జంతువులు కూడా జోకులు వేసుకుంటాయా... కామెడీగా నవ్వుకుంటాయా?

హాస్య గుణం

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, జాస్మిన్ ఫాక్స్-స్కెల్లీ
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నవ్వడం, నవ్వించడం, చిలిపి చేష్టలు చేయడం కేవలం మనుషులకే చేతనవుతుందని చాలామంది అనుకుంటుంటారు. కానీ, కొన్ని జంతువులు కూడా హాస్యం ద్వారా తమ మధ్య బంధాలను బలోపేతం చేసుకునే చాన్స్ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మనుషులను జంతువుల నుంచి వేరే చేసే అంశం ఏదని అన్నప్పుడు చాలామంది నవ్వడం, నవ్వించడం అని చెబుతారు.

మనిషికి నవ్వడం ఇష్టం. హాస్యాన్ని ఆస్వాదించడం మానవ జాతి నరనరాల్లో నాటుకు పోయింది. నవజాత శిశువులు మూడు నెలలు నిండినప్పటి నుంచే నవ్వడం మొదలు పెడతారు.

8 నెలల వయసు వచ్చే సరికి వారు తమ తల్లిదండ్రుల మాదిరిగానే పెద్దగా నవ్వడం నేర్చుకుంటారు. ఆ తర్వాత కొన్నాళ్లకు తల్లిదండ్రులకు నవ్వు పుట్టించే విధంగా కావాలని కొన్ని చేష్టలు చేయడం మొదలుపెడతారు.

తమ పిల్లలు పూర్తి స్థాయి కమేడియన్లు అయ్యారన్న విషయం పేరెంట్స్ కు అర్ధమవుతుంది.

అయితే, ఈ భూమిపై పక్కోళ్లని ఆటపట్టిస్తూ, ఎగతాళి చేస్తూ చిలిపి చేష్టలకు పాల్పడేది ఒక్క మనిషి మాత్రమే కాదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. చాలా జంతువులు కూడా తమ సాటి జంతువులతో అల్లరిగా వ్యవహరిస్తుంటాయి.

లాస్ ఏంజెలస్‌లోని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో పరిశోధకురాలైన ఇసాబెల్లె లామర్, తన సహచరులతో కలిసి చింపాంజీలు, గొరిల్లాలు, కోతుల మధ్య ఈ అల్లరి చేష్టల గురించి రికార్డు చేసిన వీడియోను 75 గంటలపాటు పరిశీలించారు.

కోతి జాతి మనుషులకు అత్యంత దగ్గరి బంధువు. ఈ జాతిలో ఒరంగుటాన్లు, చింపాంజీలు, బోనోబోలు, గొరిల్లాలు ఉంటాయి. ఈ అధ్యయనంలో చేర్చిన జంతువులన్నీ ఒక జూలో ఉంటున్నాయి. వాటి రోజువారీ అలవాట్లను ఈ వీడియోలో రికార్డు చేశారు.

హాస్య గుణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కుక్కలలో కూడా ఆటపట్టించే గుణం ఉంటుందని డార్విన్ రాశారు.

జంతువులలో ఆటపట్టించే అలవాటు

పైన చెప్పిన కోతి జాతికి చెందిన జంతువులు ఒకదానిని ఒకటి అల్లరి చేష్టలతో ఆటపట్టిస్తూ కనిపించాయి. ఒరంగుటాన్‌లు, చింపాంజీలు, బోనోబోలు, గొరిల్లాలలో 18 రకాల చిలిపి చేష్టలను పరిశోధకులు నమోదు చేశారు.

చాలా తరచుగా చేసే ఈ పనుల్లో మొట్టికాయలు వేయడం, కొట్టడం, దడిపించడం, ఏదైన పని చేయబోతుంటే అడ్డు తగలడం, ఏదో ఒక శరీర భాగాన్ని పట్టుకునిలాగడం లాంటివి ఉన్నాయి.

వీటిలో కొన్నయితే తమ పక్కనున్న జంతువు ముఖం ముందు తమ చేతినో, కాలినో అడ్డం పెట్టి ఊపడం కనిపించింది. ఒరంగుటాన్లు తమ సహచరుల జుట్టు పీకడం తరచూ చేసే పనిగా రికార్డయింది.

ఈ అధ్యయనంపై రిపోర్టు రాసిన ఇసాబెల్ లామర్ దీని గురించి వివరించారు. ‘‘ రెండు పెద్ద కోతులు కూర్చుని పేలు చూసుకుంటున్నప్పుడు ఒక యువ మర్కటం ఒక్కసారిగా వారిపై దూకుతుంది. చాలాసార్లు ఈ కుర్ర కోతులు ఇలా పెద్దలను ఆటపట్టించడం కనిపిస్తుంది. వెనకాల వెళ్లి గీరడం, చప్పట్లు కొట్టడం, దూకడం ద్వారా వాటిని ఆటపట్టించేందుకు ప్రయత్నిస్తాయి’’ అని అన్నారు.

‘‘ఇలాంటి సమయంలో పెద్ద కోతులు ఎలా రెస్పాండ్ అవుతాయా అని ఈ చిన్న కోతులు వేచి చూస్తాయి. అయితే, పెద్ద కోతులు ఈ అల్లరి పనులను పెద్దగా పట్టించుకోకుండా తమ పనిలో మునిగిపోతాయి. కానీ, ఈ పిల్లలు ఊరుకోవు. తమ అల్లరిని అవి గుర్తించే వరకు ఇలా చిలిపిచేష్టలను చేస్తూనే ఉంటాయి’’ అని వివరించారు ఇసాబెల్.

కోతులలో ఈ చిలిపి చేష్టలు మనుషుల పిల్లలు చేసే అల్లరికి దగ్గరగా ఉంటుందట. కావాలని అల్లరి పనులు చేస్తూ పెద్దలకు కోపం తెప్పించే గుణం వీటిలో ప్రధానమైంది. తాము ఆటపట్టించే తమ పెద్దలు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడటం కోతి పిల్లలతోపాటు మనుషుల పిల్లల్లో కూడా కనిపించిందట.

జంతువులలో ఇటువంటి చిలిపి గుణాలు మనకు తెలిసిన దానికంటే ఎక్కువగానే ఉన్నాయని చాలా మంది శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

హాస్య గుణం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కోతులలో ఆటపట్టించే గుణం ఉందని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది.

మానవులలో పూర్వీకుల లక్షణాలు

మనుషుల్లో కనిపించే లక్షణాలు వారికి పూర్వీకులైన ఒరంగుటాన్లు, బోనోబోలు, చింపాంజీలు, గొరిల్లాలలో కనిపించడాన్ని బట్టి చూస్తే దాదాపు 13 లక్షల సంవత్సరాల కిందటే నేటి మనిషి పూర్వీకులలో ఈ నవ్వించే, ఆటపట్టించే గుణం ఉందని అర్ధమవుతోంది.

ఇవే కాకుండా, చాలా జంతువులలో నవ్వడం, నవ్వించడంలాంటి లక్షణాలు చాలా పెద్ద స్థాయిలో ఉన్నాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఉదాహరణకు, జీవశాస్త్రవేత్త చార్లెస్ డార్విన్ తన పుస్తకం 'ది డిసెంట్ ఆఫ్ మ్యాన్'లో కుక్కలలో కూడా నవ్వించే, ఆటపట్టించే అలవాటు ఉందని చెప్పారు.

‘‘కొన్నిసార్లు ఎవరైనా యజమాని ఒక కర్రను కుక్క మీదికి విసిరినట్లయితే కుక్క ఆ కర్రను నోట కరుచుకొని కొందదూరం లాక్కెళుతుంది. యజమాని మళ్లీ తన దగ్గరకు వచ్చే వరకు వేచి చూస్తుంది. దగ్గరకు రాగానే మళ్లీ ఆ కర్రను మరికొంత దూరం లాక్కెళుతుంది. అలాంటి పనులను మళ్లీ మళ్లీ చేస్తూ, యజమానిని ఆటపట్టిస్తూ తానూ ఎంజాయ్ చేస్తుంది’’ అని డార్విన్ చెప్పారు.

హాస్య గుణం

ఫొటో సోర్స్, Getty Images

ఎలుకలలో చక్కిలిగిలి

డాల్ఫిన్లు కూడా ఆటాడుతున్నప్పుడు సరదా పనులతో అల్లరి చేస్తూ శబ్దాలు చేస్తాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏనుగులు కూడా ఆడుతూ శబ్దం చేస్తాయి.

కొన్ని చిలుకలు వినోదం కోసం ఇతర జంతువులను ఆటపట్టించడం కనిపిస్తుంది. ఉదాహరణకు ఒక పెంపుడు చిలుక, ఒక పెంపుడు కుక్కను ఏడిపించడానికి యజమానిలాగా ఈల వేసి కుక్కను రమ్మని పిలుస్తుంది.

ఎలుకలు కూడా నవ్వడానికి, ఆటపట్టించడానికి ఇష్టపడతాయని చెప్పేందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్శిటీలో రీసెర్చ్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న జెఫ్రీ బెర్గ్‌డార్ఫ్ గత దశాబ్ద కాలంగా ఎలుకలకు చక్కిలిగింతలు పెట్టి వాటిలో నవ్వే గుణం మీద పరిశోధన చేస్తున్నారు.

ఇలా చక్కిలిగింతలు పెట్టినప్పుడు ఎలుకలు ఆనందంతో ఒక రకమైన శబ్ధం చేస్తూ ఈలలు వేస్తాయని, చక్కిలిగింతలు పెట్టించుకోవడానికి మళ్లీ మళ్లీ తమ దగ్గరకు వస్తున్నాయని జెఫ్రీ బెగ్‌డార్ఫ్ గుర్తించారు.

అయితే, ఎలుకలు చక్కిలిగింతలు పెట్టించుకోవడానికి వచ్చినంత మాత్రాన, చక్కిలిగింతలు పెట్టినప్పుడు శబ్ధాలు చేసినంత మాత్రాన వాటిలో హాస్య గుణం ఉందని చెప్పొచ్చా? దీనిపై పెద్దగా అధ్యయనాలు జరగలేదు.

ఒక జంతువు ఒక నిర్దిష్ట మార్గంలో ఎందుకు ప్రవర్తిస్తుందో అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి ఇసాబెల్లె లామర్ అధ్యయనంలో గొరిల్లాలు, చింపాంజీలు, ఒరంగుటాన్‌లు జోక్ చేస్తున్నాయా, లేక తమ ఒత్తిడిని తగ్గించుకుంటున్నాయా, లేకపోతే ఇతరుల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారా? అన్నది చెప్పడం కష్టం.

అయితే, నవ్వు, హాస్యం ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని పెంచుతుందని మనుషులు నమ్ముతారు. మరి జంతువులలో కూడా నవ్వు ఇలాంటి పాత్ర పోషిస్తుందా?

ఈ ప్రశ్నకు సమాధానంగా ఇసాబెల్లె "గొరిల్లాలు, చింపాంజీలు, ఒరంగుటాన్‌ల వంటి జంతువులలో హాస్యం అదే పాత్ర పోషిస్తుందని మనకు ఇప్పటి వరకు తేలలేదు" అని అన్నారు. కానీ అది నిజం కూడా కావచ్చని అంటారామె.

అయితే, దీన్ని నిరూపించడానికి ఇతర జంతువుల మీద కూడా విస్తృతంగా అధ్యయనం చేయాల్సి ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)