ఈ ‘డ్రాగన్’ ఎలా ఉండేదో తెలుసా?

డ్రాగన్ శిలాజం

ఫొటో సోర్స్, NATIONAL MUSEUMS OF SCOTLAND

    • రచయిత, విక్టోరియా గిల్
    • హోదా, బీబీసీ న్యూస్

ఒక భారీ జల సరీసృప శిలాజాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ శిలాజం 16 అడుగుల పొడవు (ఐదు మీటర్లు) ఉంది.

ఈ శిలాజానికి ఉన్న పొడవైన మెడ కారణంగా దీనిని డ్రాగన్‌గా భావిస్తున్నారు.

ఇది 24 కోట్ల ఏళ్ల నాటిదని, ట్రయాసిక్ కాలానికి చెందినదని పరిశోధకులు చెబుతున్నారు.

దీనిని ‘డైనోసెఫలోసారస్ ఓరియంటైల్స్’ అని పిలుస్తున్నారు.

ఈ జాతిని 2003లో గుర్తించారు.

శాస్త్రవేత్తలకు ఈ ప్రీహిస్టారిక్ జంతువు శరీర నిర్మాణాన్ని అర్థం చేసుకోవడానికి సరికొత్త శిలాజం అవకాశం కల్పిస్తోంది.

దక్షిణ చైనాలోని పురాతన సున్నపురాయి నిక్షేపాలలో ఈ శిలాజం లభించింది.

ఎప్పుడు ఈ నిక్షేపాలలో వెదికినా ఏదో ఒక కొత్త విషయం బయటపడుతోందని డాక్టర్ ఫ్రేజర్ బీబీసీకి చెప్పారు.

డైనోసర్ శిలాజం

ఫొటో సోర్స్, MARLENE DONELLY

ఫొటో క్యాప్షన్, ‘డైనోసెఫలోసారస్ ఓరియంటైల్స్’ నీటి అడుగున చేపలను వేటాడుతున్నట్టు ఊహిస్తూ గీసిన చిత్రం

పొడవైన మెడ

శాస్త్రవేత్తలకు పూర్తిస్థాయిలో ఒక శిలాజాన్ని చూసే అవకాశం మొదటిసారి దక్కిందని, ఇది చాలా వింతగా ఉన్న జంతువని, శిలాజాన్ని అధ్యయనం చేసిన అంతర్జాతీయ బృందంలో సభ్యుడైన స్కాట్లండ్‌లోని నేషనల్ మ్యూజియానికి చెందిన డాక్టర్ ఫ్రేజర్ చెప్పారు.

‘‘దీనికి ఫ్లిప్పర్ లాంటి అవయవాలు ఉన్నాయి. దీని మెడ చాలా పొడవుగా ఉంది. తోక, శరీరంలోని ఇతర భాగమంతా కలిపి చూసినా, అంతకంటే పొడవుగా మెడ ఉంది’’ అని ఆయన వివరించారు.

ఈ జంతువుకు ‘‘పొడవైన, వంపు తిరిగిన, సాగే మెడ ఉండేది’’ అని పరిశోధకులు ఊహిస్తున్నారు.

దానికున్న వెన్నెముక నీటి అడుగున వేటాడటానికి తోడ్పడి ఉంటుందని భావిస్తున్నారు.

ఈ జంతువుకు సంబంధించిన కొత్త శిలాజాల సమూహాన్ని వివరించే పత్రాన్ని ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్స్: ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ది రాయల్ సొసైటీ ఆఫ్ ఎడిన్‌బరో జర్నల్‌లో ప్రచురించారు.

ఇవి కూడా చదవండి :

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)