జపాన్ మహిళలు న్యూడ్ ఫెస్టివల్‌లో పాల్గొంటామని ఎందుకు ముందుకు వస్తున్నారు?

న్యూడ్ ఫెస్టివల్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, హడాకా మత్సూరి ఫెస్టివల్‌లో పాల్గొంటున్న మహిళలు

దాదాపు నగ్నంగా ఉన్న కొందరు పురుషులు ‘వాషోయ్ వాషోయ్’ అని నినాదాలు చేస్తూ ఆలయం దిశగా ముందుకు సాగుతున్నారు. జపనీస్ భాషలో ‘వాషోయ్’ అంటే ‘పదండి పోదాం’ అని అర్ధం

సెంట్రల్‌ జపాన్‌లోని కోనోమియా అనే ఆలయం దగ్గర ‘హడాకా మత్సూరి’ లేదా న్యూడ్ ఫెస్టివల్ అనే పేరుతో జరిగే ఈ ఉత్సవంలో గత 1250 సంవత్సరాల నుంచి పెద్దగా మార్పులు లేవు. కానీ, ఈ సంవత్సరం ఒక పెద్ద మార్పు కనిపించించింది.

పురుషుల గుంపు వెనకాలే, దూరంగా ఒక మహిళల గుంపు కూడా బయలుదేరింది. ఇక్కడికి వస్తున్న మహిళలకు తాము చరిత్ర సృష్టిస్తున్నామని తెలుసు.

సాంప్రదాయికంగా పురుషులు ఆధిపత్యం వహించే కొన్ని ఈవెంట్లలో మహిళలకు ప్రవేశం ఎక్కడైనా కష్టమే. గత సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విడుదల చేసిన ‘జెండర్ గ్యాప్ ఇండెక్స్‌’లో జపాన్‌ 146 దేశాలలో 125వ ర్యాంక్‌లో ఉంది.

అలాగని అక్కడి మహిళలు మౌనంగా ఉన్నారని, వెనకబడ్డారని అనుకోవడానికి వీల్లేదు.

‘‘ఈ పండుగలో పాల్గొనే విషయంలో పురుషులకు సహకరించేందుకు ఇంతకు ముందు మహిళలు చాలా కష్టపడేవారు’’ అని అట్సుకో తమకోషి అన్నారు. ఆయన కుటుంబం తరతరాలుగా కొనోమియా పండుగలో పాల్గొంటుంది.

దుష్టశక్తులను పారదోలే క్రమంలో దేవుడిని ప్రార్ధించేందుకు పురుషులు ఈ పండుగలో పాల్గొంటుంటారు. అయితే ఇందులో తామూ ఇందులో పాల్గొనవచ్చని గతంలో మహిళలు ఎప్పుడూ అనుకోలేదు.

అయితే, మహిళలు ఇందులో పాల్గొనకూడదనే నియమం ఏదీ లేదని, తామూ పాల్గొంటామని ఎప్పుడూ మహిళలు అడగలేదని నరుహిటో సునోడా అనే వ్యక్తి అన్నారు.

‘‘ఇది అందరికీ ఆనందం కలిగించే పండుగ. ఇందులో మహిళలు కూడా పాల్గొంటే అది ఇంకా ఆనందకరంగా మారుతుంది’’ అని ఆయన రాయిటర్స్ వార్తా సంస్థతో అన్నారు.

న్యూడ్ ఫెస్టివల్

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, మగవాళ్లంతా గోచి గుడ్డలు కట్టుకుని ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటారు.

‘ఇక్కడ మహిళలకు ఏం పని’

అయితే, ఆయన ఉండే కమ్యూనిటీలో అందరూ దీనికి సుముఖంగా లేరు.

‘‘పురుషుల పండుగలో మహిళలకు ఏం పని అని వాదించేవాళ్లు చాలామంది ఉన్నారు. ఇది పురుషుల పండగ. నిజంగానే మహిళలకు ఇందులో ఏం పని?’’ అని తమకోషి అనే 56 ఏళ్ల మహిళ అన్నారు.

‘‘కానీ, ఈ విషయంలో మా మధ్య విభేదాలు లేవు. మనం మంచి మనస్సుతో ఉంటే, దేవుడు మనల్ని కూడా కరుణిస్తాడు’’ అని ఆమె అన్నారు.

అయితే చాలామంది మహిళలు ఇందులో పాల్గొనేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. అయితే, పూర్తి నగ్నంగా కాదు.

వాళ్లంతా ఊదా రంగులో ఉన్న హ్యాపీ కోట్స్ ( మహిళలు ధరించే పొడవైన జాకెట్‌లాంటి డ్రెస్), తెల్లని షార్ట్స్ ధరిస్తారు. ఈ షార్ట్స్ పురుషులు ధరించే లంగోటీ (గోచీ)కి ప్రత్యామ్నాయం. ఈ డ్రెస్సును ధరించి భుజం మీద వెదురు కర్రను మోసుకుంటూ పురుషుల వెనక వాళ్లు నడుస్తున్నారు.

అయితే, ఈ ఆలయ ప్రాంగణంలోకి మహిళలు ప్రవేశిస్తారు తప్ప, మగవాళ్లతో కలిసి ఒకరిపై ఒకరు పాకుతూ దేవతను తాకే ప్రయత్నం మాత్రం చేయడం లేదు.

ఆ దేవతను పురుషులు మాత్రమే తాకాలని, అప్పుడే దుష్ట శక్తులు పారిపోతాయని జపనీయుల నమ్మకం.

న్యూడ్ ఫెస్టివల్

ఫొటో సోర్స్, REUTERS

తాకనంత మాత్రాన....

మహిళలు దేవతను తాకనంత మాత్రాన మహిళలు తొలిసారి పాల్గొంటున్న ఈ వేడుక ప్రాధాన్యత తగ్గిపోతుందా? ఎంతమాత్రం కాదంటున్నారు అక్కడి మహిళలు.

‘‘కాలం మారింది. ఇందులో పాల్గొనడం గొప్ప బాధ్యతగా భావిస్తాను’’ అని యుమికో అనే మహిళ బీబీసీతో అన్నారు.

మహిళలు ఇందులో పాల్గొనడం ద్వారా లింగ భేదాలను బద్ధలు కొట్టడమే కాక, సంప్రదాయంగా వస్తున్న ఈ పండుగను సజీవంగా కొనసాగిస్తున్నారని ఆమె అభిప్రాయ పడ్డారు.

ఈవారం, ఉత్తర జపాన్‌లోని కొకుసేకి ఆలయంలో జరగబోయే న్యూడ్ ఫెస్టివల్ చివరిది కావొచ్చని, ఈ ఉత్సవాలను కొనసాగించడానికి తగినంతమంది యువత కూడా దొరకడం లేదని నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధాప్య జనాభాను పొందిన దేశాల్లో జపాన్ ఒకటి. గత సంవత్సరం, మొదటిసారిగా ప్రతి 10 మందిలో ఒకరికంటే ఎక్కువ మంది 80 లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వారు తేలారు.

పైగా, జపాన్ మహిళలలో జననాల రేటు కూడా తక్కువే. ప్రతి జపనీస్ స్త్రీ 1.3 మందికి మాత్రమే జన్మనిస్తోంది. గత సంవత్సరం కేవలం 800,000 మంది పిల్లలు జన్మించారు.

ఈ ఏడాది జరిగే ఉత్సవంతో ఈ ఆలయంలోకి మహిళలు కూడా ప్రవేశించే సమయం దగ్గరపడిందని కొందరు మహిళలు అంటున్నారు.

న్యూడ్ ఫెస్టివల్
ఫొటో క్యాప్షన్, అట్సుకో తమకోషి

ఉత్సాహంగా, ఉల్లాసంగా...

ఇప్పుడు మహిళలు రెండు వరసలలో నిలబడి భుజాల మీద పెద్ద వెదురు స్తంభాన్ని మోసుకుంటూ వెళుతున్నారు.

అట్సుకో తమకోషి ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. ఇంతకు ముందు పురుషులు మాత్రమే పఠించే మంత్రాలను మహిళలు కూడా పఠించేలా ఉత్సాహపరుస్తూ ఆమె విజిల్ ఊదుతున్నారు. ఆమె వెనకున్న మహిళలు ‘వాషోయ్, వాషోయ్ అని అరుస్తున్నారు.

ఈ ఉత్సవంలో పాల్గొనేందుకు మహిళలు కొన్ని వారాలుగా శిక్షణ తీసుకున్నారు. ఇందులో ఏమాత్రం పొరపాటు జరగవద్దన్నది వారి పట్టుదల.

ఈసారి మీడియాతోపాటు ప్రేక్షకుల కళ్లన్నీ తమపై ఉంటాయని వారికి తెలుసు. అందుకే వారు చాలా ఉత్సాహంగా నవ్వుతున్నట్లు కనిపించినా లోలోపల ఉద్వేగం, ఆందోళన కూడా ఉన్నాయి.

ఫైనల్‌గా వాళ్లు కోనోమియా షింటో ఆలయంలోకి ప్రవేశించారు. పురుషుల మీద చల్లినట్లుగానే వారిపై కూడా కొందరు చల్లని నీటిని చల్లుతున్నారు. ఇది వారిలో మరింత శక్తిని, ఉత్సాహాన్ని ఇస్తున్నట్లు అర్ధమవుతోంది.

అక్కడ దేవుడికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఉత్సాహంగా వేడుకను ముగించారు.

ఆ తర్వాత వాళ్లంతా ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ హర్షధ్వానాలు చేశారు. ప్రేక్షకులు కూడా వారిని అభినందించారు.

"ఇది నాకు కన్నీళ్లు తెప్పించింది.’’ అని మిచికో ఇకాయ్ అనే మహిళ అన్నారు. ‘‘నేను ఇక్కడికి రాగలనా అనుకున్నాను. కానీ, ఇప్పుడు ఎంతో సాధించినట్లు అనిపిస్తోంది’’ అని ఆమె అన్నారు.

ఇందులో పాల్గొన్న మహిళలను మీడియ ఫొటోలు తీయడం, ఇంటర్వ్యూలు చేయడం కనిపించింది. వారు కూడా ఎంతో ఉత్సాహంగా మీడియాతో మాట్లాడారు.

‘‘మొత్తానికి నేను సాధించాను. చాలా సంతోషంగా ఉంది. మొదటిసారి ఒక మహిళగా ఇందులో పాల్గొనగలిగాను.’’ అని మినెకో అకాహోరి అనే మహిళ బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)