టాటా గ్రూప్ మార్కెట్ విలువ పాకిస్తాన్ జీడీపీ కన్నా ఎక్కువ... ఇదెలా సాధ్యమైంది?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, మీర్జా ఏబీ బేగ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బూట్లలో బాటా, లగేజీ రవాణాలో టాటా వెరీ స్ట్రాంగ్ అని నా చిన్నతనంలో ఓ సామెత విన్నా.
ఇందులో ఎంత నిజముందో తెలీదు గానీ, తాజాగా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 365 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 30 లక్షల 25 వేల కోట్ల)కు చేరున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇది కేవలం భారత్‌లో బలమైన కంపెనీగా చెప్పడమే కాదు, ఆ కంపెనీ విలువ పాకిస్తాన్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) కంటే ఎక్కువగా ఉంది.
రిలయన్స్ గ్రూప్ అధినేత ముకేశ్ అంబానీ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారని, బిలియనీర్ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ ఆయన తర్వాతి స్థానంలో ఉన్నారని తరచూ వినే ఉంటారు. కానీ, వాటిలో టాటా గురించిన చర్చ ఏదీ కనిపించదు.
టీ పొడి నుంచి జాగ్వార్, ల్యాండ్ రోవర్ కార్ల వరకూ, ఉప్పు నుంచి విమానాలు, స్టార్ హోటళ్ల వరకూ...ఇలా ప్రతి రంగంలోనూ టాటాల బలమైన ఉనికి ఉంటుంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో టాటా గ్రూప్ మార్కెట్ విలువ సుమారుగా 365 బిలియన్ డాలర్లు కాగా, ఇటీవల అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పాకిస్తాన్ జీడీపీని సుమారు 341 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 28 లక్షల 26 వేల కోట్లు)గా అంచనా వేసింది.
కేవలం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) గురించి మాత్రమే చెప్పుకుంటే, దాని ఆస్తుల విలువ 170 బిలియన్ డాలర్లు (సుమారు 14 లక్షల 9 వేల కోట్లు). ఇది భారత దేశంలో రెండో అతిపెద్ద కంపెనీ. అలాగే దాని మార్కెట్ విలువ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో దాదాపు సగం.

ఫొటో సోర్స్, GETTY IMAGES
టాటా కంపెనీ స్థాపన
ఇదంతా ఒక్కరోజులో జరిగింది కాదు. దాదాపు 150 ఏళ్లకు పైగా పట్టింది. అయితే, అనేక రంగాల్లో భారత్‌లో ఇదే మొదటి కంపెనీ.
1911 ఫిబ్రవరి 8న లోనావాలా డ్యామ్‌కి శంకుస్థాపన సమయంలో, టాటా గ్రూప్ అప్పటి అధినేత సర్ దొరాబ్జీ టాటా 1868లో టాటా కంపెనీకి పునాది వేసిన తన తండ్రి జంషెడ్‌జీ టాటా గురించి చెప్పారు.
ఇప్పుడీ గ్రూపు 30 రకాలైన కంపెనీలను నడుపుతోంది. ఆరు ఖండాలలో 100కుపైగా దేశాలలో టాటా గ్రూప్ తన సేవలను అందిస్తోంది.
‘‘మా నాన్నకు డబ్బు సంపాదన ముఖ్యం కాదు. పారిశ్రామిక రంగం, ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలనే విషయానికి ప్రాధాన్యమిచ్చారు. ఆయన తన జీవితంలో అనేక సంస్థలను నెలకొల్పడం వెనుక ఆయా రంగాలు అభివృద్ధి చెందాలనే తలంపే కారణం’’ అని దొరాబ్జీ టాటా చెప్పారు.
టాటా కంపెనీ వెబ్‌సైట్‌లో కూడా ప్రపంచవ్యాప్తంగా భిన్న సమూహాల మధ్యన జీవన నాణ్యతను పెంచాలనే లక్ష్యంతోనే ఆయా కంపెనీలను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
తొలి విలాసవంతమైన హోటల్
జంషెడ్‌జీ టాటా ఎంత నిరాడబరంగా ఉండేవారంటే ఆయన అవతారాన్ని చూసి 19వ శతాబ్దపు చివరిలో బాంబేలోని ఓ ఖరీదైన హోటల్లోకి అడుగుపెట్టనివ్వలేదు.
ఈ సంఘటన జంషెడ్‌జీపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. తనను అడుగుపెట్టనీయని హోటల్ కంటే, భారతీయులందరూ హాయిగా వచ్చి వెళ్ళేలా ఓ ఖరీదైన హోటల్ కట్టాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే 1903లో ముంబాయిలో సముద్రతీరాన తాజ్ హోటల్‌ను నిర్మించారు. ముంబయి నగరంలో కరెంట్, అమెరికన్ ఫ్యాన్స్, జర్మన్ లిఫ్టులు తదితర సౌకర్యాలు కల్పించిన తొలి భవంతి ఇదే. ఇంగ్లీషు వంటవాళ్ళు ఇందులో వంటలు చేసేవారు. అమెరికా, బ్రిటన్ సహా మొత్తం 9 దేశాలలో తాజ్ హోటల్ బ్రాంచ్‌లు ఉన్నాయి.
జంషెడ్‌జీ 1839లో ఓ పార్సీ కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్వీకులు చాలామంది పార్సీ మతంలో గురువులుగా ఉన్నారు.
పత్తి, టీ, రాగి, ఇత్తడి, ఓపియం (అప్పట్లో ఓపియం విక్రయం అక్రమం కాదు) వ్యాపారాలలో జంషెడ్‌జీ బాగా సంపాదించారు.
జంషెడ్‌జీ ప్రపంచమంతటా పర్యటించేవారు. కొత్త ఆవిష్కరణల పట్ల ఎక్కువగా ప్రభావితమయ్యేవారు.
ఆయన బ్రిటన్ పర్యటనకు వెళ్ళినప్పుడు లాంక్‌షైర్‌లో వస్త్ర పరిశ్రమను చూసి, భారతదేశానికి బ్రిటిష్ సామ్రాజ్యంతో పోటీ పడే శక్తి ఉందని భావించారు.
బ్రిటన్‌లో వస్త్రపరిశ్రమలను చూసి ప్రభావితమైన జంషెడ్‌జీ 1877లో భారతదేశంలో మహారాణి మిల్స్ పేరుతో తొలి బట్టల మిల్లును ప్రారంభించారు. భారతదేశ మహరాణిగా క్వీన్ విక్టోరియా పట్టాభిషేకం జరిగిన రోజే ఈ మహారాణి మిల్లును ప్రారంభించారు.
‘‘ఎక్కడైనా ప్రజలను అభివృద్ధి చేయాలనుకుంటే బలహీనులకు, నిస్సహాయలకు సహాయం చేయడం కాకుండా, సమర్థులైనవారికి, ప్రతిభావంతులకు చేయూతనిస్తే వారే దేశానికి సేవలు అందిస్తారు’’ అని జంషెడ్‌జీ చెప్పేవారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మొదటి పారిశ్రామికనగరం
ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించాలనేది జంషెడ్‌జీకి పెద్ద కలగా ఉండేది. కానీ ఆ కల తీరకముందే ఆయన చనిపోయారు. తదుపరి ఆయన కుమారుడు దొరాజ్జీ తన తండ్రి కలను నిజం చేశారు.
1907 నుంచి టాటా స్టీల్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ క్రమంలో ఆసియాలోనే ఉక్కు కర్మాగారం నిర్మితమైన మొదటి దేశంగా భారత్ నిలిచింది.
ఈ ఉక్కు కర్మాగారానికి సమీపంలో ఏర్పడిన నగరం జంషెడ్‌పుర్ పేరుతో ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు దేశంలో అందరికీ జంషెడ్‌పుర్ అంటే ఉక్కునగరమని తెలుసు.
జంషెడ్‌జీ తన దొరాబ్జీకి ఒక పారిశ్రామిక నగరాన్ని నిర్మించమని కోరుతూ ఓ లేఖ రాశారు. అందులో ‘‘రహదారులు విశాలంగా ఉండాలి. పక్కన చెట్లు పెంచడానికి తగిన స్థలం ఉండాలి. ఆటస్థలాలు, పార్కులు, ప్రార్థనా స్థలాలు ఉండాలి’’ అని రాశారు.
టాటా తనంతట తానుగా తన ఉద్యోగులకు 1877లోనే పెన్షన్ సహా అనేక సంక్షేమ పథకాలు రూపొందించారు. 1921లోనే ఆయన 8 గంటల పని, మహిళలకు ప్రసూతి సెలవులు ఇచ్చారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
తొలి విమాన సర్వీసు
టాటా కుటుంబంలో మరో సభ్యుడైన జహంగీర్ రతన్ జీ టాటా( జేఆర్‌డీ) 1938లో కంపెనీ చైర్మన్ అయ్యారు. ఆయన ఆ పోస్టులో దాదాపు అర్థశతాబ్దానికి పైగా ఉన్నారు.
ఆయన పారిశ్రామికవేత్త కావడం కన్నా పైలట్ కావడాన్ని ఇష్టపడేవారు. ఆయన లూయిస్ బెల్‌రైట్ అనే పైలట్‌ను కలిసిన తరువాత ఈ కాంక్ష పెరిగింది.
బాంబే ఫ్లయింగ్ క్లబ్ నుంచి పైలట్ ట్రైనింగ్‌కు వెళ్ళిన మొదటి భారతీయుడు జేఆర్‌డీనే. ఆయన ఎయిర్ లైసెన్స్‌పై ‘1’ అనే నెంబర్ ఉంటుంది. దానిని చూసి ఆయన చాలా గర్వించేవారు.
ఆయన మొదటి ఎయిర్ మెయిల్ సర్వీసును కూడా ప్రారంభించారు. తరచూ విమానాలు ప్రయాణికులతోపాటు మెయిల్ కూడా తీసుకుపోయేవి.
తదనంతర కాలంలో ఈ పోస్టల్ సర్వీసే భారతదేశ మొదటి ఎయిర్ లైన్ సర్వీసుగా రూపాంతరం చెంది ‘టాటా ఎయిర్ లైన్స్’ గా మారింది. తరువాత దీని పేరును ‘ఎయిర్ ఇండియా’గా మార్చారు.
తదుపరి ‘ఎయిర్ ఇండియా’ యాజమాన్య హక్కులను ప్రభుత్వం తీసుకుంది. కానీ ప్రభుత్వం నుంచి టాటా ఆ కంపెనీని కొనుగోలు చేశారు. ఎయిర్ ఇండియా ను వెనక్కు తెచ్చుకున్నాక, టాటా సన్స్ వద్ద మూడు ఎయిర్ లైన్స్ ఉండేవి.
ఎయిర్ ఇండియాతోపాటు ఎయిర్ విస్తారా (దీనికి సింగపూర్ ఎయిర్ లైన్స్‌తో భాగస్వామ్యం ఉంది), ఎయిర్ ఆసియా(దీనికి మలేషియాతో భాగస్వామ్యం ఉంది) కంపెనీలు ఉన్నాయి.
ఎయిర్ ఇండియా యాజమాన్య హక్కులను తిరిగి పొందాకా టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ 2021 అక్టోబర్‌లో ఓ ప్రకటన విడుదల చేస్తూ దానిని ‘‘ఓ చారిత్రక సందర్భంగా’ చెపుతూ దేశంలోని అతిపెద్ద ఎయిర్‌లైన్స్ కు యజమాని కావడం గర్వకారణమని చెప్పారు.
‘‘అంతర్జాతీయ స్థాయి ఎయిర్‌లైన్ నడపాలనేది మా ప్రయత్నం. ఇది భారత్‌కు ఎంతో గర్వకారణం.’’ అని కూడా ఆయన చెప్పారు. ‘‘మహారాజ ( ఎయిర్ ఇండియా లోగో) తిరిగి రావడమనేది జేఆర్‌డీ టాటాకు నివాళి’’ అని పేర్కొన్నారు.
అంతకుముందు భారత ప్రభుత్వం జేఆర్‌డీ టాటాను ఎయిర్ ఇండియా చైర్మన్‌ను చేసింది. 1978వరకు ఆయన ఆ పోస్టులో కొనసాగారు. ఆ తరువాత మెల్లిగా భారత ప్రభుత్వ అధికారులు ఆ పోస్టును ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
కంప్యూటర్ ప్రపంచంలోకి..
జేఆర్‌డీ టాటా తన కుటుంబ సంప్రదాయాన్ని పాటిస్తూ, 1968లో అభివృద్ధి చెందిన దేశాలకు మాత్రమే పరిమితమైన కంప్యూటర్లకు సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించారు.
ఈ కంపెనీకి ‘టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్’ (టీసీఎస్) అనే పేరు పెట్టారు. టీసీఎస్ ప్రపంచం మొత్తానికి సాప్ట్‌వేర్ సరఫరా చేస్తుంటుంది. ప్రస్తుతం టాటా గ్రూపులో ఈ కంపెనీ ఎక్కువ లాభాలు సంపాదిస్తున్న కంపెనీగా నిలిచింది.
1991లో జేఆర్‌డీ టాటాకు దూరపు బంధువైన రతన్ టాటా కంపెనీ బాధ్యతలు తీసుకున్నారు. రతన్ టాటా నాయకత్వంలో టాటా వ్యాపారాలు ప్రపంచమంతటా వ్యాపించాయి.
టెట్లీ టీ, ఏఐజీ ఇన్సురెన్స్ కంపెనీ, బోస్టన్‌లో రిట్జ్ కార్ల్‌టన్ , దేవూస్ పేరుతో భారీ వాహనాల తయారీ కేంద్రం, యూరప్‌లో కోరస్ ఉక్కు పరిశ్రమలను స్థాపించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
టాటాల విజయ రహస్యం
టాటా కంపెనీలకు మాతృసంస్థ, ప్రమోటర్‌గా టాటా సన్స్ వ్యవహరిస్తుంటుంది. టాటా సన్స్‌లోని ఈక్విటీ షేర్ కాపిటల్‌లో 66 శాతాన్ని విద్య, వైద్యం, ఉపాధి కల్పన, కళలు, సంస్కృతి రంగాలకు మద్దతు ఇచ్చే దాతృత్వ ట్రస్టులు నిర్వహిస్తుంటాయి.
ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు టాటా కంపెనీ కార్పొరేట్ కమ్యూనికేషన్ విభాగాన్ని సంప్రదించడానికి బీబీసీ ప్రయత్నించింది. కానీ వారు అందుబాటులోకి రాలేదు.
టాటా కంపెనీ ప్రస్తుతం తన ఆస్తుల విలువను వెల్లడించకపోయినా, కిందటేడాది జులై 31, 2023 నాటికి తమ ఆస్తులు 300 బిలియన్ డాలర్లు (24 లక్షల కోట్లు ) అని, ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలలో 10లక్షలమందికిపైగా ఉద్యోగులు పనిచేస్తున్నారని తెలిపారు.
టాటాల అద్భుతమైన అభివృద్ధి గురించి ఆర్థిక నిపుణుడు శంకర్ అయ్యర్‌తో మాట్లాడాం. ‘‘అంబానీ, అదానీ కంపెనీల పేర్లు వారి వ్యక్తిగతమైనవి కాబట్టి ఆయా పేర్లతో వచ్చాయి. కానీ టాటా గ్రూపులో చాలా విభిన్నమైన కంపెనీలు ఉన్నాయి. వీటన్నింటినీ ఓ ట్రస్టు కింద నిర్వహిస్తుంటారు. అందుకే దీనిని మిగతా కంపెనీల కోణంలో చూడలేం’’ అని చెప్పారు.
ఆయనతో ఫోన్లో సంభాషించినప్పుడు కార్పొరేట్ ప్రపంచంలో ఇటువంటి పోలికలను తాను పరిగణనలోకి తీసుకోనని, భారత్‌లోని చాలా విషయాలలో టాటా కంపెనీ మాతృస్థానంలో ఉందన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
హోయ్‌సంగ్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్, ఆల్‌స్టామ్ ఇండియా మాజీ డైరక్టర్ నగేష్ తల్వానీ ఫోన్ ద్వారా బీబీసీతో మాట్లాడారు. ‘‘ టాటా అభివృద్ధికి మూలకారణం దాని నైతిక, నిష్పక్షపాత, పారదర్శక విధానమే. ఇదే దాని ఉద్యోగులతో బలమైన బంధానికి కారణమైంది’’ అన్నారు.
టాటా గురించిన కొన్ని విషయాలను ఆయన వివరించారు. పెట్టుబడి పెట్టే విషయంలో టాటా కు స్పష్టమైన దూరదృష్టి, వ్యూహం ఉన్నాయని, స్టార్, క్రోమా కాన్సెప్ట్, జాగ్వార్ బ్రాండ్‌ను కొనుగోలు చేయడమే దానికి ఉదాహరణ అని చెప్పారు.
‘‘వారు ఏ పనిచేసినా హడావుడి లేకుండా, నిశ్శబ్దంగా, పూర్తి శ్రద్ధతో చేస్తారు’’ అని చెప్పారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ విషయంలో టాటా తన బ్రాండ్ నేమ్‌ను చాలా తెలివిగా ఉపయోగించుకుందని, దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారులు కంపెనీతో కనెక్ట్ అయ్యారని, వారంతా టాటా బ్రాండ్ ను సురక్షితమని, నమ్మదగ్గ, నిజాయితీగల బ్రాండ్‌గా భావిస్తారని తెలిపారు.
‘‘వారికి చాలా ప్రభావవంతమైన సరఫరా విధానం ఉంది. పైగా తన ఉద్యోగుల సంక్షేమం విషయంలో చాలా శ్రద్ధ తీసుకుంటారు’’ అని చెప్పారు.
న్యూ దిల్లీలోని టాటా పవర్ ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న వివేక్ నారాయణ మాట్లాడుతూ తొలుత జాగ్వార్ ను తీసుకోవడం అంత మంచి నిర్ణయం కాదని భావించారు. కానీ తరువాత అదెంత విజయవంతమైన నిర్ణయమో నిరూపితమైంది.
అదే విధంగా టాగా ఇండియన్ ఎయిర్స్‌లైన్స్ ను దక్కించుకుంది. దాని దశ, దిశను ఇప్పుడే చెప్పడం సాధ్యం కాదు.
టాటాల విజయరహస్యం భిన్నత్వమే అంటారు ఆయన. టాటాలు తాము పనిచేసే రంగాలలో ఓ సానుకూల వాతావరణం తీసుకురావడానికి ప్రయత్నిస్తారని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- శ్రీకృష్ణుడి ద్వారక కోసం సముద్రం అడుగుకి వెళ్లిన సబ్‌మెరైన్స్, అక్కడ ఏముంది?
- కేజీ బేసిన్: కాకినాడ తీరంలో తొలిసారిగా చమురు వెలికితీత...భారతదేశపు చమురు అవసరాలను ఇది తీర్చగలదా?
- లాటరీ తగిలినట్లు ఈ దేశం ఒక్కసారిగా సంపన్న దేశంగా ఎలా మారింది?
- సావర్కర్: అండమాన్ జైలులో ఉన్నప్పుడు క్షమాభిక్ష కోరుతూ బ్రిటిష్ వారికి లేఖలు రాసింది నిజమేనా?
- ఆకాశ్ దీప్: తండ్రి, అన్నను పోగొట్టుకున్నా పట్టు వదలకుండా శ్రమించి టీమిండియాకు ఎంపికైన క్రికెటర్ కథ
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















