ఆంధ్రప్రదేశ్: అగనంపూడి టోల్ గేట్‌ను అక్రమంగా నడిపిస్తున్నారా... స్థానిక ప్రజల ఆందోళనకు కారణమేంటి?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విశాఖ నగర పరిధిలో ఉన్న అగనంపూడి టోల్ గేట్‌ను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారంటూ ఆ రహదారిపై ప్రయాణాలు చేసే వారు, టోల్ గేట్ సమీప గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
గ్రేటర్ విశాఖ పరిధిలో ఉన్న ఆ రోడ్డు జాతీయ రహదారి కాదని, అయినప్పటీకి జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) టోల్ పేరుతో రుసుం వసూలు చేస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆ టోల్ గేట్‌ను తొలగించాలంటూ స్థానికులతో పాటు రాజకీయ పార్టీల నాయకులూ గత కొద్ది సంవత్సరాలుగా ఆందోళనలు చేస్తున్నాయి. ఇటీవల టోల్ గేట్ వివాదాన్ని ఎంపీ జీవీఎల్ నరసింహా రావు రాజ్యసభలో ప్రస్తావించారు.

అగనంపూడి టోల్ గేట్ కథ
విశాఖపట్నం నుంచి అనకాపల్లి వరకు 40 కిలోమీటర్ల మేర నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణం 1997-1998 మధ్యలో జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ నిర్మించింది. ఇందుకు ప్రపంచబ్యాంకు నుంచి రూ.63 కోట్లు అప్పు తీసుకున్నారు.
రహదారి నిర్మాణం పూర్తి అయిన తరువాత టోల్ గేట్ ఛార్జీల ద్వారా ఖర్చును వసూలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. 2001 నాటికి రహదారి పనులు పూర్తిగా అయిపోయాయి. విశాఖ-అనకాపల్లి మధ్యలో అగనంపూడి వద్ద టోల్ గేట్‌ను ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2001లోనే విశాఖపట్నం-అనకాపల్లి హైవే నిర్వహణను పూర్తిగా ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగించింది. నాటి నుంచి ఆ రహదారి అభివృద్ధి పనులను తామే చూసుకుంటున్నామని ఎన్‌హెచ్‌ఏఐ, విశాఖపట్నం విభాగం ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభాత్ రంజన్ బీబీసీకి తెలిపారు.

జాతీయ రహదారి అవునా? కాదా?
1998లోని జాతీయ రహదారుల రుసుము వసూల నిబంధనల ప్రకారం టోల్ గేట్లు మున్సిపాలిటీ లేదా నగర, పట్టణ పరిధికి 10 కిలోమీటర్ల బయట ఉండాలి. 2001 నాటికి అగనంపూడి అప్పట్లో గ్రామ పంచాయితీగా ఉండేది. విశాఖ మహానగర పాలక సంస్థ(జీవీఎంసీ)లో భాగం కాదు. 2005లో విశాఖపట్నాన్ని గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌గా విస్తరించడంతో అగనంపూడి నగర పరిధిలోకి వచ్చింది.
అంటే విశాఖపట్నం-అనకాపల్లి రహదారి కూడా జీవీఎంసీ పరిధిలోకి వచ్చిందని గాజువాక బార్ కౌన్సిల్ మాజీ అధ్యక్షుడు వెన్నెల ఈశ్వరరావు బీబీసీకి తెలిపారు. తమ పరిధిలో ఉన్న రహదారులను మున్సిపాలిటీలు నిర్వహిస్తాయి. కాబట్టి ఆ రోడ్ల మీద ప్రజల నుంచి టోల్ వసూలు చేయకూడదని ఆయన అన్నారు.
విశాఖపట్నం-అనకాపల్లి రహదారి జీవీఎంసీ పరిధిలోకి వచ్చిన నాటి నుంచి అభివృద్ధి పనులకు జీవీఎంసీ నిధులనే ఖర్చు చేస్తున్నారని మాజీ ఎమ్మేల్యే పల్లా శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు. అయినా అగనంపూడి వద్ద టోల్ ప్లాజాను తొలగించకుండా ఇంకా ఎన్‌హెచ్‌ఏఐ డబ్బులు వసూలు చేస్తూ ఉండటం నిబంధనలకు విరుద్ధమని ఆరోపించారు.
“అగనంపూడి టోల్ ప్లాజా నిర్మాణానికి ఖర్చు పెట్టిన రూ.63 కోట్లను టోల్ రుసుం ద్వారా ఎప్పుడో వసూలు చేశారు. ఆనందపురం నుంచి అనకాపల్లి వరకు ఉన్న ఆరు లైన్ల రహదారికి జాతీయ రహదారి హోదా ఇవ్వడంతో, దాని సమీపంలోనే ఉన్న విశాఖ-అనకాపల్లి నాలుగు లైన్ల హైవేకి జాతీయ రహదారి హోదాను తొలగించారు” అని వెన్నెల ఈశ్వరరావు తెలిపారు.
జీవీఎంసీ పరిధిలో టోల్ గేట్ ఉండటం వల్ల టోల్ వసూలు చేయకూడదంటూ అగనంపూడి టోల్ ప్లాజాను తొలగించాలని కోరుతూ 2017లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించామని వెన్నెల ఈశ్వరరావు అన్నారు.
దాంతో టోల్ ప్లాజాను తొలగించాలంటూ 2018 డిసెంబరులో హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తరువాత 2019 ఫిబ్రవరి నుంచి టోల్ వసూళ్లు ఆపివేశారు. కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో ఎన్‌హెచ్‌ఏఐ సవాలు చేసింది. అది జాతీయ రహదారేనని దాని అభివృద్ధికి అయ్యే ఖర్చులను తామే భర్తిస్తున్నామని సుప్రీంకోర్టుకు తెలిపింది.
దాంతో హైకోర్టు తీర్పు మీద స్టే విధించిన సుప్రీంకోర్టు, నిర్వహణ ఖర్చు మీద జీవీఎంసీ కౌంటర్ దాఖలు చేసిన తరువాత నిర్ణయం వెల్లడిస్తామని తెలిపింది. 2019 జులైలో అగనంపూడి టోల్ ప్లాజా వద్ద మళ్లీ వసూళ్లు ప్రారంభమయ్యాయి. కానీ రహదారి అభివృద్ధి ఖర్చు మీద జీవీఎంసీ కౌంటర్ దాఖలు చేయలేదు. దాంతో ఆ వివాదం కోర్టులో ఉండిపోయింది.

పాతికేళ్ళుగా టోల్ కడుతున్నాం: స్థానికులు
దాదాపుగా 25 ఏళ్ల నుంచి టోల్ రుసుం కడుతున్నాం. మా రోజూవారి పనులు చేసుకోవాలంటే టోల్ ప్లాజాకు రుసుం చెల్లించుకోవాల్సి వస్తుందని అగనంపూడితో పాటు చుట్టు పక్కల గ్రామాల వారు అంటున్నారు.
“మాకు ఇటు అనకాపల్లి, అటు గాజువాక లేదా విశాఖ వెళ్తే కానీ ఉపాధి, విద్య, ఉద్యోగ పనులు అవ్వవు. ప్రతి రోజూ మేం వెళ్లాల్సిందే. పోయేటప్పుడు, వచ్చేటప్పుడు ఈ టోల్ గేట్ దాటాల్సిందే. కనీసం సర్వీస్ రోడ్డు లేదు. ఖచ్చితంగా టోల్ గేట్ దాటి వెళ్లాల్సిందే.
స్థానికంగా ఉంటున్న మాకు నెలవారీ కార్డులు ఇచ్చారు. దీనికి రూ. 335ను ఆన్‌లైన్ ద్వారా చెల్లిస్తున్నాం. ఆ కార్డులో నమోదైన నెంబర్‌తో కాకుండా మరో వాహనంలో వెళ్తే డబుల్ టోల్ కట్లాల్సి వస్తుంది. అసలు వాడకపోయినా నెలవారీ టోల్ కార్డుకు డబ్బులు కట్టాలి” అని స్థానికులు బండారు చందు, దశేంద్ర చెప్పారు.

ఈ విషయంపై స్థానిక 79 వార్డు కార్పోరేటర్ రౌతు శ్రీనివాసుతో బీబీసీ మాట్లాడింది.
“స్థానికుడినైనా నేను కూడా టోల్ రుసుం కట్టాల్సి వస్తుంది. పైగా ఇది జీవీఎంసీ పరిధిలో ఉంది. నగర పరిధిలో టోల్ రుసుం వసూలు చేయకూడదు. కానీ జాతీయ రహదారి సంస్థ ఈ టోల్‌ను వసూలు చేస్తోంది. ఈ చుట్టుపక్కల అభివృద్ధి పనులు జీవీఎంసీ నిధులతో చేస్తున్నాం. కానీ టోల్ మాత్రం ఎన్‌హెచ్ఏఐకి కడుతున్నాం” అని కార్పోరేటర్ రౌతు శ్రీనివాసు బీబీసీకి చెప్పారు.
విశాఖపట్నం-అనకాపల్లి రహదారి అభివృద్ధికి జీవీఎంసీ నిధులు ఉపయోగిస్తున్నారా? లేదా? అని వెల్లడించేందుకు మున్సిపల్ అధికారులు నిరాకరించారు. ప్రస్తుతం వివాదం సుప్రీంకోర్టులో ఉన్నందున స్పందించలేమని చెప్పారు.

ఇంకా రూ. 200 కోట్లు వసూలు చేయాలి: ఎన్‌హెచ్ఏఐ
విశాఖ-అనకాపల్లి రహదారి జాతీయ రహదారేనని, దాన్ని ఎన్‌హెచ్‌ఏఐ నిర్వహిస్తోందని ప్రభాత్ రంజన్ తెలిపారు. అలాగే ఏటా టోల్ గేట్ నిర్వహణతో పాటు విశాఖ, అనకాపల్లి రహదారి అభివృద్ది పనులు, వాహనాలు, అంబులెన్సుల నిర్వహణకు ఎన్‌హెచ్ఏఐ చాలా నిధులు ఖర్చు చేస్తుందని, గతేడాది రూ.120 కోట్లు ఖర్చు పెట్టినట్లు చెప్పారు.
మరో ఏడెనిమిది ఏళ్ల పాటు టోల్ గేట్ నిర్వహిస్తేనే ఈ రహదారిపై పెట్టిన ఖర్చును రికవరీ చేసుకోగలమని అన్నారు. మరో రూ.200 కోట్లు టోల్ రూపంలో వసూలు చేస్తే, ఈ రహదారికి వెచ్చించిన ఖర్చులు తిరిగి వస్తాయన్నారు. ఒక వైపు టోల్ వసూలు చేస్తున్నప్పటికీ, మరోవైపు రహదారి అభివృద్ధి, నిర్వహణకు ఎప్పటికప్పుడు ఖర్చులు అవుతాయని వివరించారు.
రహదారి నిర్వహణ, అభివృద్ధి పనులను ఎన్‌హెచ్ఏఐ చూస్తుందని, జీవీఎంసీ కేవలం రోడ్ల మధ్యనున్న డివైడర్లపై మొక్కలు, లైటింగ్ వంటి పనులు మాత్రమే చూస్తుందని ప్రభాత్ రంజన్ అన్నారు. ఆనందపురం-అనకాపల్లి హైవేపై టోల్ గేట్ ఉన్నప్పటికీ ఈ టోల్ గేట్ కూడా ఉండవచ్చని, అవసరం బట్టి, ఆయా ప్రాంతాల్లో టోల్ గేట్లు పెట్టవచ్చని ఆయన తెలిపారు.

బంగారు బాతులా మారింది: టీడీపీ, సీపీఐ
ఎన్‌హెచ్ఏఐ అధికారులు అందించిన సమాచారం ప్రకారం నెలకు సరాసరి నాలున్నర లక్షల నుంచి ఐదు లక్షల వాహనాలు ఈ టోల్ గేటులో రుసుం చెల్లించి రాకపోకలు సాగిస్తున్నాయి. 2024 జనవరిలో 511,895 వాహనాలు అగనంపూడి టోల్ గేటులో ఫీజు చెల్లించాయి. ఇక్కడ రాకపోకలకు రుసుం రూ.45 నుంచి రూ.100 వరకు ఉంది.
“జాతీయ రహదారుల సంస్థ అధికారులు ఈ టోల్ గేటును బంగారు బాతులా చూస్తున్నారు. నగర పరిధిలో ఉండటంతో వాహనాల రాకపోకలు అధికంగా ఉంటాయి. కనీసం స్థానికులకైనా ఉపయోగపడే విధంగా సర్వీస్ రోడ్డు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వంతో పోరాడే ధైర్యం లేక రాష్ట్ర ప్రభుత్వం ఈ టోల్ గేట్‌ను పట్టించుకోవడం లేదు. దీంతో ఈ టోల్ గేట్ సమీప ప్రజలకు, వాహనదారులకు శాపంగా మారింది’’ అని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు చెప్పారు.
గతంలో మా ప్రభుత్వ హయంలోనే ఈ టోల్ గేటును తొలగించాం. మళ్లీ వైసీపీ రావడంతో దీనిని పెట్టారు. త్వరలో మా ప్రభుత్వం వస్తుంది. రాగానే మొట్టమొదట చేసే పని అగనంపూడి టోల్ గేట్ తొలగించడమే” అని వాగ్దానం చేశారు.
ఇప్పటివరకు, ఈ టోల్ గేట్ పై దాదాపు రూ. 700 నుంచి రూ. 800 కోట్లు వసూలు చేసినా, ఇంకా దీనిని నిర్వహించడం అన్యాయమని సీపీఎం నాయకులు, జీవీఎంసీ కార్పొరేటర్ గంగారావు అన్నారు. దీనిని తర్వలో తొలగించకపోతే ప్రజలతో ఉద్యమంగా వెళ్లి గునపాలతో తవ్వేస్తామని హెచ్చరించారు.

రాజ్యసభలో అగనంపూడి టోల్ గేట్ ప్రస్తావన
అగనంపూడి టోల్ గేట్ సమస్య తీవ్రమవుతుండంతో గత రెండు దఫాల ఎన్నికల్లో ఇది గాజువాక నియోజకవర్గంలో ప్రచార అస్త్రంగా మారింది. ఫిబ్రవరి 7న రాజ్యసభలో బీజేపీ రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింగరావు అగనంపూడి టోల్ గేటు విషయాన్ని ప్రస్తావించారు.
అగనంపూడి టోల్ ప్లాజాను తొలగించే ఉద్దేశం ఉందా? అని ఆయన ప్రశ్నించగా.. నోటిఫైడ్ నేషనల్ హైవే కింద అగనంపూడి టోల్ ప్లాజాను నోటిఫై చేశారని దాన్ని తొలగించే ఉద్దేశం లేదని కేంద్ర రహదారులశాఖ మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు.
ఇవి కూడా చదవండి:
- చంద్రుడి మీద స్పేస్‌క్రాఫ్ట్‌ను ల్యాండ్ చేసి చరిత్ర సృష్టించిన తొలి ప్రైవేట్ కంపెనీ
- రైతుల నిరసన: 'ఆందోళనకారుల పోస్టులు తీసేశాం, అకౌంట్లు రద్దు చేశాం' అని అంగీకరించిన ట్విటర్... ప్రభుత్వం ఏమంటోంది?
- అమెరికా: ఐవీఎఫ్ సేవలు క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు దారితీస్తాయా... అలబామా కోర్టు ఏం చెప్పింది?
- కాగ్ రిపోర్ట్: తెలంగాణ గొర్రెల పంపిణీ పథకంలో బయటపడిన అక్రమాలు, బైకు మీద 126, ఇండికా కారులో 168 గొర్రెల్ని కుక్కి తీసుకెళ్ళారట...
- స్మైల్ సర్జరీ తరువాత పెళ్లికొడుకు మృతి.. అనస్తీషియా ఓవర్‌డోస్ కావడంతో చనిపోయారా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














