పాకిస్తాన్: దైవదూషణ అనుమానంతో దాడి యత్నం, మహిళా పోలీసు అధికారి ఆమెను ఎలా కాపాడారు?

ఫొటో సోర్స్, SHALIK RIYADH/INSTAGRAM
- రచయిత, కేరోలిన్ డేవిస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాకిస్తాన్‌లో ఆగ్రహంతో ఉన్న ఓ గుంపు మహిళపై దాడి చేసేందుకు ప్రయత్నించిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో చర్చకు దారి తీసింది.
ఆమె వేసుకున్న గౌనుపై అరబిక్ పదాలు రాసి ఉన్నాయి. వాటిని ఖురాన్‌లో సూక్తులుగా పొరపడిన కొంతమంది వ్యక్తులు, ఆమె దైవదూషణ చేస్తోందని ఆరోపిస్తూ దాడి చేసేందుకు వచ్చారు.
ఆ సమయంలో ఓ మహిళా పోలీసు అధికారిణి చాకచక్యంగా వ్యవహరించి ఆమెను కాపాడారు. తర్వాత అరబిక్ పదాలున్న గౌను ధరించిన మహిళ బహిరంగంగా క్షమాపణ చెప్పారు.
ఆమె ధరించిన డ్రస్ మీద హల్వా అని అరబిక్‌లో రాసి ఉంది. అరబిక్‌లో హల్వా అంటే అందం అని అర్థం.
పాకిస్తాన్‌లో దైవదూషణ తీవ్రమైన నేరం. ఈ నేరానికి మరణశిక్ష విధించవచ్చు. పాక్‌లో దైవదూషణకు పాల్పడిన కొంతమందిని కోర్టు శిక్షించడానికి ముందే కొట్టి చంపిన సంఘటనలు ఉన్నాయి.
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ రాజధాని లాహోర్‌లో ఆదివారం రోజు ఓ జంట రెస్టారెంట్‌కు వచ్చింది. ఆమె డ్రస్ చూసిన కొంతమంది వ్యక్తులు ఆమె గౌను మీద ఖురాన్‌లో సూక్తులు రాసి ఉన్నాయని ఆరోపిస్తూ వారిని అటకాయించారు.
ఆమె ఖురాన్‌ను అవమానిస్తోందంటూ దాడి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఆమె స్థానిక పోలీసులకు ఫోన్ చేశారు.
పోలీసులు అక్కడకు వచ్చే సరికి దాదాపు 300 మంది రెస్టారెంట్ వద్దకు చేరుకున్నారు.
గౌను వేసుకున్న మహిళ భయంతో కుర్చీలో ముడుక్కుని కూర్చున్నారు. ఎవరైనా కొడతారేమోననే భయంతో చేతులు మొహానికి అడ్డు పెట్టుకున్నారు.
అదే సమయంలో కొంతమంది వ్యక్తులు ఆమెను అసభ్య పదజాలంతో తిట్టడం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసిన వీడియోల్లో కనిపించింది.
ఈ సంఘటన కు సంబంధించి ఇది ఇవాళ లాహోర్‌లో జరిగింది అంటూ సారా తసీర్ అనే యూజర్ ఒక వీడియోను ఎక్స్‌లో పోస్టు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఆమె గౌను అక్కడే విప్పేయాలంటూ కొంతమంది నినాదాలు చేశారు. మరి కొంతమంది ఆమెను శిక్షించాలని కేకలు వేశారు. దైవ దూషణ చేస్తున్న వారి తల నరికేయాలంటూ కొంతమంది అరవడం వీడియోల్లో వినిపించింది.
ఇదే సమయంలో అక్కడకు చేరుకున్న పోలీసులు ఆమెకు రక్షణగా నిల్చున్నారు. స్థానిక ఏఎస్పీ సయేదా షెహర్బానో నక్వీ రెస్టారెంట్ బయట నిల్చుని అక్కడకు చేరుకున్న వ్యక్తులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించిన దృశ్యాలను పంజాబ్ పోలీసులు ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
“ఆమె ధరించిన గౌను మీద ఏం రాసి ఉందో ఎవరికీ తెలియదు. ఆ సమయంలో మా ముందున్న అతి పెద్ద సవాలు ఏంటంటే ఆగ్రహంతో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి ఉన్న వారి నుంచి ఆమెను సురక్షితంగా బయటకు తీసుకురావడం” అన్నారు ఏఎస్పీ షెహర్బానో.
అందుకే అక్కడున్న వారికి ‘సర్థి చెప్పానని’ ఆమె చెప్పారు.
“ఆ మహిళను మేము తీసుకెళతాము. ఆమె చర్యలను కూడా మేము పరిగణనలోకి తీసుకున్నాము. చట్ట ప్రకారం ఆమె ఏదైనా నేరం చేసినట్లు తేలితే కచ్చితంగా చర్యలు తీసుకుంటాము” అని ఆమె వారికి చెప్పారు.
గౌను వేసుకున్న మహిళకు బురఖా వేసి, హిజాబ్ తొడిగి ఏఎస్పీ షెహర్బానో ఆమెను గుంపులో నుంచి తీసుకెళుతున్న దృశ్యాలను కొంతమంది ఎక్స్‌లో పోస్టు చేశారు. మిగతా పోలీసులు వాళ్లిద్దరికీ రక్షణగా నిలిచారు.
అతివాద ఇస్లామిక్ పార్టీ తెహ్రీక్ ఇ లబైక్ పాకిస్తాన్ కార్యకర్తలు ఆ గుంపులో చాలా మంది ఉన్నారని పోలీసులు చెప్పారు.
ఆ మహిళను పోలీసు స్టేషన్‌కు తీసుకు వచ్చిన తర్వాత స్థానిక మత పెద్దలు స్టేషన్‌కు వచ్చారు. ఆమె ధరించిన గౌను మీద ఉన్నవి అరబిక్ అక్షరాలని, అవి ఖురాన్‌లో సూక్తులు కాదని స్పష్టం చేశారు.
తాము గుర్తించిన విషయాల గురించి ప్రజలకు తెలిసేలా పోలీసులు మత పెద్దలతో ఓ వీడియోను రికార్డు చేయించారు. గౌను వేసుకున్న మహిళ అమాయకురాలని అందులో వారు చెప్పారు.

ఫొటో సోర్స్, Social media
“ఆ డ్రస్సు వేసుకోవడంలో నాకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. అది పొరపాటున జరిగింది. అయినప్పటికీ జరిగిన దానికి క్షమాపణ చెబుతున్నాను. ఇది మరోసారి జరగదు. నేను కూడా ముస్లింనే, ఇప్పటి వరకూ ఎన్నడూ దైవ దూషణ చెయ్యలేదు” అని గౌను వేసుకున్న మహిళ చెప్పారు.
ఆమె షాపింగ్ చేసేందుకు లాహోర్ వచ్చారని, ఈ సంఘటన తర్వాత నగరం విడిచి వెళ్లారని అధికారులు చెప్పారు.
ఈ వ్యవహారంపై పాకిస్తాన్ ప్రధానమంత్రి మాజీ రాజకీయ వ్యవహారాల సలహాదారు తాహిర్ మహమూద్ అష్రాఫీ ఎక్స్‌లో ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. ఆ మహిళకు బదులు ఆ గుంపులో ఉన్న వ్యక్తులు క్షమాపణ చెప్పాలి అని అందులో కోరారు.
ఇలాంటి సంఘటనలు పాకిస్తాన్‌లో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయని సయేదా అన్నారు.
“ఆ సమయంలో నేను పెద్దగా అరుస్తూ అక్కడున్న వారికి నచ్చ చెప్పడంలో విఫలమైతే పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదో ఆలోచించడం కష్టం” అని ఆమె అన్నారు. మహిళను కాపాడటంలో ఏఎస్పీ సయేదా షెహర్బానో చూపిన ధైర్యాన్ని ఉన్నతాధికారులు, పంజాబ్ ప్రావిన్స్ పోలీస్ చీఫ్ మెచ్చుకున్నారు. ఆమెకు అవార్డు ఇచ్చి సత్కరిస్తామని చెప్పారు.
పాకిస్తాన్‌లో దైవదూషణకు వ్యతిరేకంగా బ్రిటిషర్ల కాలంలో తెచ్చిన చట్టాన్ని 1980లో మిలటరీ పాలనాకాలంలో మరింత విస్తృతం చేశారు.
గతేడాది ఆగస్టులో ఖురాన్‌ను అపవిత్రం చేశారని ఆరోపిస్తూ తూర్పు పాకిస్తాన్‌లోని జరన్‌వాలా పట్టణంలో చర్చ్‌లు, ఇళ్లను తగలబెట్టారు.
ఇవి కూడా చదవండి:
- దివ్యభారతి: ఒకప్పుడు హీరోను మించిన రెమ్యూనరేషన్ తీసుకున్న అందాల తార కెరీర్ రెండేళ్ళలోనే ఎలా ముగిసిపోయింది?
- లాటరీ తగిలినట్లు ఈ దేశం ఒక్కసారిగా సంపన్న దేశంగా ఎలా మారింది?
- బెంగాల్ క్షామం: లక్షల మందిని పొట్టన పెట్టుకున్న ఆనాటి దుర్భిక్షాన్ని అనుభవించిన వారిలో కొందరు ఇంకా బతికే ఉన్నారు, వారు ఏమంటున్నారు?
- భార్య ఫోన్‌కాల్స్ విని ఇన్సైడర్ ట్రేడింగ్‌తో రూ. 14.5 కోట్లు సంపాదించిన భర్త.. భార్య ఉద్యోగం పోవడంతో విడాకులకు దరఖాస్తు
- ఆంధ్రప్రదేశ్: విశాఖ ఏవీఎన్ కాలేజిలో నోబెల్ బహుమతి గ్రహీత సీవీ రామన్ ప్రయోగాలు చేసిన ఫిజిక్స్ లేబొరేటరీ ఇప్పుడెలా ఉంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















