మాల్దీవులు చేరుకున్న చైనా ‘గూఢచారి’ నౌక, భారత్‌ ఆందోళనకు కారణమేంటి?

మాల్దీవులకు చేరుకున్న చైనా నౌక

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, మాల్దీవులకు చేరుకున్న చైనా నౌక

అధునాతన టెక్నాలజీతో కూడిన చైనా ‘పరిశోధన’ నౌక ఒకటి గురువారం మాల్దీవులకు చేరుకుంది. గత నెల రోజులుగా ఈ నౌక హిందూ మహాసముద్రంలో ఉంది.

మాల్దీవుల మీడియాలో దీనికి సంబంధించి పలు కథనాలు వచ్చాయి.

సైనిక విన్యాసాల కోసం భారత్, శ్రీలంకలకు చెందిన తీర ప్రాంత నౌకలు ఆ ప్రాంతానికి చేరుకున్న రోజే, చైనాకు చెందిన నౌక ‘షియాంగ్ యాంగ్ హాంగ్ 3’ మాల్దీవులు చేరుకున్నట్లు వార్తాసంస్థ పీటీఐ నివేదించింది.

హిందూ మహా సముద్రంలోని ఈ నౌకపై భారత్ అంతకుముందే తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేసింది. కొలంబో నౌకాశ్రయంలో ఈ నౌకను ఆగకుండా చేసేందుకు శ్రీలంకపై తీవ్ర ఒత్తిడి తెచ్చింది.

గురువారం చైనా పరిశోధన నౌక ‘షియాంగ్ యాంగ్ హాంగ్ 3’ మాలేకు చేరుకున్నట్లు మాల్దీవుల మీడియా గ్రూప్ ‘ది ఎడిషన్’ కథనాన్ని ఉటంకిస్తూ పీటీఐ వార్తాసంస్థ తెలిపింది. ఈ నౌక గురువారం మధ్యాహ్నం థిలాఫుషీ సమీపంలో కనిపించింది.

మరైన్ ట్రాఫిక్ వెబ్‌సైట్‌లో ఈ వివరాలను పేర్కొన్నట్లు ది ఎడిషన్ తన కథనంలో ప్రస్తావించింది. సముద్రంలో నౌకల రాకపోకలను మరైన్ ట్రాఫిక్ వెబ్‌సైట్ పర్యవేక్షిస్తుంటుంది.

మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయిజ్జూ

ఫొటో సోర్స్, PRESIDENCY.GOV.MV

ఫొటో క్యాప్షన్, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జూ

మయిజ్జూ చైనా పర్యటన తర్వాత బయల్దేరిన నౌక

మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జూ జనవరిలో చైనాలో పర్యటించిన తర్వాత 24 గంటల్లో ఈ నౌక తన ప్రయాణాన్ని ప్రారంభించిందని మాల్దీవుల న్యూస్ వెబ్‌సైట్ అధాధును ఉటంకిస్తూ వార్తాసంస్థ పీటీఐ తెలిపింది.

మాల్దీవుల ఎక్స్‌క్లూజివ్ ఎకనామిక్ జోన్‌(ఈఈజెడ్)లో నెల పాటు ఉన్న తర్వాత, ఈ నౌక ఫిబ్రవరి 22న మాలేకి సమీపంలో కనిపించింది.

జనవరి 22 నుంచి రాడార్‌లో ఎక్కడా ఈ నౌక కనిపించలేదని తన రిపోర్టులో తెలిపింది. ఈ నౌక ట్రాకింగ్ సిస్టమ్‌ను ఆపివేసి ఉండొచ్చని భావిస్తున్నారు.

మయిజ్జూను చైనాకు అనుకూలమైన వ్యక్తిగా పరిగణిస్తున్నారు. 2023 నవంబర్ నుంచి మయిజ్జూ మాల్దీవుల అధ్యక్షుడిగా ఉన్నారు.

ఎన్నికల్లో ‘ఇండియా అవుట్’ అనే నినాదంతో ప్రచారం సాగించారు.

మాల్దీవుల అధ్యక్షుడు అయిన తర్వాత, మయిజ్జూ ఇప్పటి వరకు భారత్‌ సందర్శించలేదు.

గత సంవత్సరం నవంబర్ ప్రారంభంలో తుర్కియే అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్దోవాన్ ఆహ్వానం మేరకు ఆయన తుర్కియే వెళ్లారు. ఇటీవలే ఆయన చైనాలో పర్యటించారు.

మరైన్ ట్రాఫిక్ వెబ్‌సైట్

ఫొటో సోర్స్, WWW.MARINETRAFFIC.COM

ఫొటో క్యాప్షన్, నౌకల రాకపోకలను ట్రాక్ చేసే మరైన్ ట్రాఫిక్ వెబ్‌సైట్‌‌ అందించిన వివరాలు

ఇది గూఢచారి నౌక: అమెరికా థింక్ ట్యాంక్

చైనా శాస్త్రీయ పరిశోధన నౌకగా పేర్కొంటున్న ఈ షిప్, సైనిక అవసరాల కోసం సముద్రం నుంచి డేటాను సేకరిస్తుందని అమెరికా థింక్ ట్యాంక్ ఒకటి ఆరోపిస్తోంది.

సైనిక అవసరాల కోసం ముఖ్యంగా జలాంతర్గాములకు చెందిన డేటాను ఈ నౌక సేకరిస్తుందని థింక్ ట్యాంక్ చెబుతోంది.

ఈ ఆరోపణలను చైనా ఖండిస్తోంది. సముద్రాలకు చెందిన ఐక్యరాజ్యసమితి చట్టాలకు అనుగుణంగానే ఈ నౌక పనిచేస్తుందని తెలిపింది.

ఈ పరిశోధన నౌక తమ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఈ ఏడాది జనవరి 23న మాల్దీవుల ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మాల్దీవుల సముద్ర జలాల్లో ఉన్నప్పుడు ఈ నౌక ఎలాంటి పరిశోధన పనిని చేపట్టదని కూడా మాల్దీవుల విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది.

ఈ నౌక కదలికలను తాము నిశితంగా పరిశీలిస్తున్నట్లు భారత రక్షణ వర్గాలు తెలిపినట్లు పీటీఐ చెప్పింది.

అనుమతి నిరాకరించిన శ్రీలంక

శ్రీలంక నౌకాశ్రయంలో ఈ చైనీస్ నౌక ల్యాండ్ అయ్యేందుకు అనుమతులు కోరినప్పుడు, శ్రీలంక అందుకు నిరాకరించింది.

చైనా నౌకల ప్రవేశాన్ని ఈ ఏడాది జనవరి 5నే శ్రీలంక రద్దు చేసింది. తమ జలాల్లోకి విదేశీ నౌకలు రావడాన్ని ఏడాది పాటు నిషేధిస్తున్నట్లు శ్రీలంక ప్రకటించింది.

తమ సరిహద్దు దేశాల సముద్ర జలాల్లోకి చైనా నౌకలు వెళ్తున్నాయని భారత్ అంతకుముందు ఆందోళన వ్యక్తం చేసింది.

చైనా నౌకల రాకపోకలపై భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పరిశోధన నౌకలకు శ్రీలంక అనుమతులు నిరాకరించింది.

2022 ఏడాదిలో చైనాకు చెందిన సైనిక నౌక యువాన్ వాంగ్ 5 కొలంబోకు వచ్చింది. ఈ నౌక శ్రీలంకకు రావడంపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. రాకెట్, క్షిపణి దాడులను ట్రాక్ చేసే సామర్థ్యం దీనికి ఉందని చెప్పింది.

భారత్ ఈ నౌకను గూఢచారి నౌకగా పేర్కొంది. శ్రీలంక ప్రభుత్వం వద్ద తమ అభ్యంతరాలను అధికారికంగా తెలియజేసింది.

‘‘భద్రతాపరమైన ఆరోపణలతో శ్రీలంకపై ఒత్తిడి తీసుకురావడం సరైంది కాదు’’ అని భారత్ పేరును ప్రస్తావించకుండానే చైనా మండిపడింది.

ప్రధాని మోదీతో మాల్దీవుల అధ్యక్షులు

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, ప్రధాని నరేంద్ర మోదీతో మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జూ (పాత ఫోటో)

మాల్దీవులపై భారత్ ఆందోళనలేంటి?

భారత్ పశ్చిమ తీర ప్రాంతానికి 300 నాటికల్ మైళ్ల దూరంలో మాల్దీవులు ఉంటుంది. భారత్‌కు చెందిన లక్ష దీవుల సముదాయంలోని మినికాయ్ దీవి నుంచి ఇది కేవలం 70 నాటికల్ మైళ్ల దూరం మాత్రమే.

భౌగోళికంగా, భారత్‌కు, ప్రపంచ వాణిజ్యానికి మాల్దీవులు చాలా కీలకం. ఇది హిందూ మహా సముద్రంలో భాగం. హిందూ మహా సముద్ర ప్రాంతంలో భారత్‌కు ఎంతో కీలకమైన భాగస్వామిగా మాల్దీవులు ఉంది.

నైబర్‌హుడ్ ఫస్ట్ పాలసీ, సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్(సాగర్) వంటి మోదీ ప్రభుత్వ కార్యక్రమాల్లో మాల్దీవులకు ప్రముఖమైన స్థానం ఇచ్చింది.

ప్రస్తుతం మాల్దీవులు చైనాకు అనుకూలంగా మారడం భారత్‌కు ఆందోళనకరంగా మారింది. మయిజ్జూ అధ్యక్షుడు అయిన తర్వాత, మాల్దీవుల నుంచి భారత్ తన సైన్యానంతటినీ ఉపసంహరించుకోవాలని ఆయన ఆదేశించారు.

మార్చి 10 నాటికి ఒక ప్లాట్‌ఫామ్ నుంచి, మే 10 నాటికి మిగిలిన రెండు ప్లాట్‌ఫామ్‌ల నుంచి భారత బలగాలను ఉపసంహరించుకుంటామని భారత విదేశీ వ్యవహారాలశాఖ ఇటీవలే తెలిపింది.

మాల్దీవుల్లో ప్రస్తుతం 77 మంది భారతీయ సైనికులున్నారు. మారిటైమ్ సర్వైలెన్స్ కోసం ఒక డోనియర్ 228 విమానాన్ని, వైద్య సహాయం కోసం రెండు హెచ్ఏఎల్ ధ్రువ్ హెలికాప్టర్లను వారు ఆపరేట్ చేస్తున్నారు.

సంయుక్త సైనిక విన్యాసాలు

మాల్దీవులు, భారత్, శ్రీలంక నౌకా దళాలు గురువారం సంయుక్త సైనిక విన్యాసాలను ప్రారంభించాయి.

దోస్తీ-16 పేరుతో నిర్వహించే ఈ విన్యాసాల్లో అబ్జర్వర్‌గా బంగ్లాదేశ్ కూడా పాల్గొంటోంది.

‘‘ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు జరిగే మూడు దేశాల సంయుక్త విన్యాసం ‘దోస్తి-16’లో పాల్గొనేందుకు వచ్చిన భారత్, శ్రీలంక నౌకలకు స్వాగతం. ఈ మూడు దేశాల సైనికుల మధ్య సహకారాన్ని పెంచే ప్రయత్నాల్లో ఇది భాగం. సముద్రంలో ఏమైనా ప్రమాదాలు జరిగితే సంయుక్తంగా వాటిని ఎదుర్కొనే మార్గాలను వెతుకుతాం’’ అని మాల్దీవుల జాతీయ రక్షణ దళం(ఎంఎన్డీఎఫ్) సోషల్ మీడియా ద్వారా తెలిపింది.

1991లో దోస్తీ సైనిక విన్యాసాలు ప్రారంభమయ్యాయి. తొలిసారిగా 2012లో శ్రీలంక వీటిలో పాల్గొంది.

అంతకుముందు 2021లో ఈ యుద్ధ విన్యాసాలు జరిగాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)