పీనట్ బటర్ ఆరోగ్యానికి మంచిదేనా? అందులో ఏం ఉంటుంది

ఫొటో సోర్స్, Getty Images
పీనట్ బటర్ అంటే చాలామందికి ఇష్టం. మంచి ప్రోటీన్ సోర్స్‌గా చెప్పే పీనట్ బెటర్ తినడం ఆరోగ్యకరమేనా?
పోషకాహార నిపుణులు ఏం చెప్తున్నారు?
పీనట్ బటర్‌లో ఏఏ పదార్థాలు ఉంటాయి? గుండెజబ్బులను నివారిస్తుందనడం నిజమేనా?
ఎంత మోతాదులో తినాలి.. ఎవరైనా తినొచ్చా?

ఫొటో సోర్స్, THINKSTOCK
పీనట్ బటర్ అంటే ఏమిటి? ఎలా తయారు చేస్తారు?
పీనట్ బటర్ అంటే వేరుశనగ పప్పుతో చేసే ఒక పదార్థం.
మార్కెట్లో దొరికే పీనట్ బటర్‌ను తయారు చేసేటప్పుడు మొదట వేరుశనగ గింజలను వేయించి కానీ, నీళ్లలో మరిగించి కానీ వాటిపైన ఉండే పొట్టు తీసేస్తారు.
తొక్క తీసేసిన తరువాత వేరుశనగ పప్పును పేస్ట్ చేస్తారు.
ఆ పేస్ట్‌కి రుచి, ఫ్లేవర్ తీసుకొచ్చేందుకు బటర్, చక్కెర, ఉప్పు, ఇతర పదార్థాలు కలుపుతారు.
వేరు శనగ పేస్ట్‌కు కలిపే ఇతర అన్ని పదార్థాల మోతాదు, పరిమాణం బట్టి రుచి, చిక్కదనం మారుతుంది.
స్మూత్‌గా ఉండేలా, క్రంచీగా ఉండేలా.. ఇలా వేర్వేరు రకాలుగా తయారు చేసి మార్కెట్లో అందుబాటులో ఉంచుతారు.

ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్(16 గ్రాములు)లో ఉండే పోషకాలు ఇవీ..
97 కిలో కేలరీల శక్తి
3.6 గ్రాముల ప్రోటీన్
8.3 గ్రాముల కొవ్వు పదార్థం
2 గ్రాముల సంతృప్త కొవ్వులు
2.1 గ్రాముల పిండిపదార్థం
1.1 గ్రాముల చక్కెరలు
1.1 గ్రాముల పీచుపదార్థం

ఫొటో సోర్స్, GETTY IMAGES
పీనట్ బటర్ తయారుచేసేటప్పుడు కొన్ని బ్రాండ్‌లు నూనె, చక్కెర లేదా జైలిటాల్, ఉప్పు వంటి పదార్థాలను కలుపుతాయి. ఈ పదార్థాలు, మోతాదు ఆధారంగా పీనట్ బటర్ పోషకాహార ప్రొఫైల్‌లో కొంత మార్పు ఉంటుంది.
కొన్నిట్లో చక్కెర అధికంగా ఉంటుంది, మరికొన్నిట్లో కొవ్వు పదార్థం తక్కువగా ఉంటుంది.
వీలైనంత ఎక్కువ వేరుశనగ ఉండేది చూసుకుని కొనుగోలు చేయాలి.

ఫొటో సోర్స్, Getty Images
పీనట్ బటర్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ..
సమృద్ధిగా పోషకాలు: వేరుశనగలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో పాటు మెగ్నీషియం, జింక్, ఐరన్, కాపర్ వంటి ఖనిజాలు ఉంటాయి. ఇ, బి గ్రూప్ విటమిన్‌లు ఉంటాయి.
సమతుల శక్తి వనరు: పీనట్స్‌లో మాంసకృత్తులు, పిండిపదార్థం, కొవ్వుపదార్థం ఉంటాయి. ఈ కారణంగా ఎక్కువ కేలరీల శక్తి అందుతుంది.
ఆరోగ్యకరమైన కొవ్వులు: ఓలెయిక్ యాసిడ్ వంటి మోనోఅన్‌సాచురేటెడ్ ఫ్యాట్ సహా ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాలుంటాయి. ఓలెయిక్ యాసిడ్ ఆలివ్ నూనెలోనూ ఉంటుంది. ఓలెయిక్ యాసిడ్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలుంటాయని వైద్యులు చెప్తారు. వయోజనులు ఒక రోజులో ఎంత మొత్తంలో కొవ్వు పదార్థాలు తీసుకోవాలో అందులో 10 శాతం మేర ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్‌లో లభిస్తుంది.
పుష్కలంగా పీచుపదార్థం: పీనట్ బటర్‌లో పీచుపదార్థం పుష్కలంగా ఉంటుంది. దీన్ని తయారుచేసేటప్పుడు వేరెశనగ పొట్టు కూడా తీయకుండా వాడితే పీచుపదార్థం మరింత ఎక్కువగా ఉంటుంది. పొట్టు తీయని వేరుశనగ వాడిన పీనట్ బటర్ అయితే ఒక టేబుల్ స్పూన్‌లో 1.3 గ్రాముల పీచుపదార్థం ఉంటుంది. అదే పొట్టు తీసిన వేరెశనగ వాడితే అలాంటి ఒక టేబుల్ స్పూన్ పీనట్ బటర్‌లో 0.98 గ్రాముల నుంచి 1.1 గ్రాముల పీచుపదార్థం ఉంటుంది.
కోఎంజైమ్ క్యూ10: వేరుశనగ పప్పు, దానిపై ఉండే పొట్టులో కోఎంజైమ్ క్యూ10 అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. చర్మం, మెదడు, ఊపిరితిత్తులు, గుండెకు ఇది మేలు చేస్తుంది. కరోనరీ ఆర్టరీ డిసీజెస్‌తో బాధపడేవారిలో ఆక్సిజన్ స్థాయి తగ్గే పరిస్థితుల్లో కోఎంజైమ్ క్యూ10 చాలా కీలకం.
ప్లాంట్ స్టానోల్స్, స్టెరోల్స్: వేరుశనగ పప్పులో, పీనట్ బటర్‌లో ప్లాంట్ స్టానోల్స్, స్టెరోల్స్ ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ ప్రభావం తగ్గించడంతో పాటు హృద్రోగ ముప్పును తగ్గిస్తాయి.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరైనా తినొచ్చా? ఎంత తినొచ్చు?
వేరుశనగ తింటే అలర్జీ బారినపడేవారు ఎవరైనా పీనట్ బటర్ కూడా తినకపోవడం మంచిది.
మిగతా ఎవరైనా ఇది తినొచ్చు. డయాబెటిస్ ఉన్నవారు మార్కెట్లో దొరికే పీనట్ బటర్‌లో చక్కెర మోతాదు చూసుకుని తినాలి.
రోజుకు ఒక రెండు టీస్పూన్ల పీనట్ బటర్ తినడం ఆరోగ్యానికి మంచిది.
ఇవి కూడా చదవండి:
- ఆకాశ్ దీప్: తండ్రి, అన్నను పోగొట్టుకున్నా పట్టు వదలకుండా శ్రమించి టీమిండియాకు ఎంపికైన క్రికెటర్ కథ
- యుక్రెయిన్‌తో యుద్ధంలో రష్యా తరఫున తెలంగాణ యువకులు పోరాడుతున్నారా? వారిని పంపించింది ఎవరు?
- రూ.2,800 కోట్ల జాక్‌పాట్ తగిలిన వ్యక్తికి డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించిన లాటరీ కంపెనీ
- స్మైల్ సర్జరీ తరువాత పెళ్లి కొడుకు మృతి.. అనస్తీషియా ఓవర్ డోస్ కావడంతో చనిపోయారా?
- ‘మత్తు, పెయిన్‌కిల్లర్స్ ఇవ్వకుండానే ఆపరేషన్లు, నొప్పి తట్టుకోలేక రోదిస్తున్న రోగులు’
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














