ఐసీఐసీఐ బ్యాంక్: 'బ్యాంకు మేనేజర్ నా అకౌంట్లో నుంచి 16 కోట్లు కొట్టేశారు'

శ్వేతా శర్మ

ఫొటో సోర్స్, SHVETA SHARMA

ఫొటో క్యాప్షన్, బ్యాంక్ మేనేజర్ తనను మోసం చేశారని శ్వేతా శర్మ ఆరోపించారు
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ న్యూస్, దిల్లీ

దేశంలోని అతిపెద్ద బ్యాంకుల్లో ఒక బ్యాంకు మేనేజర్ తన ఖాతా నుంచి 16 కోట్ల రూపాయలు అక్రమంగా మళ్లించారని భారత్‌కు చెందిన ఒక మహిళ ఆరోపించారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడులు పెట్టాలని భావించి తన అమెరికా ఖాతా నుంచి ఐసీఐసీఐ బ్యాంకుకు నగదు బదిలీ చేసినట్లు శ్వేతా శర్మ చెప్పారు.

అయితే, తన ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేసుకునేందుకు బ్యాంకు అధికారి ఒకరు నకిలీ అకౌంట్లు సృష్టించి, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి, తన పేరుమీద డెబిట్ కార్డులు, చెక్‌బుక్‌లు తీసుకున్నారని ఆమె ఆరోపించారు.

''ఆయన నాకు నకిలీ స్టేట్‌మెంట్లు ఇచ్చారు. నా పేరు మీద నకిలీ ఈమెయిల్ ఐడీని సృష్టించారు. బ్యాంకు రికార్డుల్లో నా ఫోన్ నంబర్‌ను మార్చేశారు. అందువల్ల నాకు నగదు విత్‌డ్రా గురించి ఎలాంటి నోటిఫికేషన్లు రాలేదు'' అని ఆమె బీబీసీతో చెప్పారు.

''మోసం జరిగింది నిజమే'' అని బ్యాంకు ప్రతినిధి బీబీసీతో అంగీకరించారు. అయితే, ఐసీఐసీఐ బ్యాంకు కోట్లాది మంది కస్టమర్ల నుంచి వేల కోట్ల రూపాయల డిపాజిట్లు కలిగివున్న ఒక ప్రసిద్ధ బ్యాంకు అని ఆయన అన్నారు.

'ఈ మోసంలో ప్రమేయం ఉన్నవారు ఎవరైనా శిక్షార్హులే' అని ఆయన అన్నారు.

అమెరికా, హాంకాంగ్‌లో దశాబ్దాల పాటు నివసించిన శర్మ, ఆమె భర్త 2016లో భారత్‌కు తిరిగొచ్చిన తర్వాత ఒక స్నేహితుని ద్వారా బ్యాంకర్‌ను కలిశారు.

అమెరికాలో బ్యాంకు డిపాజిట్లపై చాలా తక్కువ వడ్డీ రేటు ఉంటుందని, భారత్‌లో అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.5 శాతం నుంచి 6 శాతం వరకూ వడ్డీ వస్తుందని చెప్పి డబ్బును ఇక్కడి బ్యాంకులో జమ చేయాలని ఆయన శ్వేతా శర్మకు సలహా ఇచ్చారు.

ఆయన సలహా మేరకు దిల్లీకి సమీపంలోని పాత గురుగ్రామ్‌లోని ఐసీఐసీఐ బ్యాంకును సందర్శించిన ఆమె, ప్రవాస భారతీయుల కింద ఎన్‌ఆర్ఈ అకౌంట్ తెరిచారు. 2019లో అమెరికా అకౌంట్ నుంచి ఇక్కడకు నగదు బదిలీ చేయడం ప్రారంభమైంది.

''మేం జీవితకాలం పొదుపు చేసిన మొత్తం డబ్బు 13.5 కోట్ల రూపాయలను 2019 సెప్టెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకూ నాలుగేళ్ల వ్యవధిలో బ్యాంకులో డిపాజిట్ చేశాం'' అని ఆమె చెప్పారు. ''అది వడ్డీతో కలిపి 16 కోట్లకుపైగా చేరింది'' అన్నారు.

తనకెప్పుడూ అనుమానం రాలేదని, ఎందుకంటే ''బ్రాంచ్ మేనేజర్ ఎప్పటికప్పుడు రశీదులు పంపేవారు, ఐసీఐసీఐ అకౌంట్ నుంచి ఎప్పటికప్పుడు ఈమెయిల్ స్టేట్‌మెంట్లు వచ్చేవి. కొన్నిసార్లు డాక్యుమెంట్లు ఫోల్డర్లలో కూడా వచ్చాయి'' అని ఆమె చెప్పారు.

ఐసీఐసీఐ

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారత్‌లో రెండో అతిపెద్ద బ్యాంకు ఐసీఐసీఐ

మీ డబ్బుపై మంచి రాబడి వచ్చే అవకాశం ఉందని బ్యాంకులో కొత్త ఉద్యోగి ఆమెకు సలహా ఇవ్వడంతో జనవరి ప్రారంభంలో ఈ మోసం వెలుగులోకి వచ్చింది.

తన ఫిక్స్‌డ్ డిపాజిట్లన్నీ మాయమైనట్లు ఆమె గుర్తించారు. డిపాజిట్లలో ఒక దానిపై 25 మిలియన్ రూపాయల ఓవర్‌డ్రాఫ్ట్ కూడా తీసుకున్నట్లు ఉంది.

''నా భర్త, నేను షాకయ్యాం. నేను ఆటోఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడుతున్నా. నేనసలు మామూలు మనిషిని కాలేకపోయా. వారం రోజులు మంచం మీద నుంచి కాలు కిందపెట్టలేకపోయా. మీ కళ్ల ముందే మీ జీవితం నాశనం అయిపోతోంది. కానీ, మీరు ఏమీ చేయలేరు'' అని ఆమె ఆవేదన చెందారు.

మొత్తం వ్యవహారాన్ని బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, బ్యాంకు ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చించినట్లు శ్వేతా శర్మ చెప్పారు.

''జనవరి 16న బ్యాంకు రీజనల్, జోనల్ హెడ్‌లతో పాటు, ముంబయి నుంచి వచ్చిన బ్యాంకు అంతర్గత విజిలెన్స్ ఉన్నతాధికారిని కలిశాం. అది తమ వైపు నుంచి జరిగిన తప్పు అని వారు చెప్పారు. బ్రాంచ్ మేనేజర్ మోసం చేసినట్లు వారు అంగీకరించారు.''

''మా డబ్బు తిరిగి మాకు వస్తుందని వారు మాకు హామీ ఇచ్చారు. అయితే, ఈ మోసపూరిత లావాదేవీలను గుర్తించడంలో నా సహాయం అవసరం అవుతుందని వారు చెప్పారు'' అన్నారు శర్మ.

గత నాలుగేళ్లుగా బ్యాంకుకు సంబంధించిన లావాదేవాలు, వాటి వివరాలపై శర్మ, ఆమె అకౌంటెంట్ల బృందం కొన్నిరోజుల పాటు పనిచేశారు. వంద శాతం మోసపూరిత లావాదేవీలుగా గుర్తించిన వాటి వివరాలను వారు విజిలెన్స్ బృందానికి అందజేశారు.

''నా అకౌంట్ నుంచి డబ్బులు ఎలా స్వాహా చేశారో, అవి ఎక్కడ ఖర్చు చేశారో తెలుసుకోవడం ఆశ్చర్యంగా అనిపించింది'' అని శర్మ అన్నారు.

రెండు వారాల్లో సమస్య పరిష్కరిస్తామని బ్యాంకు అధికారులు హామీ ఇచ్చినప్పటికీ, ఆరు వారాలకు పైగా గడిచినా ఇంకా తన అకౌంట్‌లో నగదు ఎప్పుడు జమ అవుతుందోనని వేచిచూస్తున్నట్లు శర్మ చెప్పారు.

ఈలోగా ఆమె ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, డిప్యూటీ సీఈవోలకు లేఖలు రాశారు. అలాగే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు దిల్లీ పోలీసు ఆర్థిక నేరాల విభాగానికి(ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్) ఫిర్యాదు చేశారు.

ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు పెండింగ్‌లో ఉన్నందున, తొలుత 9.27 కోట్లను తాత్కాలిక హక్కు కింద ఆమె అకౌంట్‌లో జమ చేయనున్నట్లు బీబీసీకి పంపిన ఒక ప్రకటనలో బ్యాంకు వర్గాలు తెలిపాయి.

అయితే, బ్యాంకు ఆఫర్‌ను శర్మ తిరస్కరించారు. ''నాకు రావాల్సిన 16 కోట్ల కంటే ఇది చాలా తక్కువ. తాత్కాలిక హక్కు అంటే పోలీసులు కేసు ముగించే వరకూ ఆ అకౌంట్‌‌ లావాదేవీలు నిలిచిపోతాయి. ఇది తేలేందుకు కొన్నేళ్లు పట్టొచ్చు''

''ఏ తప్పూ చేయకుండా నేనెందుకు శిక్ష అనుభవించాలి? నా జీవితం తల్లకిందులైంది. నిద్రపట్టడం లేదు. అన్నీ పీడకలలు వస్తున్నాయి'' అని ఆమె అన్నారు.

ఐసీఐసీఐ

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, తాను 16 కోట్లు మోసపోయానని శ్వేతా శర్మ చెప్పారు

ఇలాంటి కేసులు చాలా అరుదు అని, ఈ విధమైన మోసాలు జరగకుండా బ్యాంకులు ఆడిట్‌లు, తనిఖీలు చేస్తుంటాయని బ్యాంకింగ్ వ్యవహారాలను నిశితంగా పరిశీలించే ఫిన్‌టెక్ కంపెనీ 'క్యాష్‌లెస్ కన్జ్యూమర్‌‌'కి చెందిన శ్రీకాంత్ ఎల్ అన్నారు.

కానీ, మీ బ్యాంకు మేనేజర్ మిమ్మల్ని మోసం చేయాలని నిర్ణయించుకుంటే మాత్రం, దాదాపుగా మీరేం చేయలేరని ఆయన అన్నారు.

''ఆయన బ్యాంకు మేనేజర్ కావడంతో ఆమె అతన్ని నమ్మారు. కస్టమర్లు మరింత అప్రమత్తంగా ఉండాలి. తమ అకౌంట్ నుంచి నగదు లావాదేవీలను నిరంతరం పర్యవేక్షిస్తూ ఉండాలి''

"కస్టమర్లు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోకపోవడం వల్ల ఈ రకమైన మోసాలు జరిగే అవకాశం ఉంది" అని ఆయన చెప్పారు.

ఇలాంటి అవకవతవకలకు సంబంధించిన విషయాలతో ఐసీఐసీఐ బ్యాంకు వార్తల్లో నిలవడం ఈ నెలలోనే ఇది రెండోసారి.

బ్యాంకు టార్గెట్లను పూర్తి చేసేందుకు బ్రాంచి మేనేజర్, సిబ్బంది కలిసి డిపాజిటర్లకు చెందిన వందల కోట్ల రూపాయలను కొన్నేళ్లుగా ఇతర ఖాతాలకు మోసపూరితంగా మళ్లిస్తున్నట్లు గుర్తించామని ఈ నెల మొదట్లో రాజస్థాన్‌ పోలీసులు తెలిపారు.

ఖాతాదారుల అకౌంట్ల నుంచి నగదు విత్‌డ్రా చేసి కొత్త కరెంట్, సేవింగ్స్ అకౌంట్లు తెరవడంతో పాటు ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేసేందుకు వినియోగించినట్లు పోలీసులు తెలిపారు.

ఆ కేసులో ఐసీఐసీఐ అధికార ప్రతినిధి మాట్లాడుతూ, బ్యాంకు వేగంగా స్పందించి సదరు మేనేజర్‌పై చర్యలు తీసుకుందని, అలాగే ఈ కేసులో ఖాతాదారులెవరూ తమ డబ్బులు పోగొట్టుకోలేదని చెప్పారు.

శర్మ విషయంలో ''మూడేళ్లుగా అకౌంట్‌‌కు సంబంధించిన లావాదేవీలు, బ్యాలెన్స్ గురించిన వివరాలు మూడేళ్లుగా ఆమెకు తెలియకపోవడం, ఇటీవల ఒక్కసారిగా ఆమెకు తెలియడం'' దిగ్భ్రాంతికి గురిచేస్తోందని ఆయన అన్నారు.

''ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రాంచ్ మేనేజర్ సస్పెండ్ అయ్యారు. దర్యాప్తు పెండింగ్‌లో ఉంది. మేం కూడా మోసపోయాం'' అన్నారాయన.

''మేం కూడా ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్‌కి ఫిర్యాదు చేశాం. పోలీసు విచారణ పూర్తయ్యే వరకూ చూడాలి. ఆమె ఆరోపణలు రుజువని తేలితే ఆమె డబ్బులు వడ్డీతో సహా తిరిగొస్తాయి. కాకపోతే దురదృష్టమేంటంటే, అప్పటి వరకూ ఆమె వేచిచూడాలి.''

ఈ వ్యవహారంలో సంబంధిత బ్యాంకు మేనేజర్‌ను బీబీసీ సంప్రదించలేకపోయింది.

వీడియో క్యాప్షన్, ఐసీఐసీఐ బ్యాంక్: 'బ్యాంకు మేనేజర్ నా అకౌంట్ నుంచి 16 కోట్లు కొట్టేశారు'

ఇవి కూడా చదవండి: