ఆర్టిఫిషియల్స్ ఇంటెలిజెన్స్‌తో ఏలియన్స్ ఉనికి తెలిసిపోనుందా

ఫొటో సోర్స్, BWFOLSOM
- రచయిత, ఎమ్మా వూల్లాకాట్
- హోదా, బీబీసీ బిజినెస్ రిపోర్టర్
ఈ గెలాక్సీలో వెయ్యి నుంచి ఐదు వేల కోట్ల నివాసయోగ్యమైన ప్రపంచాలున్నాయని బిల్ డైమండ్ అంటున్నారు. ఇది తన పనిని మరింత కష్టతరం చేస్తుందని కూడా అన్నారాయన.
బిల్ డైమండ్ సెటీ ఇనిస్టిట్యూట్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్. సెటీ అంటే సెర్చ్ ఎక్ట్స్రాటెర్రిస్ట్రీయల్ ఇంటెలిజెన్స్ (గ్రహాంతర మేధస్సు కోసం వెతకడం)
‘సెటీ ఒక పరిశ్రమ, సౌర వ్యవస్థకు మించిన సైన్స్, టెక్నాలజీని ఇది వెతుకుతోంది’ అని ఆయన చెప్పారు.
"మేం చాలా అరుదైన దాని కోసం వెతుకుతున్నాం, అదే సమయంలో మనం గమనిస్తున్న విషయాలను కనుగొనడం చాలా కష్టంగానూ ఉండవచ్చు" అని డైమండ్ తెలిపారు.
కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి కొత్త టూల్స్ ఈ శోధనలో సహాయపడుతున్నాయి. వీటికి పెద్ద మొత్తంలో డేటాసెట్‌లను డీల్ చేయగల సామర్థ్యం ఉంది. వైపరీత్యాలను గుర్తించడం, గ్రహాంతర మేధస్సు కోసం చేస్తున్న శోధనను ఈ ఏఐ సాంకేతికత పనితీరు మార్చేస్తోంది.
అటువంటి ప్రాజెక్ట్‌లోనే న్యూ మెక్సికోలోని అమెరికా నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీతో సెటీ ఇనిస్టిట్యూట్ భాగస్వామ్యం కుదుర్చుకుంది.
ఈ సంస్థ గ్రహాలు, నక్షత్రాలు, గ్రహశకలాలు వంటి ఖగోళ వస్తువులను అధ్యయనం చేస్తోంది. దీని కోసం రేడియో ఫ్రీక్వెన్సీలను ఉపయోగిస్తుంది.
నక్షత్ర పరిశోధనశాల ఫెసిలిటీ అయిన ‘వెరీ లార్జ్ అర్రే’(వీఎల్ఏ) కోసం సెటి ఒక ఏఐ-ఆధారిత సాఫ్ట్‌వేర్ సైతం రూపొందిస్తోంది. ఈ వీఎల్ఏను 1973, 1981 మధ్య ఏర్పాటుచేశారు.
అర్రే (శ్రేణి) అంటే రేడియో యాంటెన్నాల సమూహం, ఇది అనేక మైళ్ల అంతటా ఒక టెలిస్కోప్‌ను సృష్టిస్తుంది.
వీఎల్ఏలో 28 యాంటెన్నాలు, ఒక్కో డిష్ సైజు 28 మీటర్లుగా ఉన్నాయి.
ఈ ‘వెరీ లార్జ్ అర్రే’ ఫెసిలిటీ గ్రహాంతర జీవుల సంకేతాల కోసం వెతుకుతోంది.

ఫొటో సోర్స్, BILL DIAMOND
గ్రహాంతర అధునాతన సాంకేతికత ఉంటే?
ఏఐ సెకనుకు రెండు టెరాబైట్ (టీబీ) డాటా ప్రాసెస్ చేయగలదు.
గ్రహాంతర జీవుల కోసం తన సంస్థ వెతుకులాట కొనసాగిస్తోందని, అయితే ఇదే సమయంలో ఏఐ పనితీరు పెరగడంతో తమకు ఈ సాంకేతికత అవసరం పడిందన్నారు డైమండ్.
గ్రహాంతర మూలాల నుంచి కొత్త రకాల రేడియో సిగ్నల్స్ వెతకడానికి ఏఐ సహాయపడగలదని ఆయన తెలిపారు. సెటీ సంస్థ నారోబ్యాండ్ సిగ్నల్స్ కోసం వెతుకుతుందని డైమండ్ తెలిపారు.
"కానీ మన వైడ్‌బ్యాండ్ (రేడియో) మాదిరి గ్రహాంతర వాసులకూ అధునాతన సాంకేతికత ఉంటే ఏం చేయాలి? అనే ప్రశ్న ఎప్పుడూ ఎదురయ్యేదే. అలాంటి సందర్భంలో సంప్రదాయ పద్ధతులు పని చేయవు, అది తెరపై శబ్దం మాదిరి కనిపిస్తుంది" అని అన్నారు.
అయితే డైమండ్ మాట్లాడుతూ ''ఏఐకి భారీ మొత్తంలో డేటాను హ్యాండిల్ చేయగల సామర్థ్యం ఉందని, దీనర్థం కాలక్రమేణా ఇది మిలియన్ల కొద్దీ స్నాప్‌షాట్లను తీయడం, నమూనాల కోసం వెతకడం ప్రారంభించడం సాధ్యమవుతుందని అర్థం'' అని చెప్పారు.
సెటి, బ్రేక్‌త్రూ లిసన్ ప్రాజెక్టుతో కూడా పనిచేస్తోంది. రూ. 1,050 కోట్లకు పైగా ప్రైవేట్ సెక్టార్ నిధుల సాయంతో ఇది నడుస్తోంది.
ఈ ప్రాజెక్టు సాంకేతిక జీవితానికి సంబంధించిన సాక్ష్యాల కోసం లక్షలాది నక్షత్రాలు, వంద వరకు గెలాక్సీలను స్కాన్ చేస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images
టొరంటో విద్యార్థి ఆవిష్కరణ
టెలిస్కోప్ డేటాను పరిశీలించడానికి, గ్రహాంతరవాసుల నుంచి సిగ్నల్స్, వాటి జోక్యాల మధ్య తేడాను గుర్తించడానికి ఒక కొత్త ఏఐ వ్యవస్థను యూనివర్శిటీ ఆఫ్ టొరంటో విద్యార్థి 'పీటర్ మా' అభివృద్ధి చేశారు.
ఆయన బృందం రెండు రకాల శబ్దాలను సృష్టించడం ద్వారా దీన్ని అభివృద్ధి చేసింది, ఆపై రెండింటి మధ్య తేడాను గుర్తించడానికి వారి ఏఐకి శిక్షణ ఇచ్చింది.
ఉదాహరణకు ''మన టెలిస్కోప్‌లను ఒక గ్రహాంతర సంకేతం వైపు చూపిస్తేనే కనిపిస్తుంది. అదే టెలిస్కోప్ దూరంగా చూపినప్పుడు అదృశ్యమవుతుంది'' అని పీటర్ మా చెప్పారు.
సంప్రదాయ విశ్లేషణ ద్వారా ఎనిమిది సంభావ్య గ్రహాంతర సంకేతాలను ప్రాజెక్ట్ ఇప్పటికే గుర్తించింది. అయితే, పరిశీలనలు ఇంకా పునరావృతం కానందున అవి వాస్తవమైనవి కాకపోవచ్చని కూడా పీటర్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను మరింత దగ్గరగా ఉండే జీవితానికి సంబంధించిన సంకేతాలను గుర్తించడానికి కూడా ఉపయోగిస్తున్నారు.
గత సంవత్సరం నాసా రోవర్ అంగారక గ్రహంపై ఉన్న జెజెరో క్రేటర్ ప్రాంతం నుంచి నమూనాలను సేకరించడం ప్రారంభించింది.
అంతా సవ్యంగా జరిగితే కొన్నేళ్ల తర్వాత అది భూమికి తిరిగి వస్తుంది.
ఇప్పటికే, రోవర్ షెర్లాక్ అతినీలలోహిత కాంతి కింద మెరిసే ఆర్గానిక్ సమ్మేళనాలను గుర్తించిందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.
అయితే ఆర్గానిక్ సమ్మేళనాలు నాన్-బయోలాజికల్ ప్రక్రియల ద్వారా ఏర్పడతాయి, అంటే అవి గ్రహం మీద గత జీవ రూపాలకు సంబంధించినవో కాదో చెప్పడం ఇప్పటివరకు సాధ్యం కాదు.
కార్నెగీ ఇన్‌స్టిట్యూషన్ ఫర్ సైన్స్ నుంచి కూడా కొత్త పరిశోధనలు వస్తున్నాయి. ఇది ప్రస్తుత లేదా గత జీవిత సంకేతాల కోసం రాళ్ల నమూనాలను విశ్లేషించడానికి ఏఐని ఉపయోగిస్తోంది.
పూర్వంలో జీవించిన, జీవించని పదార్థాలను ఏఐ 90 శాతం కచ్చితత్వంతో వేరు చేయగలదని ఈ బృందం కనుగొంది.
"పరమాణు శిలాజాలను వెతకడానికి ఇది చాలా కొత్త విధానం" అని ప్రధాన పరిశోధకులలో ఒకరైన డాక్టర్ రాబర్ట్ హాజెన్ చెప్పారు.
అనలిటికల్ మెథడ్ ద్వారా వచ్చే డేటా పాయింట్ల (నమూనాకు 5 లక్షలు)ను మెషీన్ లెర్నింగ్ ఉపయోగిస్తామని ఆయన చెప్పారు. అందుకే చిన్న నమూనాలు ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
'ఫలితం కాదు ప్రయత్నం ముఖ్యం'
భూమిపై పురాతన నమూనాలను, ఉల్కల రూపంలోని కొన్ని మార్స్ నమూనాలను విశ్లేషించడానికి ఈ వ్యవస్థను ఉపయోగించడం మొదటి ప్రణాళిక.
"ఉదాహరణకు మేం ఎన్సెలాడస్ (శని ఉపగ్రహాలలో ఒకటి) ద్వారా ఏదైనా పరికరం ప్రయోగించవచ్చు. లేదా మార్స్ మీద పరికరం ల్యాండ్ చేయవచ్చు" అని హాజెన్ అన్నారు.
ఇవన్నీ ఇపుడే మొదలయ్యాయి. ఏఐ ద్వారా ఉత్పన్నమయ్యే ఫలితాలను ఇతర పరిశీలనలు లేదా ఫిజిక్స్ ఆధారిత నమూనాలు ధ్రువీకరించాలి.
ఎక్కువగా డేటాను సేకరించి, విశ్లేషించడం ద్వారా గ్రహాంతర జీవులను గుర్తించే అవకాశాలు (అవి ఉనికిలో ఉంటే) ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి.
నువ్వు ఏం సాధించావనేది ఫలితాల్లో కాదని ప్రయత్నంలో కొలుస్తారని డైమండ్ అంటున్నారు.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరఫున తెలంగాణ యువకులు పోరాడుతున్నారా? వారిని పంపించింది ఎవరు?
- రూ.2,800 కోట్ల జాక్‌పాట్ తగిలిన వ్యక్తికి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన లాటరీ కంపెనీ
- స్మైల్ సర్జరీ తరువాత పెళ్లి కొడుకు మృతి.. అనస్తీషియా ఓవర్ డోస్ కావడంతో చనిపోయారా?
- ‘మత్తు, పెయిన్‌కిల్లర్స్ ఇవ్వకుండానే ఆపరేషన్లు, నొప్పి తట్టుకోలేక రోదిస్తున్న రోగులు’
- సముద్రం అడుగున ‘తిమింగలం ఎముకల గూడు’ అవార్డు తెచ్చిపెట్టింది
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














