ఆంధ్రప్రదేశ్: విశాఖ ఏవీఎన్ కాలేజిలో నోబెల్ బహుమతి గ్రహీత సీవీ రామన్ ప్రయోగాలు చేసిన ఫిజిక్స్ లేబొరేటరీ ఇప్పుడెలా ఉంది?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
విశాఖ సముద్రతీరానికి కిలోమీటరు దూరంలో ఎత్తయిన ప్రదేశంలో ఏవీఎన్ కళాశాల ఉంది. ఈ కళాశాలలోని మొదటి అంతస్తులో ఉన్న తరగతి గది నుంచే ప్రీ యూనివర్సిటీ కోర్సు పాఠాలు చదువుకున్న చంద్రశేఖర వెంకట రామన్ దేశానికి నోబెల్ బహుమతి తెచ్చిపెట్టారు. ఫిబ్రవరి 28 సైన్స్ డే సందర్భంగా బీబీసీ తెలుగు ప్రత్యేక కథనం.
కాంతి పరిక్షేపణ(చెదరడం)పై చేసిన ప్రయోగాలకు భౌతిక శాస్త్రంలో సీవీ రామన్‌కు నోబెల్ బహుమతి వచ్చింది. ఈ నోబెల్ బహుమతికి విశాఖలోని ఏవీఎన్ కళాశాలలో చదువుకుంటుండగా వచ్చిన ఆలోచనలే కారణమని సీవీ రామన్ జీవితకథలో రాశారు.
భౌతిక శాస్త్ర రంగంలో భారతదేశానికి తొలి నోబెల్ బహుమతిని అందించిన సీవీ రామన్‌కు చెందిన జ్ఞాపకాలు ఏవీఎన్ కళాశాలలో ఏమున్నాయి? సీవీ రామన్ ప్రయోగాలు చేసిన ఫిజిక్స్ లేబొరేటరీ ఇప్పుడెలా ఉంది?

సీవీ రామన్ విశాఖ ఎందుకు వచ్చారు?
సీవీ రామన్ 1888 నవంబర్ 7న తమిళనాడులోని తిరుచురాపల్లిలో జన్మించారు. తండ్రి చంద్రశేఖర్ అయ్యర్ కళాశాల అధ్యాపకులు. గణితం, భౌతిక శాస్త్రం బోధించే చంద్రశేఖర్ అయ్యర్‌కు విశాఖపట్నంలోని ఏవీఎన్ కళాశాలలో భౌతిక శాస్త్ర అధ్యాపకుడిగా ఉద్యోగం వచ్చింది.
రామన్ తండ్రి ఉద్యోగ రీత్యా విశాఖపట్నం ఏవీఎన్ కళాశాలకు రావడంతో రామన్ కుటుంబం విశాఖపట్నం తరలి వచ్చింది.
రామన్ ఏవీఎన్ కళాశాలలో 1905లో ప్రీ యూనివర్సిటీ కోర్సు(పీయూసీ) చదువుకున్నారు. అంతకుముందు ఆయన పదోతరగతి వరకు కూడా విశాఖలోనే చదువుకున్నారు. దీంతో రామన్ విద్యాభ్యాసం ఎక్కువగా విశాఖలోనే సాగింది.
సీవీ రామన్ చదువుకునే రోజుల నుంచే పరిశోధనలపై ఆసక్తి చూపేవారు. ఇక్కడ చదువుకుంటున్న రోజుల్లో కూడా ఎక్కువగా ప్రయోగశాలలో సమయం గడిపేవారని ‘సీవీ రామన్-ఏ బయోగ్రఫీ’ పేరుతో రామన్ జీవిత చరిత్ర రాసిన ఉమా పరమేశ్వరన్ పేర్కొన్నారని ఏయూ భౌతిక శాస్త్ర విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్. శ్రీనివాసరావు బీబీసీతో చెప్పారు.
ఏవీఎన్ కళాశాలలో చదువుకున్న సీవీ రామన్ ఆంధ్ర యూనివర్సిటీలో భౌతిక శాస్త్ర విభాగం ప్రారంభించడంలోనూ, అలాగే ఈ విభాగాభివృద్ధిలోనూ కీలక పాత్ర పోషించారని శ్రీనివాసరావు తెలిపారు.
అంతేకాదు, ఆయన ఏయూ ఫిజిక్స్ విభాగానికి గెస్ట్ ఫ్యాకల్టీగా తరగతులు చెప్పేవారనే తెలిపారు.

ఏవీఎన్ కళాశాలలో సీవీ రామన్
ఏవీఎన్ కళాశాల ప్రధాన ద్వారం దాటగానే కళాశాల ప్రాంగణంలోకి అడుగు పెడతాం. అక్కడ నుంచి ఏవీఎన్ కళాశాలలో చాలా చోట్ల సీవీ రామన్‌కు చెందిన గుర్తులు కనిపిస్తుంటాయి.
కళాశాల ఫిజిక్స్ లేబొరేటరీ, అలాగే సీవీ రామన్ విగ్రహం ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. ఆ ప్రయోగశాల బోర్డుపై ఆయన ఫోటో పెయింటింగ్ కనిపిస్తుంటుంది.
అక్కడే విద్యార్థి దశలో తనకు వచ్చిన ఆలోచనలకు ప్రాథమిక ప్రయోగాలు చేసేవారని కళాశాల ప్రిన్సిపాల్ సింహాద్రి నాయుడు బీబీసీకి చెప్పారు.
అందుకే, ఆ గదిని దేవాలయంగా చూస్తామని తెలిపారు. ఆ గదిలోనే ఇప్పటి విద్యార్థులు ప్రయోగాలు చేస్తుంటారని తెలిపారు.
ఫిజిక్స్ లాబోరేటరి పైభాగంలోనే సీవీ రామన్ ప్రీ యూనివర్సిటీ కోర్సు చదువుకునే రోజుల్లోని తరగతి గది ఉంది.
ఇది ఒకమూలగా ఉండటంతో కిందనున్న సముద్రం, వీధులు స్పష్టంగా కనిపించేవట. అయితే ఇప్పుడు వీధుల్లో భవనాలు, ఇతర కట్టడాలు ఎత్తుగా రావడంతో సముద్రం కనిపించడం లేదు.
కానీ హర్బర్‌లో లంగరేసిన కొన్ని నౌకలు, భారీ కంటెనర్లు, క్రేన్లు కనిపిస్తున్నాయి.

ఎత్తులో తరగతి గది... దిగువన నీలి సముద్రం
ఆ ఫిజిక్స్ లేబొరేటరీ పైన ఉన్న తరగతి గదిలో కూర్చుని పాఠాలు వింటూ రామన్ కుడి వైపు కిటికీలోంచి సముద్రాన్ని చూసేవారు.
సముద్రం ఎందుకు నీలంగా ఉంటుందనే ఆలోచన అక్కడే ఆయనకు మొదలైందనే విషయాన్ని సీవీ రామన్ బయోగ్రఫీలో చెప్పారని ఏయూ భౌతిక శాస్త్ర విభాగ అధినేత, ప్రొఫెసర్ ఎస్. శ్రీనివాసరావు చెప్పారు. ఈయన ఏవీఎన్ కళాశాలలో ఫిజిక్స్ విభాగంలో గతంలో పని చేశారు.
సీవీ రామన్ బయోగ్రఫీ చదివినప్పుడు రామన్‌కు చెందిన అనేక ఆశ్చర్యకరమైన, అద్బుతమైన విషయాలు తెలుస్తాయని ఎస్. శ్రీనివాసరావు చెప్పారు.
“తక్కువ డబ్బుతో ప్రయోగాలు ఎలా చేయవచ్చో సీవీ రామన్ నిరూపించారు. అలాగే ప్రయోగాలు అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు, అందులోని విషయాల నుంచే చేయవచ్చునని, దానికి సృజనాత్మకమైన ఆలోచన ఉంటే చాలునని చెప్పారు. రామన్ ఎఫెక్ట్‌ను కనుగొనేందుకు ఆయన ఆ రోజుల్లో ప్రయోగాలకు వందల్లోనే ఖర్చు పెట్టారు. ఆయన కనుగొన్న గొప్ప విషయానికి, దానికి అయిన ఖర్చును పోల్చి చూస్తే... అది ‘నథింగ్’ అని చెప్పవచ్చు” అని ప్రొఫెసర్ శ్రీనివాసరావు వివరించారు.
రోజూ చూసే సముద్రపు రంగు గురించి ఆయన చేసిన ఆలోచనలతోనే ప్రపంచ వైజ్ఞానిక రంగాన్ని ఆశ్చర్యపరిచే రామన్ ఎఫెక్ట్‌ని కనుగొన్నారని చెప్పారు.

రామన్ ఎఫెక్ట్ ద్వారా ఏం కనుగొన్నారంటే...
కాంతి కిరణాలు ఒక పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది. అంటే కాంతి కిరణాల్లోని ఫోటాన్ కణాలు, ద్రవ పదార్థాల పరమాణువులపై పడి పరిక్షేపం చెందుతాయి.
ఈ ఫోటాన్లు కొన్ని ఎక్కువ పౌనఃపున్యంతో, మరికొన్ని తక్కువ పౌనఃపున్యంతో పరిక్షేపం చెందుతాయి. అంటే పడిన కాంతిలో కొంత భాగం మాత్రం వేరే పౌనః పుణ్యంతో చెదురుతుంది.
ఉదాహరణకు సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతిలోని నీలం రంగు ఎక్కువగా పరిక్షేపం చెంది మన కంటికి చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందని సీవీ రామన్ సిద్ధాంతీకరించారు.
ఇలా పదార్థాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో తెలిపే పరిశోధన ఫలితాన్నే 'రామన్ ఎఫెక్ట్' అంటారు.
దీన్ని కనుగొన్నందుకు ఆయన 1930లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. రామన్ ఎఫెక్ట్ ద్వారా రసాయనిక పదార్థాలలో అణు, పరమాణు నిర్మాణాల పరిశీలన, వాటి లక్షణాలు తెలుసుకోవచ్చు.
ఇది పరిశ్రమల్లో కృత్రిమ రసాయనిక సమ్మేళనాల పరిశీలనకు, వస్త్రాల రంగులు, వైద్య రంగంలో అవసరమయ్యే మందుల విశ్లేషణకు ఉపయోగపడుతుంది.

రామన్ ఎఫెక్ట్ ఒక సంచలనం
సముద్రం నీలిరంగులో ఎందుకు ఉంటుందనే ఆలోచనతో మొదలైన రామన్ పరిశోధనలు... సముద్ర జలంలోని అణువులు సూర్యకాంతిని వివిధ వర్ణాలుగా విడదీసి వెదజల్లుతాయని, అందులో నీలి రంగు కిరణాలు మాత్రం ఎక్కువ లోతుకు చొచ్చుకుపోయి ప్రతిఫలిస్తుందని, అందువల్ల సముద్రం నీలి రంగులో కనిపిస్తుందని రామన్ వివరించారని ఏవీఎన్ కళాశాల ఫిజిక్స్ విభాగ అధ్యాపకులు డాక్టర్ జి. శంకర నారాయణ రావు బీబీసీతో చెప్పారు.
ఏవీఎన్ కళాశాలలో మొదలైన సీవీ రామన్ పరిశోధన ప్రయాణం సంచలనమైన రామన్ ఎపెక్ట్ వరకు సాగిందన్నారు.
వస్తువు మీద కాంతి పడితే అది పరిక్షేపం చెందుతుందని.. దాని వల్లనే అది తన గమనాన్ని మార్చుకుంటుందని తన సిద్దాంతాల ద్వారా రుజువు చేశారు రామన్.
పెద్దగా పెట్టుబడి లేకపోయినా, ఆ సమయానికి కావాల్సిన ఆధునిక పరికరాలు లేకపోయినా... తనకున్న పరిమిత వనరులతోనే రామన్ ప్రయోగాలు చేశారని శంకర నారాయణ రావు చెప్పారు.
ఏవీఎన్ కళాశాలలో విద్యార్థులకు ఈ విషయాలను ఎప్పుడూ చెబుతుంటామని, అలాగే ఆయన చదువుకున్న చోట, ఆయన ప్రయోగాలు చేసిన చోట తాము కూడా ఉండటం తమకు, విద్యార్థులకు గర్వకారణంగా భావిస్తామన్నారు.
వస్తువు మీద కాంతి కిరణం పడితే అది పరిక్షేపం చెందుతుందని 1928 సంవత్సరం, ఫిబ్రవరి 28న రామన్ మొట్టమొదటిసారి ప్రయోగాత్మకంగా నిరూపించారు.
దీంతో, ఆ రోజునే దేశం జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకుంటుందని, తమ కళాశాలలో ఈ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటామని చెప్పారు. 1987 ఫిబ్రవరి నుండి జాతీయ సైన్స్ దినోత్సవాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా జరుపుతోంది.
సీవీ రామన్ కేవలం కాంతి మీద కాకుండా ధ్వని, వర్ణాలు, ద్రవాల తలతన్యత, ఖనిజాలు, డైమండ్, క్రిస్టల్ తదితర అంశాలపై కూడా ఎన్నో పరిశోధనలు జరిపారని ప్రొఫెసర్ ఎస్. శ్రీనివాస రావు చెప్పారు.
ఆయన పరిశోధన పత్రాలను బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సేకరించి, అక్కడే భద్రపరిచిందని చెప్పారు.

సీవీ రామన్ చదివిన చోటే మేం కూడా చదువుతున్నాం: విద్యార్థులు
ప్రస్తుత ఏవీఎన్ కళాశాల 1860లో ఏవీఎన్ హైస్కూల్‌గా ప్రారంభమై ఆ తర్వాత 1878 ఏవీఎన్ కళాశాల స్థాయికి ఎదిగింది. 1960లో హైస్కూల్ వందేళ్లు పూర్తయిన సందర్భంగా సీవీ రామన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సంతకం చేసిన పత్రం ఒకటి పంపారు. దానిని కళాశాలలో ఇప్పటికీ భద్రపరిచారు.
విద్యార్థులకు సీవీ రామన్ గురించి చెబుతున్నప్పుడు ఆయన చదువుకున్న తరగతి గది, ప్రయోగాలు చేసిన లాబోరేటరీ, ఆయన సంతకం చేసిన పత్రం చూపిస్తుంటారు. వాటిని చూసిన విద్యార్థులు స్పూర్తి పొందుతుంటారని కళాశాల ప్రిన్సిపాల్ సింహాద్రి నాయుడు చెప్పారు.

సీవీ రామన్ విద్యార్థిగా భౌతిక శాస్త్ర ప్రయోగాలు చేసిన లేబొరేటరీలోనే ప్రస్తుత సైన్స్ విద్యార్థులు ప్రయోగాలు చేస్తున్నారు. సీవీ రామన్ చదువుకున్న చోట తాము విద్యార్థులుగా ఉండటమనేది గర్వకారణంగా ఉందని చెప్తున్నారు.
“సీవీ రామన్ గారు చదువుకున్న కాలేజీలోనే మేం చదువుకోవడం చాలా గర్వకారణంగా ఉంది. ఇక్కడ ఆయన వర్క్ చేసిన ప్రయోగశాలలోనే మేం పని చేయడం మాకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. అది మాకు సైన్స్ రంగంలో ఏదైనా సాధించవచ్చుననే ప్రోత్సాహాన్ని ఇస్తుంది” అని బీఎస్సీ విద్యార్థులు లిఖితేశ్వరి, సోని బీబీసీతో చెప్పారు.
ఏవీఎన్ కళాశాలలో సీవీ రామన్‌తో పాటు, విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు, సినీనటుడు ఎస్వీ రంగారావు, స్వాతంత్య్ర సమరయోధుడు తెన్నేటి విశ్వనాధం చదువుకున్నవారే. అంతే కాకుండా కవులు రచయితలైన రావిశాస్త్రి, శ్రీశ్రీ కూడా ఇక్కడి విద్యార్థులే.
ఇవి కూడా చదవండి:
- భార్య ఫోన్‌కాల్స్ విని ఇన్సైడర్ ట్రేడింగ్‌తో రూ. 14.5 కోట్లు సంపాదించిన భర్త.. భార్య ఉద్యోగం పోవడంతో విడాకులకు దరఖాస్తు
- దివ్యభారతి: ఒకప్పుడు హీరోను మించిన రెమ్యూనరేషన్ తీసుకున్న అందాల తార కెరీర్ రెండేళ్ళలోనే ఎలా ముగిసిపోయింది?
- షమిమా బేగం: ఇస్లామిక్ స్టేట్‌లో చేరడానికి వెళ్లి ఏ దేశానికి చెందని వ్యక్తిగా ఎలా మారారు?
- సావర్కర్: అండమాన్ జైలులో ఉన్నప్పుడు క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్ వారికి లేఖలు రాసింది నిజమేనా?
- ‘సైకాలజీ ఆఫ్ మనీ’: పొదుపు మంత్రంతో ఓ చిరుద్యోగి రిటైరయ్యేనాటికి కోట్లు ఎలా కూడబెట్టాడు... మోర్గన్ హౌసెల్ ఇచ్చిన మెసేజ్ ఏంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














