ఆకాశ్ దీప్: తండ్రి, అన్నను పోగొట్టుకున్నా పట్టు వదలకుండా శ్రమించి టీమిండియాకు ఎంపికైన క్రికెటర్ కథ

ఆకాశ్ దీప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆకాశ్ దీప్
    • రచయిత, విష్ణు నారాయణ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

బిహార్ రాజధాని పాట్నా నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం 'బడ్డీ'. కైమూర్ పర్వతాలలోని తేరాయ్ ప్రాంతంలో ఉన్న ఈ గ్రామం రోహ్తాస్ జిల్లాలో ఉంది. ఆ గ్రామంలో, అక్కడి కంకర పిచ్‌పై ఆటలాడిన 'ఆకాశ్ దీప్' ఒక్కసారిగా వెలుగులోకి వచ్చారు.

రాంచీ వేదికగా ఇంగ్లండ్‌తో ఆడుతున్న తన తొలి టెస్టులోనే ఆకాశ్ ప్రదర్శన అతనికి 'డ్రీమ్ డెబ్యూ' అయింది.

ప్రారంభ ఓవర్లలోనే ఇంగ్లండ్ క్రికెట్ జట్టు టాప్ ఆర్డర్‌ను నేలకూల్చాడు ఆకాశ్. తొలిరోజు ఆటలో మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు.

అయితే ఈ ప్రయాణం ఆకాశ్‌కి అంత తేలికగా సాగలేదు. కనీస వసతులు, క్రీడా వాతావరణం లేని ఊరి నుంచి ఆకాశ్ వెలుగులోకి వచ్చాడు.

'నువ్వు ఆటాలడి, గంతులేస్తే చెడిపోతావు, చదువుకుంటే నవాబు అవుతావు' అనే సూక్తులు తరచుగా వినిపిస్తుంటాయక్కడ.

ఆకాశ్ బాగా చదువుకొని ఉద్యోగం చేయాలని ఆయన తండ్రి కోరుకున్నారు. అయితే ఆకాశ్ మాత్రం క్రికెటర్‌ కావాలనుకున్నారు, అవకాశాల కోసం పశ్చిమ బెంగాల్‌ వెళ్లాడు.

అక్కడ రాణించి, బెంగాల్‌ తరఫున రంజీ మ్యాచ్‌లు ఆడాడు. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకూ సెలెక్ట్ అయ్యాడు.

అయితే, ఇంగ్లండ్‌పై అరంగ్రేటం సమయంలో ఆకాశ్‌కు భారత జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్ టెస్ట్ క్యాప్‌ను అందించినప్పుడు మాత్రమే వెలుగులోకి వచ్చాడు.

ఆకాశ్‌ కూడా అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.

ఆకాశ్ దీప్

ఫొటో సోర్స్, VISHNU NARAYAN/BBC

ఫొటో క్యాప్షన్, ఆకాశ్ బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చేయగలడు

ఆకాశ్ క్రీడా ప్రయాణం గురించి అతని సోదరుడు నితిన్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

"ఆకాశ్, నేను చిన్నప్పటి నుంచి కలిసే ఆడుకున్నాం. తన బౌలింగ్ నైపుణ్యం గురించే అందరూ మాట్లాడుతున్నారు. అయితే ఊళ్లో ఉన్నపుడు అతనెలా బ్యాటింగ్ చేశాడో, అలాగే చేయాలనీ చాలామంది కోరుకుంటున్నారు. ఆకాశ్ ఒకే ఓవర్‌లో 6 సిక్సర్లు కొట్టగలడు. తను బ్యాట్స్‌మెన్ అయినప్పటికీ వేగంగానూ బౌలింగ్ చేసేవాడు'' అని నితిన్ తెలిపారు.

తండ్రి, సోదరుడి మరణం

“తండ్రి, సోదరుడు మరణించినప్పటికీ ఆకాశ్ ఆట వదల్లేదు. మధ్యలో కోవిడ్ కూడా వచ్చింది. కానీ ఆట కొనసాగించాడు. ఇవాళ జిల్లా మొత్తం అతన్ని చూసి గర్విస్తోంది. ఎన్ని కష్టాలొచ్చినా టాలెంట్ ఎలా బయటపడుతుందో చెప్పడానికి ఆకాశ్ ఉదాహరణ'' అని నితిన్ అన్నారు.

ఆకాశ్ మేనల్లుడు కిషన్ బీబీసీతో మాట్లాడుతూ.. "ఒకసారి మా ఊరి (బడ్డీ) జట్టు ఝార్ఖండ్‌లోని గర్వా జిల్లాలో మ్యాచ్ ఆడేందుకు వెళ్లింది. నేను కూడా టీంలో ఉన్నా. మ్యాచ్ ఆడిన తర్వాత మేం ఓ హోటల్‌లో భోజనం చేశాం, ఆ హోటల్ యజమాని డబ్బులు తీసుకోలేదు. కారణం అడగ్గా, మామయ్య (ఆకాశ్) ఆట అంటే ఆయనకు ఇష్టమట. అంత దూరంలో ఉన్న వాళ్లకు కూడా మామయ్య ఆట తెలిసింది" అని గుర్తుచేసుకున్నారు.

ఆకాశ్ మేనల్లుడు కిషన్

ఫొటో సోర్స్, VISHNU NARAYAN/BBC

ఫొటో క్యాప్షన్, కిషన్, ఆకాశ్‌లు ఇద్దరూ క్రికెట్ ఆడేవారు.

'క్రికెట్ అంటే ఇష్టం'

ఆకాశ్ దీప్‌ పెదనాన్న రమాశిష్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ‘‘నా కొడుకు (నితిన్‌), ఆకాశ్ కలిసి చదువుకునేవారు, ఆడుకునేవారు. ఆకాశ్ తండ్రి (రామ్‌జీ సింగ్) ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. ఆకాశ్ శారీరకంగా దృఢంగా ఉంటాడు, కాబట్టి తన కొడుకు ఆర్మీలో ఉద్యోగం చేయాలనుకునేవారు. అయితే ఆకాశ్‌కు క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. ఆట మీద ఇష్టంతో అదే బాటలో నడిచాడు. ఈ రోజు తన ప్రతిభను అందరి ముందుంచాడు. ఇపుడు ఊరంతా ఆనందంగా ఉంది'' అన్నారు.

నాన్నకి అంకితం

రాంచీ టెస్టు తొలిరోజు ఆట ముగిసిన తర్వాత ఆకాశ్ దీప్ మీడియాతో మాట్లాడుతూ.. ''2015లో నాన్న, సోదరుడిని కోల్పోయాను. ఈ రోజు మా నాన్న ఉంటే ఎంత సంతోషంగా ఉండేవారో. మూడు వికెట్లు నా ఈ తొలి ప్రదర్శన నాన్నకే అంకితం'' అన్నారు.

ఇంగ్లిష్ టీమ్‌పై ఇలాంటి ప్రదర్శన చేయడం ప్రోత్సాహకరంగా ఉండటమే కాకుండా గొప్ప బాధ్యతగా భావిస్తున్నట్లు ఆకాశ్ చెప్పాడు. దేశం కోసం బాగా ఆడేందుకు ప్రయత్నిస్తానన్నాడు.

బిహార్

ఫొటో సోర్స్, VISHNU NARAYAN/BBC

దశాబ్ధాలుగా రంజీ ఆడని రాష్ట్రం

ఆకాశ్ అన్న పిల్లలు ఆర్య, ఆరుహిలు స్టేడియంలో ఆకాశ్ ఆటను చూసి గ్రామానికి తిరిగి వచ్చారు.

ఆర్య మాట్లాడుతూ “బాబాయ్ చాలా కష్టపడేవాడు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఏకాగ్రత కోల్పోకుండా ఎలా ఉండాలో తన నుంచి నేర్చుకోవచ్చు. ప్రపంచం చాలా పెద్దదని, దాన్ని చూడాలంటే చదువుకోవాలని ఎప్పుడూ చెబుతుంటాడు. ఏ పనిలోనైనా అత్యుత్తమంగా ఉండాలంటాడు'' అని అన్నారు.

మ్యాచ్‌లో ఆకాశ్ ఆటతీరు, మూడు వికెట్లు తీయడంపై ఆమె మాట్లాడుతూ "మేం మ్యాచ్‌కు ముందు, తరువాత కూడా బాబాయితో మాట్లాడాం. వికెట్ పడిన బంతి 'నో బాల్' కావడంతో మేం కూడా నిరాశకు లోనయ్యాం, కానీ మ్యాచ్ తర్వాత అందరి దృష్టి మాపై పడింది. మేం సెలబ్రిటీలయ్యామనే ఫీలింగ్ కలిగింది'' అని అన్నారు.

స్కూల్, ఎగ్జామ్స్ వల్ల తిరిగి రావాల్సి వచ్చిందని, లేకుంటే ఐదు రోజులు అక్కడే ఉండే వాళ్లమని, మరో 2 వికెట్లు తీయాలని బాబాయితో చెప్పామని ఆరుహి చెప్పారు.

''ఈ రోజు తాత బతికి ఉంటే ఎంత సంతోషించేవాడో. ఎక్కడ చూసినా బాబాయి పేరు, ఊరు పేరు వినిపిస్తోంది. బాబాయికి ఊరు, ఇల్లు అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్లినా ఊరికి తిరిగి వస్తుంటాడు'' అని తెలిపారు.

బిహార్ రాష్ట్రం దశాబ్దాలుగా రంజీ ట్రోఫీ ఆడటంలేదు. ఇక్కడ ఒక్క ప్రపంచ స్థాయి, లేదా దేశీయ స్థాయి మైదానం కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లు అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడం అంత సులువు కాదు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)