సీతాదేవి: రెండో పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారిన ఈ పిఠాపురం యువరాణి కథ ఏంటి?

సీతాదేవి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉయ్యూరు సంస్థానానికి చెందిన రాజా మేకా వెంకయ్యప్పారావును సీతాదేవి వివాహం చేసుకున్నారు.
    • రచయిత, శంకర్ వడిశెట్టి, జై శుక్లా
    • హోదా, బీబీసీ కోసం

ఒకనాడు ఆంధ్రప్రదేశ్‌లో అనేక సంస్థానాలు ఉండేవి. నేటి కాకినాడ జిల్లాలోని పిఠాపురం వాటిలో ఒకటి. కాకినాడలోని పిఠాపురం రాజా కాలేజీ, పిఠాపురంలోని రాజా రావు భావయమ్మా రావు జూనియర్ కాలేజి వంటివి ఆనాటి సంస్థానపు ఆనవాళ్లు.

పిఠాపురం రాజా కుటుంబం నుంచి ఉయ్యూరు సంస్థానంలో అడుగుపెట్టిన ఓ యువరాణి ఆ తర్వాత బరోడా సంస్థానాధీశుడిని పెళ్లి చేసుకున్నారు.

తన రెండో పెళ్లికి మత నిబంధనలు అడ్డురావడంతో ఆమె ఇస్లాం మతంలోకి మారారు. పెళ్లి చేసుకున్నాక మళ్లీ హిందువుగా మారారు. 80 ఏళ్ల కిందటి రాణి సీతాదేవి ప్రేమ, పెళ్లి వ్యవహారాలు చాలా ఆసక్తిని కలిగిస్తాయి.

ర్యాలీ ప్రసాద్ అనే రచయిత ‘పిఠాపురం చరిత్ర’ అనే పుస్తకాన్ని రాశారు. ఆ పుస్తకంలో ‘రాణి సీతాదేవీ’ సంబంధించిన వివరాల ప్రకారం..

బరోడాకు చెందిన మహారాజా ప్రతాప్‌సింగ్ గైక్వాడ్ ఆనాటికి దేశంలోనే అత్యంత ధనవంతుల్లో ఒకరు. ఆయన విలాసవంతమైన జీవితం గడుపుతుండేవారు. ఆయనకు గుర్రపు పందేల మీద విపరీతమైన ఆసక్తి ఉండేది.

అలా మద్రాసులో అడుగుపెట్టిన ప్రతాప్ సింగ్‌ గుర్రపు పందేల క్లబ్బు వద్ద రాణి సీతాదేవిని చూశారు. తొలిచూపులోనే ఆమె అందానికి మైమరిచిపోయారు.

ఉయ్యూరు సంస్థానానికి చెందిన రాజా మేకా వెంకయ్యప్పారావును అప్పటికే సీతాదేవి వివాహం చేసుకున్నారు. 1935లో వారికి వివాహం జరిగింది. ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఉయ్యూరు రాజాతో కలిసి సీతాదేవీ రేసులకు హాజరయ్యేవారు.

సీతాదేవికి పెళ్లి అయి ఏడేళ్లయినా ఆమెను వివాహం చేసుకోవడానికి ప్రతాప్‌సింగ్ సిద్ధం కావడం వారి ప్రేమ కథలో ఆసక్తికర అంశమయ్యింది. ప్రతాప్ సింగ్‌కు కూడా అప్పటికే మరొకరితో పెళ్లయ్యింది.

"సీతాదేవి అందంగా ఉంటారు, ఆమె అందానికి మహారాజు మైమరిచిపోయారు. సీతాదేవి కూడా మహారాజు ప్రతాప్ సింగ్ వ్యక్తిత్వానికి ఆకర్షితులై ఇద్దరూ వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు" అని అని గైక్వాడ్ కుటుంబ సభ్యుడు, ప్రతాప్ సింగ్ రావ్ గైక్వాడ్ మేనల్లుడు జితేంద్ర సింగ్ గైక్వాడ్ బీబీసీతో చెప్పారు.

ప్రతాప్‌సింగ్ గైక్వాడ్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతాప్‌సింగ్ గైక్వాడ్‌తో పెళ్లికి రాణీ సీతాదేవి కూడా అంగీకరించినప్పటికీ వివాహానికి నిబంధనలు అడ్డువచ్చాయి.

నిబంధనలు అడ్డు..

బరోడా రాజు ప్రతాప్‌సింగ్ గైక్వాడ్‌తో పెళ్లికి రాణీ సీతాదేవి కూడా అంగీకరించినప్పటికీ వారి వివాహానికి నిబంధనలు అడ్డురావడంతో కొంత సందిగ్ధత ఏర్పడింది. ముఖ్యంగా బరోడా సంస్థానం కట్టుబాట్లను అనుసరించి మహారాజా కుటుంబంలో రెండో వివాహానికి అవకాశం లేదు. అప్పటికే సీతాదేవి తొలి వివాహం చేసుకుని ఉండటం కూడా వివాహానికి మరో అడ్డంకిగా మారింది.

ఈ నిబంధనలు అధిగమించి తమ వివాహానికి ఆటంకాలు తొలిగించుకోవాలని ప్రతాప్‌సింగ్ గైక్వాడ్‌, సీతాదేవి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించారు.

బరోడా సంస్థానంలో న్యాయ నిపుణుల సలహాతో మత మార్పిడికి సిద్ధమయ్యారు.

మతం మారితే బరోడాలో అమలవుతున్న హిందూ వివాహ చట్టం పరిధి నుంచి తప్పించుకోవచ్చని భావించారు. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు.

ప్రతాప్‌సింగ్ గైక్వాడ్‌, సీతాదేవీ, వారి కుమారుడు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సీతాదేవీ హిందూమతాన్ని స్వీకరించి, 1943లో ప్రతాప్‌సింగ్ గైక్వాడ్‌ ని వివాహం చేసుకున్నారు .

మతం మారి పెళ్లి చేసుకుని..

ఇటు రాణీ సీతాదేవి ఇస్లాం మతం స్వీకరించి, దాని ప్రకారం ఉయ్యూరు రాజా నుంచి విడాకులు తీసుకున్నారు.

ఆ తర్వాత మళ్లీ హిందూమతాన్ని స్వీకరించి, 1943లో ప్రతాప్‌సింగ్ గైక్వాడ్‌ ని వివాహం చేసుకున్నారామె.

ఆ వివాహం విషయమై అప్పట్లో బ్రిటీష్ వైస్రాయ్ నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే చట్ట ప్రకారం తొలి వివాహం రద్దు చేసుకున్న తర్వాత ఆమెకు రెండో వివాహానికి అడ్డంకులుండవని, ఇక రెండో వివాహం నిషేధం చట్టంపై స్పందిస్తూ.. రాజ్యంలోని చట్టాలకు రాజుకు మినహాయింపు ఉంటుందని వాదించారు.

ఇక రాజ్యానికి వారసుడు గైక్వాడ్ మొదటి భార్య శాంతాదేవి కొడుకే అవుతాడనే షరతుపై వివాహాన్ని వైస్రాయ్ గుర్తించారు.

అయితే అప్పట్లో సీతాదేవిని మహారాణిగా గుర్తించేందుకు బ్రిటీష్ ప్రభుత్వం అంగీకరించలేదు. ఆమెను రాజ్యంలోని మహారాణులను ప్రోటోకాల్ ప్రకారం పిలిచే ‘హర్ హైనెస్’ గా సంబోధించకూడదని నిర్ణయించారు.

అయితే సీతాదేవి రాకతో రాజకుటుంబంలో గందరగోళం నెలకొంది. ప్రతాప్‌సింహారావు మొదటి భార్య శాంతాదేవితో సీతాదేవికి పొసగలేదని చెబుతారు.

సీతాదేవీ దంపతులు

ఫొటో సోర్స్, GETTY IMAGES

గైక్వాడ్ కుటుంబంపై పరిశోధన చేసిన చంద్రశేఖర్ పాటిల్ బీబీసీతో మాట్లాడుతూ "ఇద్దరు రాణులు విడివిడిగా నివసించారు, శాంతాదేవి లక్ష్మీవిలాస్ ప్యాలెస్‌లో, సీతాదేవి మకరపుర ప్యాలెస్‌లో ఉన్నారు." అని అన్నారు.

1945లో వారికి వారసుడు శాయాజీరావు గైక్వాడ్ జన్మించారు. అదే సంవత్సరంలో ఆమె మొనాకోలోని మాంటీకార్లోకి వలస వెళ్లారు. అప్పటికే మాంటీకార్లో నగరం విలాసవంతమైన జీవితాలకు, కాసినో సహా అనేక జూద క్రీడలకు కేంద్రంగా ఉండేది.

రేసు గుర్రాలు సహా వివిధ పందేలకు అలవాటు పడిన రాణీ సీతాదేవి తన భర్తతో కలిసి మాంటీకార్లో సిటీకి వెళ్లారు. ఇక దేశానికి స్వాతంత్య్రం రావడం, సంస్థానాలను భారత ప్రభుత్వం విలీనం చేసుకోవడంతో ఆమె అక్కడే స్థిరపడ్డారు.

దేశానికి స్వాతంత్ర్యం రావడానికి ముందే బరోడా సంస్థానం నుంచి భారీగా డబ్బు, నగలు, ఆభరణాలు వంటివి రాణీ సీతాదేవి తనతో పాటు తీసుకెళ్లారు. మాంటీకార్లోకు తరలించిన ఆభరణాల్లో 4 ముత్యాల తివాచీలు, ప్రసిద్ధ బరోడా ముత్యాలతో తయారు చేసిన 7-తీగల నెక్లెస్, విలువైన వజ్రాలున్నాయి.

రెండో ప్రపంచయుద్ధం ముగిసిన తర్వాత వివిధ దేశాల్లో పర్యటించిన ఆ జంట రెండుసార్లు అమెరికా కూడా వెళ్లారు. ఆ సమయంలో పెద్దమొత్తంలో ఖర్చు చేసినట్టు చెబుతారు. తమ విలాసమైన జీవన ఖర్చుల కోసం బరోడా సంస్థాన భాండాగారం నుంచి రుణం కూడా తీసుకున్నట్లు చెబుతారు.

అమెరికా పర్యటనల కోసమే 10 మిలియన్ల డాలర్లు ఖర్చు (ఇప్పటి కరెన్సీలో సుమారు రూ.8.30 కోట్లు ) చేసినట్లు చరిత్రలో ప్రస్తావించారు.

బరోడా సంస్థానం నుంచి తీసుకున్న అప్పులకు గానూ భారతదేశంలో విలీనం తర్వాత కేంద్ర ప్రభుత్వం చెల్లించిన రాజాభరణం నుంచి 8 మిలియన్ అమెరికన్ డాలర్లు (నేటి కరెన్సీలో సుమారు రూ. 6.5 కోట్లు )మినహాయించుకున్నట్టు చెబుతారు.

బరోడా సంస్థానం

ఫొటో సోర్స్, Getty Images

మహారాజు నుంచి విడాకులు..

మొనాకోలో స్థిరపడి, అక్కడి విలాసవంతమైన జీవితం గడుపుతున్న మహారాజా ప్రతాప్‌సింగ్ గైక్వాడ్‌ను 1951లో భారత ప్రభుత్వం సంస్థానాధిపతి హోదాను తొలగించింది.

కేంద్ర ప్రభుత్వం నుంచి అందుతున్న రాయితీలు ఆయన మొదటి భార్య సంతానానికి దక్కుతాయంటూ ఆదేశాలు ఇచ్చింది. దాంతో ప్రతాప్ సింగ్ తిరిగి ఇండియాకు రావడానికి సిద్ధపడటంతో రాణి సీతాదేవితో విభేదాలు వచ్చాయి.

చివరకు 1956లో ప్రతాప్ సింగ్ గైక్వాడ్ తో సీతాదేవి విడాకులు తీసుకున్నారు. భారత ప్రభుత్వానికి దక్కాల్సిన విలువైన వజ్రాలు, ఆభరణాలను ఆమె మొనాకోకు తరలించడం వల్ల ఆమె ఇండియాకు రావడంపై మీద ఆంక్షలు పెట్టారు.

సీతాదేవీ

ఫొటో సోర్స్, Getty Images

పైలట్ తలకు తుపాకీ గురిపెట్టి..

ఆభరణాలు, ఫ్యాషన్ నిపుణుడు, రచయిత మైలాన్ విల్సన్ తన పుస్తకం 'వాన్ క్లీఫ్ & అర్పెల్స్: ట్రెజర్స్ అండ్ లెజెండ్స్'లో కొన్ని ఆసక్తికర విషయాలు పేర్కొన్నారు. మైలాన్ పాతకాలపు ఆభరణాలపై విస్తృతమైన పరిశోధనలు చేసి దాని చరిత్ర గురించి విస్తృతంగా రాశారు.

"డకోటా విమానం వడోదరలోని విమానాశ్రయం రన్‌వేపై నిలబడి ఉంది. ఇది గత రెండు రోజులుగా అక్కడే ఉంది. కొన్ని మోటర్‌కార్లు చాలా లగేజీలతో వచ్చాయి. ఈ విమానం పైలట్ అమెరికన్. స్వాతంత్య్రానికి రెండేళ్ల ముందు తమ రాజ్యాలు, సంస్థానాలు ఇక ఉండవని మహారాజులకు అర్థమైంది. అందుకే వారి ఆస్తుల్లో కొన్నింటిని విక్రయించాల్సి వచ్చింది.

ఈ అమెరికన్ పైలట్ రెండేళ్ల క్రితం బ్రిటిష్ ఆర్మీ నుంచి ఈ డకోటా విమానాన్ని కొనుగోలు చేసి ఇక్కడకు తీసుకువచ్చారు. కొన్ని మార్పుల తరువాత, సామగ్రి, ప్రయాణీకులను తీసుకెళ్లడానికి అనుమతి పొందారు.

పైలట్ చూస్తుండగా రన్ వే వద్ద ఒక రోల్స్ రాయిస్ కారు వచ్చింది. అందులో సీతాదేవీ బయటికి వచ్చారు. విమానంలో సామగ్రి నింపిన తర్వాత, ఆమె కాక్‌పిట్ వెనుక కూర్చున్నారు. ఆమెతో పాటు మరో ఇద్దరు మహిళలు ఉన్నారు.

ఏం జరుగుతుందో పైలట్‌కి అర్థమైంది. అందుకే ఆ మహిళను 'సామానులో ఏముందో నాకు తెలుసు, ఇప్పుడు రవాణా ఖర్చు ఎక్కువ అవుతుంది' అని చెప్పాడు.

సీతాదేవీ ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. బహుశా ఇలాంటివి జరుగుతాయని ఆమెకు తెలుసు. వెంటనే ఆమె పర్సులోంచి రివాల్వర్ తీసి పైలట్ వైపు పెట్టారు. పైలట్ అర్థం చేసుకుని విమానాన్ని యూరప్‌ తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు.’’ అని రాశారు.

వారి వద్ద 56 పెట్టెలు ఉన్నాయి. వడోదర రాజ ఖజానాలో విలువైన భాగమది.

మహారాణి సీతా దేవి పారిస్‌లో తన నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఆమె తన విశ్వాసులలో కొందరికి ఈ కథ చెప్పారు. ఎవరైనా ఇంత ధైర్యంగా దీన్ని ఎలా చేయగలరని కొందరు నమ్మలేకపోయారు. అయితే ఈ సీతాదేవికి వేటాడటమూ సరదా అని చాలాతక్కువ మందికి తెలుసు.

ముత్యాల కార్పెట్

ఫొటో సోర్స్, Getty Images

'వాన్ క్లీఫ్ & అర్పెల్స్ : ట్రెజర్స్ అండ్ లెజెండ్స్' అనే పుస్తకంలో సీతాదేవికి ముత్యాల హారం ఉండేదనీ రాశారు.

ఈ ముత్యాలు ఎర్ర సముద్రం నుంచి లభించిన అరుదైన ముత్యాలుగా తెలిపారు. ఈ ముత్యాల హారం విలువ అప్పట్లో 5,99,200 డాలర్లు.

ఆమె దగ్గర 50,400 డాలర్ల విలువ చేసే మరో రెండు నెక్లెస్‌లు కూడా ఉన్నాయి. 33,600 డాలర్లు విలువ చేసే ఒక విలువైన ముత్యంతో కూడిన ఉంగరం కూడా ఉంది.

సీతాదేవీ ఆభరణాలు

ఫొటో సోర్స్, WWW.VANCLEEFARPELS.COM

తమ వద్దనున్న ఆభరణాలు, నగలు అమ్ముకుంటూ విదేశాల్లోనే జీవించారు సీతాదేవీ. 1956లో సీతాదేవి దగ్గర కొనుగోలు చేసిన ఆభరణాలతో హ్యారీ విన్ స్టన్ చేసిన నెక్లెస్‌ను 1957లో వాలిస్ సింప్సన్ కొనుగోలు చేసినట్టు కూడా కథనాలున్నాయి.

శాయాజీరావు గైక్వాడ్ మాత్రం తల్లితోనే ఉన్నారు. 1985లో కొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో బాగా కుంగిపోయారు సీతాదేవి. 1989 ఫిబ్రవరి 15న ఆమె మరణించారు.

పిఠాపురం రాజా సర్కిల్

ఫొటో సోర్స్, Lakshman

ఆస్తులు అక్క కూతురికి..

దేశంలోనే అత్యంత విలాసవంతమైన జీవనం గడిపిన మహారాణిగా ఆమెను చరిత్రకారులు పేర్కొన్నారు. అత్యంత సౌందర్యవతి అని కూడా కీర్తించారు.

పిఠాపురం సంస్థానంలో రావు వెంకట కుమార మహాపతి సూర్యారావు, చిన్నమాంబదేవికి మూడో కుమార్తెగా 1917 మే 2న సీతాదేవి జన్మించారు. సుమారు 73 ఏళ్లు జీవించారు.

"వారికి అప్పట్లోనే సొంతంగా ఎయిర్ జెట్ ఉండేది. విలువైన సంపదకు వారసురాలు కావడంతో ఖర్చులకు వెనుకాడలేదు. వివిధ దేశాల్లో పందేలకు వెళ్లేవారు. చివరకు ఆమె భారతదేశం వచ్చేందుకు అవకాశం లేకపోవడంతో బంధువులను కలిసేందుకు కొలంబో వెళ్లేవారు. ఆ తర్వాత లండన్ వెళ్లిపోయేవారు. ఆమె మరణించిన తర్వాత తన ఆస్తిని అక్క కూతురు అనంగ రేఖాదేవికి అప్పగించారు. ఇంతటి విలాసజీవితం గడిపిన వ్యక్తులు బహుశా దేశ చరిత్రలో మరొకరు ఉండరు" అంటూ పిఠాపురం చరిత్ర పుస్తక రచయిత , కవి ర్యాలి ప్రసాద్ అన్నారు.

సీతాదేవి చరిత్రను అటు బరోడాతో పాటుగా దేశమంతా కథలు కథలుగా చెప్పుకున్నారని ఆయన బీబీసీతో అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)