శేషాచలం అడవుల్లో పోలీసులపై వాహనాలు ఎక్కిస్తున్న ఎర్ర చందనం స్మగ్లర్లు... అలా ప్రాణాలు కోల్పోయిన ఓ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?

ఎర్రచందనం స్మగ్లింగ్
ఫొటో క్యాప్షన్, స్మగ్లర్లు వాహనాలతో పైకి దూసుకురావడంతో ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ గణేష్
    • రచయిత, తులసీప్రసాద్‌రెడ్డి నంగా
    • హోదా, బీబీసీ కోసం

శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునే క్రమంలో స్మగ్లర్ల ధాటికి పోలీసులు బలైపోతున్నారు.

ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలించే మాఫియా కారణంగా ఫిబ్రవరి 5న ఒక కానిస్టేబుల్ చనిపోయారు. 23న మరొక కానిస్టేబుల్ గాయాలతో ఆసుపత్రిలో చేరారు.

శేషాచలం అడవుల్లో మాత్రమే దొరికే ఎర్రచందనానికి జపాన్, చైనా వంటి దేశాల్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఆ దేశాలకు స్మగ్లర్లు అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారు. ఆ అక్రమ రవాణాను అడ్డుకునే ప్రయత్నంలో కొందరు పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తోంది.

శేషాచలం అడవుల నుంచి అక్రమంగా జరిగే ఎర్రచందనం రవాణాను అడ్డుకునేందుకు 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెడ్ శాండల్స్ యాంటీ స్మగ్లింగ్ టాస్క్ ‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. 32 ఏళ్ల గణేశ్, రెండేళ్లుగా ఈ టాస్క్ ఫోర్సులో కానిస్టేబుల్‌గా పని చేస్తున్నారు.

అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం గుండ్రేవారిపల్లి క్రాస్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో గణేశ్ పైన ఎర్ర చందనం స్మగ్లర్ల కారు దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు.

గణేశ్ మీదనే ఆధారపడి జీవిస్తున్న ఆయన కుటుంబం ఇప్పుడు దిక్కులేనిదిగా మారింది.

గణేశ్ మరణం మర్చిపోక ముందే ఫిబ్రవరి 23న, తిరుపతి జిల్లా ఏర్పేడు టోల్ ప్లాజా దగ్గర పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ఒక కారు వెనక్కి వెళ్లిపోయింది. అది గమనించిన వారు సమాచారం ఇవ్వడంతో సమీపంలోని ఫారెస్ట్ చెక్ పోస్ట్ దగ్గర రోడ్డుపై బ్యారికేడ్లు అడ్డుపెట్టి కారును ఆపేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ కారు ఆగకుండా వాటిని గుద్దుకుని వెళ్లిపోవడంతో టాస్క్ ఫోర్స్ విధుల్లో ఉన్న కడప ఏఆర్ కానిస్టేబుల్ ప్రభాకర్ తీవ్రంగా గాయపడ్డారు.

ఎర్రచందనం స్మగ్లింగ్
ఫొటో క్యాప్షన్, ఓ పెద్ద కుటుంబానికి గణేష్ ఒక్కరే ఆధారం

‘‘అందరికీ ఆయనే ఆధారం’’

సత్యసాయి జిల్లా, ధర్మవరంలోని గుట్టకిందపల్లి దగ్గర సన్నటి సందు వస్తుంది. ఎదురుగా ఇంకో వాహనం రాలేనంత సన్నటి సందు అది. ఆ సందులో ఒక పక్కగా రెండు గదుల చిన్న ఇల్లు ఉంది. ఆ ఇంట్లో గణేశ్ మీద ఆధారపడి జీవిస్తున్న ఒక పెద్ద కుటుంబం పుట్టెడు దుఖంలో ఉంది. వారిలో ఆయన తల్లి, భార్య ఇద్దరు పిల్లలతోపాటూ అక్క, ఇద్దరు చెల్లెళ్లు ఉన్నారు.

గణేశ్‌కు ఇద్దరు మగ పిల్లలు. ఒకరికి మూడేళ్లు, ఇంకొకరికి ఏడేళ్లు. ఇంట్లో ఒక గోడకు గణేశ్ ఫొటో తగిలించి ఉంది. కింద మరొక ఫొటోకు బొట్టు పెట్టి ఉంది. తల్లి దిగాలుగా కూర్చొని ఉన్నారు. మరో గదిలో గణేశ్ భార్య, భర్త ఫొటోలు చూసుకుంటూ మౌనంగా రోదిస్తున్నారు.

గణేశ్‌కు నలుగురు పిన్నమ్మలు ఉన్నారు. వారిలో ఇద్దరికి భర్తలు లేకపోవడంతో వారికి కూడా ఆయనే ఆధారమని వారు చెబుతున్నారు.

“వాళ్ల నాన్న కూడా లేడు. ఆయన బాగా తాగేవాడు. నేనే కూలికి వెళ్లి వాడిని చదివించాను. నాకు ముగ్గురు ఆడపిల్లలు ఒక కొడుకు. డిగ్రీ రాశాక ఉద్యోగంలోకి వెళ్లాడు. ఇప్పుడు ఆ ఆధారం కూడా పోయింది” అని చెబుతున్నప్పుడు గణేశ్ తల్లి అలివేలు కళ్లలో నీళ్లు తిరిగాయి.

డిగ్రీ తర్వాత కొందరి సాయంతో కోచింగ్ తీసుకుని కానిస్టేబుల్ ఉద్యోగం సంపాదించిన గణేశ్ విజయనగరంలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు. తాడిపత్రి హెడ్ క్వార్టర్స్, హైదరాబాద్, అనంతపురంలో పని చేశారు. ఆ తరువాత తిరుపతికి వచ్చి టాస్క్ ఫోర్స్‌లో చేరారు.

ఎర్రచందనం స్మగ్లింగ్
ఫొటో క్యాప్షన్, పిల్లలను బాగా చదివించుకోవడానికే తిరుపతికి వచ్చామని గణేష్ భార్య అనూష చెప్పారు

‘మా భవిష్యత్ ఏమిటో తెలియడం లేదు’

‘‘రోజూ ఉదయాన్నే ఆయన వచ్చి మమ్మల్ని నిద్ర లేపేవాడు. ఆ రోజు మాత్రం ఆయన రాలేదు. ఆయన మరణంతో మా భవిష్యత్ ఏమిటో తెలియడం లేదు. పిల్లల్ని బాగా చదివించాలని ఆయన అనేవారు. వారి కోసమే మేం తిరుపతికి వెళ్లాం’’ అని గణేశ్ భార్య అనూష అన్నారు.

ఇంటర్ చదివిన ఆమె ఇప్పుడు తన పిల్లల భవిష్యత్తు కోసం ఏదో ఒక పని చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు.

‘‘మాకు పెళ్లై ఏడేళ్లు అయ్యింది. రెండేళ్లుగా తిరుపతిలోనే ఉంటున్నాం. మాకు ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పష్టమైన హామీ రాలేదు. నేను ఇంటర్ చదివా. నా పిల్లల కోసం ఏదో ఒకటి చేసుకోవాలి. ఈ ఉద్యోగంలో చాలా రిస్క్ ఉంటుంది. రైడ్స్ ఉంటే ఏ సమయంలో అయినా వెళ్లాలి. ఎప్పుడూ అలర్ట్‌గా ఉంటారు. మొదట్లో ఇబ్బంది పడినా తరువాత అలవాటు పడ్డారు. ఆ తరువాత ఇష్టంగా వెళ్లేవారు’’ అని అనూష చెప్పారు.

తనతోపాటు ఇద్దరు చెల్లెళ్ల పెళ్లిళ్లు కూడా గణేశే చేశాడని ఆయన అక్క గంగాదేవి చెప్పారు. తమ నలుగురు పిన్నమ్మలు కూడా అతని సంపాదనపైనే ఆధారపడ్డారని అన్నారు.

‘‘తనకు ఉన్న దాంట్లోనే అన్నీ చేశాడు. అలవాట్లు ఏవీ లేవు. చాలా మంచోడు. కానీ మమ్మల్ని అందరినీ మధ్యలోనే విడిచిపెట్టి వెళ్లి పోతాడని ఎవరూ అనుకోలేదు. డ్యూటీలోనే చనిపోయాడు కనుక మా తమ్ముడి భార్యకు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి’’ అని ఆమె కోరుతున్నారు.

ఎర్రచందనం స్మగ్లింగ్
ఫొటో క్యాప్షన్, అక్రమరవాణా వాహనాలను ఎలా ఆపాలో ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు రెడ్ శాండిల్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాసులు చెప్పారు.

‘‘30 లక్షల పరిహారం’’

చిన్న పిల్లలు ఉన్న గణేశ్ కుటుంబానికి ఎంత చేసినా తక్కువేనని టాస్క్ ఫోర్స్ ఎస్పీ శ్రీనివాసులు అన్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం 30 లక్షల రూపాయల పరిహారం ప్రకటించిందని చెప్పారు.

ఎర్ర చందనం స్మగ్లర్లు కావాలనే ఇలా చేశారా? లేక తప్పించుకునే క్రమంలో అలా జరిగిందా అనేది దర్యాప్తులో తేలుతుందని ఆయన చెప్పారు.

‘‘స్మగ్లర్లు ఎర్ర చందనం పట్టుకెళ్లాలనే లక్ష్యంతో ఉంటారు. పోలీసులు వాటిని అడ్డుకోడానికి ప్రయత్నిస్తుంటారు. ఇది వేకువ జామునే జరిగింది. అంటే అప్పుడు చీకటిగా ఉండడం వల్ల అలా జరిగుంటుందే కానీ, కావాలని చంపారని మేం అనుకోవడం లేదు. పూర్తి వివరాలు విచారణలో తేలుతాయి’’ అని శ్రీనివాసులు తెలిపారు.

స్మగ్లింగ్ అడ్డుకోడానికి స్పెషల్ టాస్క్ ఫోర్స్

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కలిపి దాదాపు 5 లక్షల హెక్టార్లలో అంటే 13 లక్షల ఎకరాల్లో ఎర్ర చందనం సహజంగా పెరుగుతోంది. గతంలో ఎర్రచందనం అక్రమ రవాణా జరగకుండా ఒక్క అటవీ శాఖ మాత్రమే నియంత్రించేది. దీంతో ఏపీ ప్రభుత్వం 2015లో పోలీసులు, అటవీ శాఖ అధికారులతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది.

తిరుపతిలో ఈ టాస్క్ ఫోర్స్‌ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ టాస్క్ ఫోర్సులో దాదాపు 400 మంది ఏపీఎస్పీ, అటవీ శాఖ సిబ్బంది పనిచేస్తున్నారు. వీటితోపాటూ స్టైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ డ్యూటీ ఫోర్స్ కూడా క్రియేట్ చేశారు. ఈ బృందాలన్నీ కలిసి అడవుల్లోకి వెళ్లి ఎర్ర చందనం అక్రమ రవాణాను అడ్డుకుంటూ ఉంటాయి.

గతంలో అటవీ అధికారుల మీద ఎక్కువ దాడులు జరిగేవని అందుకే టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారని ఎస్పీ శ్రీనివాసులు చెప్పారు. ఎర్రచందనం స్మగ్లర్ల దాడిలో ఎంతోమంది మృతిచెందడం, గాయపడడం జరిగిందని, అలాంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు కూడా పాటిస్తుంటామని ఆయన వివరించారు.

‘‘మాకు ప్రికాషన్స్, ప్రోటోకాల్స్ ఉంటాయి. జరిగిన ఘటనను మేం పరిశీలిస్తాం. ఏదైనా పొరపాటు జరిగితే, వాటిని రెక్టిఫై చేసుకుంటాం. ఇలాంటి ఇన్సిడెంట్ మళ్లీ జరగకుండా చూస్తాం. మేం ప్రస్తుతం టెలీ కమ్యూనికేషన్స్ కోసం శాటిలైట్ ఫోన్స్ ఉపయోగిస్తున్నాం. రిస్క్ ఉన్నప్పుడు స్టాండ్ బైగా ఇంకో టీమ్ రెడీ చేసుకుంటాం. అవసరం ఉన్నప్పుడు ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి పంపిస్తాం. స్థానిక పోలీసులు, అటవీ శాఖ సాయం కూడా తీసుకుంటాం.’’

ఎర్ర చందనాన్ని అక్రమరవాణా చేసే వాహనాలను ఆపే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయంపై తమ బృందాలకు ట్రైనింగ్ ఇవ్వనున్నట్టు శ్రీనివాసులు చెప్పారు.

ఎర్రచందనం స్మగ్లింగ్
ఫొటో క్యాప్షన్, ఎర్రచందనం స్మగ్లింగ్‌ నియంత్రణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయంటారు సీపీఎం తిరుపతి జిల్లా కార్యదర్శి కందారపు మురళి

‘స్మగ్లర్ల నియంత్రణలో విఫలం’

2013 డిసెంబర్‌లో కూడా స్మగ్లర్ల దాడిలో ఇద్దరు అటవీ శాఖ అధికారులైన డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ శ్రీధర్, అసిస్టెంట్ రేంజ్ ఆఫీసర్ డేవిడ్ కరుణాకర్‌ చనిపోయారు.

ఎర్రచందనం స్మగ్లర్లను నియంత్రించడంలో ప్రభుత్వాలు విఫలం కావడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని సీపీఎం తిరుపతి జిల్లా కార్యదర్శి కందారపు మురళి ఆరోపించారు.

‘‘శేషాచలం కొండల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. గతంలో కూడా అనేకసార్లు ఈ స్మగ్లర్లు దాడులకు పాల్పడడం, అధికారులు చంపేయడం జరిగింది. ఇద్దరు కానిస్టేబుళ్ళు చనిపోయారు. రేంజర్ స్థాయి అధికారులు చనిపోయారు. ఎర్రచందనం ఎవరు తరలిస్తున్నారో వారిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైంది’’ అని ఆయన విమర్శించారు.

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన గణేశ్ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం అందించాలని కందారపు మురళి డిమాండ్ చేశారు. విశాఖలోని ఒక ప్రైవేటు ఫ్యాక్టరీ వల్ల చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం పరిహారంగా కోటి ఇచ్చింది. కాబట్టి ప్రభుత్వానికి అదేమీ పెద్ద మొత్తమేమీ కాదని ఆయన భార్యకు ఉద్యోగం ఇచ్చి పిల్లలను చదివించే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని కోరారు.

వీడియో క్యాప్షన్, శేషాచలం అడవుల్లో స్మగ్లర్ల కారు ఆపే యత్నంలో చనిపోయిన కానిస్టేబుల్.. అసలేం జరిగింది?

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)