు ఆమె ఏం చెప్పారంటే “ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నదే లక్ష్యం. అయితే అందుకు ఎవరి సాయం అక్కర్లేదు. నేను ఏమైనా కానివ్వండి అది నేను స్వయంగా సాధించుకుంటాను. నా స్థానాన్ని నేనే సంపాదించుకోవాలి”
ఇది వింటే ఆమె చిన్న వయసులోనే కఠినమైన, స్థిరమైన లక్ష్యాలను ఏర్పరుచుకున్నారని, వాటిని సాధించుకునేందుకు గట్టిగా పోరాడేందుకు నిశ్చయించుకున్నట్లు అర్థం చేసుకోవచ్చు.

ఫొటో సోర్స్, RT CHAWLA
ముంబయిలో నివసించిన దివ్య మాణిక్‌జీ కూపర్ ట్రస్ట్ స్కూల్లో చదువుకున్నారు. ఫర్హాన్ అఖ్తర్, షర్మన్ జోషి ఆమె క్లాస్‌మేట్లు. దివ్యభారతికి చదువు పట్ల పెద్దగా శ్రద్ధ లేదు.
ఆమె తల్లిదండ్రులు కూడా చనిపోయారు. 2012లో బాలీవుడ్ హంగామాకు వారు మూడు దశలుగా సుదీర్ఘమైన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆమె తల్లి కుమార్తె గురించి చాలా విషయాలు మాట్లాడారు.
“దివ్య భారతికి చదువంటే పెద్దగా ఇష్టం లేదు” అని ఆమె చెప్పారు. నేను ఆమెకు చదువు చెప్పాలని చాలా ప్రయత్నాలు చేశాను. అయితే ఆమె అద్దం ముందు హిమ్మత్‌వాలా సినిమాలో పాటలకు డాన్స్ వేస్తుండేది. జితేంద్ర ఆమెకు ఇష్టమైన హీరో. దివ్య భారతి స్కూల్‌లో ఉండగానే ఆమెకు సినిమాల్లో నటించేందుకు ఆఫర్లు రావడం మొదలైంది. గోవిందా సోదరుడు కీర్తి కుమార్ రాధాకా సంగమ్ సినిమా కోసం ఆమెను తీసుకున్నారు. అయితే, అనుకోకుండా ఆమెను ఆ చిత్రం నుంచి తొలగించారు.
తర్వాత సతీష్ కౌశిక్ దివ్య పేరును “ప్రేమ్” చిత్రం కోసం ప్రతిపాదించారు. అయితే ఆయన ఆ సినిమాకు టబును ఎంచుకోవడంతో అలా మరో అవకాశం కూడా పోయింది. సుభాష్ ఘయ్ నిర్మించిన సౌదాగర్ విషయంలోనూ ఇదే జరిగింది.
హిందీ సినిమాల్లో నటించడానికి ముందే ఆమెకు తెలుగు చిత్రం “బొబ్బిలి రాజా”లో అవకాశం వచ్చింది. 1990లో విడుదలైన ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.

ఫొటో సోర్స్, PUNEET KUMAR
హిందీలో కంటే ముందు తెలుగులో స్టార్ అయిన దివ్య భారతి
బోనీ కపూర్ దివ్య భారతిని మా ప్రొడ్యూసర్ సురేష్‌బాబుకు పరిచయం చేశారు. వెంటనే మేము ఆమెతో మా చిత్రం కోసం సంతకం చేయించాం. అప్పట్లో ఆమె చాలా చిన్నది. ఆమెకు షాపింగ్ అంటే ఇష్టం. అప్పుడు సురేష్ బాబు కూర్చోబెట్టి ఆమెకు అంతా వివరంగా చెప్పారు. యాక్టింగ్ మీద దృష్టి పెడితే అన్నీ వచ్చి ఒళ్లో వాలతాయని చెప్పారు. ఆమె తెలుగులో పెద్ద స్టార్ కావడంతో బాలీవుడ్‌లోనూ అవకాశాలు వచ్చాయి” అని బొబ్బిలి రాజా దర్శకుడు బి గోపాల్ బీబీసీ ప్రతినిధి గౌతమీఖాన్‌తో చెప్పారు.
తెలుగు, తమిళ్ చిత్రాల్లో నటిస్తున్న సమయంలోనే రాజీవ్ రాయ్ ఆమెకు 1992లో “విశ్వాత్మ” చిత్రంలో అవకాశం ఇచ్చారు.
1992లోనే విశ్వాత్మ, షోలా ఔర్ షబ్నం, దిల్ కా క్యా కుసూర్ చిత్రాలు వరుసగా ఒకే నెలలో విడుదలయ్యాయి. దీవానా 1992 జూన్‌లో విడుదలైంది. ఆ చిత్రంలో రిషికపూర్, షారుఖ్ ఖాన్ నటులతో పోటీ పడి నటించారామె.
దివ్యభారతి క్రేజ్ ఏంటో ఫిల్మ్ ఫేర్ మేగజైన్‌లో రాసిన ఈ వాక్యం ద్వారా గ్రహించవచ్చు “సునీల్ షెట్టి తొలి చిత్రం ‘బలవాన్’ విడుదలైనప్పుడు ఆమె హీరో కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు”

ఫొటో సోర్స్, PUNEET KUMAR
అద్భుతాలే కాదు, ఆకతాయి పనులూ చేసేది
దివ్య భారతి నటన గురించి ఆమె తల్లి బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘ పహ్లాజ్ నిహాల్నీ సినిమా ‘షోలా ఔర్ షబ్నం’ సినిమాలో ఓ సీరియస్ సీన్‌లో నటించాల్సి ఉంది. కానీ ఆ సమయంలో ఆమె క్రికెట్ ఆడుతోంది. దర్శకుడు డేవిడ్ ధవన్ సీరియస్‌గా ఉండమని దివ్యకు చెప్పారు. అప్పుడు దివ్య దర్శకుడి వైపు తిరిగి ‘‘అంటే ఇప్పుడు నేను చచ్చిపోయే సీన్ ఉంటే నేను చచ్చిపోవాలా’’? అని మీరు కెమెరా ఆన్ చేసుకోండి. నేనేదైనా తప్పు చేసుకుంటే సినిమానుంచి తప్పుకుంటాను అని చెప్పింది. దీని తరువాత ఆ సీన్ తీశారు. అ రోజు రాత్రి ఆ సీన్‌ని డేవిడ్ ధవన్ చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారు.
దివ్య చనిపోయిన తరువాత మొట్టమొదటగా ఆస్పత్రికి చేరుకుంది పహ్లాజ్ నిహ్లానినే.
బిబిసీ కొలీగ్ మధుపాల్ తో దివ్యభారతితో కలిసి పనిచేసిన పాత సంగతులను నిహలానీ నెమరవేసుకున్నారు. ‘‘ఆమె ఎంతో సరదా మనిషి’’ అని చెప్పారు. ‘‘షోలా ఔర్ షబ్నం’లో ఓ భావోద్వేగ సన్నివేశం ఉంది. కానీ తన డైలాగ్ చెప్పేవరకూ ఆమె నవ్వుతూనే ది. దాదాపు 32 టేకులు తీసుకున్నా ఆమె నవ్వడం మాత్రం ఆపలేదు. కానీ ఆమె ఎప్పుడూ తన పనిని అంకితభావంతో చేసేవారు. షూటింగ్ మధ్యలో ఆమె కాలికి గాయమైనా, ప్యాకప్ చెప్పడానికి మాత్రం ఒప్పుకోలేదు. అలా నెప్పి భరిస్తూనే యాక్షన్ సన్నివేశాలలో నటించింది. ఆమె కాలిలో ఏదో గుచ్చుకుంది. అందుకే తరువాత రోజు ఉదయం షూటింగ్ క్యాన్సిల్ చేశాను. కానీ ఆమె ఉదయం 6గంటల కల్లా నా గదికి వచ్చేశారు. ఇక షూటింగ్ మొదలు పెట్టక తప్పలేదు.
‘దీవానా’ సినిమా షూటింగ్ సమయంలో దివ్యభారతి ఎన్నో అల్లరి పనులు చేసినట్టు నిర్మాత గుడ్డు దనోవా గుర్తు చేసుకున్నారు. ‘‘ఆమె ఎంతో చిలిపిగా ఉండేది’’ ‘‘మేం ఊటిలో పాాయలియా పాటను షూట్ చేస్తున్నాం. షూటింగ్‌కు ముందు అందరూ పేకాడుతూ కూర్చున్నారు. ఓ పక్క దర్శకుడు, రిషీ కపూర్ కుర్చీల్లో కూర్చుని ఉన్నారు. అక్కడ కూర్చోవడానికి మరో కుర్చీ లేకపోవడంతో దివ్య రిషీజీ ఒళ్ళో కూర్చుని ఆయనను ఆటపట్టించడం మొదలుపెట్టింది. దీంతో రిషీజీ ‘ పెద్దలను గౌరవించవా అనే ఉద్దేశంతో ‘నీకు 18 ఏళ్ళు, నాకు 39 ఏళ్ళు తెలుసా అని అడిగారు. కానీ దివ్యభారతి అల్లరి మాత్రం ఆగలేదు.

ఫొటో సోర్స్, RT CHAWLA
సాజిద్ నడియావాలతో పెళ్ళి
దివ్య గురించి ఫొటోగ్రాఫర్ ఆర్టీ చావ్లా మాట్లాడుతూ ‘‘ఆరోజు దివ్య పుట్టిన రోజు. ఎవరైనా స్టార్ వస్తే దివ్య చాలా సంబరపడేది. చావ్లా అంకుల్ జాకీషాఫ్ర్‌తో నా ఫొటో తీయండి. కొన్ని ఆమె గోవిందతో కలిపి ఫోటో తీయమనేది. కానీ చివరి రోజుల్లో దివ్య పద్ధతి కొద్దిగా మారింది. ఆ రోజుల్లో మెహబూబ్ స్టూడియోలో ‘రంగ్’ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ విషయం ఆమెకు చెపితే ఆమె ఏమాత్రం స్పందించకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది.
అదే సమయంలో దివ్యభారతి వ్యక్తిగత జీవితంలో ఏదేదో జరగడం మొదలైంది. ముఖ్యంగా దివ్య నిర్మాత సాజిత్ నడియావాలాను వివాహం చేసుకుందనే వార్త బయటకు వచ్చినప్పటి నుంచి చాలా మార్పులు కనిపించాయి. అప్పటికి దివ్యభారతి వయసు కేవలం 18 సంవత్సరాలు. వీరిద్దరూ ‘షోలా ఔర్ షబ్నం’ సెట్స్‌లోనే కలుసుకున్నారు. దివ్యభారతి తల్లి ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రకారం మొదట్లో ఈ పెళ్ళిపై దివ్యభారతి కుటుంబం అంత సానుకూలంగా లేదు. కానీ తరువాత వారు ఆ పెళ్ళిని అంగీకరించారు.
ఏప్రిల్ 5, 1993 రాత్రి దివ్యభారతి మరణించిందనే వార్త సినీ పరిశ్రమను నిర్ఘాంత పరిచింది. ఆరోజు రాత్రి ఏం జరిగిందనే విషయంపై పత్రికలలో పుంఖానుపుంఖాలుగా వార్తలు వచ్చాయి.
కానీ దివ్య తల్లిదండ్రులు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ఆ రోజు సాయంత్రం దివ్య తన కొత్త ఇంటిని కొనాలనుకుంది. మేమందరం వెళ్ళి ఆ ఇంటిని చూశాం. ఆ సమయంలో మాకో ఫోన్ కాల్ వచ్చింది. డిజైనర్ నీతా లుల్లా ఇంటివద్దే ఉన్నారని, కాస్ట్యూమ్ చూడాలనుకుంటున్నారని ఆ పోన్ సారాంశం. దీంతో దారి మధ్యలోనే నేను దిగిపోయాను. దివ్యభారతిని ఆమె సోదరుడు దివ్యభారతిని ఆమె ఇంటివద్ద దింపడానికి వెళ్ళారు. దివ్యభారతి వెళ్ళే సమయానికే నీతాలూలా, ఆమె భర్త ఉన్నారు. కానీ 15 నిమిషాల తరువాత దివ్యభారతి బాల్కనీ నుంచి పడిపోయారని ఫోన్ వచ్చింది. దివ్య చాలా అల్లరి పిల్ల. బహుశా ఈ ప్రమాదం కూడా అలాంటి అల్లరివల్లే జరిగింది. ఆమె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. అలా అని ఆమెను ఎవరు చంపుతారు, ఎందుకు చంపుతారు’’? అని ప్రశ్నించారు.
దివ్యభారతి భౌతిక కాయాన్ని చూసి తాను బిగ్గరగా రోదించానని ఆర్తీ చావ్లా చెప్పారు. ఆమె నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయా, ఆమెకు నాకు ఉన్న అనుబంధం గురించి ఎవరికీ తెలియదు. ఒక ఫోటోగ్రాఫర్‌గా ఆమె దహనక్రియలను కూడా ఫోటోలు తీశాను అని ఆర్తీ గుర్తు చేసుకున్నారు.

ఫొటో సోర్స్, PUNEET KUMAR
దివ్య భారతి మరణం
ఫిల్మ్ జర్నలిస్ట్ ట్రాయ్ రిబేరియా దివ్యభారతి మృతిపై స్టార్‌డస్ట్‌లో ఓ కథనం రాశారు. ఆయన ఇలా రాశారు. ‘‘దివ్యభారతి మృతి వార్త మొదటిగా తెలిసిన అతికొద్దిమందిలో నేనూ ఒకడిని. అర్థరాత్రి 1.30గంటల సమయంలో దివ్యభారతి మృతదేహాన్ని కాజువాల్టీ వార్డులో స్ట్రెచర్‌పై ఉంచారు.
దివ్యభారతి తండ్రి పరిస్థితి దారుణంగా ఉంది. వారంతా చిన్నపిల్లల్లా రోదిస్తున్నారు. దివ్య సోదరుడి కునాల్ గుండె పగిలిపోయింది. ఒక గంట తరువాత దివ్య భర్త సాజిద్ వచ్చారు. దివ్యను చూడగానే ఆయన నేలపై పడిపోయారు. ఆయన నోటి నుంచి నురగ రావడం మొదలైంది. డాక్టర్లు ఆయనకు గుండెపోటు ఉందని చెప్పారు. తరువాత నిర్మల పహ్లాజ్ నిహాల్నీ వచ్చి పరిస్థితులను తన చేతుల్లోకి తీసుకున్నారు. ఆ తరువాత బోనీకపూర్, గోవింద, కమల్ సాదనా, సైఫ్ తదితరులు వచ్చారు. ఆ తరువాత దివ్య తల్లి వచ్చారు.

ఫొటో సోర్స్, RT CHAWLA
రంగ్’ ట్రైలర్ చూస్తుంటే..
‘రంగ్’ ‘సత్రాంజ్’, ‘తొలిముద్దు’ చిత్రాలు దివ్యభారతి మరణం తరువాత విడుదలయ్యాయి. రంగ్ సినిమాలో ఆయేషా జుల్కా, దివ్యభారతి కలసి నటించారు. వారిద్దరూ మంచి స్నేహితులు కూడా.
అయేషా బీబీసీతో మాట్లాడుతూ ‘‘ఆమె ఎప్పుడూ త్వరగా పద... జీవితం చాలా చిన్నది’’ అంటూ ఉండేది. ఆమె ఎపనైనా త్వరగా చేయాలనుకునేది. ఆమెకు జీవితంలో అన్నీ త్వరగానే వచ్చేశాయి’’ అని చెప్పారు. కొన్ని నెలల తరువాత మేం రంగ్ ట్రైలర్ చూడటానికి వెళ్ళాం. దివ్య స్క్రీన్‌పైకి రాగానే, విచిత్రంగా తెరపడిపోయింది. ఆ ఘటన మాకు వింతగా అనిపించింది. ’’ అని వివరించారు.
దివ్య భర్త సాజిద్ పై అనేక ఊహాగానాలు, కుట్రల గురించి కథనాలు వచ్చినా, సాజిద్‌కు దివ్య తల్లిదండ్రుల మధ్య సంబంధాలు బావుండేవి. 2004వరకు కూడా సాజిద్ చిత్రాలన్నింటినీలోనూ ముందుగా దివ్య ఫోటో వేసి, నా ప్రియమైన భార్య జ్ఞాపకాలతో అని రాసేశారు.

ఫొటో సోర్స్, RT CHAWLA
దివ్య భారతి మరణం తర్వాత...
తరువాత సాజిద్ వర్దాఖాన్‌ను పెళ్ళి చేసుకున్నారు. దివ్య మరణంపై సాజిద్ మీడియాతో తక్కువగా మాట్లాడేవారు. కానీ వర్దా దివ్యకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో పంచుకుంటారు.
‘‘దివ్య చివరిసారిగా తాకిన పెర్ఫ్యూమ్ ఇప్పటికీ సాజిద్ వద్ద ఉంది. దివ్య ఇప్పటికీ మా జీవితాల్లో ఒక భాగం. మా పిల్లలు ఎప్పుడు దివ్య సినిమా చూసినా ‘‘పెద్దమ్మ’’ అంటుంటారు. సాజిద్ తను దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘కిక్’లో సాత్ సమందర్ పాటను అందులో జోడించారు. నేను సాజిద్ ను కలవడానికి కారణం దివ్యనే... ఎందుకంటే దివ్య మొదటి వర్థంతి రోజున సాజిద్ ను ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను.. అదే మమ్మల్ని కలిపింది’’ అని ఆమె ట్విట్టర్‌లో రాసుకొచ్చారు.
దివ్య మరణం తరువాత ఆమె సినిమాలు లాడ్లా (శ్రీదేవి), మెహ్రా (రవీనా), హల్‌చల్(కాజోల్), విజయ్‌పథ్ (టబు), కర్తవ్య్ (జుహి) పూర్తి చేశారు.
ఇవి కూాడా చదవండి:
- యశస్వీ జైస్వాల్: బేస్బాల్లా క్రికెట్ బంతిని బాదేస్తూ మరో డబుల్ సెంచరీ చేసిన 'జస్బాల్'
- గుల్బదన్: ఒట్టోమాన్ సుల్తాన్‌ను ఎదిరించిన మొఘల్ యువరాణి కథ...
- అలెక్సీ నావల్నీ: పుతిన్ ఆదేశాల మేరకే ఆయనను చంపేశారా, విమర్శకులు ఏమంటున్నారు?
- తాజ్ మహల్ కంటే ముందే, ప్రియురాలి కోసం చోళరాజు నిర్మించిన ‘ప్రేమ చిహ్నం’ కథ తెలుసా?
- కజఖ్‌స్తాన్: మీథేన్ గ్యాస్ మెగా-లీకేజి, కొన్ని నెలలుగా విస్తరిస్తున్న ప్రమాదాన్ని బయటపెట్టిన బీబీసీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














