స్కిన్ డొనేషన్: కిడ్నీ, లివర్‌లాగే చర్మాన్నీ కూడా దానం చేయవచ్చని తెలుసా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, సుశీలా సింగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
డిసెంబర్ 11, 2023, సాయంత్రం వేళ..భోపాల్‌లోని కరోండా ప్రాంతంలో ఏడేళ్ళ చిత్రాన్ష్ మేడపైన ఆడుకుంటున్నాడు. మేడ పక్కన హైటెన్షన్ విద్యుత్ తీగలు ఉన్నాయి. ఆ పక్కనే చిత్రాన్ష్ తల్లి బట్టలు ఆరేస్తున్నారు.
హఠాత్తుగా ఓ పెద్ద పేలుడు శబ్ధంలా వినిపించడంతో ఆమె వెనక్కి తిరిగి అక్కడి దృశ్యాన్ని చూసి హడలిపోయారు. ఇరుగురు పొరుగువారి సాయంతో చిత్రాన్ష్‌ను ఆస్పత్రికి తీసుకువెళ్ళారు.
‘‘మేం అంతకు ముందురోజే ఇల్లు మారాం. మేడపైన మా అబ్బాయి ఇనుపరాడ్ ఎగరేస్తూ ఆడుకుంటున్నాడు. అది వెళ్ళి హైటెన్షన్ వైర్‌ను తాకడంతో మంటలు రేగి, మా అబ్బాయి శరీరాన్ని కూడా కాల్చేశాయి’’ అని చిత్రాన్ష్ తండ్రి గజేంద్ర దంగీ చెప్పారు.
‘‘మా బిడ్డను అటువంటి స్థితిలో చూసి, నాకు నా భార్యకు నోట మాటరాలేదు’’ అని ఆయన గుర్తు చేసుకున్నారు.
‘‘ఈ పిల్లాడు వచ్చిన్నప్పుడు 60 శాతం గాయాలతో ఉన్నాడు. కేవలం ఆ చిన్నారి వీపు, కాళ్ళు మాత్రమే కాదు, ఒంట్లో చాలా భాగం కాలింది. చాలా రోజులపాటు ఆ అబ్బాయికి వెంటిలేటర్‌పై చికిత్స అందించాం’’ అని కాస్మోటిక్, ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ సునీల్ రాథోర్ చెప్పారు.

తండ్రి నుంచి చర్మం తీసుకుని..
‘‘మేం ముందు చిన్నారి చర్మాన్ని గ్రాఫ్ట్ చేశాం. కానీ అది సరిపోలేదు. చిన్నారి తండ్రికి కౌన్సెలింగ్ ఇచ్చాం. ఆయన కాలు నుంచి చర్మాన్ని సేకరించాం. దీనివల్ల మేం ఆ పిల్లాడి చేతుల్లో ఒకదానిని కాపాడగలిగాం. చిన్నారికి డ్రెస్సింగ్ ఇంకా కొనసాగుతోంది. అతని చేతులకు చర్మం అతుక్కునేలా చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. భవిష్యత్తులో ఆపరేషన్ అవసరం కావచ్చు’’ అని డాక్టర్ తెలిపారు.
‘‘సహజంగా చిన్నపిల్లల విషయంలో ఇలా జరిగినప్పుడు తల్లిదండ్రులు ప్రత్యేకించి తండ్రులు తమ చర్మాన్ని ఇవ్వడానికి ముందుకు వస్తారు. కానీ పెద్దవాళ్ళ విషయంలో మాత్రం చర్మాన్ని దానం చేయడానికి సంశయిస్తారు’’ అని అడాక్టర్ సునీల్ రాథోర్ చెప్పారు.
‘‘ఏదైనా సంఘటనలో కాలిన గాయాలకు గురైనవారు షాక్‌లోనూ, నొప్పిలోనూ ఉంటారు. అలాంటి సమయంలో వారి శరీరంలోనే మరో చోట నుంచి చర్మాన్ని తీయడమనేది వారిని మరింత వేదనకు గురిచేస్తుంది. ఇటువంటి పరిస్థితులలో బంధువులు, లేదా ఎవరైనా దాతలు ముందుకొచ్చి చర్మాన్ని దానం చేయాలి’’ అంటారు స్నేహా జావెల్. ఆమె గృహహింస నుంచి బయటపడిన కాలిన గాయాల బాధితురాలు.
తన శరీరం 40 శాతానికి పైగా కాలిపోయిందని, కానీ ఎవరూ చర్మదానం చేయడానికి ముందుకు రాలేదని ఆమె చెప్పారు. తన శరీంలోనే మరో చోటు నుంచి చర్మాన్ని సేకరించారని తెలిపారు. కానీ ఎవరైనా చర్మదానం చేసి ఉంటే తనకు రెండోసారి బాధపడాల్సిన పని ఉండేదికాదని, త్వరగా కోలుకోవడానికి అవకాశం చిక్కేదని తెలిపారు.
‘‘చర్మం అనేది అతిపెద్ద అవయవం. దానిని ఇన్షెక్షన్లు, వేడి, చల్లదనం నుంచి రక్షించుకోవాల్సి ఉంటుంది. శరీరంలోని ద్రవాలు బయటికి రాకుండా చర్మం రక్షణకవచంగా పనిచేస్తుందంటూ’’ నేషనల్ బర్న్న్ సెంటర్‌లో మెడికల్ డైరక్టర్, ప్లాస్టిక్ కాస్మెటిక్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ సునీల్ కేశ్వాని చర్మ దానం ప్రాముఖ్యాన్ని తెలిపారు.
ముంబాయిలో నివసించే కేశ్వాని ‘‘ చర్మం కాలితే, అది శరీరానికి రక్షణ కవచంలా ఎంత మాత్రం ఉండలేదు. బ్యాక్టీరియా ప్రవేశించి ఇన్ఫెక్షన్ వచ్చి మనిషి ప్రాణం పోతుంది. అందుకే చర్మదానం చేస్తే మనుషుల ప్రాణాలు కాపాడినవారమవుతాం’’ అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, SNEHA JAWALE
ఏటా 10 లక్షలమంది బాధితులు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం భారతదేశంలో ఏటా 10లక్షలమంది ప్రజలు కాలిన గాయాలకు గురవుతున్నారు.
ఈ గణాంకాల వంక చూస్తే చాలా కేసులు నమోదు కావడం లేదని తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది బాధితులు చిన్న చిన్న క్లినిక్‌లకు వెళుతుంటారు. అలాంటి పరిస్థితులలో కచ్చితంగా ఎంతమంది కాలిన గాయాలపాలవుతున్నారనే సంఖ్య తెలియదని సఫ్దర్ జంగ్ ఆస్పత్రిలో బర్న్ అండ్ ప్లాస్టిక్ విభాగాధిపతిగా ఉన్న డాక్టర్ శలభ్ కుమార్ తెలిపారు.
ఏటా 7 వేలమందికి పైగా కాలినగాయాల పేషెంట్లు ఆస్పత్రికి వస్తుంటారని, వీటిల్లో ఎక్కువమంది వంటింట్లో జరిగిన ప్రమాదాల్లో గాయపడినవారే అని తెలిపారు.
దీంతోపాటు ఫ్యాక్టరీలు, ఇతర ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలు, యాసిడ్ బాధితులు ఉంటారని చెప్పారు.
భారత్‌లో బతికున్నవారి నుంచి చర్మాన్ని సేకరించడం చట్టవిరుద్ధమని డాక్టర్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
స్కిన్ బ్యాంక్
‘‘ఇండియాలో స్కిన్ బ్యాంక్‌ల సంఖ్య చాలా తక్కువ. అవి అందుబాటులో లేని చోట ప్రజలు తమ చర్మాన్ని దానం చేయడం నేరం కాదు. అందుకే భోపాల్‌లో గజేంద్ర తన కుమారుడికి చర్మాన్ని ఇవ్వగలిగారు. అక్కడ స్కిన్ బ్యాంక్ లేదు’’ అని డాక్టర్ సునీల్ విశదీకరించారు.
కిందటినెలవరకు ఉన్న సమాచారాన్ని చూస్తే భారత్‌లో ఇప్పటిదాకా 27 స్కిన్ బ్యాంకులు ఉన్నట్టు తెలుస్తోందని చెప్పారు డాక్టర్ సునీల్ కేశ్వాని.
వీటిల్లో ఎక్కువ భాగం మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలలోనే ఉన్నాయి. ఉత్తర భారతంలో మొట్టమొదటిసారిగా దిల్లీలోని సఫ్దర్ జంగ్ హాస్పిటల్‌లో స్కిన్ బ్యాంక్ తెరిచారు. కానీ ఇప్పుడు ఇలాంటి బ్యాంకులు చాలా రాష్ట్రాలలో తెరుస్తున్నారు.
చర్మాన్ని ఎవరైనా దానం చేయవచ్చా?
- చనిపోయిన వారి చర్మాన్ని దానం చేయవచ్చు.
- మృతదేహాల నుంచి 6 నుంచి 8గంటల్లోగా చర్మాన్ని సేకరించాల్సి ఉంటుంది.
- చర్మదానం చేసే వ్యక్తి వయసు కనీసం 18 ఏళ్ళు ఉండాలి.
- చర్మదాతలకు ఎటువంటి చర్మసంబధిత వ్యాధులు ఉండకూడదు.
- నూరు సంవత్సరాల వయసున్నవారు కూడా చర్మదానం చేయవచ్చు.
- దాతలకు హెచ్ఐవీ, హెపటైటిస్ బీ, సీ లాంటి వ్యాధులు ఉండకూడదు.
బ్యాంకులలో చర్మాన్ని ఎలా భద్రపరుస్తారు?
గ్లైసరాల్ అనే రసాయనాన్ని ఉపయోగించి చర్మాన్ని భద్రపరుస్తారని డాక్టర్ సునీల్ కేశ్వాని, డాక్టర్ శలభ్ కుమార్ చెప్పారు. ఈ రసాయనంలో చర్మాన్ని 4 నుంచి 6 డిగ్రీల వేడిలో 45 రోజులపాటు ప్రాసెస్ చేస్తారు.
ఇలా ప్రాసెస్ చేసిన చర్మాన్ని అయిదేళ్ల వరకు నిల్వ చేయవచ్చు. కానీ డిమాండ్ కారణంగా చర్మాన్ని ఎక్కువ కాలం నిల్వ చేయలేకపోతున్నామని కేశ్వానీ తెలిపారు.
సహజంగా లివర్, కిడ్నీ లాంటి అవయవ మార్పిడిలో దాత, గ్రహీతల కణజాలాలు సరిపోలాల్సిన అవసరం ఉంటుంది. కానీ చర్మ మార్పిడిలో ఆ అవసరం లేదని డాక్టర్లు చెప్పారు.
దీనిని ప్లాస్టిక్ సర్జరీ అని కూడా పిలుస్తారని, కానీ ఇది అందం కోసం చేసే ది కాదని, ప్రాణాలు నిలిపేందుకు చేసే స్కిన్ గ్రాఫ్టింగ్ అని తెలిపారు.
చర్మదానం చేసినవారు నడిచేటప్పుడు కష్టంగా ఉంటుంది. చర్మాన్ని సేకరించిన చోట గాయం తగ్గడానికి 3 వారాలు పడుతుంది. రెండువారాలలో నొప్పి తగ్గిపోతుంది. తరువాత దైనందిన పనులు చేసుకోవచ్చు.

ప్రజలలో చైతన్యం అవసరం
చర్మదానం వల్ల కండరాలు, అవయవాలకు ఏమీ కాదని, ఎటువంటి శారీరక బలహీనత కూడా కలగదని డాక్టర్లు చెబుతున్నారు.
చర్మ దానంపై ప్రజలలో అవగాహన, చైతన్యం తక్కువగా ఉన్నందున ప్రభుత్వం జాతీయ ఆరోగ్య పథకంలో మార్పులు తేవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
కాలిన గాయాల బాధితులకు లక్షలాదిరూపాయలు ఖర్చు అవుతుందని, ప్రభుత్వం వీరికి సంబంధించిన ఫండ్స్‌ను పెంచాల్సిన అవసరం ఉందని డాక్టర్ సునీల్ కేశ్వాని చెప్పారు.
ప్రజలలో చర్మదానంపై చైతన్యం లేకపోవడం వల్లే తనకు ఎప్పుడూ కిడ్నీ, కన్ను, తదితర అవయవ దాతల కోసం ఫోన్లు వస్తాయే కానీ చర్మ దాతల కోసం ఎవరూ సంప్రదించడం లేదని దిల్లీ కేంద్రంగా పనిచేసే ఆర్గాన్ ఇండియాకు చెందిన డాక్టర్ సౌరభ్ శర్మ చెప్పారు. దీనికి సంబంధించిన సమాచారం ఇవ్వడం ద్వారా ఆయన ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు.
ఒకరి మృతదేహం 8మంది జీవితాలను కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థల సహాయంతో పాఠశాలలు, కళాశాలలు, సంస్థలలో చర్మదానంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ఇది ఎంతో మంది ప్రజల ప్రాణాలను కాపాడుతుంది.
ఇవి కూడా చదవండి:
- ఫిబ్రవరి 29: లీపు సంవత్సరం అంటే ఏమిటి? ఎలా లెక్కిస్తారు?
- భావప్రాప్తి: కొంతమంది మహిళలకు 'క్లైమాక్స్' అనుభూతి కలగకపోవడానికి 8 కారణాలు..
- ‘సైకాలజీ ఆఫ్ మనీ’: పొదుపు మంత్రంతో ఓ చిరుద్యోగి రిటైరయ్యేనాటికి కోట్లు ఎలా కూడబెట్టాడు.. మోర్గన్ హౌసెల్ ఇచ్చిన మెసేజ్ ఏంటి?
- గుడ్ టచ్, బ్యాడ్ టచ్: పిల్లలకు ఈ విషయం ఎలా చెప్పాలి, తల్లిదండ్రుల పాత్ర ఏంటి?
- శేషాచలం అడవుల్లో పోలీసులపై వాహనాలు ఎక్కిస్తున్న ఎర్ర చందనం స్మగ్లర్లు.. అలా ప్రాణాలు కోల్పోయిన ఓ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులు ఏమంటున్నారు?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














