ధ్రువ్ జురెల్: మరో మహేంద్రసింగ్ ధోనీ అవుతాడా?

క్రికెట్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, విమల్ కుమార్
    • హోదా, సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్ట్, రాంచీ

కొద్దినెలల కిందటి వరకూ మూడు ఫార్మాట్లలోనూ టీమిండియా వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్‌గా ఇషాన్ కిషన్ ఆడుతున్నాడు. అయితే, రెండు నెలల కిందట టీమిండియా దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండగా, ఇషాన్ కిషన్ హఠాత్తుగా భారత్‌కు తిరిగొచ్చాడు.

అతను మానసికంగా అలసిపోవడమే అందుకు కారణం. ఆ తర్వాత టెస్టు సిరీస్‌లో కేఎల్ రాహుల్ వికెట్ కీపర్‌గా వ్యవహరించాడు.

రిషభ్ పంత్ టీమిండియాకు దూరమైన సమయంలో కేఎస్ భరత్, సంజూ శాంసన్, జితేష్ శర్మ వివిధ ఫార్మాట్లలో వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ స్థానంలో ఆడుతున్నారు.

వీరే కాకుండా దేశవాళీ క్రికెట్‌ను ఆసక్తిగా గమనిస్తే, వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ ఉపేంద్ర యాదవ్ పేరు కూడా అప్పుడప్పుడూ వినిపిస్తూ ఉంటుంది.

ధ్రువ్ జురెల్ గురించి ఎవరూ మాట్లాడేవారు కాదు, కానీ కేవలం 10 రోజుల్లో సీన్ మారిపోయింది.

శుభ్‌మన్ గిల్, ధ్రువ్ జురెల్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, రాంచీ విజయానందంలో శుభ్‌మన్ గిల్, జురెల్

రాంచీలో అద్భుత ఇన్నింగ్స్

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ధ్రువ్‌ జురెల్ రాంచీలో తన కెరీర్‌లో రెండో టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్ ఆడిన తీరు చూస్తే, బహుశా అలా ఆడతానని తనకు కూడా తెలియదేమో.

సునీల్ గావస్కర్ లాంటి ఓ లెజెండరీ క్రికెటర్ అతనిలో మహేంద్ర సింగ్ ధోనీని చూశారు. టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ రుద్రప్రతాప్ సింగ్ రాంచీలో ధ్రువ్‌ను కలిసినప్పుడు ''బహుశా, నువ్వు ఇంకా చాలా ఇన్నింగ్స్ ఆడొచ్చు. కానీ, నీ కెరీర్ ముగిసినప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మాత్రం, ఈ ఇన్నింగ్స్‌ నీకు గర్వకారణంగా నిలుస్తుంది'' అన్నాడు.

''మ్యాచ్ క్లిష్ట పరిస్థితుల్లో ఉండడమే కాకుండా, ఒక ముఖ్యమైన టెస్టు సిరీస్‌పై ప్రభావం చూపే క్లిష్ట సమయంలో ఓ యువ ఆటగాడు బ్యాటింగ్‌కు రావడం చాలా అరుదు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ప్రశాంతంగా బ్యాటింగ్ చేశావ్. రాంచీకి చెందిన నా స్నేహితుడు మహి కూడా చాలా సంతోషంగా ఫీలై ఉంటాడు'' అని ఆర్పీ సింగ్ అన్నాడు.

రాంచీలో ధ్రువ్ బ్యాటింగ్‌ను ధోనీ చూడలేదు. అతని 90 పరుగుల అద్భుత ఇన్నింగ్స్‌ను టీవోలో చూశాడో లేదో తెలీదు. కానీ ప్రతిభను గుర్తించే విషయంలో శ్రీలంక మాజీ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మెన్ కుమార సంగక్కర అభిప్రాయాన్ని తేలిగ్గా తీసుకోలేం.

ధ్రువ్ జురెల్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, రాంచీ టెస్టులో ధ్రువ్ జురెల్ హాఫ్ సెంచరీ చేశాడు

ధ్రువ్ టాలెంట్ గుర్తించిన సంగక్కర

గతఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్‌గా పనిచేశారు సంగక్కర. జట్టులో సంజూ శాంసన్, జోష్ బట్లర్ వంటి వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్ ఉన్నప్పటికీ ధ్రువ్ జురెల్‌కు అవకాశం ఇవ్వడంలో సంగక్కర వెనకాడలేదు.

ఒక మ్యాచ్‌లో 15 బంతుల్లో 32 పరుగులు చేసి ప్రభావం చూపించాడు. ఆ తర్వాత ప్రతి మ్యాచ్‌లోనూ ఆడిన జురెల్, 172.73 స్ట్రైక్ రేటుతో 152 పరుగులు చేసి అందరి దృష్టినీ ఆకర్షించాడు.

కానీ, ఇంత దూకుడుతో ఆడే ఆటగాడు టెస్టు మ్యాచ్‌లలోనూ అంత ఓపికగా ఎలా ఆడగలిగాడనేది కూడా ఆశ్చర్యం కలిగించింది.

రాజ్‌కోట్‌‌లో ఆడిన తన తొలి టెస్టు మ్యాచ్‌లో జురెల్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చేప్పటికి, అతని కంటే ముందే స్పిన్నర్లు క్రీజులోకి వచ్చారు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు పరుగుల తేడాతో హాఫ్ సెంచరీ కోల్పోయినా అతని ముఖంలో నిరాశ కనిపించలేదు.

ధ్రువ్ జురెల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, కుల్దీప్ యాదవ్‌తో కలిసి పరుగులు తీస్తున్న జురెల్

జట్టులో భాగస్వామ్యం

రాంచీ టెస్టు మ్యాచ్ మూడో రోజు మీడియా సమావేశానికి వచ్చిన జురెల్‌ను సెంచరీ చేయలేకపోయినందుకు బాధపడుతున్నారా అని సూటిగా ప్రశ్నించారు. అందుకు జురెల్ బదులిస్తూ, అలాంటిదేమీ లేదని చాలా సరళంగా, సూటిగా చెప్పారు.

జట్టులోని యువ ఆటగాళ్లు తమ వ్యక్తిగత రికార్డులు, పరుగులకు ప్రాధాన్యం ఇవ్వకుండా జట్టు గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని, జట్టు అవసరాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని రోహిత్ శర్మ కూడా గట్టిగా చెప్పారు.

జురెల్ వంటి ఆటగాళ్లను ఉద్దేశించే కెప్టెన్ ఆ వ్యాఖ్యలు చేశారు.

నిజానికి, జట్టు కోసం ఆడుతున్నప్పుడు తన వ్యక్తిగత రికార్డులను పట్టించుకోని లక్షణాలను, ఆ స్ఫూర్తి పాఠాలను అతనికి వారసత్వంగా వచ్చాయి. జురెల్ తండ్రి దేశం తరఫున కార్గిల్ యుద్ధంలో పాల్గొన్నారు.

తండ్రిలా ఆర్మీలో చేరకపోయినా కొడుకు కూడా దేశం కోసం అదే స్ఫూర్తితో మైదానంలోకి దిగుతాడు. రాంచీలో తన తండ్రికి సైనికుడి తరహాలో సెల్యూట్ చేశాడు జురెల్.

నేడు ప్రపంచమంతా జురెల్ ఆత్మవిశ్వాసానికి సెల్యూట్ చేస్తోంది.

ధ్రువ్ జురెల్

ఫొటో సోర్స్, Getty Images

ఒత్తిడికి గురికాకుండా అద్భుత ఇన్నింగ్స్

రాంచీ టెస్టు మ్యాచ్ నాలుగో రోజు 192 పరుగుల లక్ష్యంతో చేజింగ్ మొదలుపెట్టిన టీమిండియా, ఒకానొక దశలో కేవలం ఒక వికెట్ కోల్పోయి 99 పరుగులతో బలంగా ఉంది.

విజయం దాదాపు ఖాయమనుకుంటున్న సమయంలో అనూహ్యంగా 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. దీంతో టీమిండియాపై ఒత్తిడి పెరిగింది.

ఆ పరిస్థితుల్లో అవతలి ఎండ్‌లో ఎవరున్నారని శుభ్‌మన్ గిల్ ఆందోళన చెందలేదు. ఎందుకంటే, అవతలి వైపు తనకు మద్దతుగా జురెల్ ఉన్నాడని అతనికి తెలుసు.

జురెల్ మరోసారి అద్భుతంగా ఆడి 39 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు.

మొదటి ఇన్నింగ్స్‌లో జురెల్ క్రీజులోకి వచ్చేప్పటికి టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. ఆ తర్వాత 177 పరుగులకి చేరుకునే సరికే మరో రెండు వికెట్లు కోల్పోయింది.

అలాంటి తీవ్ర ఒత్తిడి సమయంలో, జురెల్ దూకుడుతో పాటు సమన్వయంతో ఆడుతూ మూడో రోజు లంచ్ విరామ సమయానికి 90 పరుగులు చేశాడు.

అతని అద్భుత ఇన్నింగ్స్‌కు ప్రతిఒక్కరూ ఫిదా అయ్యారు. టీ20 వరల్డ్ కప్‌కి మరో వికెట్‌కీపర్ బ్యాట్స్‌మెన్‌గా జురెల్‌కి చోటు ఖాయమనే చర్చ మొదలైంది.

ధ్రువ్ జురెల్, సర్ఫ్‌రాజ్ ఖాన్

ఫొటో సోర్స్, ANI

కెరీర్‌లో మలుపు

రెండు దశాబ్దాల కిందట ధోనీకి ఎదురైన తరహాలోనే జురెల్ కూడా 23 ఏళ్లకే టెస్టు మ్యాచ్ సవాల్‌ను ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఆ సమయంలో టీమిండియా వికెట్‌కీపింగ్ భవిష్యత్తు పార్థివ్ పటేల్, దినేశ్ కార్తీక్ అనుకునేవారు.

అప్పట్లో ధోనీకి అంత అనుభవం లేకపోయినా లెక్కచేయకుండా సెలెక్టర్లు అతన్ని జట్టులోకి తీసుకున్నారు. ధోనీ కేవలం వైట్ బాల్ ప్లేయర్ మాత్రమే కాదని వారు నమ్మారు.

జురెల్ తన కెరీర్‌లో ఇప్పటి వరకూ 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. కొంతకాలం కిందటి వరకూ రాష్ట్ర జట్టులో కూడా అతనికి అంత సులవుగా అవకాశాలు దక్కలేదు. కానీ, రాజ్‌కోట్, రాంచీ టెస్టు మ్యాచ్‌లు జురెల్‌ కెరీర్‌ను మలుపు తిప్పాయి.

ధోనీలా మాదిరిగా ఆ స్థాయికి చేరడం ఈ యువ ఆటగాడికి భారీ లక్ష్యమే కావొచ్చు. కానీ, కచ్చితంగా పంత్‌కి ప్రత్యామ్నాయం లేదా పార్టనర్ అయ్యే సామర్థ్యం మాత్రం అతని సొంతం.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)