చంద్రుడి మీద కాలనీలు ఏర్పాటు చేస్తే మనుషులకు కలిగే ప్రయోజనాలు ఏంటి... ఈ రేసులో ఎవరు ముందున్నారు?

ఫొటో సోర్స్, GETTY IMAGES
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా 50 ఏళ్ల తర్వాత మళ్లీ చంద్రునిపైకి మనుషులను పంపాలని ఆలోచిస్తోంది. అమెరికాకు చెందిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ అల్డ్రిన్‌లు 1969లో చంద్రునిపై కాలుమోపిన తొలి మానవులు.
భారత్, రష్యా, చైనా, జపాన్‌లు తమ అంతరిక్ష నౌకలను, ల్యాండర్లను లేదా రోవర్లను చంద్రుని ఉపరితలంపైకి పంపించాయి. కానీ, ఈ మిషన్లలో చంద్రునిపైకి మనుషులను పంపలేదు.
ప్రస్తుతం ‘ఆర్టెమిస్’ ప్రొగ్రామ్ కింద చంద్రునిపైకి మనుషులను పంపాలని అమెరికా మళ్లీ ప్రణాళికలు రచిస్తోంది.
భారత్, చైనాలు కూడా ప్రస్తుతం ఇవే రకమైన ప్రణాళికలు చేస్తున్నాయి. అయితే, ఈవారం దునియా జహాన్‌లో వచ్చేసారి చంద్రునిపైకి అడుగు పెట్టబోయే తొలిదేశం ఏంటి? అక్కడ కాలనీలు ఏర్పాటు చేయడం వల్ల మనుషులకు కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..

ఫొటో సోర్స్, GETTY IMAGES
చంద్రమండల యాత్ర
అంతరిక్షంలోకి వెళ్లాలంటే రాకెట్ టెక్నాలజీ అత్యంత ముఖ్యం. ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో, సోవియట్ యూనియన్, అమెరికాలు ఈ టెక్నాలజీని వాడుతూ అంతరిక్షంలోకి తొలుత మనుషులను పంపించేందుకు తీవ్రంగా పోటీ పడ్డాయి. 1961లో సోవియట్ యూనియన్ అంతరిక్షంలోకి యూరి గగారిన్‌ను పంపించి విజయం సాధించింది.
చంద్రునిపైకి లేదా అంతరిక్షంలోకి మనుషులను తీసుకెళ్లడం అత్యంత అద్భుతమైన కర్తవ్యమని ‘ది మూన్: ఏ హిస్టరీ ఫర్ ది ఫ్యూచర్’ పుస్తక రచయిత, ‘ది ఎకనామిస్ట్’ సీనియర్ ఎడిటర్ ఆలివర్ మోర్టాన్ రాశారు.
ఇది ప్రపంచంలో ఆ దేశం విశ్వసనీయతను, బలాన్ని పెంచుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో సోవియట్ యూనియన్ విజయం సాధించిన తర్వాత, అమెరికాపై ఒత్తిడి పెరిగింది.
ఆ తర్వాత సోవియట్ యూనియన్ ఘనతను మించిన దాన్ని సాధించాలని అమెరికా తాపత్రయ పడిందని ఆలివర్ మోర్టాన్ చెప్పారు.
‘‘అంతకంటే మించిన ఘనత అంటే చంద్రునిపై మనిషిని దించడమే. దీని కోసం అత్యంత శక్తిమంతమైన రాకెట్ కావాల్సి ఉంది. చంద్రునిపైన కాలు మోపి, ప్రపంచం మొత్తానికి తన సత్తా తెలియజేయాలనుకుంది’’ అని రాశారు.
అమెరికా 1969లో ఇద్దరు వ్యోమగాములను అపోలో 11 అంతరిక్ష నౌక ద్వారా చంద్రునిపైకి పంపింది. అపోలో 11 విజయవంతమైన తర్వాత, ఇతర అపోలో మిషన్ల ద్వారా చంద్రునిపైకి మరో పది మంది వ్యోమగాములను పంపించింది.
ఇది కేవలం శాస్త్రీయపరమైన ఘనత మాత్రమే కాదు, అమెరికా రాజకీయంగా సాధించిన విజయం కూడా. చంద్రునిపై నడుస్తున్న ఇద్దరు మనుషుల ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా సర్క్యూలేట్ అయ్యాయి. కానీ, మరో ఫోటో ప్రజల్ని అత్యంత ఎక్కువగా ఆకట్టుకుంది.
‘‘నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ అల్డ్రిన్‌లు చంద్రునిపై నడుస్తున్న ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా సర్క్యూలేట్ అయ్యాయి. కానీ, సామాన్య ప్రజల హృదయాల్లో, మనసుల్లో చోటు దక్కించుకున్న ఫోటో ఏంటంటే, చంద్రునిపై కనిపిస్తున్న భూమి ఉదయించే ఫోటో. ఇది భూమి మిరుమిట్లు గొలిపే చిత్రం. చాలా మంది ప్రజలు తమ ఇళ్లల్లో ఈ ఫోటోను పోస్టర్‌గా పెట్టుకున్నారు’’ అని ఆలివర్ మోర్టాన్ చెప్పారు.
సోవియట్ యూనియన్ ఎప్పుడూ చంద్రునిపైకి మనుషులను పంపలేదు. కానీ, 1970ల్లో ఎందుకు అంతరిక్షంపైకి మానవుని ప్రయాణాల ప్రాధాన్యత తగ్గిపోయింది?
అప్పటికే ఈ ఘనతను అమెరికా సాధించడంతోనని ఆలివర్ మోర్టాన్ భావిస్తారు. చంద్రునిపైన పరిశోధనలకు ఒకటి లేదా రెండుసార్లు మనుషులను పంపింది. దీంతో, దీని ప్రాధాన్యత తగ్గిపోయి, ఈ మిషన్లు ఆగిపోయినట్లు చెబుతారు.
కానీ, ప్రస్తుతం మళ్లీ వ్యోమగాములు తమ సీట్ బెల్టులను పెట్టుకునే సమయం ఆసన్నమైంది. ఈసారి మిగిలిన దేశాల కంటే ముందే చంద్రునిపైకి మనుషులను పంపడం అమెరికాకు కష్టం కావొచ్చు. ఎందుకంటే, ఇతర దేశాలతో కూడా అమెరికాకు తీవ్రమైన పోటీ ఎదురుకావొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
చంద్రుని మీదకు పరుగు పందెం
గత కొన్నేళ్లుగా అమెరికా, చైనాల మధ్యలో సంబంధాలు ఘర్షణాత్మకంగా ఉన్నాయి. ఈ రెండు దేశాలు తమ శత్రుత్వాన్ని భూమి నుంచి అంతరిక్షం వరకు తీసుకెళ్తున్నాయి.
వచ్చే ఐదు నుంచి పదేళ్లలో చంద్రునిపైకి మానవ మిషన్లను పంపించేందుకు అమెరికా, చైనాలు సిద్ధమవుతున్నాయని టెక్నాలజీ సంబంధిత అంశాల వెబ్‌సైట్ ఆర్స్ టెక్నికా(Ars Technica)కు చెందిన అంతరిక్ష వ్యవహారాల సీనియర్ ఎడిటర్ ఎరిక్ బెర్గర్ చెప్పారు.
దీని కోసం ఈ రెండు దేశాలు అంతర్జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు. ఇది నేరుగా రాజకీయాలకు సంబంధించినదిగా చూస్తున్నారు.
‘‘చంద్రుడు ఒక ఆచరణాత్మక లక్ష్యంగా మారింది. దాని ఉపరితలంపై తక్కువ గురుత్వాకర్షణ ఉంటుంది. భూమికి దగ్గరగా చంద్రుడు ఉంటాడు. అంగారక గ్రహంపైకి చేరుకోవడానికి ఆరు నుంచి ఎనిమిది నెలలు పడితే, చంద్రుడిపైకి వెళ్లేందుకు మూడు రోజులే పడుతుంది. అందుకే, చంద్రుడు వారికి తదుపరి లక్ష్యంగా మారాడు’’ అని ఎరిక్ చెప్పారు.
చంద్రునిపైకి చేరుకునేందుకు మొదలైన ఈ పరుగు పందెం గురించి మాట్లాడటానికి కంటే ముందు, దీనిలో ఉన్న భారీ సాంకేతిక లోపాల గురించి చర్చించుకోవాలి. అతి పెద్ద సవాలు ఏంటంటే.. రాకెట్‌ను అంతరిక్షంలోకి తీసుకెళ్లాలి. రేడియేషన్ నుంచి వ్యోమగాములను రక్షించాలి. చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్‌గా ల్యాండ్ చేయాలి. చంద్రునిపైన లాంచ్ చేసిన రాకెట్‌ను తిరిగి భూమిపైకి తీసుకురావడం మరింత కష్టమని కూడా ఎరిక్ చెప్పారు.
‘‘భూమి నుంచి రాకెట్ లాంచ్ చేసినప్పుడు, కౌంట్‌డౌన్ ప్రారంభిస్తారు. ఆ తర్వాత రాకెట్ నుంచి లిక్విడ్ ఫ్యూయల్ విరజిమ్ముతుంది. ఏదైనా లోపం ఉంటే, మిషన్ ఆగిపోతుంది. చంద్రునిపైన ప్రతి ఒక్కటి కూడా ఆటోమేటిక్‌గా జరగాల్సి ఉంటుంది. అలాగే, రాకెట్ భూకక్ష్యలోకి ప్రవేశించినప్పుడు, దాని వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. జనరేట్ అయ్యే వేడిమి నుంచి రాకెట్‌ను కాపాడేందుకు బలమైన హీట్ షీల్డ్ కావాల్సి ఉంటుంది’’ అని తెలిపారు.
ఇన్ని ఇబ్బందులున్న నేపథ్యంలో, చాలా మంది వ్యోమగాముల ప్రాణాలను పణంగా పెట్టి, కోట్లాది రూపాయల ప్రజల డబ్బులను ఇన్వెస్ట్ చేసి అక్కడకు పంపడం అవసరమా? అనే ప్రశ్నలు కూడా వస్తాయి.
కానీ, ప్రస్తుతం ఈ రేస్ ఫార్మాట్ మారిపోయింది. తొలుత ఎవరు చంద్రునిపైకి మనుషులను తీసుకెళ్తారనేది ఇప్పుడు ప్రశ్నకాదు. తొలుత ఎవరు చంద్రునిపైన మనుషులు నివసించేలా, దాని నుంచి లబ్ది పొందేలా సాంకేతికతను అభివృద్ధి చేస్తారన్నదే ప్రశ్నగా మారింది. అంటే, ఈ పోటీ ప్రస్తుతం చంద్రునిపైన మనుషుల స్థావరాలను తొలుత ఎవరు ఏర్పాటు చేస్తారన్నది.
చంద్రుని దక్షిణ ధ్రువంపై కాలు మోపడం కూడా అత్యంత ఆసక్తికర విషయమే అని ఎరిక్ బర్గర్ అన్నారు. ఎందుకంటే, ఈ ప్రాంతం చాలా వరకు చీకటిలోనే ఉంటుంది. అక్కడ మంచు ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన వనరు.
ఈ ప్రాంతంలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది చాలా తక్కువ ప్రాంతం.
దీనిపై నియంత్రణ కోసం కూడా వివాదం జరిగే అవకాశం ఉందా? సాంకేతికంగా లేదా రాజకీయంగా లాభమేంటి? అన్నది కూడా ప్రశ్ననే. ఇది ప్రజల హృదయాలను, మనసులను గెలుచుకునే పోటీ. దీనిలో అమెరికాకు చైనా ప్రధాన ప్రత్యర్థి.
గత 20 ఏళ్లలో అంతరిక్ష రంగంలో చైనా ఎంతో పురోగతి సాధించిందని ఎరిక్ బెర్గర్ అన్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాంటి చిన్న మాడ్యుల్‌ను ఇది సిద్ధం చేసిందని తెలిపారు.
అంగారకుడిపైకి తన మిషన్లు పంపే సమయంలో, కేవలం అంగారకుడి కక్ష్యలోకి తన మిషన్లు పంపడమే కాకుండా, దాని ఉపరితలంపైన దిగి అతిపెద్ద ఘనత సాధించింది.
చైనా 2030 నాటికల్లా చంద్రునిపైన తన బేస్‌ను ఏర్పాటు చేయాలని కోరుకుంటుంది. అమెరికా కూడా 2028 నాటికి ఇదే పనిచేయాలనుకుంటుంది. కానీ, ఇప్పటికే ఆలస్యమైంది.
ఈ మిషన్‌ను విజయవంతం చేసేందుకు అమెరికా తన బిలీనియర్ ఎలన్ మస్క్‌పై, ఆయన కంపెనీ ‘స్పేస్‌ఎక్స్’పై ఆధారపడుతుంది.
నాసా కోసం స్పేస్‌ఎక్స్ రూపొందించే స్టార్‌షిప్ అంతరిక్ష నౌక లేకుండా ఇది సాధ్యం కాదని ఎరిక్ బెర్గర్ అభిప్రాయపడుతున్నారు.
అంతరిక్ష పరిశోధన మిషన్ల కోసం ప్రైవేట్ రంగంలోని కంపెనీలతో అమెరికా, చైనాలు కలిసి పనిచేస్తున్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
చంద్రుడి మీద బిజినెస్?
మనుషులను చంద్రునిపైకి తీసుకెళ్లి, అక్కడ కొంతకాలం ఉంచి, పరిశోధనలు జరిపేందుకు ఎన్నో సాంకేతికతల అవసరం ఉంటుంది. ఈ విషయంలో చాలా దేశాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
చంద్రునిపైన పరిశోధన చేసేందుకు, అక్కడున్న వనరులను వాడుకునేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలకు కావాల్సిన నియమ, నిబంధనలు, విధానాలు ఏంటన్న విషయంపై 30కి పైగా దేశాలతో అమెరికా ఒప్పందం కుదుర్చుకుంది.
‘‘అమెరికా, దాని ఆర్టెమిస్ ప్రాజెక్ట్ ఈ రంగంలో నాయకత్వాన్ని అందిస్తాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీలు ఆశిస్తున్నాయి’’ అని యూకే నార్త్ ఉంబ్రియా యూనివర్సటీలోని స్పేస్ పాలసీ, రెగ్యులేషన్స్ ప్రొఫెసర్ క్రిస్టోఫర్ న్యూమాన్ అన్నారు.
‘‘చాలా దేశాలు, కంపెనీలు చంద్రునిపైన అభివృద్ధిని కోరుకుంటున్నాయి. అక్కడున్న వనరులను సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నాయి. దీంతో అమెరికాతో ఇవి ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అదేవిధంగా, చాలా దేశాలు, వాటి ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ రంగంలో చైనాకు సహాయం చేస్తున్నాయి. దీంతో చంద్రునిపైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం ద్వారా డబ్బులు సంపాదించాలని చూస్తున్నాయి’’ అని చెప్పారు.
పదేళ్ల క్రితం తన అంతరిక్ష పరిశ్రమలోకి ప్రైవేట్ కంపెనీలను అనుమతిస్తూ చైనా చెప్పుకోదగ్గ ఘనత సాధించింది. కానీ, ఈ రంగంలో ఇప్పటికీ అత్యంత ప్రముఖమైన వ్యక్తి అంటే ఆయన ఎలన్ మస్క్‌నే.
నాసా ఆర్టెమిస్ మిషన్ చంద్రునిపైన కాలు మోపే అంతరిక్ష నౌకను తయారు చేసే బాధ్యతను ఈ కంపెనీనే చేపడుతుంది. ఎలన్ మస్క్ లక్ష్యం చాలా పెద్దది అని క్రిస్టోఫర్ న్యూమాన్ అన్నారు.
‘‘తన అంతరిక్ష నౌక ప్రాజెక్ట ద్వారా, మానవ భవిష్యత్‌కు మార్గాన్ని నిర్దేశించడంలో తాను భాగస్వామవుతున్నట్లు ప్రపంచానికి ఎలన్ మస్క్ చెప్పాలనుకుంటున్నారు. ఇతర గ్రహాలపై మనుషులు నివసించే స్థావరాలను ఏర్పాటు చేయడంలో ఎలన్ మస్క్ అంతరిక్ష నౌక కీలకమైన పాత్ర పోషించనుంది. కేవలం లాభాలను ఆర్జించడమే వారి లక్ష్యం కాదు. దానికి మించి ఉంది’’ అని క్రిస్టోఫర్ న్యూమాన్ అన్నారు.
అయితే, అంతరిక్ష పరిశోధనా మిషన్లలో ప్రైవేట్ పరిశ్రమలను భాగం చేయడంపై ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
‘‘మీరు ఒకవేళ ఇతర గ్రహాలపైకి వెళ్లి, అక్కడ మానవ నివాసాలను ఏర్పాటు చేయాలనుకుంటే, అక్కడుండే నిబంధనలు ఏమిటి? నేరాలను ఎలా నిర్వచిస్తారు? వాటికి శిక్ష ఏమిటి? అనేవి నిర్ణయించాల్సి ఉంది.
లక్ష్యణాత్మక ప్రైవేట్ పరిశ్రమలను ఈ నిబంధనల్లో భాగం చేయడం సవాలైన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో స్పేస్ మిషన్లలో ప్రైవేట్ కంపెనీలపై ఆధారపడటం ప్రభుత్వాలకు ఆందోళనకర అంశం’’ అని క్రిస్టోఫర్ న్యూమాన్ అన్నారు.
‘‘స్పేస్‌ఎక్స్‌తో కూడా ఈ సమస్య ఉంటుంది’’ అని క్రిస్టోఫర్ చెప్పారు.
‘‘ఎలన్ మస్క్‌ను నియంత్రించడం కష్టమైతే, అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా ఆయన మారతారు. ప్రస్తుతం భూమిపై మనం నివస్తున్నాం. కానీ, చాలా మంది ఇతర గ్రహాలపై నివాసయోగ్యం కోసం చూస్తున్నారు.
ఒకవేళ భూమి వినాశన అంచుకు వస్తే, ఇతర గ్రహాలపైకి వెళ్లగలమని భావిస్తున్నారు. దీని కోసం ఇతర గ్రహాలపై మానవ జీవితాన్ని విస్తరించాలని చూస్తున్నారు. ఇతర గ్రహాలపై నివాసాలను ఏర్పాటు చేయడం చాలా మందికి లక్ష్యంగా ఉంది. అందులో ఎలన్ మస్క్ కూడా ఒకరు’’ అని చెప్పారు.
ఇతర గ్రహాలపై నివాస స్థావరాలను ఏర్పాటు చేయడం కంటే ముందు చంద్రునిపై మనుషులను కొద్ది కాలం పాటు ఉంచడం ద్వారా ఏమైనా ప్రయోజాలుంటాయా?

ఫొటో సోర్స్, Getty Images
చంద్రుడి మీద నీరుందా?
చంద్రునిపై ఆర్టెమిస్ బేస్ క్యాంప్‌ను నిర్మించడం ఆర్టెమిస్ ఒప్పందం లక్ష్యమని అరిజోనా స్టేట్ యూనివర్సిటీ థండర్‌బర్డ్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్, అంతరిక్ష విధానాల నిపుణురాలు నమ్రతా గోస్వామి అన్నారు.
దీని ద్వారా చంద్రునిపై ఉన్న వనరులను ఉపయోగించుకోవచ్చు. అంగారక గ్రహాన్ని చేరుకునే సామర్థ్యన్ని పెంచుకోవచ్చని చెప్పారు. ఇటీవల, చంద్రునిపై ఇనుము, టైటానియంతో పాటు ఇతర ఉపయోగకరమైన మూలకాలున్నట్లు గుర్తించారు.
చంద్రుని దక్షిణ ధ్రువానికి 600 కి.మీల దూరంలో భారత్ చంద్రయాన్ 3 మిషన్ ల్యాండ్ అయింది. సల్ఫర్, అల్యూమినియం, ఇతర మూలకాలున్నట్లు ఇది నిర్ధారించింది. కానీ, మంచు నీరు ఉన్నట్లు మాత్రం ఇది ధ్రువీకరించలేకపోయింది.
2026లో జపాన్‌తో కలిసి భారత్ మళ్లీ చంద్రునిపైకి తన అంతరిక్ష ప్రయోగాన్ని చేపట్టనుంది. ఆ ప్రయోగంలో చంద్రునిపై మంచు నీరును గుర్తించాలని చూస్తుంది. చంద్రునిపై మానవ నివాసాలు ఏర్పాటు చేసేందుకు మంచు నీరు చాలా అవసరం.
ఎందుకంటే, ఆక్సీజన్ దాని నుంచే తయారవుతుంది. అంతరిక్షంలో మరిన్ని పరిశోధనలకు చంద్రుడు బేస్‌గా మారనున్నాడని కూడా ఈ విషయాలు సూచిస్తున్నాయి.
‘‘చంద్రుని బేస్‌గా మార్చడం ద్వారా, అక్కడి నుంచి అంతరిక్ష నౌకలను అంగారకుడిపైకి పంపించగలదు. చైనా చంద్రునిపై 2036 కల్లా బేస్‌ను ఏర్పాటు చేయాలనుకుంటుంది. భారత్ కూడా ఇదే రకమైన ప్రాజెక్టును ప్రకటించింది.
ఒకవేళ దీనిలో విజయం సాధిస్తే, చంద్రుని గురుత్వాకర్షణ శక్తిని ఉపయోగించుకుని అక్కడి నుంచే అంతరిక్షంలోకి రాకెట్లను ప్రయోగించగలవు. భూమిపై నుంచి రాకెట్లను ప్రయోగించడం చాలా ఖర్చుతో కూడుకున్న ప్రక్రియ. చంద్రుని నుంచి పోలిస్తే భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి రాకెట్ ఎగిరేందుకు ఎక్కువ ఇంధనం అవసరం పడుతుంది. అందుకే, చాలా దేశాలు చంద్రున్ని వ్యూహాత్మక వనరుగా చూస్తున్నాయి’’ అని నమ్రతా గోస్వామి అన్నారు.
ఇది మాత్రమే కాక, భవిష్యత్‌లో చంద్రుని నుంచి మరేమైనా ప్రయోజనాలు పొందగమలా? ఉదాహరణకు, చంద్రునిపై మరో వైపు ఎల్లప్పుడూ వెలుతురు ఉంటుంది. అక్కడ ఎలాంటి మేఘాలు లేదా వాతావరణం ఉండదు. అంటే సౌరశక్తి ఉత్పత్తి చేసేందుకు చంద్రుని ఉపరితలాన్ని వాడుకోవచ్చన్నమాట.
‘‘చంద్రునిపై సౌరశక్తిని ఉత్పత్తి చేసి, లో ఆర్బిట్‌లో ఉన్న పెద్ద ఉపగ్రహాల ద్వారా మైక్రోవేవ్‌ల ద్వారా సౌరశక్తిని భూమిపైకి పంపవచ్చు’’ అని నమ్రతా చెప్పారు.
భూమిపై రాత్రి సమయం ఉంటుంది. వాతావరణంలో మార్పులుంటాయి. ఇవి సౌరశక్తిని ఉత్పత్తి చేయడంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. అంతరిక్షంలో సౌరశక్తిని రోజులో 24 గంటల పాటు ఉత్పత్తి చేయొచ్చు.
అంతేకాక, భూమిపైన ఉన్న శిలాజ ఇంధనాలు కొద్ది కాలం తర్వాత అయిపోనున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అంతరిక్షం నుంచి శుద్ధమైన సౌరశక్తిని పొందడమే మంచి ఎంపిక అన్నారు. ఇది ఆకర్షణీయమైన ఎంపికే. కానీ, ఏ స్థాయిలో ఈ వనరులను ఎవరు వాడుకోవాలన్నది ప్రశ్న.
1967లో కుదుర్చుకున్న అంతరిక్ష ఒప్పందం మేరకు, అంతరిక్షంలో ఏ దేశం కూడా సార్వభౌమాధికారాన్ని క్లయిమ్ చేసుకోవడానికి వీలు లేదు. అంటే, అమెరికా, చైనాలు చంద్రునిపైన చీకటి వైపున్న ప్రాంతంలో నివాసాలను ఏర్పాటు చేసినా, ఆ ప్రాంతం తమది అని చెప్పుకోవడానికి వాటికి వీలు లేదు.
కానీ, వాస్తవం దీనికి భిన్నగా ఉండొచ్చు. చంద్రుని వనరులను సమానంగా వాడుకోవాలనే దానికి ఎలాంటి చట్టపరమైన విధానం లేదు. తొలుత అక్కడికి వెళ్లే దేశాలు ప్రయోజనం పొందవచ్చనే ఆందోళనలు కూడా ఉన్నాయని నమ్రతా గోస్వామి చెప్పారు.
తర్వాత సారి చంద్రునిపైన తొలి అడుగు ఎవరు పెడతారన్నది మా ప్రశ్న? చంద్రునిపైకి చేరుకోవడం ప్రస్తుతం కేవలం శాస్త్రీయ ఘనత మాత్రమే కాదు. చంద్రుని నుంచి సౌరశక్తిని పొందేందుకు ఇది అపారమైన అవకాశాలను అందించగలదు.
అక్కడ బేస్ క్యాంపును ఏర్పాటు చేయడం ద్వారా ఇతర గ్రహాలపైకి పరిశోధనా మిషన్లను కూడా పంపించవచ్చు.
ప్రస్తుత పరిస్థితులను చూస్తే, 2028లో అమెరికా చంద్రునిపైన కాలు మోపనుందని తెలుస్తుంది. రెండేళ్ల తర్వాత చైనా, పదేళ్ల తర్వాత భారత్ చంద్రునిపైకి వెళ్లనున్నాయి.
ఇవి కూడా చదవండి:
- భావప్రాప్తి: కొంతమంది మహిళలకు 'క్లైమాక్స్' అనుభూతి కలగకపోవడానికి 8 కారణాలు...
- దివ్యభారతి: ఒకప్పుడు హీరోను మించిన రెమ్యూనరేషన్ తీసుకున్న అందాల తార కెరీర్ రెండేళ్ళలోనే ఎలా ముగిసిపోయింది?
- కంటి శుక్లాలు ఎందుకొస్తాయి? ఆపరేషన్ తర్వాత ఏం చేయాలి, ఏం చేయకూడదు?
- గాంధీ కుటుంబం గురించి అమేఠీ, రాయబరేలీ ప్రజలు ఏమంటున్నారు... వారు అక్కడ పోటీ చేయాలంటున్నారా, వద్దంటున్నారా?
- బెంగాల్ క్షామం: లక్షల మందిని పొట్టన పెట్టుకున్న ఆనాటి దుర్భిక్షాన్ని అనుభవించిన వారిలో కొందరు ఇంకా బతికే ఉన్నారు, వారు ఏమంటున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















