‘రష్యన్ ఆర్మీ’ కోసం పనిచేస్తూ డ్రోన్ దాడిలో మరణించిన భారతీయుడు, ఇప్పటికీ తెలియని తెలంగాణ యువకుల ఆచూకీ

యుక్రెయిన్, రష్యా
    • రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

రష్యా వెళ్లి లక్షల రూపాయలు సంపాదించుకోవచ్చని భావించి చిక్కుల్లో పడ్డారు భారతీయ యువకులు కొందరు.

అందులో ఒకరు ఇటీవల ప్రాణాలు కోల్పోయారు. రష్యా తరఫున యుక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న గుజరాత్‌కు చెందిన హేమిల్ అశ్విన్ భాయ్(23) డ్రోన్ దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు.

ఈ మేరకు దుబయి కేంద్రంగా ఇలాంటి నియామకాలకు సహకరించిన ఏజెంట్ ఫైజల్ ఖాన్ ‘బీబీసీ’తో చెప్పారు.

కాగా తెలంగాణ సహా కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, జమ్ముకశ్మీర్ నుంచి 16 మంది రష్యా వెళ్లారు. అక్కడ యుక్రెయిన్‌తో వీరు యుద్ధం చేస్తున్నారు.

ఏజెంట్లు చెప్పిన మాటలు నమ్మి వెళ్లి యుక్రెయిన్‌తో రష్యా చేస్తున్న యుద్దంలో ఫ్రంట్‌లైన్ సైనికులుగా పోరాడుతున్నామని వీరిలో కొందరు చెబుతున్నారు.

హెల్పర్ ఉద్యోగం పేరుతో పిలిచి ఆర్మీలో రిక్రూట్ చేసుకున్నారని వాపోయారు.

రష్యా తరఫున పోరాడుతున్నారంటున్న యువకులు

హెల్పర్ ఉద్యోగాల పేరిట నమ్మించి..

భారతీయ యువకులకు సెక్యూరిటీ, హెల్పర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి తీసుకెళ్లారు ఏజెంట్లు.

దీని కోసం రష్యాలో ఇద్దరు, ఇండియాలో ఇద్దరు ఏజంట్లు ఉన్నారు.

ఈ నలుగురికీ సమన్వయకర్తగా దుబయిలో ఫైజల్ ఖాన్ అనే మరో ఏజెంట్ పనిచేశారు. ఈయన బాబా వ్లాగ్స్ పేరిట యూట్యూబ్ చానల్ నడుపుతున్నారు.

రష్యాలో హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయని తన యూట్యూబ్ చానల్‌లో వీడియోలు పెట్టి యువతను ఆకర్షిస్తుంటారీయన.

ఆ వీడియోలు చూసి.. అందులో ఇచ్చిన ఫోన్ నంబర్ల ఆధారంగా ఉద్యోగాలు అవసరమైన యువకులు సంప్రదించేవారు.

35 మందిని పంపించేలా ప్రణాళిక

మొత్తం 35 మందిని రష్యా పంపించేందుకు ఏజెంట్లు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు.

వీరిలో మొదటి బ్యాచ్ లో ముగ్గురు 2023 నవంబరు 9న ఇండియా నుంచి బయల్దేరారు.

చెన్నై నుంచి షార్జా.. అక్కడి నుంచి మాస్కోకు 12న చేరుకున్నారు.

నవంబరు 16న ఆరుగురు, తర్వాత ఏడుగురిని రష్యా తీసుకెళ్లింది ఫైజల్ ఖాన్ బృందం.

ఆ తర్వాత కొన్ని రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి డిసెంబరు 24న ఆర్మీలో చేర్పించినట్లు బాధిత యువకుల కుటుంబీకులు చెబుతున్నారు.

అయితే, తాను ఎక్కడా సెక్యురిటీ, హెల్పర్ ఉద్యోగాలు అని చెప్పలేదని చెబుతున్నారు దుబయిలోని ఏజెంట్ ఫైజల్ ఖాన్.

బీబీసీతో ఆయన ‘జూమ్’లో మాట్లాడారు.

‘‘ఆర్మీ హెల్పర్ అని చెప్పాను. గతంలో నేను చేసిన వీడియోలు చూడొచ్చు. రష్యా అధికారుల నుంచి మాకు కూడా హెల్పర్ జాబ్ అనే సమాచారం ఉంది. నేను దాదాపు ఆరేడు సంవత్సరాల నుంచి ఈ పనిలో ఉన్నాను. ఇప్పటివరకు దాదాపు రెండు వేల మందికి వేర్వేరు చోట్ల ప్లేస్‌మెంట్ ఇప్పించాను’’ అని చెప్పారు.

రష్యాకు వెళ్లిన కొందరి పేర్లను బీబీసీ సంపాదించింది.

వారిలో.. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అఫ్సాన్, తెలంగాణలోని నారాయణపేటకు చెందిన సుఫియాన్, యూపీకి చెందిన అర్బాన్ హుస్సేన్, కశ్మీర్ కు చెందిన జాహూర్ అహ్మద్, గుజరాత్‌కు చెందిన హేమిల్, కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన సయ్యద్ ఇలియాస్ హుస్సేన్, సమీర్ అహ్మద్, అబ్దుల్ నయీం ఉన్నారు.

హేమిల్ ఎలా చనిపోయారంటే

వీరిలో గుజరాత్‌కు చెందిన 23 ఏళ్ల హేమిల్ యుద్ధభూమిలో మరణించారు.

ఫిబ్రవరి 21న దోన్యస్క్‌ ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో హేమిల్ మరణించినట్లు తనకు సమాచారం ఉందని ఏజెంట్ ఫైజల్ ఖాన్ ‘బీబీసీ’తో చెప్పారు.

కాగా అక్కడ యుద్ధం చేస్తున్న భారతీయులలో మరికొందరి ఆచూకీ కూడా కొద్దికాలంగా తెలియలేదు.

కొన్నివారాలు తమతో వారు కాంటాక్ట్‌లో లేరని కుటుంబీకులు ‘బీబీసీ’తో చెప్పారు.

యూపీ నుంచి రష్యా వెళ్లిన వ్యక్తి
ఫొటో క్యాప్షన్, యూపీ నుంచి రష్యా వెళ్లిన వ్యక్తి

విషయం ఎలా బయటకు వచ్చిందంటే..

కుటుంబ స‌భ్యులతో కాంటాక్టులో లేకపోవడంతోపాటు రష్యాలోని యువకుల నుంచి బయటకు వచ్చిన వీడియోలతో విషయం వెలుగులోకి వచ్చింది.

రెండు వీడియోలు వైరల్‌గా మారాయి.

ఒక వీడియోలో కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన సయ్యద్ ఇలియాస్ హుస్సేన్, మహమ్మద్ సమీర్ అహ్మద్, సుఫియాన్ మాట్లాడినట్లుగా ఉంది.

‘‘మమ్మల్ని సెక్యురిటీ హెల్పర్స్ ఉద్యోగం అని తీసుకువచ్చి రష్యా ఆర్మీలోకి తీసుకున్నారు.

రష్యా బోర్డర్‌లోకి తీసుకువచ్చారు. ఇక్కడ అడవిలో యుద్దభూమిలో ఉంచారు. మమ్మల్ని బాబా వ్లాగ్స్ ఏజెంట్ మోసం చేశారు.’’ అని చెప్పారు.

మరో వీడియోలో ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన అర్బాజ్ హుస్సేన్ మాట్లాడినట్లుగా ఉంది.

తన చేతికి గాయమైందని చూపించారు.

యుద్దభూమిలో తమను పడేశారని, అక్కడి నుంచి అతి కష్టం మీద తప్పించుకుని బయటకు వచ్చానని అందులో చెప్పారు.

తమను ఎలాగైనా కాపాడాలని వేడుకుంటున్నారు.

రష్యన్ ఆర్మీ
ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్‌తో పోరాడుతున్న రష్యన్ సైన్యం

రష్యన్‌లో బాండ్ పేపర్‌పై సంతకాలు

రష్యాకు వెళ్లిన తర్వాత ట్రైనింగ్‌కు ముందుగా ఈ యువకులతో బాండ్ పేపర్‌పై సంతకాలు చేయించుకున్నారు అక్కడి అధికారులు.

బాండ్ పేపర్ రష్యన్ భాషలో ఉందని, ఏజెంట్ల మీద నమ్మకంతో వాటిపై అందరూ సంతకాలు చేసినట్లు చెప్పారు నాంపల్లికి చెందిన మహమ్మద్ ఇమ్రాన్. ఇతని తమ్ముడు అఫ్సన్ కూడా రష్యాకు వెళ్లి మోసపోయాడు.

మహమ్మద్ అఫ్సన్ ది హైదరాబాద్ నాంపల్లి.

బీబీసీ ఆయన ఇంటికి వెళ్లినప్పుడు అక్కడ అతని అన్న మహమ్మద్ ఇమ్రాన్ కలిశారు.

ఓ భవనంలోని మూడో అంతస్తులో వీరు నివాసం ఉంటున్నారు.

అఫ్ఫన్‌కు భార్య, రెండేళ్ల బాబు, 8 నెలల పాప ఉన్నారు.

గతంలో ఇతను హైదరాబాద్ లోని వస్త్ర దుకాణంలో క్లస్టర్ మేనేజర్ గా పనిచేసేవాడు.

యూట్యూబ్‌లో ఫైజల్‌ఖాన్ పోస్టు చేసిన వీడియో చూసి మంచి జీతం వస్తుందన్న ఆశతో అతన్ని సంప్రదించారు.

అతనికి డబ్బులు చెల్లించి రష్యాకు వెళ్లారు. దాదాపు రెండు నెలలుగా తన సోదరుడి ఆచూకీ లేదని, తామంతా ఆందోళన చెందుతున్నామని చెప్పారు అఫ్సర్ అన్న మహమ్మద్ ఇమ్రాన్.

‘‘చివరిసారిగా డిసెంబరు 31న మాతో మాట్లాడాడు‌‍. ‌‍ఆ తర్వాత మాతో టచ్‌లో లేడు.

ఇక్కడ ట్రైనింగ్ వేరుగా ఉంది. ఇది హెల్పర్ ట్రైనింగ్‌లా లేదని అప్పట్లో మాతో చెప్పాడు.

మేం ఏజెంట్లతో మాట్లాడితే, ట్రైనింగ్‌లో భాగమేనని, ఏం టెన్షన్ పడొద్దని, మళ్లీ అందరూ వెనక్కి వచ్చేస్తారని అన్న చెప్పారు. తర్వాత వారి ఆచూకీ లేదు.

యూపీకి చెందిన యువకుడి ద్వారా తెలిసింది ‌‍ఏంటంటే.. మా తమ్ముడి కాలికి రెండు బుల్లెట్లు తగిలాయని..!

అతన్ని వెంటనే వెనక్కి రప్పించాలి.’’ అని ఇమ్రాన్ కోరారు.

జనవరి 18 నుంచి సమాచారం లేదు..

తెలంగాణలోని నారాయణపేట జిల్లాకు చెందిన సయ్యద్ సుఫియాన్ జనవరి 18 నుంచి కాంటాక్టులో లేడని ఆయన తల్లి నసీం బాను బీబీసీకి చెప్పారు.

కుమారుడిని తలచుకుని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

‘‘నాకు ఇక్కడ ఫోన్ అందుబాటులో లేదు. ఉన్నప్పుడు కాల్ చేస్తాను. నేను బాగానే ఉన్నాను’’ అని చెప్పి పెట్టేశాడు. అప్పటి నుంచి మళ్లీ ఫోన్ రాలేదు.

మాకు ముందూ వెనుకా ఎవరూ లేరు. మోదీ సర్కారు స్పందించి మా కుమారుడ్ని వెనక్కు తీసుకురావాలి’’ అని ఆమె విజ్ఘప్తి చే‌శారు.

నారాయణపేటలో వారి కుటుంబం నివాసం ఉంటోంది.

రెండు గదుల చిన్న ఇంట్లోనే వారి జీవనం సాగుతోంది.

24ఏళ్ల సుఫియాన్ రెండేళ్లుగా దుబాయిలో పనిచేస్తున్నాడు.

ఇతనికి తల్లిదండ్రులు, అక్క, అన్న ఉన్నారు.

గతేడాది నవంబరు 16న మరో ఐదుగురుతో కలిసి రష్యాకు వెళ్లాడు సుఫియాన్. దుబయిలో పరిచయం అయిన మరికొందరు భారతీయ మిత్రులతో కలిసి రష్యా వె‌ళ్లేందుకు నిర్ణయించుకున్నాడు.

అతను దాదాపు నెల రోజులుగా కుటుంబసభ్యులకు కాంటాక్టులో లేడు.

‘‘వారానికోసారి కుటుంబంతో మాట్లాడేందుకు అనుమతి ఉంటుంది.

యుద్దభూమిలో ఉన్నప్పుడు ఫోన్ లో మాట్లాడితే.. సిగ్నల్స్ ఆధారంగా యుక్రెయిన్ గుర్తు పట్టే వీలుంది. అలా ఫోన్ సిగ్నల్స్ గుర్తించి డ్రోన్ దాడులు చేస్తోంది.

యుద్దభూమిలో ఫోన్లను వినియోగించడం లేదు. అందుకే వారు కుటుంబంతో కాంటాక్టులో లేరు’’ అని బీబీసీకి చెప్పారు ఫైజల్ ఖాన్.

ఫైజల్ ఖాన్

పది మంది మిస్సింగ్

రష్యా వెళ్లిన 16 మందిలో ఆరుగురి ఆచూకీ మాత్రమే తెలుస్తోందని, మరో పది మంది ఆచూకీ తెలియాల్సి ఉందని ఫైజల్ చెప్పారు.

‘‘వైరల్ గా మారిన వీడియో పంపించిన యూపీకి చెందిన హుస్సేన్ నాతో కాంటాక్టు అయ్యాడు. ఆయన్ను గైడ్ చేసి మాస్కోకు తీసుకురాగలిగాం. ప్రస్తుతం అతను సేఫ్‌గానే ఉన్నాడు. ఆచూకీ లేని వారి కోసం ఎంబసీ, రష్యా ఆర్మీ అధికారులతో సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నాం’’ అని బీబీసీకి చెప్పారు ఫైజల్ ఖాన్.

రష్యాకు వెళ్లిన వారిలో తెలంగాణ యువకులతోపాటు మరికొందరి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

‘‘ఆరుగురు టచ్ లో ఉన్నారు. యూపీకి చెందిన యువకుడు నన్ను సంప్రదించడంతో సేఫ్‌గా మాస్కోకు తీసుకువచ్చాను. ఇద్దరు ఫ్రంట్ లైన్ సైనికులుగా యుద్దంలో ఉన్నట్లు తెలిసింది. నాకు ఆర్మీ అధికారులు హెల్పర్స్ అని చెబితేనే నేను యువకులను పంపించా. కానీ రష్యా అధికారులు వారిని సైనికులుగా మార్చుకున్నారు’’ అని చెప్పారు.

రష్యా సైన్యం

వాగ్నర్ గ్రూపులోకి చేర్పించారా..?

భారతీయ యువకులను రష్యాలోని ప్రైవేటు సైన్యంగా పేరున్న వాగ్నర్ గ్రూపులో చేర్పించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై అధికారికంగా ఎక్కడా సమాచారం లేదు.

అధికారికంగా రష్యన్ ఆర్మీ అని చెప్పినప్పటికీ, అనధికారికంగా వాగ్నర్ గ్రూప్ సైన్యంలో పని చేయిన్నారని ప్రచారం జరుగుతోంది.

ఇదే విషయాన్ని ఫైజల్ ఖాన్ ను బీబీసీ అడిగింది.

తొలుత వాగ్నర్ గ్రూప్ అని చెప్పి.. తర్వాత రష్యన్ ఆర్మీలో పనిచేసేందుకు రిక్రూట్ చేసినట్లు చెప్పారు.

అవి రెండూ, వేర్వేరు గ్రూపులు కదా.. అని ప్రశ్నించగా.. అదంతా రష్యన్ ఆర్మీనే అని చెప్పుకొచ్చారు.

ఇదే విషయంపై రష్యాలో ఏజెంటుగా ఉన్న మొయిన్‌ను బీబీసీ స్పందించేందుకు ప్రయత్నించింది. అతను ఫోన్‌లో అందుబాటులోకి రాలేదు.

దీనిపై హైదరాబాద్ నాంపల్లిలో ఉండే అఫ్సన్ సోదరుడు మహమ్మద్ ఇమ్రాన్ తో బీబీసీ మాట్లాడింది.

‘‘బాండ్ పేపర్ రష్యన్ భాషలో ఉంది. తర్వాత మా తమ్ముడు నాకు బాండ్ పేపర్లోని వివరాలు పంపించినప్పుడు అనువాదం చేసుకుని చదివా. అందులో వాగ్నర్ గ్రూప్ అని లేదు కానీ రష్యన్ ఆర్మీ అనే ఉంది.’’ అని చెప్పారు.

మూడు దేశాలు.. ఐదుగురు ఏజెంట్లు

మొత్తం ఈ వ్యవహారం వెనుక మొత్తం ఐదుగురు ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు బీబీసీ పరిశోధనలో తేలింది.

వీరంతా ఇండియాకు చెందిన వారే. కానీ వేర్వేరు దేశాల్లో ఉంటున్నారు.

రష్యాలో ఆర్మీ సహా వేర్వేరు సంస్థల్లో ఉద్యోగాల పేరిట భారతీయ యువకులను తీసుకెళ్లి వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు.

రాజస్థాన్ కు చెందిన మొయిన్, తమిళనాడుకు చెందిన పళనిసామి రమేశ్ కుమార్ రష్యాలో ఉండి ఆపరేట్ చేస్తున్నారు.

వీరికి అనుసంధానంగా దుబయిలో ఫైజల్ ఖాన్ ఉంటున్నారు. ఇతను బాబా వ్లాగ్స్ పేరిట యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు.

అందులో ప్రకటనలు ఇచ్చి యువతకు వల వేస్తుంటారు.

ముంబయిలో సుఫియాన్, పూజ అనే ఏజెంట్ల ద్వారా భారతీయ యువకులకు వల వేస్తున్నారు.

ఘటన తర్వాత ముంబయిలోని ఏజెంట్లు ఫోన్లో అందుబాటులోకి రావడం లేదు.

ఫైజల్ ఖాన్ అందుబాటులోకి రావడంతో బీబీసీ మాట్లాడింది.

రష్యాలోని మొయిన్ ను కూడా బీబీసీ స్పందించింది. అతను తర్వాత మాట్లాడతానని ఫోన్ పెట్టేసి మళ్లీ కాంటాక్టులోకి రాలేదు.

ఒక్కొక్కరి నుంచి రూ. 3లక్షలు వసూలు

రష్యాకు వెళితే రూ. లక్ష నుంచి రూ. 1.50 లక్షల జీతం వస్తుందని ఏజెంట్లు ఆశ చూపించారు.

అక్కడికి వెళ్లిన తర్వాత ట్రైనింగ్ పేరిట మొదటి మూడు నెలలకు రూ.40-50వేలు మాత్రమే ఇవ్వసాగారు.

తర్వాత జీతం పెరుగుతుందని ఫైజల్ ఖాన్ వారితో చెబుతూ వచ్చాడు.

యువకుల నుంచి రూ. 3 లక్షలు ఫైజల్ ఖాన్ వసూలు చేశాడు.

వీరంతా ఉద్యోగాలు చేసి దాచుకున్న డబ్బులు లేదా అప్పులు తీసుకువచ్చి అతనికి చెల్లించారు.

‘‘మా తమ్ముడు దుబయిలో ఉన్నప్పుడు మొదటి ఏడాది బాగానే డబ్బు పంపించేవాడు.

ఏదైనా ఒక నెల పంపించకపోయినా, తర్వాత నెలలో పంపించేవాడు. రెండో ఏడాది మాత్రం పూర్తిగా పంపించడం ఆపేశాడు.

తను సంపాదించిన మొత్తాన్ని దాచుకుని ఏజెంట్లకు ఇచ్చాడు.

రష్యాకు వెళితే ఎక్కువ సంపాదించి జీవితంలో స్థిరపడవచ్చని భావించాడు.

కానీ, ఇప్పుడు పరిస్థితి మొత్తం మారిపోయింది.’’ అని బీబీసీతో అన్నారు తెలంగాణలోని నారాయణపేటకు చెందిన సుఫియాన్ అన్న సయిద్ సల్మాన్.

‘‘ప్రతి ఒక్కరి నుంచి రూ.3లక్షలు తీసుకున్న మాట నిజమే. అది ప్రక్రియలో భాగమే. అందులో నేను కేవలం రూ.50వేలు తీసుకుని మిగిలిన మొత్తాన్ని రష్యాలోని ఏజెంట్లకు ఇచ్చేవాడిని.’’ అని చెప్పారు ఏజెంట్ ఫైజల్ ఖాన్.

రష్యా వెళ్లే వరకు రహస్యమే..

రష్యా వెళ్లే వరకు అక్కడికి వెళుతున్నట్లు తమకు తెలియదని చెప్పారు సల్మాన్.

‘‘సుఫియాన్ రష్యాకు వెళ్లాకే మాకు తెలిసింది.

కేవలం యూరోపియన్ దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాననే ముందుగా చెప్పేవాడు.

రష్యాకు వెళ్లే విషయాన్ని ఏజెంట్లు చెప్పొద్దన్నారట.

ఎందుకంటే రష్యా వెళ్లాలంటే, రూ. 20-25లక్షలు ఖర్చు అవుతుంది. కానీ, మేం మాత్రం 3 లక్షలే తీసుకుని రష్యా పంపిస్తున్నాం. ఈ విషయం బయట తెలిస్తే అందరూ మమ్మల్ని ఇబ్బంది పెడతారని ఏజెంట్లు నమ్మబలికి, కనీసం ఇంట్లో కూడా చెప్పనివ్వలేదు.’’ అని చెప్పారు సల్మాన్.

అసదుద్దీన్ ఒవైసీ

ఫొటో సోర్స్, Getty Images

అసదుద్దీన్ ఒవైసీ ఏమన్నారంటే..

బాధిత కుటుంబసభ్యులు కొందరు ఫిబ్రవరి 21న హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని కలిశారు.

తమ పిల్లలను రష్యా నుంచి వెనక్కి తీసుకువచ్చేలా చూడాలని కోరారు.

దీనిపై ఆయన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జయశంకర్‌కు లేఖ రాశారు.

ఎంబసీ అధికారులతో మాట్లాడి యువకులను వెనక్కి తీసుకురావాలని కోరారు.

‘‘యువకులకు ఉద్యోగాల ఇస్తామనే ఆశ కల్పించి యువకుల నుంచి రూ. 3లక్షలు వసూలు చేసి రష్యాకు తీసుకెళ్లారు.

ప్రస్తుతం వారి ఆచూకీ తెలియక కుటుంబాలు ఆందోళనలో ఉన్నాయి.

నరేంద్ర మోదీ, జయశంకర్ కలగజేసుకుని వారిని భద్రంగా వెనక్కి తీసుకురావాలని కోరుతున్నా’’ అన్నారు అసదుద్దీన్ ఒవైసీ

ముంబయిలోని ఇద్దరు ఏజెంట్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

భారత విదేశీ వ్యవహారాల శాఖ ఏమందంటే..

రష్యాలోని యుద్ధభూమిలో భారతీయ యువకులు చిక్కుకుపోయిన విషయంపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ మేరకు వార్త సంస్థ ఏఎన్ఐ ఎక్స్‌లో ట్వీట్ చేసింది.

భారత విదేశీ వ్యవహారాల ప్రతినిధి రంధీర్ జైశ్వాల్ స్పందిస్తూ.. ‘‘రష్యా ఆర్మీలో ఉద్యోగాల కోసం కొందరు భారతీయులు వెళ్లి చిక్కుకున్నట్లు తెలిసింది.

వారిని త్వరగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు రష్యా అధికారులతో భారత ఎంబసీ సంప్రదింపులు జరుపుతోంది.

‌‍భారతీయులు జాగ్రత్తగా ఉంటూ ఇలాంటి మోసాలకు దూరంగా ఉండాలని విజ్ఘప్తి చేస్తున్నాం’’ అని చెప్పారు.

మరోవైపు, ఈ విషయంపై బీబీసీ రష్యాలోని భారత ఎంబసీ, భారత్ లోని రష్యా ఎంబసీని ఈ మెయిల్ ద్వారా సంప్రందించింది. వారి నుంచి ఇంకా స్పందన రాలేదు.

పోలీసుస్టేషన్ లో కేసు నమోదు

తన సోదరుడు కనిపించకపోవడంపై హైదరాబాద్ నాంపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఇమ్రాన్.

ఏజెంట్ ఫైజల్ ఖాన్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

దీనిపై నాంపల్లి పోలీసులు ఫైజల్‌ఖాన్‌పై చీటింగ్ కేసు నమోదు చేశారు.

వీడియో క్యాప్షన్, రష్యన్ ఆర్మీ’ కోసం పనిచేస్తున్న తెలంగాణ యువకులు ఎక్కడున్నారు, ఏమయ్యారు?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)