రష్యా దాడులలో 31వేల మంది సైనికులు మరణించారన్న యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కథ్రిన్ ఆర్మ్‌స్ట్రాంగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
రష్యా పూర్తి స్థాయి దాడి మొదలు పెట్టిన తర్వాత 31వేల మంది యుక్రేనియన్ సైనికులు మరణించినట్లు జెలియన్‌స్కీ చెప్పారు.
గాయపడిన వారి సంఖ్యను తాను వెల్లడించలేనని, అలా చేస్తే అది రష్యన్ల ప్లానింగ్‌కు సహకరించినట్లు అవుతుందని ఆయన అన్నారు.
యుక్రేనియన్ అధికారులు కూడా గాయపడ్డవారి వివరాలను బయటకు చెప్పడం లేదు. అయితే ఆ సంఖ్య చాలా ఎక్కువగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.
పశ్చిమ దేశాల నుంచి అందాల్సిన సాయంలో సగబాగం ఇంకా అందలేదని, దీంతో సైనికుల ప్రాణాలు పోవడంతో పాటు, తమ భూభాగాలను నష్టపోతున్నట్లు యుక్రెయిన్ రక్షణమంత్రి చెప్పిన తర్వాత జెలియన్‌స్కీ సైనికుల మరణాల సంఖ్యపై ప్రకటన చేశారు.
యుద్ధంలో మరణించిన యుక్రెయిన్ సైనికుల గురించి రష్యా పాలకులు చెబుతున్న తప్పుడు లెక్కల గురించి ప్రపంచానికి తెలియాలనే తాను వాస్తవాలను వెల్లడించినట్లు జెలియన్‌స్కీ చెప్పారు.
“యుద్ధంలో 31వేల మంది సైనికులు చనిపోయారు. మూడు లక్షలు లేదా లక్షన్నర మంది లేదా పుతిన్ ఆయన బృందంలో వాళ్లు చెబుతున్నచెబుతున్నట్లు కాదు. యుద్ధంలో ఒక్కర్ని కోల్పోవడం కూడా భారీ నష్టమే”
యుద్ధంలో జరిగిన విస్తృతమైన నష్టం గురించి ఆయన మాట్లాడారు. యుక్రెయిన్‌లో రష్యా ఆక్రమించుకున్న ప్రాంతంలో లక్షల మంది సామాన్యుల ప్రాణాలు పోయాయని, వాస్తవ సంఖ్య ఎంతమంది చనిపోయారో తనకు తెలియదన్నారు.
“వారిలో ఎంత మంది చనిపోయారో నాకు తెలియదు. ఎంతమందిని చంపేశారో తెలియదు. ఎంత మందిని చిత్రహింసలు పెట్టి చంపేశారో, ఎంత మందిని బందీలుగా తీసుకెళ్లారో కూడా తెలియదు”.
యుద్ధంలో మరణించిన సైనికుల సంఖ్యను ప్రకటించడం యుక్రెయిన్‌లో చాల అరుదు. జెలియన్‌స్కీ చెప్పిన సంఖ్య కంటే ఎక్కువ మందే చనిపోయి ఉండవచ్చని అంచనా.
రష్యాతో యుద్ధంలో 70వేల మంది యుక్రేనియన్ సైనికులు చనిపోయి ఉండవచ్చని, లక్ష 20వేల మంది గాయపడి ఉండవచ్చని గతేడాది ఆగస్టులో ఆమెరికా అధికారులు చెప్పారు.
రష్యా విషయానికొస్తే లక్ష 80వేల మంది రష్యన్ సైనికులు చనిపోయారని, లక్షల మంది గాయపడ్డారని జెలియన్‌స్కీ అన్నారు.
బీబీసీ రష్యా, మీడియా జోన్ వెబ్‌సైట్ కలిసి 45వేల మంది రష్యన్ సైనికులు యుద్ధంలో చనిపోయినట్లు అధికారిరంగా సైనికుల పేర్లతో సహా తేల్చింది. అయితే వాస్తవంగా ఈ సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండవచ్చని అంచనా.
మూడున్నర లక్షల మంది రష్యన్ సైనికులు చనిపోవడం లేదా గాయపడి ఉండవచ్చని బ్రిటన్ రక్షణ శాఖ తాజాగా వెల్లడించింది.

సాయం అందకపోవడంతో ఎదురుదాడిలో విఫలం
పశ్చిమ దేశాల నుంచి రావల్సిన సాయం ఆలస్యం అవుతోందని యుక్రెయిన్ రక్షణ మంత్రి రుస్తుం యుమెరోవ్ ప్రకటన చేసిన తర్వాత అధ్యక్షుడు జెలియన్‌స్కీ ప్రకటన వచ్చింది.
“ప్రస్తుతం చెప్పినంత సాయం అందడం లేదు”
రష్యన్ సైనికుల్ని తమ భూభాగం నుంచి తరిమి కొట్టేందుకు యుక్రెయిన్‌కు అనేక రకాల అవాంతరాలు ఎదురవుతున్నాయి.
“యుద్ధంలో ముందడుగు వేసేందుకు యుక్రెయిన్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సైనిక సరఫరాలు తగిన స్థాయిలో లేకపోవడమేనని” ఉమెరోవ్ చెప్పారు.
“మేము సాధ్యమైన వాటితో పాటు అసాధ్యమైన వాటిని సాధించడానికి చేయాల్సినదంతా చేస్తాం. అయితే సమయానికి మాకు కావల్సినవి అందకపోతే నష్టపోవాల్సిందే” అని ఆయన చెప్పారు.
మార్చ్ నాటికి యుక్రెయిన్‌కు అందిస్తామన్న్నపది లక్షల అర్టిలరీ షెల్స్ అందించాల్సిన అంశం గురించి యూరోపియన్ యూనియన్‌ను జర్మనీ గతేడాది నవంబర్‌లోనే హెచ్చరించింది.
అయితే మార్చ్ నాటికి తాము ఐదు లక్షల అర్టిలరీ షెల్స్ మాత్రమే అందించగలమని, మిగతా ఐదు లక్షలు 2024 చివరి నాటికి అందిస్తామని ఈయూ జనవరిలో తెలిపింది.
గత ఏడాది ముందుగానే శత్రువు మీద ఎదురుదాడిని తీవ్రం చేయాలని తాము ఎంతగానో ప్రయత్నిస్తున్నా, ఆయుధాలు లేకపోవడం వల్ల అది వీలు పడలేదని అధ్యక్షుడు జెలియన్‌స్కీ చెప్పారు.
దోనియెస్క్ ప్రాంతంలో రష్యన్ సేనలను తిప్పి కొట్టడంలో యుక్రెయిన్ విజయం సాధించినా కొన్నిచోట్ల ఎదురు దాడి చెయ్యడంలో కీయెవ్ దారుణంగా విఫలమైంది.
తమ ఎదురుదాడికి సంబంధించిన వ్యూహాలు రష్యాకు ముందుగానే తెలిశాయని జెలియన్‌స్కీ తాజా ప్రసంగంలో తెలిపారు.

అవ్‌డీవ్‌కా నుంచి వెనుదిరిగిన యుక్రెయిన్ సైన్యం
తూర్పు యుక్రెయిన్‌లో కీలక పట్టణం అవ్‌డీవ్‌కాను తాము స్వాధీనం చేసుకున్నట్లు రష్యా ప్రకటించింది. ఇక్కడ నుంచి మాస్కో సేనలు వెనుదిరిగాయి. ఇటీవలి కాలంలో రష్యా సాధించిన పెద్ద విజయమిది.
పశ్చిమ దేశాల నుంచి సరైన సమయంలో ఆయుధాలు అందకపోవడం వల్లనే తాము అవ్‌డీవ్‌కాను నష్టపోవాల్సి వచ్చిందని జెలియన్ ఆరోపించారు.
పశ్చిమ దేశాలతో పాటు అమెరికా అందిస్తామన్న 60 బిలియన్ డాలర్ల సాయం కూడా అమెరికన్ కాంగ్రెస్‌లో ఆమోదం పొందకపోవడం మరో కారణం.
యుక్రెయిన్ మీద రష్యా దాడి చేసి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈయూ దేశాల నేతలు శనివారం కీయెవ్‌లో పర్యటించారు. యుక్రెయిన్‌కు తాము అండగా ఉన్నామని పునరుద్ఘాటించారు.
యుక్రెయిన్‌కు నేటో సభ్యత్వం లభించే వరకు యుక్రెయిన్ రక్షణకు తాము మద్దతిస్తామని చెబుతూని ఇటలీ, కెనడా భద్రత ఒప్పందాల మీద సంతకాలు చేశాయి.
ఒప్పందంలో బాగంగా కెనడా యుక్రెయిన్‌కు మూడు బిలియన్ల కెనడియన్ డాలర్ల ఆర్థిక సాయంతో పాటు ఆయుధాలు కూడా అందించనుంది.
సైనికులు, ఆయుధాల విషయంలో యుక్రెయిన్ మాత్రమే కాకుండా రష్యా కూడా చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటోందని పశ్చిమ దేశాలు చెబుతున్నాయి.
“యుక్రెయిన్‌లో పోరాడేందుకు అవసరమైనన్ని ఆయుధాలు ఉత్పత్తి చేయగలిగినంత సామర్థ్యం రష్యాకు లేదని” ఈయూ అధికారి ఒకరు చెప్పారు.
ఇతర మార్గాల్లో ఆయుధాలను సేకరించడం ద్వారా మాస్కో నాయకత్వం సైనిక సరఫరాలను పెంచగలదని అయితే దీర్ఘకాలంలో అది సరైన పరిష్కారం కాదని ఈయూ నేతలు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఆకాశ్ దీప్: తండ్రి, అన్నను పోగొట్టుకున్నా పట్టు వదలకుండా శ్రమించి టీమిండియాకు ఎంపికైన క్రికెటర్ కథ
- యుక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరఫున తెలంగాణ యువకులు పోరాడుతున్నారా? వారిని పంపించింది ఎవరు?
- రూ.2,800 కోట్ల జాక్‌పాట్ తగిలిన వ్యక్తికి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన లాటరీ కంపెనీ
- స్మైల్ సర్జరీ తరువాత పెళ్లి కొడుకు మృతి.. అనస్తీషియా ఓవర్ డోస్ కావడంతో చనిపోయారా?
- ‘మత్తు, పెయిన్‌కిల్లర్స్ ఇవ్వకుండానే ఆపరేషన్లు, నొప్పి తట్టుకోలేక రోదిస్తున్న రోగులు’
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














