ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం: 10 వేల మంది హమాస్ ఫైటర్లను చంపామని ఇజ్రాయెల్ ప్రకటన... బీబీసీ వెరిఫైలో తేలిందేంటి?

గాజా

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మెర్లిన్ థామస్, జేక్ హోర్టన్
    • హోదా, బీబీసీ వెరిఫై

గాజాలో 30 వేలకు పైగా పాలస్తీనియన్లు మరణించారు. చనిపోతున్న పౌరుల సంఖ్య పెరుగుతుండటంతో ఇజ్రాయెల్‌ నిరసనలనూ ఎదుర్కొంటోంది. పాలస్తీనా నుంచి హమాస్‌ను తొలగిస్తామని అక్టోబర్ 7 తర్వాత చేసిన ప్రకటనను నిజం చేసే క్రమంలో ఒత్తిడిని సైతం ఎదుర్కొంటోంది. ఇప్పటివరకు మరణించిన హమాస్ ఫైటర్ల సంఖ్యపై బీబీసీ వెరిఫై బృందం సమీక్ష జరిపింది.

వైమానిక దాడులు, గ్రౌండ్ ఆపరేషన్లలో 10,000 మందికి పైగా హమాస్ ఫైటర్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.

హమాస్ ఫైటర్లు, వారి మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడానికి కచ్చితంగా ప్రయత్నిస్తున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) చెబుతూనే, పౌర మరణాలను తగ్గించే ప్రయత్నం చేస్తోంది. ఇదే క్రమంలో తమ వ్యూహాలనూ సమర్థించుకుంటోంది.

ఒకవైపు హమాస్ తన ఫైటర్ల మరణాలకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటనా చేయడంలేదు.

ఇదే సమయంలో 6,000 మంది ఫైటర్లు మరణించారని ఒక హమాస్ అధికారి అంగీకరించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది, అయితే ఈ సంఖ్యను ఖండిస్తున్నట్లు బీబీసీతో హమాస్ తెలిపింది.

గాజా హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖను ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్వసనీయంగా పరిగణిస్తుంటుంది.

అయితే, చనిపోయిన వారిలో ఎంతమంది పౌరులు, ఫైటర్లున్నారనే విషయాన్ని ఆ సంస్థ ఇప్పటివరకు అధికారికంగా చెప్పలేదు.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చనిపోయిన వారిలో కనీసం 70 శాతం మంది మహిళలు, పిల్లలున్నట్లు ఆ గణాంకాలు చూపిస్తున్నాయి.

హమాస్ ఫైటర్లు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాజాలో పరేడ్ చేస్తున్న హమాస్ ఫైటర్లు (ఫైల్)

ఐడీఎఫ్ చానల్స్ ఏం చెబుతున్నాయి...

హమాస్ ఫైటర్ మరణాలను లెక్కించిన పద్దతులను వివరించాలని ఐడీఎఫ్‌ను బీబీసీ వెరిఫై చాలాసార్లు కోరింది, కానీ వారు స్పందించలేదు.

దీంతో ఐడీఎఫ్‌ పత్రికా ప్రకటనలు, దాని సోషల్ మీడియా ఛానెల్‌లలో ఫైటర్ల హత్యకు సంబంధించిన వివరాలను బీబీసీ పరిశీలించింది.

12,000 మంది హమాస్ ఫైటర్లు మరణించినట్లు ఐడీఎఫ్‌ ప్రకటించిందని ఫిబ్రవరి 19న 'ది టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్' వార్తాసంస్థ తెలిపింది.

మేం ఆ సంఖ్యను ఐడీఎఫ్‌ ముందుంచాం. వారు స్పందిస్తూ ఒకసారి 'సుమారు 10,000' అని, మరోసారి 'పదివేల కంటే ఎక్కువ' అని చెప్పారు.

గాజాలో మూడింట రెండొంతుల హమాస్ పోరాట స్థావరాలను నాశనం చేశామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు జనవరి మధ్యలో ప్రకటించారు. అయితే మరణించిన ఫైటర్ల సంఖ్యను ఆయన చెప్పలేదు.

యుద్ధానికి ముందు గాజాలో దాదాపు 30,000 మంది హమాస్ ఫైటర్లున్నట్లు ఐడీఎఫ్ అంచనా.

ప్రతి హమాస్ ఫైటర్‌ను చంపే ప్రక్రియలో ఇద్దరు పౌరులు బలవుతున్నారనే అంచనాలు యుద్దభూమిలో ఎదుర్కొంటున్న సవాళ్ల దృష్ట్యా అత్యంత సానుకూలమేనంటూ ఐడీఎఫ్‌ డిసెంబరులో అభిప్రాయపడింది.

1,000 మంది టెర్రరిస్టులను తమ డివిజన్ ఫోర్సెస్ చంపేశాయని నవంబర్ 14న ఐడీఎఫ్ తన టెలిగ్రామ్‌ ఛానెల్లో తెలిపింది.

అదే సమయంలో ఆరోగ్య మంత్రిత్వ శాఖ 11,320 మరణాలను రిపోర్టు చేసింది.

అక్టోబర్ 7 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఐడీఎఫ్‌ యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసిన మొత్తం 280 వీడియోలను 'బీబీసీ వెరిఫై' బృందం సమీక్షించింది.

అందులో పెద్ద సంఖ్యలో ఫైటర్లను చంపేసినట్లుగా చెబుతున్న విజువల్ ఎవిడెన్స్ (ఫోటో, వీడియో సాక్ష్యం) చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి.

వీటిలో ఒకటి డిసెంబర్ 13న పోస్ట్ చేశారు. దానిలో పలువురి మృతదేహాలను చూపించారు. కొన్ని ఇతర వీడియోలు ఫైటర్లపై కాల్పులు జరుపుతున్నట్లు చూపాయి.

టెలిగ్రామ్‌లోని తన ప్రధాన ఛానెల్‌లో ఐడీఎఫ్, హమాస్ మృతులపై పోస్టులు పెడుతుంటుంది. దీంతో మేం వాటి ఆధారంగా హమాస్ ఫైటర్ల మృతుల సంఖ్యను లెక్కించడానికి ప్రయత్నించాం.

ఫైటర్లను చంపినట్లు ఐడీఎఫ్ క్లెయిమ్ చేసిన 160 పోస్టులను కనుగొన్నాం, అందులో మొత్తం మరణాలు 714 గా ఉన్నాయి.

అదే సందర్భంలో డజన్లు, వందల మందిని చంపినట్లుగా ఉన్న పోస్టులు మరో 247 ఉన్నాయి. అయితే, వాటి ద్వారా మృతుల సంఖ్యను వెరిఫై చేయడం అసాధ్యం.

గాజా సిటీ మ్యాప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గాజా నగరం ఏరియల్ మ్యాప్ (2023 ఫిబ్రవరి, 2024 ఫిబ్రవరి)

మరణించింది పౌరులా, ఫైటర్‌లా?

యుద్ధ ప్రాంతాల్లో మృతుల గణనలో ఇబ్బందులు ఉంటాయి. ఇక, గాజాలో అయితే, చాలామంది ఫైటర్లు పౌర దుస్తులనే ధరిస్తారు.

వాళ్లు చాలావరకు భూగర్భంలోని సొరంగాల్లోనే ఉంటారు. కానీ, ఇక్కడ, వైమానిక దాడుల కారణంగా చనిపోయిన వారే ఎక్కువున్నారు.

గాజాలో ఐడీఎఫ్ ఆపరేషన్ ప్రారంభమైనప్పటి నుంచి హమాస్ అక్కడి పౌరులను మానవ కవచాలుగా ఉపయోగిస్తోందని సైన్యం ఆరోపించింది.

కానీ హమాస్ ఆధ్వర్యంలోని భూభాగంలో ఉన్న మిగతావారిని కూడా ఐడీఎఫ్ ఫైటర్లుగా పరిగణించవచ్చని కొంతమంది నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

''హమాస్‌తో సంబంధం ఉన్న ఏ సివిల్ సర్వెంట్ లేదా అడ్మినిస్ట్రేటర్ అయినా కూడా వారిని ఆ సంస్థలో భాగంగానే ఇజ్రాయెల్ పరిగణిస్తుంది'' అని కింగ్స్ కాలేజ్ లండన్‌లోని సెక్యూరిటీ స్టడీస్‌లో సీనియర్ లెక్చరర్ ఆండ్రియాస్ క్రీగ్ తెలిపారు.

మునుపటి యుద్ధాలతో పోలిస్తే ఈ ఘర్షణలో చనిపోయిన వారిలో మహిళలు, పిల్లల నిష్పత్తి గణనీయంగా పెరిగిందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెబుతున్నాయి.

ఇది ఎక్కువ మరణాల రేటును సూచిస్తోందని 'ఎవ్రీ క్యాజువాలిటీ కౌంట్స్' ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాచెల్ టేలర్ అంటున్నారు.

యూకేకు సంబంధించిన ఈ సంస్థ హింసాత్మక సంఘర్షణల్లో బాధితుల వివరాలను సేకరిస్తుంటుంది.

గాజా జనాభాలో దాదాపు సగం మంది 18 ఏళ్లలోపు వారుండగా, యుద్ధంలో మరణించిన వారిలో 43 శాతం మంది పిల్లలున్నారు. జనాభా ఆధారంగా అక్కడి మరణాలు పరిశీలిస్తే విచక్షణారహిత హత్యలు జరిగినట్లు సూచిస్తోందని టేలర్ అభిప్రాయపడ్డారు.

2014లో చనిపోయిన పురుషుల్లో 'పోరాడే వయసు' గల వారు ఎక్కువగా ఉన్నారని, కానీ, తాజా సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తోందని ఆమె తెలిపారు.

ఘర్షణ ప్రారంభమైనప్పటి నుంచి రోజుకు సగటున 200 మందికి పైగా మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా సూచిస్తుంది.

గాజా

ఫొటో సోర్స్, REUTERS

ఇకపై గణాంకాలు కష్టమే..

కాగా, అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్యలో చాలా మరణాలు నమోదయ్యాయి, ఆ తర్వాత తగ్గిపోయాయి. అయితే, గాజాలో మరణాలు నమోదు చేసే ఆసుపత్రులు ఇకపై ఎక్కువగా పనిచేయనందున, మృతుల వాస్తవ సంఖ్య చాలా ఎక్కువగా ఉండొచ్చని బీబీసీకి నిపుణులు తెలిపారు.

ఈ మృతుల గణాంకాలు కూడా సైనిక దాడుల కారణంగా వచ్చేవే. ఇవి ఆకలి లేదా వ్యాధుల మరణాలు కావు.

ఇజ్రాయెల్, గాజాల మధ్య గతంలో జరిగిన ఘర్షణల కంటే ప్రస్తుత యుద్ధం చాలా ఘోరమైనదని జెరూసలేంకు చెందిన మానవ హక్కుల సంస్థ బీట్సెలెమ్ పేర్కొంది.

"గాజా, ఇతర భూభాగాలలో గతంలో జరిగిన యుద్ధాలలో చనిపోయిన వారి సంఖ్య కంటే ఇది చాలా ఎక్కువ" అని సంస్థ ప్రతినిధి డ్రార్ సాడోట్ అన్నారు.

మరణాల సంఖ్యను పరిశీలిస్తే యుద్ధం ప్రారంభ రోజులలో ఐడీఎఫ్ ప్రతినిధి చెప్పిన ''గరిష్ట నష్టాన్ని కలిగించే వాటిపై దృష్టి సారించాం" అనే విధానాన్ని వివరిస్తుందని సాడోట్ గుర్తుచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)