గగన్‌యాన్: భారత్ నుంచి అంతరిక్షంలో అడుగుపెట్టే వ్యోమగాములు వీరే...

ఫొటో సోర్స్, NarendraModi/X
- రచయిత, గీతా పాండే
- హోదా, బీబీసీ ప్రతినిధి
వచ్చే ఏడాది భారత్ ప్రయోగించనున్న గగన్‌యాన్‌కు సంబంధించి భారత్ కీలక ప్రకటన చేసింది. గగన్‌యాన్ కోసం సిద్ధం చేసిన తొలి అంతరిక్ష విమానంలో ప్రయాణించే నలుగురు వ్యోమగాములను పరిచయం చేసింది.
ప్రధాని నరేంద్ర మోదీ వీరిని మంగళవారం తిరువనంతపురంలో సత్కరించారు.
గగన్ యాన్ మిషన్ ద్వారా వ్యోమగాములను 400 కిలోమీటర్ల దూరంలోని లో ఎర్త్ కక్ష్యలోకి ప్రవేశపెట్టి, మూడురోజుల తరువాత వారిని వెనక్కు తిరిగి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఇందుకోసం భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగన్‌యాన్‌కు సంబంధించి అనేక పరీక్షలు నిర్వహించింది.
వ్యోమగాములను తీసుకువెళ్ళే అంతరిక్ష నౌక సరిగా పనిచేయకపోతే సిబ్బంది సురక్షితంగా తప్పించుకోవడం ఎలా అనే విషయమై అక్టోబరులో ఓ కీలక పరీక్ష నిర్వహించింది.
ఇది విజయవంతం కావడంతో 2025లో వ్యోమగాములను పంపడానికి ముందే ఈ ఏడాది ప్రయోగాత్మకంగా ఓ రోబోను అంతరిక్షంలో పంపుతామని ప్రకటించింది.
తిరువనంతపురంలోని ఇస్రో కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో గగన్‌యాన్ కోసం ఎంపికైన వ్యోమగాములను ‘‘కలలు గనేవారు, సాహసికులు, అంతరిక్షంలో వెళ్ళేందుకు సిద్ధమైన పరాక్రమవంతులుగా’’ వర్ణించారు.
భారత వైమానిక దళం నుంచి గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లాను గగన్‌యాన్ మిషన్‌కు ఎంపికచేసినట్టు ప్రకటించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇస్రో చీఫ్ సోమనాథ్ ఈ నలుగురి చొక్కాలపై గోల్డెన్ వింగ్ బ్యాడ్జీలను తగిలించి సత్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ వారిని ‘దేశానికి గర్వకారణమని’ పేర్కొన్నారు.
‘‘ఇవి నాలుగు పేర్లు కాదు, లేదంటే నలుగురు మనషులు కారు. వీరు 140 కోట్ల మంది భారతీయుల ఆశలను అంతరిక్షంలోకి మోసుకువెళ్ళే నాలుగు శక్తులు. వారికి శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ ’’ అని మోదీ చెప్పారు.

ఫొటో సోర్స్, DOORDARSHAN/DD
వైమానిక దళం నుంచి ఎంపిక చేసిన పైలట్ల జాబితా నుంచి అంతిమంగా ఈ నలుగురిని ఎంపిక చేసేముందు కఠినమైన శారీకర, మానసిక పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
ఈ నలుగురూ రష్యాలో 13 నెలలపాటు కఠినమైన శిక్షణ పొందారని, ప్రస్తుతం వారు అంతరిక్షంలో వెళ్ళేందుకు ఎదురుచూస్తున్నారని అధికారులు చెప్పారు. గగన్‌యాన్‌కు ఎంపికైన నలుగురు వివిధ ఎక్సర్‌సైజులు, యోగా చేస్తున్న వీడియోను ఈ సందర్భంగా ప్రదర్శించారు.
దీంతోపాటు ఇస్రో ఈ ఏడాది చివర్లో అంతరిక్షంలోకి పంపనున్న వ్యోమమిత్ర అనే మహిళా హ్యూమనాయిడ్‌ను ప్రదర్శించింది.
గగన్‌యాన్ భారత దేశ తొలి మానవసహిత అంతరిక్ష వైమానిక కార్యక్రమం. ఇందుకోసం పలు ఇస్రో కేంద్రాలలో తీవ్రమైన కసరత్తు కొనసాగుతోంది.
గగన్‌యాన్ ప్రాజెక్ట్ కోసం భారత్ 9023 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే అంతరిక్షంలో మనుషులను పంపిన నాలుగోదేశంగా సోవియట్ యూనియన్, అమెరికా, చైనాల సరసన నిలుస్తుంది.
కిందటేడాది చంద్రయాన్ విజయవంతం కావడంతో అంతరిక్ష ప్రయోగాలలో భారత్ కీలక ముందడుగు వేసినట్టయింది . దీని తరువాత కొన్నివారాలకే భారతదేశ తొలి అబ్జర్వేషన్ మిషన్ ఆదిత్య ఎల్-1ను సూర్యుని గుట్టు తెలుసుకునేందుకు పంపింది. ప్రస్తుతం ఇది సౌరవ్యవస్థపై ఓ కన్నేసి కక్ష్యలో తిరుగుతోంది.
దీంతోపాటుగా 2035 కల్లా ఇండియా స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది. అలాగే 2040 నాటికల్లా చంద్రుడిపైకి వ్యోమగామిని పంపాలనే యోచనలో ఇస్రో ఉంది.
ఇవి కూడా చదవండి :
- దివ్యభారతి: ఒకప్పుడు హీరోను మించిన రెమ్యూనరేషన్ తీసుకున్న అందాల తార కెరీర్ రెండేళ్ళలోనే ఎలా ముగిసిపోయింది?
- లాటరీ తగిలినట్లు ఈ దేశం ఒక్కసారిగా సంపన్న దేశంగా ఎలా మారింది?
- బెంగాల్ క్షామం: లక్షల మందిని పొట్టన పెట్టుకున్న ఆనాటి దుర్భిక్షాన్ని అనుభవించిన వారిలో కొందరు ఇంకా బతికే ఉన్నారు, వారు ఏమంటున్నారు?
- భార్య ఫోన్‌కాల్స్ విని ఇన్సైడర్ ట్రేడింగ్‌తో రూ. 14.5 కోట్లు సంపాదించిన భర్త.. భార్య ఉద్యోగం పోవడంతో విడాకులకు దరఖాస్తు
- ఆంధ్రప్రదేశ్: విశాఖ ఏవీఎన్ కాలేజిలో నోబెల్ బహుమతి గ్రహీత సీవీ రామన్ ప్రయోగాలు చేసిన ఫిజిక్స్ లేబొరేటరీ ఇప్పుడెలా ఉంది?
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














