ప్లావ్: వయాగ్రాలా పని చేస్తుందని నమ్మే ఈ వంటకం ఏంటి?

ప్లావ్

ఫొటో సోర్స్, Simon Urwin

ఫొటో క్యాప్షన్, ప్లావ్ ఉజ్బెకిస్తాన్‌ పాక సంప్రదాయాలలో చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.
    • రచయిత, సైమన్ ఉర్విన్
    • హోదా, బీబీసీ ట్రావెల్

బియ్యం, కూరగాయలు, మాంసం, సుగంధ ద్రవ్యాలతో చేసే ఈ వంటకం పేరు ప్లావ్. చాలా దేశాల్లో ఇది ఫేమస్. కానీ, దీనికి ఉజ్బెకిస్తాన్‌తో ఎక్కువ అనుబంధం ఉంది.

ప్లావ్ ఆ దేశ జాతీయ వంటకం. అక్కడి ప్రజల్లో చాలామంది వారానికి ఒకసారైన తింటారు.

ఇది ఫ్యామిలీ వేడుకల్లో, పుట్టినరోజు, పెళ్లిళ్లు, అంత్యక్రియలు... ఇలా అన్ని సందర్భాలలో వడ్డిస్తారు. హజ్ నుంచి తిరిగొచ్చిన ముస్లింల కోసం ఈ వంట ప్రత్యేకంగా తయారు చేస్తారు.

ప్లావ్ వంటకాన్ని తొలుత 'అలెగ్జాండర్ ది గ్రేట్' కోసం కనిపెట్టినట్లు కొందరు చరిత్రకారులు చెబుతుంటారు.

సెంట్రల్ ఏషియా యుద్ధ సన్నాహకాల్లో భాగంగా ఆర్మీ కోసం ఏదైన రుచికరమైన ఆహారం తయారుచేయాలని ఆదేశించడంతో ఈ వంటకం తయారైంది.

"దీనిని నిరూపించడానికి మా వద్ద చారిత్రక రికార్డులు లేవు. కానీ 9,10వ శతాబ్దాల నాటికి ప్లావ్ ఇక్కడ బాగా ప్రాచుర్యం పొందిందని మాకు తెలుసు" అని ఆహార చరిత్రపై మక్కువ ఉన్న ఉజ్బెక్ టూర్ గైడ్ నిలుఫర్ నూరిద్దినోవా అన్నారు.

బీబీసీ వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ప్లావ్

ఫొటో సోర్స్, Simon Urwin

పోషకాలుండే వంటకంగా పేరు

"1,000 సంవత్సరాలకు పైగా ఈ ప్రాంతంలో వరి ప్రధానమైన పంట. పంటలు పండించడం, పశువుల పెంపకం వంటి వాటికి శారీరక శ్రమ అవసరం. కాబట్టి, ప్లావ్ ఇక్కడ కేలరీలు, పోషకాలు అధికంగా ఉండే వంటకంగా మారింది" అని తెలిపారు.

ఉజ్బెకిస్తాన్‌ వంట సంప్రదాయాలలో ప్లావ్ చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఇటీవల దీనిని యునెస్కో సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చారు.

"ప్లావ్ భోజనం కంటే ఎక్కువ. ఇది బంధాలను సృష్టిస్తుంది. స్నేహాన్ని ప్రోత్సహిస్తుంది. దేశాన్ని ఒక్కచోటికి చేర్చుతుంది" అని నూరిద్దినోవా అంటున్నారు.

ఉజ్బెక్ భాషలో ప్లావ్ పదం కూడా ఒక ముఖ్యమైన భాగంగా మారిందని తెలిపారు.

"రోజువారీ వ్యక్తీకరణలలో ప్లావ్ చాలా కనిపిస్తుంటుంది. మీకు భూమిపై ఒక రోజు మాత్రమే మిగిలి ఉందని తెలిసిన రోజున ప్లావ్ తినెయ్యండి’’ అని ఆమె సూచిస్తున్నారు.

"అంటే, మీరు సంతోషంగా చనిపోవచ్చు. ఉజ్బెకిస్తాన్‌లో ప్లావ్ లేని జీవితం ఊహించలేం" అంటున్నారు.

ప్లావ్

ఫొటో సోర్స్, Simon Urwin

వందల రకాలు

ఉజ్బెకిస్తాన్‌లో 100 కంటే ఎక్కువ రకాల ప్లావ్‌లు ఉన్నాయి.

వంటకాలు ప్రాంతం, సీజన్ ప్రకారం విభిన్నంగా ఉంటాయి. అయితే ప్రతి రకంలోనూ కీలకమైన పదార్థాలుంటాయి.

ఈ వంటకం పూర్తి పేరు ఓష్ పలావ్ (osh palov): "o" ఓబ్ (పర్షియన్‌లో నీరు), sh అంటే "షోలీ" (బియ్యం), "p" పియోజ్ (ఉల్లిపాయ), "a" అయోజ్(క్యారెట్), "l" లామ్ (మాంసం), "o" ఒలియో (కొవ్వు లేదా నూనె), "v" అంటే వెట్ (ఉప్పు).

ప్లావ్

ఫొటో సోర్స్, Simon Urwin

దేశంలోని అత్యంత ప్రసిద్ధ ప్లావ్ రెస్టారెంట్ బేష్ కోజోన్ ( సెంట్రల్ ఏషియా ప్లావ్ సెంటర్ అని కూడా పిలుస్తారు). ఇది రాజధాని తాష్కెంట్ పక్కనున్న యునుసాబాద్‌ ప్రాంతంలో ఉంది.

మధ్య ఆసియాలోని అతిపెద్ద ప్లావ్ రెస్టారెంట్‌లలో బెష్ కోజోన్ ఒకటిగా భావిస్తారు. ఇది ప్రతిరోజూ 5 నుంచి 8 వేల మంది కస్టమర్లకు సేవలు అందిస్తోంది. ఇక్కడ కజాన్ అని పిలిచే ఒక రకం కలప మీద ప్లావ్ తయారు చేస్తారు.

ఉజ్బెక్ సంప్రదాయం ప్రకారం ప్లావ్ ప్లేట్‌లో తప్పనిసరిగా నాన్ ఉండాలి.

షోకిర్జోన్ నూర్మాటోవ్ అనే వ్యక్తి బెష్ కోజోన్ రెస్టారెంట్ బేకర్. మిగతా షెఫ్‌ల మాదిరే ఆయన కూడా పనిని ప్రారంభించే ముందు ఒక ప్రత్యేక ఆచారాన్ని పాటిస్తారు.

మొదట ఆయన తనను తాను శుద్ధి చేసుకుంటారు. తన పని విజయవంతంగా నడవడానికి చేతులు జోడించి దువా (అల్లాహ్ నుంచి ఆశీర్వాదం) కోసం ప్రార్థిస్తారు.

ఆ తర్వాత రోజుకు 3 వేలకు పైగా రొట్టెల తయారీలోకి దిగుతారు.

ప్లావ్

ఫొటో సోర్స్, Simon Urwin

రెస్టారెంట్లలో పురుషులే ఎందుకు?

ఇళ్లల్లో అయితే ప్లావ్ ఎక్కువగా మహిళలు తయారు చేస్తారు. రెస్టారెంట్లలో (ప్రత్యేక సందర్భాలలో), ఇది ఓష్పాజ్ అని పిలిచే పురుష షెఫ్‌ల పని.

ఎందుకంటే "భారీ పరిమాణంలో ప్లావ్ తయారుచేయడానికి కఠినమైన శారీరక శ్రమ అవసరం" అని బేష్ కోజోన్‌లోని ఓష్‌పాజ్ ఫైజుల్లా సగ్దియేవ్ అన్నారు.

"నా దగ్గరున్న అతిపెద్ద కజాన్‌లో ఆహారం మూడు టన్నులుంటుంది. షెఫ్‌లు ప్లావ్ తయారీలో ఒత్తిడినీ ఎదుర్కొంటారు'' అని చెబుతున్నారు.

అతిథికి ప్లావ్ రుచిగా అనిపించకపోతే దాన్ని షెఫ్‌లు అవమానకరంగా పరిగణిస్తారని ఫైజుల్లా అభిప్రాయపడ్డారు.

అయితే, తనకు అలా ఎప్పుడూ జరగలేదని కూడా చెప్పారు.

ప్లావ్

ఫొటో సోర్స్, Simon Urwin

ప్లావ్ తయారీ చాలా కఠినంగా ఉంటుంది. ముందుగా మాంసం (మటన్, గొడ్డు మాంసం మిశ్రమం) వేయించాలి.

తర్వాత తెలుపు, పసుపు క్యారెట్లు, ఉల్లిపాయ, బియ్యం, నీరు, మసాలా దినుసులను జోడించాలి. దీనిలో ఉప్పు, మిరియాలు, పసుపు, ప్రధానంగా జీలకర్ర మిశ్రమాన్ని ఉపయోగిస్తారు సగ్దియేవ్ .

ఇది మొదట భారత్ నుంచి సిల్క్ రోడ్ వెంట ఉజ్బెకిస్తాన్‌కు చేరుకుంది. బెష్ కోజోన్ చైఖానా ప్లావ్‌ ప్రత్యేకత ఏమిటంటే ఏమిటంటే, పదార్థాన్ని ఉడికించే ముందు చిక్‌పీస్ (శనగలు), కిస్మిస్ (పుల్లని ఎండుద్రాక్ష)లు కలుపుతారు. ఆ తర్వాత నాలుగు గంటల పాటు నెమ్మదిగా ఉడికిస్తారు.

ప్లావ్

ఫొటో సోర్స్, Simon Urwin

ఉజ్బెకిస్తాన్‌లో ప్లావ్ చేయడానికి, తినడానికి గురు, ఆదివారాలు ముఖ్యమైన రోజులుగా పరిగణిస్తారు.

"పురాతన కాలంలో గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రజలు తమ వస్తువులను వారానికి రెండుసార్లు (గురు, ఆదివారాలు) విక్రయించడానికి నగర బజార్‌లకు వచ్చేవారు. ఆ రోజుల్లోనే అవసరమైన అన్ని పదార్థాలను కొనుగోలు చేయడానికి వారి వద్ద ఎక్కువ డబ్బు ఉండేది" అని నూరిద్దినోవా వివరించారు.

ప్లావ్

ఫొటో సోర్స్, Simon Urwin

'వయాగ్రా రూపంలో తాగడం'

గురువారం రోజున ప్లావ్ తినడానికి ముఖ్య కారణం, దానిలో పురుషులకు వీర్యాన్ని వృద్ధి చేసే బలమైన లక్షణాలున్నాయని భావించడమేనని రచయిత సైమన్ ఉర్విన్‌తో సగ్దియేవ్ తెలిపారు.

'గర్భం దాల్చడానికి గురువారం మంచి రోజుగా భావిస్తారు' కాబట్టి, అదే రోజు తినడం సరైనదని ఆయన చెప్పారు.

ప్లావ్ అంటే ఫోర్‌ప్లే అని పురుషులు తనతో జోక్ చేస్తుంటారని సగ్దియేవ్ అంటున్నారు. కజాన్ కింద నుంచి నూనెను కొన్నిసార్లు నేచురల్ వయాగ్రా అని భావిస్తూ తాగుతారని తెలిపారు.

చాలామంది ఓష్‌పాజ్‌ (షెఫ్)లు పురుష కస్టమర్‌లకు అదనపు లైంగిక శక్తి కోసం ఉత్తమమైన మాంసాన్ని గురువారం అందించడానికి నిల్వ చేస్తారని సగ్దియేవ్ చెప్పారు.

గురువారాల్లో గర్భం ధరించే సంప్రదాయం దేశంలోని బలమైన మత విశ్వాసాలతో ముడిపడి ఉందని చెప్పారు.

వీడియో క్యాప్షన్, ప్లావ్: వయాగ్రా లాంటి ఈ ఉజ్బెకిస్తాన్ వంటకాన్ని ఎలా తయారు చేస్తారు?

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)