'ఉత్తరకాశీ సొరంగం నుంచి 41 మందిని కాపాడాను, ప్రతిఫలంగా మా ఇంటిని కూల్చేశారు' -ర్యాట్ హోల్ మైనర్ వకీల్ హసన్

వకీల్ హసన్

ఫొటో సోర్స్, SERAJ ALI/BBC

గత ఏడాది నవంబర్‌లో ఉత్తరకాశీలోని సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించే ఆపరేషన్‌లో పాల్గొన్నారు 'ర్యాట్ హోల్ మైనర్' వకీల్ హసన్. తాజాగా దిల్లీలోని ఖజురిఖాస్ ప్రాంతంలో ఉన్న ఆయన ఇంటిని దిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ (డీడీఏ) కూల్చేసింది.

ఈ ఇల్లు నిర్మించిన భూమి ప్రభుత్వానిదని డీడీఏ చెబుతుండగా, తనకు ఎటువంటి నోటీసు రాలేదని హసన్ అంటున్నారు.

“డీడీఏ అధికారులు, పోలీసులు బుధవారం బుల్డోజర్లతో అకస్మాత్తుగా వచ్చి నా ఇంటిని కూల్చివేయడం ప్రారంభించారు. ఏదైనా నోటీసు ఉందా అని అడిగాను. కానీ, వారు ఎటువంటి నోటీసు చూపించలేదు'' అని బీబీసీ అసోసియేట్ జర్నలిస్ట్ ఆసిఫ్ అలీతో హసన్ తెలిపారు.

ప్రభుత్వ పనులను అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ పోలీసులు తనను స్టేషన్‌కు తీసుకెళ్లి గంటల తరబడి కూర్చోబెట్టారని హసన్ అన్నారు.

వకీల్ హసన్

ఫొటో సోర్స్, SERAJ ALI/BBC

ఫొటో క్యాప్షన్, భగవతి అనే మహిళ నుంచి రూ. 38 లక్షలకు ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు హసన్ తెలిపారు.

రాత్రంత్రా రోడ్డుపైనే...

తన కుటుంబం మొత్తం ఫుట్‌పాత్‌పై కూర్చుందని, ఇరుగుపొరుగు వాళ్లు ఆహారం అందించారని హసన్ చెప్పారు.

“ఇల్లు కూల్చే సమయంలో నా భార్య ఇంట్లో లేదు. నా పిల్లలున్నారు. ఉత్తరకాశీలో కూలీలను మా నాన్న కాపాడారు, మీరు మా ఇంటిని కూల్చొద్దని అధికారులతో చెప్పారు'' అని తెలిపారు.

''మేం కొన్ని నెలల క్రితం కార్మికులను రక్షించినప్పుడు, దేశం మొత్తం మమ్మల్ని హీరోలను చేసింది, కానీ, ఈ రోజు నాకు జరిగింది ఇది'' అని హసన్ తెలిపారు.

తమకు న్యాయం జరిగే వరకు నిరాహార దీక్ష చేపడతామని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో చాలా ఇళ్లు ఉన్నాయని, డీడీఏ అధికారులు వారిని టార్గెట్ చేస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారని హసన్ ఆరోపించారు.

‘‘కొంతకాలం క్రితం ఎంపీ మనోజ్‌ తివారీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ సమస్యను పరిష్కరించాలని కోరాను. మీ ఇల్లు ఎక్కడికీ వెళ్లదని హామీ ఇచ్చారు. 14 ఏళ్లుగా ఇక్కడే బతికాను" అని అన్నారు. భగవతి అనే మహిళ నుంచి రూ. 38 లక్షలకు ఈ ఇంటిని కొనుగోలు చేసినట్లు హసన్ తెలిపారు.

దిల్లీ

ఫొటో సోర్స్, SERAJ ALI/BBC

బీజేపీ, డీడీఏలు ఏమంటున్నాయి?

హసన్ ప్రకటనపై ఎంపీ మనోజ్ తివారీ వార్తాసంస్థ పీటీఐతో మాట్లాడుతూ “అవును, నేను ఆయనను కలిశాను. మీ ఇల్లు ఎక్కడికీ వెళ్లదనీ చెప్పాను, కానీ, మేం అక్కడికి వెళ్ళినప్పుడు భూమికి సంబంధించి కొన్ని సమస్యలున్నాయని అర్థమైంది. మేం వారికి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద చట్టబద్ధంగా ఇళ్లను అందజేస్తాం. దీనిపై హామీ ఇస్తున్నాం" అన్నారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

డీడీఏ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేస్తూ "ఫిబ్రవరి 28న ఖజూరి ఖాస్ ప్రాంతంలోని డీడీఏ భూములపై ఆక్రమణను తొలగించాం. ఈ స్థలం మా డెవలప్‌మెంట్ ల్యాండ్‌లో భాగం" అని అన్నారు.

ఆ ప్రాంతంలో అనేక అక్రమ ఇళ్లను కూల్చివేశారని పోలీసులు తెలిపారు. అయితే అక్కడ ఉన్న బీబీసీ కరస్పాండెంట్ సెరాజ్ అలీ మాట్లాడుతూ.. హసన్ ఇల్లు తప్ప, ఆ ప్రాంతంలో ఎక్కడా బుల్డోజర్ చర్యలు కనిపించడం లేదని చెప్పారు.

వకీల్ హసన్
ఫొటో క్యాప్షన్, ఉత్తరకాశీలో కార్మికుల రెస్క్యూ సమయంలో వకీల్ హసన్ దిగిన ఫోటో.

ప్రాణాలను కాపాడిన ర్యాట్ మైనర్స్

2023 నవంబర్లో ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్‌‌పై శిథిలాలు పడటంతో అందులోనే 41 మంది కార్మికులు చిక్కుకున్నారు. వారిని బయటికి తీసుకురావడానికి యంత్రాలు పూర్తిగా సఫలీకృతం కాకపోవడంతో 'ర్యాట్ మైనర్లు' రంగంలోకి దిగారు.

ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో అత్యంత క్లిష్టమైన చివరి 10 నుంచి 12 మీటర్ల రంధ్రం తవ్వడంలో 'ర్యాట్ హోల్ మైనర్లు' ముఖ్యపాత్ర పోషించారు.

దీనికోసం పదిమందికి పైగా 'ర్యాట్ హోల్ మైనర్లు' పాల్గొన్నారు. వకీల్ హసన్, ఆయన సహచరులు ఇందులో ఉన్నారు.

ఈ 'ర్యాట్ హోల్ మైనర్లు' శిథిలాలను చేతులతోనే తొలగిస్తారు. దీంతో హసన్ బృందం సొరంగంలో రంధ్రం చేసి, కార్మికులను బయటికి తీసుకురావడానికి పూనుకున్నారు. ఉలి, సుత్తితో రాళ్లను కొట్టి, రోప్‌తో శిథిలాలను పైకి పంపించారు. ఇలా సొరంగంలో చాలా నెమ్మదిగా రంధ్రం తవ్వారు, ఈ పద్ధతి కార్మికుల సురక్షిత తరలింపునకు హామీ ఇస్తుంది.

ర్యాట్ హోల్ మైనింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

'ర్యాట్ హోల్ మైనింగ్' టెక్నిక్ ఏమిటి?

'ర్యాట్ హోల్ మైనింగ్' అనేది గనులలో బొగ్గును వెలికితీసే చాలా పాత టెక్నిక్.

భూమి లోపల చేతి పరికరాలతోనే చిన్న మార్గం ఏర్పాటు చేసి, దాని ద్వారా ఒక వ్యక్తి వెళ్లి బొగ్గును తీస్తారు. మేఘాలయ, జార్ఖండ్‌లోని మూసి ఉన్న గనులలో ఈ పద్దతిలో అక్రమ మైనింగ్ చేస్తుంటారు.

ఎలుకల బొరియలను పోలి ఉండటం వలన దీనిని 'ర్యాట్ హోల్ మైనింగ్' అనే పేరుతో పిలుస్తారు. ఇది చాలా ప్రమాదకరం.

అందుకే ఈ మైనింగ్ పద్దతిని 'నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్' నిషేధించింది,

2018 డిసెంబర్ 13న కసన్‌లోని బొగ్గు గనిలో 'ర్యాట్ హోల్ మైనింగ్' ద్వారా బొగ్గును వెలికితీస్తున్న 15 మంది కార్మికులు మరణించారు.

మేఘాలయలోని షిల్లాంగ్‌లోని 'నార్త్ ఈస్ట్ హిల్ యూనివర్శిటీ'లో పనిచేస్తున్న ప్రసిద్ధ జియాలజిస్ట్ దేవేష్ వాలియా బీబీసీతో మాట్లాడుతూ 'ర్యాట్ హోల్ మైనింగ్' చేసే వ్యక్తులు ఎక్కువగా కొండల్లోనే ఉంటారు. అక్కడి రాళ్లను చీల్చుకుంటూ లోపలికి వెళ్లే అనుభవం వారికి ఉంటుంది. వీళ్లకు కొండలు తెలుసు. అక్కడి రాళ్లూ తెలుసు. వాటికి ఎలా రంధ్రం చెయ్యాలో కూడా తెలుసు. ఆగర్ యంత్రం కూడా ఇక్కడ పని చెయ్యలేదు" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)