గుడ్ టచ్, బ్యాడ్ టచ్: పిల్లలకు ఈ విషయం ఎలా చెప్పాలి, తల్లిదండ్రుల పాత్ర ఏంటి?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, అనుజా కులకర్ణి
- హోదా, బీబీసీ కోసం
థానేలో ఇటీవల పిల్లలపై లైంగిక వేధింపులు జరిగాయంటూ వచ్చిన వార్తలతో దేశవ్యాప్తంగా స్కూల్ పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
పాఠశాలలో గుడ్ టచ్-బ్యాడ్ టచ్‌కు సంబంధించి పిల్లలకు నిర్వహించే కార్యక్రమాలు, సెమినార్లతో.. కొంతమంది చిన్నారులు ఈ విషయాలు తెలుసుకుని, అలాంటి ఘటనలు ఎదురైనప్పుడు కనీసం తమ తల్లిదండ్రులకు చెప్పగలుగుతున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతున్నాయి.
కానీ, ఇలాంటి సంఘటనలు చాలా ఎక్కువగా జరుగుతున్నట్లు మనం వింటున్నాం. పిల్లల సంరక్షణ, తల్లిదండ్రులుగా మన పాత్రపై మనసులో వందలాది ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఈ సమయంలో మనం గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు ఎలా అర్థం చేయించాలి, తల్లిదండ్రులుగా మన పాత్ర ఎలా ఉండాలి అనే విషయాలపై ఈ కథనంలో మరింత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
పిల్లల భద్రత గురించి తరచూ మాట్లాడుతున్నప్పటికీ, పిల్లలతో సరిగ్గా ఏం మాట్లాడాలనుకుంటున్నారు? ఇలాంటి సమాచారంతో పిల్లల్ని భయపెట్టాలనుకోవట్లేదు కదా? ఎవరైనా వారిని భయపెడుతున్నట్లు అనిపిస్తే, ఆ పరిస్థితి నుంచి వారినెలా బయటికి తీసుకురావాలి? ఈ విషయాలపై పిల్లలతో ఎలా మాట్లాడాలి? అనే ప్రశ్నలు తల్లిదండ్రుల మదిలో తిరుగుతూ ఉంటాయి.
ఇటీవల పరిశోధనలో వెల్లడైన తల్లిదండ్రుల అభిప్రాయాలను, ఈ విషయంలో వారికున్న భయాలను ఇక్కడ ప్రస్తావించాం.
- నా కొడుకు లేదా కూతురు లైంగికంగా లేదా శారీరంగా వేధింపులకు గురవుతుందా?
- ఒకవేళ అలాంటిదే జరిగితే, ఏం జరుగుతుందో ఆమె లేదా అతను గుర్తించలేకపోతున్నారా?
- అలాంటి ఇబ్బందికర పరిస్థితి నుంచి నా పిల్లలు ఎలా భయపడగలిగారు?
- ఆ పరిస్థితి ఎదురైనప్పుడు పిల్లలు నా వద్దకు వచ్చి, సమస్య గురించి చెప్పగలిగారా?
- నాకు కాకుండా మరేవరైనా పెద్దవారి వద్ద ఈ విషయాన్ని చర్చించారా?
- మా గురించి వాళ్లేం ఆలోచిస్తున్నారు?
- ఇలాంటివి జరిగిన తర్వాత నా కూతుర్ని సమాజం లేదా మరెవరైనా జడ్జి చేసేందుకు చూస్తున్నారా? అనే విషయాలను తల్లిదండ్రులు తీవ్రంగా ఆలోచిస్తున్నారు.
ఈ విషయాలను చదివితే, తల్లిదండ్రుల ప్రశ్నలు ఎంత లోతుగా ఉన్నాయి, పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతుంది.
నేటి తరంలో తల్లిదండ్రులు, కొత్తరకం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రస్తుతం పిల్లల సమస్యలు చాలా భిన్నంగా ఉంటున్నాయి. తొలిసారి తల్లిదండ్రులు టెక్నాలజీ సంబంధిత అంశాలను కూడా ఎదుర్కొంటున్నారు.
టెక్నాలజీ సైడ్ ఎఫెక్స్‌ను, మీడియా దుర్వినియోగాన్ని, మానసిక సమస్యలను, ప్రవర్తన పరమైన మార్పులను తల్లిదండ్రులు డీల్ చేయాల్సి ఉంటుంది.
మన పేరెంటింగ్ కూడా నేడు కొత్త రకం సవాలును ఎదుర్కొంటోంది. తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగానికి వెళ్లడం, పనిని పూర్తి చేయడం, పని పూర్తయినప్పటికీ ఆ ఒత్తిడి భారం కొనసాగడం ఇవన్నీ ఇప్పుడు ప్రతి ఇంట్లో నెలకొంటున్నాయి.
ఎక్కువగా చదవడం, హోమ్ వర్క్‌ల భారం వంటి పోటీకరమైన విద్యా విధానంలో పిల్లలతో గడిపేందుకు తల్లిదండ్రులకు పెద్దగా సమయం చిక్కడం లేదు. దీంతో పిల్లల భద్రతా, మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను తెలుసుకోవడంపై తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు.
నిజమే, వీటన్నంటిన్ని ఫలితంగా పిల్లల ప్రవర్తనపై చాలా ప్రభావం పడుతుంది. కొన్నిసార్లు పిల్లలు మన ముందున్నట్లే అనిపిస్తారు. కానీ, వారు మనతో సంభాషించే సమయం తగ్గుతుంది.
వారు వాళ్ల ప్రపంచంలో, మనం మన ప్రపంచంలో ఉంటాం. దీంతో గుడ్, బ్యాడ్ టచ్, వారి భద్రతా వంటి విషయాలపై మాట్లాడటం కష్టమవుతుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కానీ, చాలా మంది పిల్లలు లైంగిక వేధింపులు, అసభ్యకరంగా తాకడం వంటి విషయాలపై ఇంట్లో ప్రస్తావించడం లేదు. తల్లిదండ్రులు ఏమంటారో అని పిల్లలు వీటిని ఇంట్లో అడగడం లేదు, చెప్పడం లేదు. వారికి వారే నిందించుకుంటున్నారు.
ఈ సంఘటనలు వెలుగులోకి వచ్చినా, పిల్లల్ని మానసికంగా ఆ షాక్ నుంచి బయటికి తీసుకువచ్చి, తిరిగి వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడం, మానసిక ఆరోగ్యాన్ని బాగుచేయడం కౌన్సిలర్లకు, తల్లిదండ్రులకు ఒక క్లిష్టమైన ప్రయాణంగా ఉంటుంది.
పిల్లలతో స్నేహపూర్వకమైన సంబంధాలు ఉండటం, వారు ఎలాంటి భయం లేకుండా మాట్లాడగలిగేలా చేయడంతో ఈ సమస్య నుంచి వారిని కచ్చితంగా బయటపడేయొచ్చు.
తల్లిదండ్రులుగా కొన్నిసార్లు పిల్లల భద్రత, ప్రవర్తనలో మార్పును మనమే గుర్తించాల్సి ఉంటుంది.
- పిల్లలు అకస్మాత్తుగా ఏం మాట్లాడకుండా మౌనం వహించడం
- ఒక్కసారిగా స్తబ్దుగా అయిపోవడం లేదా మాట్లాడేటప్పుడు, ఆడుకునేటప్పుడు వారి నవ్వులు, అల్లరి తగ్గిపోవడం
- తల్లిదండ్రులు వచ్చి, పిల్లల్ని దగ్గరకు తీసుకున్నప్పుడు కూడా వారు దాన్ని అసౌకర్యంగా భావించడం
- తినడం, నిద్రపోవడం, చదువుకోవడం లేదా వీటిల్లో ఏదో ఒకదానిలో మార్పులు రావడం
- చిన్న విషయాలైనా, నువ్వు చెప్పేది సరైందేనా? అక్కడ ఎవరు ఉంటారు? నేను రాకపోతే ఆ పని జరగదా? ఇలాంటి ప్రశ్నలను తరచూ అడుగుతుండటం ద్వారా వారి ప్రవర్తనలో మార్పును గమనించవచ్చు.
పైన పేర్కొన్న సూచనలు ఏవైనా పిల్లల్లో కనిపించినా లేదా గుర్తించినా వారితో మాట్లాడేందుకు ప్రయత్నించాలి. ఏ సమస్య లేదు కదా? ఎవరైనా ఏమన్నా అన్నారా? నీకు తెలుసు కదా ఏదైనా సమస్య ఉంటే, కచ్చితంగా నీకు సాయపడతాను. ఇలాంటివి చెప్పిన తర్వాత పిల్లల నుంచి వచ్చే స్పందనను గమనించాలి.
అది చెప్పొచ్చా లేదా అన్న విషయంపై పిల్లల మనసుల్లో కొన్నిసార్లు కన్‌ఫ్యూజన్ ఉంటుంది. కొన్నిసార్లు పిల్లలు ఈ విషయాల గురించి తల్లిదండ్రులతో కంటే చిన్నమ్మ, పెద్దమ్మలు, బాబాయి మావయ్యలు, అమ్మమ్మ, తాతయ్యలతో స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు.
అలాంటి సందర్భాల్లో, మీతో మీ పిల్లలు వారి మనసులోని భావాలను సరిగ్గా చెప్పుకోలేరని భావించినప్పుడు ఇతర సపోర్టు సిస్టమ్ సాయం తీసుకోవాల్సి ఉంటుంది. క్రమంగా పిల్లల స్పందన మారి, ఆ విషయం గురించి మెల్లగా మాట్లాడేందుకు ప్రయత్నిస్తారు.
అలాంటిదే ఒక ఉదాహరణ, కొన్నేళ్ల క్రితం అంటారా(ఏడేళ్ల బాలిక)తో ఆమె తల్లి స్నేహితురాలు మాట్లాడారు. ఆమె క్లాస్‌మెట్ ఎదుర్కొన్న శారీర వేధింపుల గురించి చెబుతూ.. అలాంటివి జరిగినప్పుడు ఏం చేయాలో అంటారాకు వివరించారు.
అంటారాకు ఈ విషయంలో సూచనలు చేస్తున్నప్పుడు, ఆ పాప ఎదుర్కొంటున్న సమస్య గురించి తల్లి స్నేహితురాలికి తెలిసింది. మరోవైపు అంటారాకు ఏం చేయాలో చెబుతూనే.. పాప తల్లికి కూడా విషయాన్ని వివరించారు.
ఈ విషయంలో ఎలాంటి టెన్షన్ లేకుండా బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి వివరించారు. ఇలాంటప్పుడు తమల్ని నిందించుకోకుండా అవసరమైతే సాయం తీసుకోవాలని చెప్పారు. దీంతో, అంటారా కూడా తల్లిదండ్రులతో తనకు ఎదురైనా సంఘటన గురించి ఎలాంటి భయం లేకుండా చెప్పింది.
పాప నుంచి విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు, వెంటనే వారి ఇంటికి ఇస్మా(కుటుంబ సభ్యుల్లో ఒకరు) రాకుండా ఆపివేశారు. ఇస్మాపై చర్యలు తీసుకున్నారు. ఇంకెప్పుడూ అంటారా ఒత్తిడికి గురి కాకూడదని భావించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఈ విషయంలో తల్లిదండ్రులు ఏం చేయాలో మనం చూద్దాం..
1. పిల్లలతో రోజూ మాట్లాడాలి
పిల్లలకు ఆ రోజు ఎలా గడిచిందన్న విషయంపై వారితో మాట్లాడాలి. సాధారణంగా డిన్నర్ సమయంలో, లేదా డిన్నర్ తర్వాత, నిద్రపోయేటప్పుడు లేదా క్లాస్‌కి, ఆడుకోవడానికి వెళ్లేటప్పుడు ఏదో ఒక సమయంలో వారితో మాట్లాడాలి.
ఆ సమయంలో పిల్లలు చెప్పే వాటిని శ్రద్ధగా వినాలి. అదెంత చిన్నదైనా లేదా ఉపయోగం లేనిది అయినా దానిపై ఒకసారి ఆలోచించాలి.
నువ్వు గొడవ పడలేదు కదా, నీకు ఎన్ని మార్కులు వచ్చాయి, ఎందుకు బాక్స్ తినలేదు వంటి విషయాలపై ఎక్కువగా చర్చ పెట్టకుండా చూసుకోవాలి.
ఇలా చేస్తే, చాలాసార్లు పిల్లలు ఆ రోజు ఏం జరిగిందో చెప్పకుండా, ఏమీ లేదనే సమాధానం ఇచ్చేస్తారు.
ఇలాంటి సమాధానాలు రాకుండా చూసుకోవాలంటే, తల్లిదండ్రులుగా పిల్లల్ని మనం ఎలాంటి ప్రశ్నలు వేస్తున్నాం, వారితో మనమెలా ప్రవర్తిస్తున్నామో తెలుసుకోవాలి.
2. క్రమశిక్షణ కోసం లేదా కోపం వచ్చినప్పుడు పిల్లల్ని కొట్టడం – తప్పా ఒప్పా?
ఏదైనా పరిస్థితిలో కోపం వచ్చినప్పుడు, మీ కొడుకు లేదా కూతురు స్పందన ఎలా ఉంటుంది, ఇతరులను వారు శారీరకంగా అంటే కొట్టడం, నెట్టడం, గిచ్చడం వంటి ద్వారా ఇబ్బంది పెడుతున్నారా? లేదా? అన్నది చూడాలి.
దీని కోసం, ప్రాథమికంగా, తల్లిదండ్రులుగా మనం తిట్టకుండా, కొట్టకుండా, అరవకుండా ఎలా నియంత్రణలో ఉంటున్నామో చూసుకోవాలి.
3. పిల్లలు ప్రశ్నించడాన్ని ఆపకూడదు
వాళ్లు ప్రశ్నలు అడిగినప్పుడు మౌనంగా ఉండటం, మందలించకుండా ఉండటం చేయాలి. తరచుగా, పిల్లలకు మానసికంగా అందుబాటులో ఉండటం కష్టమే. కానీ, నిమిషం లేదా రెండు నిమిషాలు వారితో మాట్లాడాలి. పని పూర్తి చేసుకుని, నీతో మాట్లాడతాను అని చెప్పాలి.
కారులో నిమిషం మాట్లాడుకుందామా అని అడుగుతూ వారితో మాట్లాడే కోరికను పిల్లలకు తెలియజేయాలి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
4. ఏది గుడ్, బ్యాడ్ టచ్ అనే విషయం ఉదాహరణలతో పిల్లలకు తెలియజేయాలి
తొలుత, గుడ్ టచ్ అంటే పిల్లలకు మంచిగా అనిపించేది. ఇతరుల నుంచి పిల్లలు పొందే ప్రేమ, సంతోషం, భావోద్వేగానికి సంబంధించినది. దీన్ని పిల్లలకు ఉదాహరణలతో వివరించాలి.
అమ్మమ్మ కౌగిలింత, తాతయ్య పొగడ్త, కితకితలతో నాన్న నిద్రలేపడం, చాలా సమయం తర్వాత తల్లి ఇచ్చే కౌగిలింత ఇవ్వన్నీ పిల్లలకి సంతోషాన్ని, ప్రేమను అందిస్తాయని వారికి తెలియజెప్పాలి.
అసౌకర్యవంతమైన, తప్పుడుగా అనిపించే టచ్‌ల గురించి కూడా వారితో మాట్లాడాలి. ఉదాహరణకు ఎవరైనా వారి జుట్టును లాగడం, సరదగా నెట్టడం, తన్నడం వంటివి విషయాలను పిల్లలకు తెలియజేయాలి.
బట్టల లోపల ఎవరైనా చేతులు పెడితే మీకు అసౌకర్యంగా, కోపంగా అనిపిస్తాది. మీకు అసౌకర్యవంతంగా ఎవరైనా టచ్ చేస్తున్నట్లు అనిపిస్తే, అక్కడి నుంచి బయటికి వచ్చే స్వేచ్ఛ మీకు కచ్చితంగా ఉంటుందనే విషయాన్ని పిల్లలకు తెలియజేయాలి. అది ఏ వ్యక్తి అన్నదానితో సంబంధం ఉండకూడదని తెలుపాలి.
5. కొన్ని సందర్భాలు మినహయించి..
కొన్ని అసాధారణమైన సందర్భాల్లో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, డాక్టర్లు మిమ్మల్ని టచ్ చేస్తారని ఉదాహరణలతో చెప్పాలి.
ఉదాహరణకు.. స్నానం చేయించేటప్పుడు, డాక్టర్ చెక్ చేసేటప్పుడు, ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు చేసే టచ్‌లను వివరించాలి.
6. స్వతహాగా వారి పనులు వారు చేసుకునేలా సిద్ధం చేయాలి
సొంతంగా స్నానం చేయడం, బట్టలు మార్చుకోవడం వంటి విషయాలను పిల్లలకు ఎంత త్వరగా అయితే అంత త్వరగా నేర్పించాలి.
పిల్లలు సొంతంగా సురక్షితంగా ఎలా ఉండాలో తెలియజేయాలి.
ప్రతిసారి కూతురు లేదా కొడుక్కి మీరు కావాల్సిన అవసరాన్ని తల్లిదండ్రులు తగ్గించాలి.

ఫొటో సోర్స్, Getty Images
7. పిల్లలకు సేఫ్ సర్కిల్ అనే విధానం గురించి చెప్పాలి
ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు భయపడకుండా అక్కడి నుంచి పరిగెత్తి, పెద్ద వారిని ఎలా ఆశ్రయించాలో ఉదాహరణలతో పిల్లలకు వివరించాలి.
అరవడం, కొరకడం, చేతులు ఎత్తడం, ఫిర్యాదు చేయడం వంటి వాటి ద్వారా మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో పిల్లలకు పదేపదే చెబుతూ ఉండాలి.
మరింత ముందుకు వెళ్లి పిల్లలకు సేఫ్ సర్కిల్ అనే విధానం గురించి చెప్పాలి. పిల్లలతో కలిసి సేఫ్ సర్కిల్‌ను ఒక దగ్గర డ్రా చేయాలి. పిల్లలు సురక్షితంగా ఉండేందుకు వారు నమ్మే పేర్ల జాబితానే సేఫ్ సర్కిల్.
8. కష్ట సమయాల్లో ఏం చేయాలో వారికి చెప్పాలి
భద్రత పరంగా ఏదైనా సమస్య తలెత్తినప్పుడు ఏం చేయాలో వారికి తెలుపాలి.
తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లను కలిగి ఉండటం, జనాల మధ్యలో వారు సురక్షితంగా భావించే వారి దగ్గరకు వెళ్లడం, మీ సమస్య తెలియజేయడం వంటివి చేయాలని కొన్ని ఉదాహరణతో వివరించాలి.
9. పిల్లలకు సానుకూల అంశాలను, సేఫ్ టచ్‌ను దూరం చేయకూడదు
ప్రేమను తెలియజేయడానికి టచ్ అనేది చాలా తేలికైన, సులభతరమైన విధానం. ప్రతిరోజూ తాకే, కితకితలు పెట్టే కౌగలించుకునే వాటితో గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌ల మధ్య తేడాను పిల్లలు తెలుసుకోవడం తేలిక.
నిత్యం పిల్లల దగ్గరకి ఎవరైనా రావడం, వారిని ముద్దు పెట్టుకోవడం వంటి వాటిని తప్పించాలి. అవును, ఎవరు అలా చేయొచ్చో పిల్లలకు వివరించాలి.

ఫొటో సోర్స్, Getty Images
10. తరచూ ఒత్తిడికి లేదా ఆందోళనకు గురికావడాన్ని తప్పించాలి
తల్లిదండ్రులుగా మనం తరచూ పిల్లల ముందు చిన్న విషయాలకే భయపడిపోవడం, ఒత్తిడికి గురికావడం వంటి వాటిని తగ్గించాలి.
ఇది పిల్లల్లో ఏదైనా సమస్యను పరిష్కరించునే విధానంలో వారి సామర్థ్యాన్ని, మానసిక బలాన్ని ప్రభావితం చేస్తుంది. నా ప్రశ్నను మా అమ్మనాన్న అర్థం చేసుకుంటారనే భావనను తల్లిదండ్రులు పిల్లలకు కల్పించాలి.
11. ప్రజలేమంటారో అన్న భయం తొలగించాలి
ప్రజలు ఏమనుకుంటారో అన్న దానితో సంబంధం లేకుండా వారికి ఏది మంచిగా అనిపిస్తే, అది చేయమని పిల్లలకు చెప్పాలి.
దీని వల్ల ముఖ్యమైన విషయాలు మీనుంచి వారు దాచకుండా అడ్డుకోవచ్చు.
12. పిల్లలతో ఆడుకోవడం
తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య నమ్మకాన్ని ఏర్పాటు చేసే విషయంలో వారితో ఆడుకోవడం, సంతోషకరమైన క్షణాలను గడపడం ముఖ్యమైన విషయాలు.
కలిసి తినడం, చదువుకోవడం,వారిని స్కూల్ దగ్గర విడిచిపెట్టడమే కాకుండా.. వారితో కలిసి టీవీ చూడం, ఏదైనా యాక్టివిటీ లేదా గేమ్ ఆడటం చేయాలి.
13. ఈ విషయంలో తల్లి, తండ్రి ఇద్దరి సహకారం సమానంగా ఉండాలి
చాలా విషయాలు తల్లితో మాట్లాడలేరు. చెప్పాలంటే, కూతురు తండ్రితో ఎక్కువగా ఆడుకోవడం లేదా మాట్లాడటం చేస్తుంటుంది. అలాగే, అబ్బాయిలు తల్లితో ఎక్కువ సౌకర్యవంతంగా మాట్లాడుతుంటారు.
పిల్లలతో ఆడుకునే విషయంలో, వారి చదువుల్లో సహకరించడంలో తల్లికి, తండ్రికి సమానమైన బాధ్యతలుంటాయన్నది గమనించాలి.
14. టీచర్లు, కౌన్సిలర్లు, డాక్టర్ల సాయం తీసుకోవాలి
ఈ విషయంలో ఏదైనా సమస్య ఉందనిపిస్తే, టీచర్, కౌన్సిలర్ సాయం తీసుకోవడాన్ని మొహమాటంగా భావించవద్దు.
దీని వల్ల పిల్లలు ఆత్మవిశ్వాసంతో మీతో ఏ విషయానైనా చర్చిస్తారు. క్లిష్ట పరిస్థితులలో కూడా మీతో స్వేచ్ఛగా మాట్లాడగలుగుతారు.
ఇవి కూడా చదవండి:
- భార్య ఫోన్‌కాల్స్ విని ఇన్సైడర్ ట్రేడింగ్‌తో రూ. 14.5 కోట్లు సంపాదించిన భర్త.. భార్య ఉద్యోగం పోవడంతో విడాకులకు దరఖాస్తు
- దివ్యభారతి: ఒకప్పుడు హీరోను మించిన రెమ్యూనరేషన్ తీసుకున్న అందాల తార కెరీర్ రెండేళ్ళలోనే ఎలా ముగిసిపోయింది?
- షమిమా బేగం: ఇస్లామిక్ స్టేట్‌లో చేరడానికి వెళ్లి ఏ దేశానికి చెందని వ్యక్తిగా ఎలా మారారు?
- సావర్కర్: అండమాన్ జైలులో ఉన్నప్పుడు క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్ వారికి లేఖలు రాసింది నిజమేనా?
- ‘సైకాలజీ ఆఫ్ మనీ’: పొదుపు మంత్రంతో ఓ చిరుద్యోగి రిటైరయ్యేనాటికి కోట్లు ఎలా కూడబెట్టాడు... మోర్గన్ హౌసెల్ ఇచ్చిన మెసేజ్ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














