జూలో ఆడ సింహం పేరు సీత, మగ సింహం పేరు అక్బర్.. వీటి పేర్లను మార్చాలన్న హైకోర్టు

సింహం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రెండు సింహాల పేర్లను మార్చాలని జంతు ప్రదర్శనశాలను ఆదేశించిన కోర్టు

పశ్చిమ బెంగాల్‌లోని ఒక జంతు ప్రదర్శన శాలలో ఉన్న రెండు సింహాల పేర్లను మార్చాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది.

ఈ సింహాల పేర్లు తమ మతపరమైన మనోభావాలను దెబ్బతీస్తున్నాయని విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఫిర్యాదు చేయడంతో కోర్టు ఈ ఆదేశాలిచ్చింది.

జంతు ప్రదర్శనశాలలో ఉన్న ఆడ సింహానికి హిందూ దేవత సీత పేరును, మగ సింహానికి 16వ శతాబ్దపు మొగల్ పాలకుడు అక్బర్ పేరును పెట్టారు.

వీటికి ఈ పేర్లు పెట్టడాన్ని వీహెచ్‌పీ సవాలు చేసింది. ఆడ సింహానికి సీత పేరును పెట్టడం హిందూ దేవతను అవమానపరిచినట్లేనంటూ వీహెచ్‌పీ అభ్యంతరం వ్యక్తంచేసింది.

ఒకే వన్యప్రాణుల పార్కులో ఈ సింహాలను ఉంచడంపై కూడా అభ్యంతరం చెప్పింది.

ఈ రెండు సింహాలు ప్రస్తుతం సిలిగురి జిల్లాలోని నార్త్ బెంగాల్‌ వైల్డ్ యానిమల్స్ పార్కులో నివసిస్తున్నాయి.

జంతువులకు హిందూ దేవతలు, ముస్లిం ప్రవక్తలు, క్రైస్తవ బోధకులు, నోబెల్ పురస్కార గ్రహీతలు, స్వాతంత్య్ర సమరయోధుల పేర్లను పెట్టవద్దని గురువారం కోర్టు తెలిపింది.

‘‘జంతువులకు బిజ్లీ(కాంతి అనే అర్థంలో) లేదా మరేదైనా పేర్లను పెట్టుకోవాలి. కానీ, అక్బర్, సీతా లాంటి పేర్లను ఎందుకు పెడుతున్నారు’’ అని జస్టిస్ సౌగత భట్టాచార్య ప్రశ్నించారు.

కుక్కలు సహా మీ పెంపుడు జంతువులకు వ్యక్తుల పేర్లను పెడతారా అని జడ్జి ప్రశ్నించారు. పేర్ల వల్ల వివాదాలు తలెత్తకుండా చూసుకోవాలని సూచించారు.

ఈ సింహాల పేర్లపై దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి తమకు ఫిర్యాదులు వచ్చాయని వీహెచ్‌పీ తన ఫిర్యాదులో తెలిపింది. ‘‘సీత, హిందువుల దేవుడు రాముని భార్య. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ సీతను ఆరాధ్య దైవంగా పూజిస్తారు’’ అని చెప్పింది.

ఇలాంటి పనుల వల్ల తమ దేవతను తక్కువ చేసినట్లవుతుందని, హిందువులందరి మనోభావాలను నేరుగా దెబ్బతీసినట్లని వీహెచ్‌పీ తన ఫిర్యాదులో ఆరోపించింది.

పశ్చిమ బెంగాల్‌లోని అధికారులు కావాలనే ఇలా చేశారని వీహెచ్‌పీ తీవ్రంగా విమర్శించింది. జూలోని ఆ రెండు సింహాల పేర్లను మార్చకపోయినా, వాటిని వేర్వేరు చోట్లకు మార్చకపోయినా తాము పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది.

‘‘సీతా, అక్బర్ ఒకే దగ్గర ఉండటాన్ని అనుమతించం’’ అని వీహెచ్‌పీ అధికారి ప్రతినిధి వినోద్ బన్సాల్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)