అహ్మద్ అల్ గుఫెరి: బాంబు దాడిలో 103 మంది బంధువుల్ని కోల్పోయిన ఈ వ్యక్తి ఏం చెబుతున్నారు?

- రచయిత, లూసి విలియమ్సన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అహ్మద్ అల్ గుఫెరి...గాజాకు చెందిన ఈయన తన కుటుంబాన్ని తుడిచిపెట్టేసిన బాంబు దాడి నుంచి తప్పించుకున్నారు.
అహ్మద్ బంధువుల కుటుంబానికి చెందిన ఓ ఇంటిపై జరిగిన దాడిలో అతని బంధువులు 103 మంది చనిపోయారు. ఆ సమయంలో ఆయన అక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆక్రమిత వెస్ట్‌బ్యాంక్‌లోని జెరికో పట్టణంలో ఉన్నారు.
అక్టోబర్ 7న హమాస్ ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు అహ్మద్ టెల్ అవీవ్‌లోని ఓ భవన నిర్మాణంలో పని చేస్తున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. హమాస్ దాడి తర్వాత ఆయన గాజా వచ్చేందుకు ప్రయత్నించినా యుద్ధం కారణంగా వీలు పడలేదు.
దీనికి తోడు ఇజ్రాయెల్ సైన్యం సరిహద్దుల్ని మూసేసింది.
గాజా మీద ఇజ్రాయెల్ సైన్యం దాడి మొదలైనప్పటి నుంచి ఆయన ప్రతీరోజూ వారితో మాట్లాడుతూనే ఉన్నారు. గతేడాది డిసెంబర్ 8న ఆయన భార్య షిరీన్‌తో మాట్లాడుతున్న సమయంలో అతని బంధువులు ఇంటిపై బాంబు దాడి జరిగింది.
“తను చనిపోతుందని ఆమెకు తెలుసు. తెలిసీ తెలియక తాను ఏదైనా తప్పు చేసి ఉంటే క్షమించమని అడిగింది. అయితే అలాంటివేమీ అవసరం లేదని నేను ఆమెకు చెప్పాను. మా మధ్య జరిగిన చివరి సంభాషణ అదే ” అంటూ అహ్మద్ కన్నీరు పెట్టుకున్నారు.
ఆ రోజు సాయంత్రం అతని సమీప బంధువు ఇంటి మీద జరిగిన బాంబు దాడిలో అహ్మద్ భార్యతో పాటు ముగ్గురు పిల్లలు చనిపోయారు.
ఇందులో అహ్మద్ తల్లి, నలుగురు సోదరులు, వారి కుటుంబ సభ్యులు, పదుల సంఖ్యలో అత్త మామలు, సోదరులు...ఇలా మొత్తం వంద మందికి పైగా చనిపోయారు. ఇది జరిగి రెండు నెలలు గడుస్తున్నా, వారి మృతదేహాలు ఇంకా శిధిలాల కిందనే ఉండిపోయాయి.
గత వారంలో ఆయన చిన్న కూతురు నజ్లా పుట్టిన రోజు వచ్చింది. ఈ ఏడాది ఆమె రెండో ఏట అడుగు పెడుతుంది. కానీ, ఇప్పుడామె లేదు. తనకు జరిగిన నష్టాన్ని అహ్మద్ ఇప్పటికీ తట్టుకోలేకపోతున్నారు.
కూతుళ్ల మృతదేహాలను చూడకపోవడం, వారి అంత్య క్రియలు నిర్వహించకపోవడంతో వాళ్లింకా సజీవంగానే ఉన్నట్లుగా భావించి మాట్లాడుతున్నారాయన. ఆయన మొహంలో ఎలాంటి భావాలు కనిపించడం లేదు. పిల్లల్ని తలచుకున్నప్పుడల్లా ఆయన కళ్ల నుంచి నీరు ధారగా ప్రవహిస్తోంది.
“నా పిల్లలు చిన్న పక్షుల లాంటివారు. నాకిదంతా కలలా ఉంది. మాకు ఇలా జరిగిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను” అని చెప్పారు అహ్మద్.

కూతుళ్ల జ్ఞాపకాలు తనను చుట్టుముట్టకుండా ఉండేందుకు వారి ఫోటోలను అహ్మద్ ఫోన్, ల్యాప్‌టాప్ స్క్రీన్‌ల నుంచి తొలగించారు.
బాంబు దాడిలో ప్రాణాలతో బయటపడిన కొంతమంది బంధువులు, ఇరుగుపొరుగు వారు చెప్పిన మాటల ఆధారంగా అసలేం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఇంటి గడప ముందు ఓ పెద్ద క్షిపణి వచ్చి పడిందని వారు అహ్మద్‌తో చెప్పారు.
“క్షిపణి దాడి తర్వాత వాళ్లు అక్కడకు దగ్గర్లో ఉన్న మా మామయ్య ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే 15 నిముషాల లోపే యుద్ధ విమానం ఆ ఇంటిపై బాంబులు కురిపించింది” అని అతను చెప్పాడు.
ఆయన కుటుంబ సభ్యులు చనిపోయిన నాలుగు అంతస్తుల భవనం గాజా నగరంలోని సహబా మెడికల్ సెంటర్ సమీపంలో ఉంది.
ఆ ఇల్లు ప్రస్తుతం కాంక్రీటు శిధిలాల దిబ్బగా మారిపోయింది. ఆ శిధిలాల మీద రంగుల చుక్కలు, మురికి బట్టలు, ఓ ఆకుపచ్చ ప్లాస్టిక్ కప్పు ఉన్నాయి.

ఆ కాంక్రీట్ శిధిలాల కింద ధ్వంసమైన ఓ కారు, ముక్కలై వేలాడుతున్న దాని విండ్ స్క్రీన్ కనిపిస్తున్నాయి.
బాంబు దాడి మొదలైనప్పుడు దగ్గర్లో ఉన్న కొండమీదకు వెళ్లిన వాళ్లు బతికారని, ఇంట్లోనే తలదాచుకున్న వాళ్లు చనిపోయారని, ఈ దాడి నుంచి ప్రాణాలతో బయటపడిన హమీద్ అల్ గుఫేరి తెలిపారు.
‘‘అదొక అగ్ని కీలల వర్షం. మా ఇంటి పక్కన ఉన్న నాలుగు ఇళ్ల మీద కూడా దాడులు జరిగాయి. వాళ్లు ప్రతీ పది నిముషాలకు ఒక ఇంటి మీద బాంబులు కురిపిస్తున్నారు. ఆ సమయంలో గుఫేరి ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్లు కలిసి అంతా 110 మంది ఉన్నారు. వారిలో ఎక్కువ మంది చనిపోయారు” అని ఆయన తెలిపారు.
చనిపోయినవారిలో తొమ్మిది రోజుల చిన్నారితో పాటు ఇంట్లో అందరి కంటే పెద్దదైన 98 ఏళ్ల బామ్మ ఉన్నారని దాడి నుంచి బయటపడిన వారు చెప్పారు.
తమ ఇంటి మీద రెండు వైమానిక దాడులు జరిగాయని అహ్మద్ మరో బంధువు చెప్పారు.
“ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేవు. కొంతమంది ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లకుంటే మృతుల సంఖ్య వేలల్లో ఉండేది. దాడుల తర్వాత ఈ ప్రాంతం పూర్తిగా మారిపోయింది. అక్కడో కార్ పార్కింగ్ ప్లేస్ ఉండేది. అక్కడే మేము నీరు నిల్వ చేసుకునేవాళ్లం. ఆ పక్కనే మరో నాలుగు పెద్ద ఇళ్లు ఉండేవి. ఇప్పుడా ప్రాంతం అంతా తుడిచి పెట్టుకుపోయింది.’’ అని ఆయన వెల్లడించారు.
దాడి తర్వాత శిధిలాల కింద ఉన్న మృతదేహాలను బయటకు తీసేందుకు తెల్లవారే వరకు శ్రమించామని హమీద్ చెప్పారు.
“గాలిలో విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. మేము బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడల్లా క్వాడ్ కాప్టర్లతో మాపై దాడులు చేస్తూనే ఉన్నారు”. అని అహ్మద్ సోదరుడు చెప్పారు.
“మేము ఇంట్లోనే కూర్చున్నా మేమేదో శిధిలాల కింద ఉన్నట్లు అనిపించింది. దాడి జరిగినప్పుడు నేను ఒక మూల నుంచి మరో మూలకు విసిరేసినట్లుగా ఎగిరి పడ్డాను. వాళ్లు నన్ను ఎలా బయటకు తీసుకు వచ్చారో తెలియదు. నా కళ్ల ముందు మనుషుల ప్రాణాలు పోవడం చూశాను.’’ అని అహ్మద్ సోదరుడు ఒకరు బీబీసీతో చెప్పారు.
రెండున్నర నెలలు గడిచాయి. శిధిలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాలను బయటకు తీసేందుకు వాళ్లు ఇప్పటికీ ప్రయత్నిస్తున్నారు. కాంక్రీట్ దిమ్మెల్ని పగల గొట్టేందుకు చిన్న డిగ్గర్‌ను అద్దెకు తీసుకోవడానికి కుటుంబ సభ్యులంతా డబ్బులు వసులూ చేశారు.
“మేము ఇవాళ నాలుగు మృతదేహాలను వెలికి తీశాం. అందులో మా అన్నయ భార్య, నా మేనల్లుడు ఉన్నారు. వారి శరీరాలు ముక్కలై ఉన్నాయి. 75 రోజులుగా శిధిలాల కింద ఉన్నారు” అని అహ్మద్ కన్నీటి పర్యంతమయ్యారు.
ఆ శిధిలాల దిబ్బకు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో వారి శరీరాలను పూడ్చి పెట్టారు. ఆ సమాధుల మీద కర్రలు, ప్లాస్టిక్ షీట్లను గుర్తుగా పెట్టారు.
బాంబు దాడి జరిగినప్పుడు అహ్మద్ జెరికోలో ఉన్నారు. అప్పట్లో ఆయనకు ఇంటికి వచ్చేందుకు అవకాశం చిక్కలేదు.
“భార్య, పిల్లలు, తల్లి, చెల్లెళ్లు, అన్నయ్యలు ఇతర బంధువులందరినీ కోల్పోయి నేను చేయగలిగేది ఏముంటుంది?. వాళ్లేమీ తీవ్రవాదులు కాదు. సామాన్య పౌరులు” అన్నారాయన.
ఆ కుటుంబం ఆరోపణల్ని బీబీసీ ఇజ్రాయెల్ సైన్యం దృష్టికి తీసుకెళ్లింది. వైమానిక దాడుల గురించి ప్రశ్నించింది. అయితే దాడుల గురించి తమకు ఏమీ తెలియదని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది.
వైమానిక దాడుల గురించి ప్రస్తావిస్తూ “ దాడుల సమయంలో సామాన్య ప్రజలకు హాని కలగకుండా గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు” ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ చెప్పాయి.
అహ్మద్ కుటుంబంపై దాడి జరగడానికి ముందు తర్వాత ఇజ్రాయెల్ బలగాలు హామాస్ సాయుధులకు మధ్య షెజయ్యాలో తీవ్రమైన పోరాటం జరిగింది. ఈ ప్రాంతం అహ్మద్ ఇంటికి దగ్గర్లోనే ఉంది.
అనేకమంది హమాస్ మిలిటెంట్లు యాంటీ ట్యాంక్ మిసైల్స్‌తో షెజయ్యా వైపు వస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని, వారిపై హెలికాప్టర్లతో దాడి చేయాలని తాము డిసెంబర్ 9న ఆదేశించినట్లు ఇజ్రాయెల్ అర్మీ బీబీసీకి చెప్పింది.

గాజా స్ట్రిప్‌లో భూతల దాడుల్ని కొనసాగిస్తూనే టెర్రరిస్టుల లక్ష్యాల మీద వైమానిక దాడులు చేస్తున్నామని కూడా చెప్పింది.
అహ్మద్ కుటుంబం ఉన్న జీటౌన్ ప్రాంతంలో ఇప్పుడు కూడా ఇజ్రాయెస్ సేనలు దాడులు చేస్తున్నాయి.
జెరికోలో ఉన్న అహ్మద్ దాడి నుంచి బయట పడిన తన బంధువులకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తున్నారు. సొంత ఇంటికి దూరంగా చాలా కాలంగా వేరే ప్రాంతంలో చిక్కుకుపోయిన అహ్మద్ ఇప్పుడు ఇంటికి రావాలని ఆశతో ఎదురు చూస్తున్నారు.
అయితే అది ఎప్పుడు సాధ్యం అవుతుందో చెప్పలేని పరిస్థితి.
“గాజాలో నా కల చెదిరిపోయింది. నేను ఎవరి కోసం వెళ్లాలి. నన్ను నాన్న అని ఎవరు పిలుస్తారు? డాళింగ్ అని ఎవరు పిలుస్తారు? నువ్వే నా జీవితమని నా భార్య ఎప్పుడూ చెబుతూ ఉండేది. ఇప్పుడా మాట నాకు ఎవరు చెబుతారు?” అన్నారు గుఫేరి.
ఇవి కూడా చదవండి:
- యశస్వీ జైస్వాల్: బేస్బాల్లా క్రికెట్ బంతిని బాదేస్తూ మరో డబుల్ సెంచరీ చేసిన 'జస్బాల్'
- గుల్బదన్: ఒట్టోమాన్ సుల్తాన్‌ను ఎదిరించిన మొఘల్ యువరాణి కథ...
- అలెక్సీ నావల్నీ: పుతిన్ ఆదేశాల మేరకే ఆయనను చంపేశారా, విమర్శకులు ఏమంటున్నారు?
- తాజ్ మహల్ కంటే ముందే, ప్రియురాలి కోసం చోళరాజు నిర్మించిన ‘ప్రేమ చిహ్నం’ కథ తెలుసా?
- కజఖ్‌స్తాన్: మీథేన్ గ్యాస్ మెగా-లీకేజి, కొన్ని నెలలుగా విస్తరిస్తున్న ప్రమాదాన్ని బయటపెట్టిన బీబీసీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















