రైతుల నిరసన: 'ఆందోళనకారుల పోస్టులు తీసేశాం, అకౌంట్లు రద్దు చేశాం' అని అంగీకరించిన ట్విటర్... ప్రభుత్వం ఏమంటోంది?

రైతు ఉద్యమం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, నిఖిల హెన్రీ, దిల్‌నవాజ్ పాషా
    • హోదా, బీబీసీ ప్రతినిధులు

ప్రధాన సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన ఎక్స్ (గతంలో ట్విటర్) భారత్‌లో కొనసాగుతున్న రైతుల నిరసనలకు సంబంధించిన అకౌంట్లు, పోస్టులను తొలగించినట్లు అంగీకరించింది.

భారత ప్రభుత్వం కంపెనీకి 'ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్' (కార్యనిర్వాహక ఆదేశాలు) పంపిన తర్వాత ఆ పేజీలను తీసివేసినట్లు ఎక్స్ పేర్కొంది.

జైలు శిక్షతో పాటు జరిమానాలు విధించే అవకాశం ఉందని ఆ ఆదేశాల్లో ప్రభుత్వం పేర్కొన్నట్లు ఎక్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో ఆ సంస్థ ఏకీభవించలేదు.

తన అధికారిక అకౌంట్ @GlobalAffairsలో ఎక్స్ తన వివరణ ఇచ్చింది.

ఎక్స్ నుంచి తమ పోస్టులను తొలగించినట్లు పలువురు గతంలో ఫిర్యాదు చేశారు.

భారత్‌లో రైతుల నిరసనను కవర్ చేస్తున్న రిపోర్టర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లు, ప్రముఖ రైతు నాయకుల ఎక్స్ అకౌంట్లు సస్పెండ్ అయినట్లు ఎక్స్ యూజర్, జర్నలిస్ట్ అయిన మహ్మద్ జుబైర్ సోమవారం రాశారు.

తన ఎక్స్ అకౌంట్‌తో పాటు న్యూస్ ప్లాట్‌ఫాం 'గావ్ సవేరా'ను కూడా నిలిపివేసినట్లు జర్నలిస్ట్ మన్‌దీప్ పూనియా బీబీసీతో చెప్పారు.

"మేం గ్రామీణ భారతాన్ని కవర్ చేసే ప్రొఫెషనల్ జర్నలిస్టులం. క్షేత్రస్థాయి నుంచి రిపోర్టింగ్ చేస్తున్నాం. కానీ, ప్రభుత్వానికి అది అనవసరం. ప్రభుత్వం మా గొంతు నొక్కుతోంది. ఇది మా జీవనోపాధిని కూడా దెబ్బతీస్తుంది" అని ఆయన అన్నారు.

"ప్రభుత్వ ఆదేశానుసారం" భారత్‌లో అకౌంట్లు, పోస్టులు నిలిపివేస్తున్నట్లు ఎక్స్ తన వివరణలో పేర్కొంది.

ఎక్స్

ఫొటో సోర్స్, Getty Images

అయితే, ''ప్రభుత్వ చర్యలతో తమ సంస్థ ఏకీభవించడం లేదని, ఇలాంటి పోస్టుల విషయంలో భావప్రకటనా స్వేచ్ఛను విస్తృతంగా చూడాల్సిన అవసరం ఉంది'' అని ఎక్స్ తెలిపింది.

ప్రభుత్వ ఆదేశాలను చట్టపరంగా సవాల్ చేశామని తెలిపిన ఆ సంస్థ, ఏ కోర్టులో పిటిషన్ వేసిందో తెలియజేయలేదు.

ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఈ నిర్బంధంపై విమర్శలు చేసింది. ప్రజాస్వామ్య దేశంలో భిన్నాభిప్రాయాలను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించింది. సోషల్ మీడియా పోస్టులను తొలగించినందుకు అనేక మంది ఎక్స్ యూజర్లు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

ఎక్స్ కంపెనీ ప్రకటనపై స్పందన కోసం బీబీసీ భారత ప్రభుత్వాన్ని సంప్రదించింది. ఇప్పటి వరకు ఎలాంటి స్పందన రాలేదు.

తమ పంటలకు కనీస మద్దతు ధర కోరుతూ దేశంలోని అనేక రైతు సంఘాలు ఫిబ్రవరి 13 నుంచి ఆందోళనకు దిగాయి. పంజాబ్, హరియాణా, యూపీ నుంచి ఆందోళనకారులు దేశ రాజధాని దిల్లీకి మార్చ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే, రైతుల మార్చ్‌ను అడ్డుకునేందుకు నగర సరిహద్దుల్లో ముళ్ల తీగలు, సిమెంట్ దిమ్మెలతో భారీగా బారికేడ్లు వేశారు. రైతులు దిల్లీకి చేరుకోకుండా నిరోధించేందుకు బీజేపీ అధికారంలో ఉన్న హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు పెద్ద సంఖ్యలో పోలీసులను, పారామిలటరీ బలగాలను మోహరించాయి.

దేశంలో రైతుల ఓట్లు కీలకమని యాక్టివిస్టులు అంటున్నారు. మరికొద్ది నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ట్రాక్టర్లు, ఇతర వాహనాలతో దిల్లీ రోడ్లపై రైతుల నిరసన ప్రదర్శనలను ప్రభుత్వం కోరుకోవడం లేదు.

2020లో రైతులు ఇదే తరహాలో నిరసనలకు దిగారు. నెలల తరబడి దిల్లీ సరిహద్దుల్లోనే తిష్టవేశారు. ఆ పరిస్థితి మళ్లీ పునరావృత్తం కావాలని ప్రభుత్వం అనుకోవడం లేదు.

నిరసనలను అణచివేసేందుకు రైతు సంఘాలతో ప్రభుత్వం పలు దఫాలు చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదు. హరియాణా పోలీసులతో జరిగిన ఘర్షణలో బుధవారం 22 ఏళ్ల యువ రైతు ప్రాణాలు కోల్పోయారు. తలకి బుల్లెట్ గాయం కావడం వల్లే ఆయన మరణించారని పంజాబ్ అధికారులు బీబీసీతో చెప్పారు.

రైతు ఉద్యమం

ఫొటో సోర్స్, Getty Images

జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల అకౌంట్లపై నిషేధం

రైతుల ఉద్యమం నేపథ్యంలో పలువురు జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తల సోషల్ మీడియా అకౌంట్లపై నిషేధం విధించారు. పీటీఐ రిపోర్ట్ ప్రకారం, కనీసం 177 అకౌంట్లు, వెబ్ లింక్స్‌పై తాత్కాలిక నిషేధం అమల్లో ఉంది.

సామాజిక కార్యకర్త హన్సరాజ్ మీనా అకౌంట్‌పై కూడా నిషేధం విధించారు. ఇది ముమ్మాటికీ భావప్రకటనా స్వేచ్ఛను ఉల్లంఘించడమేనని హన్సరాజ్ మీనా బీబీసీతో అన్నారు.

తన వ్యక్తిగత అకౌంట్‌తో పాటు తన సంస్థ ట్రైబల్ ఆర్మీ ఎక్స్ అకౌంట్‌‌లను భారత ప్రభుత్వం నిషేధం విధించిందని ఆయన చెప్పారు.

భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు నిషేధం విధించినట్లు సోషల్ మీడియా వేదిక ఎక్స్ హన్సరాజ్ మీనాకు తెలిపింది.

''వాళ్లు చెబుతున్న నా పోస్టులు ఏ విధంగానూ చట్టాన్ని ఉల్లంఘించేలా లేవు. నేను కేవలం నా అభిప్రాయాలు చెప్పాను. ఆలోచనలకు కూడా ప్రభుత్వం భయపడుతోంది. మా గొంతుక ప్రజలకు చేరడం ప్రభుత్వానికి ఇష్టం లేదు, అందుకే నిర్దిష్ట కారణం చూపకుండానే మా ఖాతాలు నిలిపివేశారు'' అన్నారు మీనా.

''అకౌంట్ నిలిపివేయడానికి ముందు నాకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మా అకౌంట్‌ను ఎందుకు నిలిపివేస్తున్నారో కనీసం నోటీసు ఇవ్వలేదు, ఎలాంటి సమాచారం లేదు. మేం రైతుల మధ్య నుంచి రిపోర్టింగ్ చేస్తున్నాం. మా గొంతు నొక్కేందుకే మా అకౌంట్లు నిలిపివేశారు'' అని జర్నలిస్ట్ మన్‌దీప్ పూనియా అన్నారు.

''నేనో జర్నలిస్టుని, ఉద్యమాన్ని కవర్ చేస్తున్నా. కానీ, ప్రభుత్వం మా సోషల్ మీడియా అకౌంట్లను నిలిపివేసింది. ఇప్పుడు మేం వీడియోలు చేస్తున్నాం, కానీ, వాటిని ఎక్కడా పోస్టు చేయలేకపోతున్నాం. ఇక్కడ జరుగుతున్న సంఘటనలను ప్రత్యక్షంగా రిపోర్ట్ చేయలేం. ప్రభుత్వం మమ్మల్ని పనిచేయనీయడం లేదు'' అని శంభు సరిహద్దులో ఉన్న మన్‌దీప్ అన్నారు.

పంజాబ్‌కి చెందిన స్వతంత్ర జర్నలిస్ట్ సందీప్ సింగ్ కూడా అదే చెప్పారు. ''ట్విటర్‌లో నా అకౌంట్ 'పున్యాబ్'. ఫిబ్రవరి 14, ప్రేమికుల రోజున, నా అకౌంట్‌ను నిలిపివేసి ప్రధాని మోదీ బహుమతి ఇచ్చారు. అకౌంట్ నిలిపివేయడంతో గ్రౌండ్ నుంచి రిపోర్ట్ చేయలేకపోతున్నా'' అని బీబీసీతో చెప్పారు.

సందీప్ సింగ్ అకౌంట్‌‌పై నిషేధం ఇదే మొదటిసారి కాదు. గతంలో పంజాబ్‌లో అమృతపాల్‌ సింగ్‌ను అరెస్టు చేసిన సమయంలోనూ ఆయన ట్విటర్ అకౌంట్‌ను క్లోజ్‌ చేశారు.

''సోషల్ మీడియా ప్రభుత్వానికి సైరన్‌గా మారింది. భావ ప్రకటనకు అవి వేదికలుగా మారాయి. కానీ, ఇప్పుడు అది కూడా కూలిపోతోంది. ట్విటర్‌లో తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారు, ప్రభుత్వ అజెండాను ముందుకు తీసుకెళ్తున్న వారి అకౌంట్లు బాగా నడుస్తున్నాయి'' అన్నారు సందీప్ సింగ్.

రైతు ఉద్యమం
ఫొటో క్యాప్షన్, యాక్టివిస్ట్ హన్సరాజ్ మీనా, జర్నలిస్ట్ మన్‌దీప్ పూనియా, జర్నలిస్ట్ సందీప్ సింగ్

ప్రభుత్వం ఏమంటోంది?

సీఆర్పీసీ సెక్షన్ 144 కింద ఇచ్చిన అధికారాలను భావ ప్రకటనా స్వేచ్ఛ, లేదా ఏదైనా ప్రజాస్వామ్య హక్కును ఉల్లంఘించేందుకు ఉపయోగించకూడదని 2020 జనవరిలో అనురాధ భాసిన్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో భారత అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

ఇంటర్నెట్‌పై నిషేధం విధించాలన్న అన్ని ఆదేశాలను పునఃసమీక్షించాలని సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వాన్ని కోరింది. చట్టం పరిధిలోకి రాని ఉత్తర్వులను తక్షణమే ఉపసంహరించుకోవాలని కూడా సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది.

అదే సమయంలో, పబ్లిక్ ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి), పబ్లిక్ సేఫ్టీ (ప్రజా భద్రత)కు సంబంధించిన విషయాల్లో ఇంటర్నెట్‌పై నిషేధానికి ఆదేశాలు ఇవ్వవచ్చని కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీకి కేంద్ర హోం శాఖ, కమ్యూనికేషన్ల శాఖలు తెలియజేశాయి.

పబ్లిక్ ఎమర్జెన్సీ, పబ్లిక్ సేఫ్టీ కాకుండా, ఇతర ఏ కారణాలతో ఇంటర్నెట్‌పై నిషేధం విధించారని కమిటీ ప్రభుత్వాన్ని కోరింది? దీనికి ప్రభుత్వం స్పందిస్తూ.. ఇంటర్నెట్‌పై నిషేధానికి సంబంధించిన రికార్డులను ప్రభుత్వం నిర్వహించడం లేదని తెలిపింది.

ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885లోని సెక్షన్ 5(2) కింద పబ్లిక్ సేఫ్టీ, పబ్లిక్ ఎమర్జెన్సీకి సంబంధించిన మార్గదర్శకాలను పొందుపరిచారు.

అయితే, వాటి నిర్వచనం ఏమిటని అడిగినప్పుడు, కమిటీలో హోం మంత్రిత్వ శాఖ ఇలా చెప్పింది. ''ఈ పదాలు కమ్యూనికేషన్స్ శాఖ పరిధిలోని టెలిగ్రాఫ్ చట్టంలో ఉన్నాయి. అందువల్ల, ఆ చట్టం నిర్వచనంలో వివరణ ఉందా లేదా అనేది చూడాలి.''

టెలిగ్రాఫ్ యాక్ట్ 1885, సెక్షన్ 5 ప్రకారం, 'పబ్లిక్ ఎమర్జెన్సీ' లేదా 'పబ్లిక్ సేఫ్టీ' విషయంలో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ప్రసార మాధ్యమాలను ఆధీనంలోకి తీసుకోవచ్చు. అంటే, ఇంటర్నెట్ వంటి కమ్యూనికేషన్ మార్గాలను నిషేధించవచ్చు.

దేశంలో నిరసనల సమయంలో ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడం ప్రభుత్వానికి ఒక ట్రెండ్‌గా మారుతోంది. ఇంటర్నెట్‌ను నియంత్రించే విషయంలో భారత్ ముందంజలో ఉన్నట్లు డేటా చెబుతోంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)