మతిమరుపు సాధారణమేనా? ఎప్పుడు జాగ్రత్త పడాలి

గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు రాసి పెట్టుకుంటున్న వ్యక్తి

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అలెగ్జాండర్ ఈస్టన్
    • హోదా, ది కన్జర్వేషన్

దైనందిన జీవితంలో మతిమరుపు అనేది కాస్త బాధాకరమైన విషయమే. వృద్ధాప్యంలో ఇది కొంచెం భయంకరంగానే ఉంటుంది. కానీ, జ్ఞాపకశక్తికి సంబంధించి ఇది సాధారణ విషయం. కొత్త సమాచారాన్ని మన మెదడులోకి అనుమతించేందుకు ఇది సహకరిస్తుంది.

అయితే, ఏ స్థాయి వరకు మతిమరపు అనేది సాధారణం? అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు ఇటీవల జరిగినట్లు దేశాల పేర్లలో కన్‌ఫ్యూజన్‌కు గురికావడం సాధారణమేనా? దీనికి నిరూపణలు ఏం చెబుతున్నాయో చూద్దాం..

ఏదైనా విషయాన్ని మనం గుర్తుంచుకోవాలనుకున్నప్పుడు, దాన్ని మన మెదడు నేర్చుకుని(ఎన్‌కోడ్ చేసుకుని), దాన్ని సురక్షితంగా ఉంచుతుంది(భద్రపరుస్తుంది). అవసరమైనప్పుడు ఆ విషయం బయటికి వచ్చేలా చేస్తుంది. ఈ ప్రక్రియలో మతిమరపు అనేది ఏ సమయంలోనైనా రావొచ్చు.

తొలిసారి పెద్దమొత్తంలో సమాచారం మన బ్రెయిన్‌కు చేరినప్పుడు, ఆ సమాచారాన్నంతా ఒకేసారి ప్రాసెస్ చేయలేదు. దానికి బదులుగా, సమాచారాన్ని ఫిల్టర్ చేయడంపై మెదడు దృష్టి ఉంటుంది. దీంతో, ఏ సమాచారం ముఖ్యమో దాన్ని గుర్తించి, మెదడు ప్రాసెస్ చేస్తుంది.

మనం ఏదో విషయం గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నప్పుడు, డిన్నర్ పార్టీలో ఎవరైనా కనిపిస్తే వారి పేరు సడెన్‌గా మనకు గుర్తుకు రాదు. ఇది కచ్చితంగా మతిమరుపే. కానీ, ఇది సాధారణం.

బ్యాగులో వస్తువు కోసం వెతుకుతున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

రిహార్సల్స్ ప్రాధాన్యం ఎంత?

మన అలవాట్లు, విధానాలు అంటే.. మన తాళాలను ఎప్పుడూ ఒకటే చోట ఉంచడం వంటివి చేస్తే ఆ ప్రాంతాన్ని మనం ప్రత్యేకంగా గుర్తుకు చేసుకోవాల్సినవసరం ఉండదు. ఇలాంటి అలవాట్లతో మతిమరుపు అనే సమస్య నుంచి తప్పించుకోవచ్చు.

ఏదైనా విషయాన్ని జ్ఞాపకం ఉంచుకునేందుకు రిహార్సల్స్ అతి ముఖ్యమైనవి. ఒకవేళ మనం ప్రాక్టీస్ చేయకపోతే, ఏదైనా విషయాన్ని మర్చిపోతాం. ఎక్కువ సార్లు చెప్పినా లేదా రిహార్సల్స్ చేసినా ఆ విషయాన్ని దీర్ఘకాలం పాటు గుర్తుంచుకుంటాం.

జర్మన్ సైకాలజిస్ట్ హెర్మాన్ ఎబ్బింగ్‌హాస్ ప్రజలకు నాన్‌సెన్స్ సిలబల్‌ గురించి వివరించారు.

ఒక నిర్దిష్ట కాలంలో ఎన్ని విషయాలు వారు గుర్తుంచుకున్నారు అన్న విషయాన్ని ప్రజలెప్పుడూ అంతకముందు పరీక్షించుకోలేదు, వినలేదు.

రిహార్సల్స్ లేకపోతే, చాలా వరకు అంశాలు ఒకటి లేదా రెండు రోజుల్లో మర్చిపోతుంటామని ఈ జర్మన్ సైకాలజిస్ట్ నిరూపించారు. ఇది గుర్తుంచుకునే అంశాలకు, పరీక్షలకు సంబంధించిన విషయం.

ప్రజలు క్రమం తప్పకుండా ఒక విషయాన్ని రిహార్సల్ చేస్తే, ఆ విషయం ఒక రోజుకు మించి గుర్తుంచుకునే అవకాశం పెరుగుతుంది.

అయితే, ఈ పద్ధతి వల్ల దైనందిన జీవితంలోని కొన్ని ఇతర విషయాలను మర్చిపోయే ప్రమాదం కూడా ఉంటుంది.

సూపర్‌మార్కెట్‌కు వెళ్లినప్పుడు, కారును ఎక్కడ పార్క్‌ చేశామో మన మెదడులో కోడ్ చేసుకుంటాం. ఆ తర్వాత సూపర్ మార్కెట్లోకి వెళ్లినప్పుడు, మనం గుర్తుంచుకోవాల్సిన ఇతర విషయాలను అంటే తీసుకోవాల్సినవి సామాన్లను పదేపదే గుర్తుచేసుకుంటూ ఉంటాం. దీంతో, కారు ఎక్కడ పార్క్ చేశామన్న విషయాన్ని మర్చిపోతాం.

ఇది మతిమరపులో మరో కోణాన్ని చూపిస్తుంది. నిర్దిష్ట సమాచారాన్ని మనం మర్చిపోవచ్చు. కానీ, అవసరమైన సమాచారాన్ని మాత్రం గుర్తుంచుకుంటాం.

సామాన్లు తీసుకుని స్టోర్ నుంచి బయటికి వచ్చాక, మనం కారు ఎక్కడ పార్కు చేశామన్న విషయం మర్చిపోయామన్నది గమనిస్తాం. స్టోర్ ప్రవేశానికి కుడివైపా లేదా ఎడమవైపా, పార్కింగ్ ప్రదేశంలో చివర్లో చేశామా లేదా మధ్యలో చేశామా అన్నది బహుశా మనకు గుర్తుండే ఉంటుంది. దాని బట్టి, మొత్తం పార్కింగ్ స్థలంలో వెతకడానికి బదులు, నిర్దిష్ట ప్రాంతంలో కారును వెతికితే మంచిది.

మతిమరుపు, వృద్ధాప్యం

ఫొటో సోర్స్, Getty Images

వృద్ధాప్య ప్రభావం

వయసు పెరుగుతున్నకొద్దీ విషయాలను మర్చిపోతామేమోననే భయం ప్రజల్లో పెరుగుతుంది. వృద్ధాప్యంలో మతిమరుపు పెరుగుతునేది నిజమే. కానీ, అన్ని వేళలా ఇది సమస్య కాదు.

ఎంత ఎక్కువ కాలం మనం జీవిస్తే, అన్ని అనుభవాలు మనకుంటాయి. ఎక్కువ విషయాలను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. కేవలం అది మాత్రమే కాక, అనుభవాలు చాలా వరకు ఒకే విధంగా ఉంటాయి. అంటే, మన జ్ఞాపకాల నుంచి ఈ విషయాలను వేరు చేయడం కష్టం కూడా కావొచ్చు.

మీరు ఒక్కసారే స్పెయిన్‌లో బీచ్ హాలిడేకు వెళ్లుంటే, దాన్ని మీరు చాలా స్పష్టంగా గుర్తుంచుకుంటారు. కానీ, వెకేషన్ కోసం ఎన్నోసార్లు మీరు స్పెయిన్‌లోని వివిధ నగరాలకు వెళ్లినప్పుడు.. బార్సేలోనాకు తొలిసారి లేదా రెండో సారి వెళ్లినప్పుడు లేదా మీ సోదరుడితో మల్లోర్కాకో లేదా ఇబిజాకు వెళ్లినప్పుడు ఏదైనా సంఘటన జరిగితే.. దాన్ని గుర్తుంచుకోవడం కష్టమే.

జ్ఞాపకాలు ఓవర్‌ల్యాప్ అయినప్పుడు, ఆ సమాచారాన్ని తిరిగి గుర్తుంచు తెచ్చుకోవడం కష్టమవుతుంది. మీ కంప్యూటర్‌లో డాక్యుమెంట్లను సేవ్ చేసిన విషయాన్ని ఉదాహరణగా తీసుకోండి.

మీరు ఈ ప్రాసెస్‌ను ప్రారంభించినప్పుడు, మీకు స్పష్టమైన ఒక ఫైలింగ్ సిస్టమ్‌ అనేది ఉంటుంది. దీనిలో మీరు ప్రతి డాక్యుమెంట్‌ను పెడతారు. దీంతో, ఏ డాక్యుమెంట్ ఎక్కడ వెతుక్కోవాలో మీకు తెలుస్తుంది.

కానీ, డాక్యుమెంట్లు ఎక్కువగా వచ్చినప్పుడు, ఏ ఫోల్డర్ దేనికి సంబంధించిందో తెలుసుకోవడం కష్టమవుతుంది. ఒకే ఫోల్డర్‌లో చాలా డాక్యుమెంట్లను మీరు సేవ్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే, అవన్నీ ఒకే అంశానికి సంబంధించినవై ఉండొచ్చు.

కానీ, కొంత కాలం తర్వాత డాక్యుమెంట్ కావాల్సినప్పుడు, అదెక్కడుందో మీకు తెలియనప్పుడు లేదా సెర్చ్‌లో ఇలాంటివి చాలా డాక్యుమెంట్లు ఉంటే, సరైన డాక్యుమెంట్‌ దొరకపెట్టడం కష్టం.

ఏదైనా విషయాన్ని మర్చిపోకుండా ఉండటం కూడా ప్రజల్ని ఇబ్బందికి గురిచేస్తుంటుంది. ప్రజలు విషయాలను మర్చిపోలేని సందర్భంలో వారు పోస్టు-ట్రామాటిక్ స్ట్రెస్‌ డిజార్డర్‌కు గురవుతుంటారు.

కొంతమంది వ్యక్తులు తమ జీవితంలో తీవ్రంగా కలచివేసే అంశాలు, లేదా బాధపెట్టిన సందర్భాలు జరిగినప్పుడు ఈ డిజార్డర్ బారిన పడుతుంటారు. ఆ విషయం గురించి వారు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారు. అది వారి మనసు నుంచి చెరిగిపోదు. దైనందిన జీవితాన్ని అది ప్రభావితం చేస్తుంటుంది.

ఇలాంటి అనుభవాల వల్ల వారు తీవ్ర వేదనకు లేదా మానసిక సంఘర్షణకు గురవుతుంటారు. ఇక్కడ మతిమరపు చాలా ఉపయోగకరమైనది.

మతిమరుపు

ఫొటో సోర్స్, Getty Images

విషయాలను మర్చిపోవడం సాధారణమే. వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు మరింత సాధారణమవుతుంది. కానీ, జో బిడెన్‌కు జరిగినట్లు పేర్లను లేదా తేదీలను మర్చిపోవడం నిర్ణయాలు తీసుకోవడంపై ప్రభావం చూపదు. పెద్ద వారికి లోతైన పరిజ్ఞానం, మంచి అంతర్ దృష్టి ఉంటుంది. ఇవి మతిమరుపు ద్వారా వచ్చే సవాళ్లను ఎదుర్కొనేలా చేస్తాయి.

కొన్నిసార్లు మతిమరుపు చాలా పెద్ద సమస్యనే. దీని గురించి వైద్యుని సలహా తీసుకోవాల్సి ఉంటుంది.

ఒకే ప్రశ్నను పదేపదే గుర్తుకు తెచ్చుకోవడం కూడా మతిమరుపునకు సూచికనే.

మీకు తెలిసిన ప్రాంతాలకు ఎలా వెళ్లాలో మర్చిపోవడం కూడా మరో సంకేతం. డిన్నర్‌ చేసేటప్పుడు ఎవరి పేరునైనా మర్చిపోవడం సాధారణమే. కానీ, ఫోర్క్ లేదా కత్తిని ఎలా వాడాలో మర్చిపోవడం సాధారణం కాదు.

చివరిగా, మనలో లేదా ఇతరులలో ఉండే సాధారణమైన మతిమరుపు గురించి పెద్దగా భయపడాల్సిన విషయం కాదు. కానీ, ఇది ప్రమాదకరంగా మారుతుందనే సంకేతాలు ఉన్నప్పుడు మాత్రం ఆందోళనకర విషయమే.

రచయిత అలెగ్జాండర్ ఈస్టన్ బ్రిటన్‌లోని దర్హమ్ యూనివర్సిటీ సైకాలజీ ప్రొఫెసర్.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)