ఝార్ఖండ్: భర్తని కొట్టి స్పానిష్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం.. పోలీసులు ఏం చెప్తున్నారు

స్పానిష్ టూరిస్ట్‌పై అత్యాచారం

ఫొటో సోర్స్, FACEBOOK

ఫొటో క్యాప్షన్, ఝార్ఖండ్‌లో స్పానిష్ టూరిస్టుపై సామూహిక అత్యాచార ఘటనపై బాధితురాలు సోషల్ మీడియా వేదికగా వీడియో పోస్ట్ చేశారు.
    • రచయిత, రవి ప్రకాష్
    • హోదా, బీబీసీ హిందీ కోసం

స్పెయిన్‌కు చెందిన టూరిస్ట్‌పై ఝార్ఖండ్‌లో సామూహిాక అత్యాచారం కేసు నిందితుల్లో నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఆ రాష్ట్ర పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో ఝార్ఖండ్‌లో శాంతిభద్రతలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ పార్టీలు ఝార్ఖండ్ ప్రభుత్వం, పోలీసులపై విమర్శలు చేస్తున్నాయి.

“ఈ ఘటనతో సంబంధం ఉన్న నలుగురిని అరెస్ట్ చేశాం. మరో ముగ్గురు నిందితులను గుర్తించాం. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటాం” అని ఝార్ఖండ్ డీజీపీ అజయ్ కుమార్ సింగ్ వెల్లడించారు.

ఝార్ఖండ్ ముఖ్యమంత్రి చంపయీ సోరెన్ దీనిపై నివేదికను సమర్పించాల్సిందిగా ఆదేశించారు.

“నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.

ఝార్ఖండ్‌లో విదేశీ పర్యటకురాలిపై సామూహిక అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

అసలు ఏం జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు?

ఝార్ఖండ్‌లో విదేశీ టూరిస్టుపై అత్యాచారం

ఫొటో సోర్స్, FACEBOOK

సోషల్ మీడియాలో పోస్ట్‌ ..

బ్రెజిల్‌కు చెందిన స్పానిష్ పౌరురాలు హియానా తన భర్త జాన్ (పేర్లు మార్చాం)తో కలిసి సోషల్ మీడియా వేదిక ఇన్‌స్టాగ్రామ్‌లో మార్చి 2న తమకు జరిగిన ఘటన గురించి పోస్ట్ చేశారు.

ఆ పోస్ట్‌తోపాటు రెండు వీడియోలను కూడా పోస్ట్ చేశారు. ఆ అకౌంట్‌ను భార్యాభర్తలిద్దరూ కలిసి నిర్వహిస్తున్నారు.

ఆ వీడియోలో తమకు జరిగిన ఘటన గురించి వారు స్పానిష్ భాషలో వివరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.

“మాకు జరిగినట్లు మరెవరికీ జరగకూడదు. ఏడుగురు నాపై అత్యాచారానికి పాల్పడ్డారు. మమ్మల్ని కొట్టి, దోచుకున్నారు. వారికి కావల్సింది నాపై అత్యాచారం చేయడమే అందుకే మమ్మల్ని విడిచిపెట్టారు. మేం ఇప్పుడు పోలీసులతో ఆసుపత్రిలో ఉన్నాం. ఈ ఘటన ఇండియాలో జరిగింది” అని ఆమె వీడియోలో చెప్పారు.

మరో వీడియోలో జాన్ మాట్లాడుతూ, “నా ముఖంపై గాయాలయ్యాయి. కానీ నా భార్య పరిస్థితి నాకన్నా దారుణంగా ఉంది. హెల్మెట్‌తో వారు నాపై చాలాసార్లు దాడి చేశారు. అదృష్టవశాత్తూ హియానా కోట్ వేసుకోవడం వల్ల గాయాల తీవ్రత తగ్గింది. ఇదిగో చూడండి” అంటూ గాయాలను చూపారు.

ఆ వీడియోను ఆసుపత్రిలో రికార్డు చేశారు. వారి ముఖాలపై గాయాలు ఉన్నట్లుగా వీడియోలో కనిపించింది.

అనంతరం హియానా తన వ్యక్తిగత ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో పోలీసులు కేసుకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని కోరారని, విచారణలో సమస్యలు ఎదురవుతాయని వారు చెప్పారని పేర్కొంటూ ఓ పోస్ట్ పెట్టారు.

కుమ్రాహట్‌లో యువతిపై సామూహిక అత్యాచారం

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC

ఆరునెలలుగా భారత్‌లో పర్యటన

జాన్, హియానాలు స్పానిష్ టూరిస్టులు. జాన్ స్పెయిన్‌లోని గ్రెనెడా నగరానికి చెందిన వ్యక్తి.

హియానా బ్రెజిల్‌కు చెందినవారు. స్పానిష్ పౌరసత్వం తీసుకున్నారు. ఇద్దరికీ స్పెయిన్ పాస్‌పోర్టులు ఉన్నాయి.

సోషల్ మీడియా అకౌంట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం భార్యాభర్తలిద్దరూ కలిసి మోటార్‌సైకిల్‌పై ప్రపంచ యాత్ర మొదలుపెట్టారు.

గడిచిన ఐదేళ్లలో 66 దేశాల్లో 1.7 లక్షల కిలోమీటర్లు బైక్‌పై ప్రయాణం సాగించారు.

భారత్‌లో యాత్ర అనంతరం నేపాల్ మీదుగా ఆస్ట్రేలియా వెళ్లాల్సి ఉంది. ఇద్దరూ చెరో బైక్‌పై ఈ యాత్ర కొనసాగిస్తున్నారు.

ప్రపంచ యాత్రలో ఇరాన్, ఇరాక్, తుర్కియే, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌదీ అరేబియా, జోర్డాన్, ఇటలీ, జార్జియాతోపాటు అఫ్గానిస్తాన్ దేశాల్లో పర్యటించారు.

గత ఆరు నెలలుగా భారత్‌లో వారి యాత్ర కొనసాగుతోంది.

ఝార్ఖండ్‌కు చేరుకోవడానికి ముందు దక్షిణ భారత దేశంలోని పర్యటక ప్రదేశాలతో పాటు కశ్మీర్, లద్దాఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలను సందర్శించారు.

సోషల్ మీడియా వేదికలైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లలో వారికి లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.

స్పానిష్ టూరిస్టుపై అత్యాచారం

ఫొటో సోర్స్, Getty Images

ఝార్ఖండ్‌లో ఏం జరిగింది?

హియానా, జాన్‌లు వేర్వేరు బైక్‌లపై ఝార్ఖండ్ మీదుగా భగల్‌పూర్‌కు ప్రయాణిస్తున్నారు. బిహార్ మీదుగా నేపాల్ వెళ్లాలనేది వారి ప్రణాళిక.

భారత్‌లో టూరిస్ట్ వీసాపై వారి ప్రపంచ యాత్ర కొనసాగుతోంది.

మార్చి 1 రాత్రి దుమ్కా జిల్లాలోని కుర్మాహట్(కుంజీ) గ్రామంలో రహదారికి సమీపంలో టెంట్ ఏర్పాటు చేసుకుని వారు నిద్రిస్తున్నారు.

ఆ సమయంలో కొంతమంది వ్యక్తులు టెంట్ దగ్గరకు వెళ్లారు. వారు మరికొంత మంది స్నేహితులను అక్కడికి రప్పించి, టెంట్‌లోకి వెళ్లి హియానాను బంధించారు.

జాన్, హియానాలపై దాడి చేసి కొట్టారు, వారి నుంచి దోచుకున్నారు. ఆ సమయంలో హియానాపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు.

ఆ ఘటనతో భయభ్రాంతులకు గురైన జాన్, హియానాలు వారి సామగ్రిని తీసుకుని రోడ్డు మీదకు వచ్చారు. 10:30 గంటల సమయంలో అక్కడికి వెళ్లిన హంస్‌డిహా పోలీస్ స్టేషన్‌కు చెందిన పెట్రోలింగ్ సిబ్బంది వారిని గుర్తించి, సరైయాహాట్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు.

సామూహిక అత్యాచారం

ఫొటో సోర్స్, RAVI PRAKASH/BBC

సంభాషించడంలో ఇబ్బందులు..

పెట్రోలింగ్ సమయంలో తమ పోలీసులు ఆ దంపతుల పరిస్థితిని చూసి, వారికి ఏదో జరిగిందని అర్థం చేసుకున్నప్పటికీ, భాషాపరమైన సమస్య వల్ల ఏం జరిగిందో నేరుగా అడిగి తెలుసుకోవడంలో ఇబ్బంది ఎదురైందని దుమ్కా ఎస్పీ పీతాంబర్ సింగ్ ఖెర్వార్ తెలిపారు.

బీబీసీతో ఆయన మాట్లాడుతూ, “భాషాపరమైన ఇబ్బందుల వల్ల వారితో నేరుగా సంభాషణ జరపడం కష్టమైంది. వారు స్పానిష్ మాత్రమే మాట్లాడుతున్నారు. వారు మాట్లాడే ఇంగ్లిష్ కూడా అర్థం కాలేదు. మా పోలీసులేమో వారితో హిందీలో మాట్లాడారు. అందువల్ల వారికి ఏం జరిగిందనేది వెంటనే తెలుసుకోలేకపోయాం” అని బీబీసీతో చెప్పారు ఎస్పీ.

ఆయన మాట్లాడుతూ, “ఆసుపత్రికి చేరుకున్నాక గూగుల్ ట్రాన్సలేటర్ సాయంతో వారు పోలీసులకు ఏం జరిగిందో మొత్తం వివరించారు. నేరానికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు వివరాలు చెప్పారు. జరిగిన ఘటనకు సంబంధించిన సమాచారం అర్ధరాత్రి దాటాక నాకు తెలిసింది. వెంటనే అక్కడికి చేరుకున్నాను.

అదే రాత్రి నిందితుల్లో ఒకరిని పట్టుకున్నాం. దర్యాప్తులో అతడు నేరానికి పాల్పడినట్లు అంగీకరించాడు. అతడి నుంచి మిగిలిన వారి పేర్లు, సమాచారం రాబట్టాం. ఆ ఘటనతో సంబంధం ఉన్న నలుగురు అరెస్టయ్యారు. మరో ముగ్గురిని పట్టుకునేందుకు ఆపరేషన్ చేపట్టాం. మా బృందాలు అదే పనిలో ఉన్నాయి” అని ఆయన చెప్పారు.

కేసుకు సంబంధించిన వివరాలు తెలుపుతూ, “ఈ కేసు విదేశీయులకు సంబంధించింది. అందువల్ల మేం దర్యాప్తులో ఇంటర్నేషనల్ ప్రొటోకాల్‌ను అనుసరిస్తున్నాం. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించాం. ప్రస్తుతం వారికి దుమ్కాలో భద్రత నడుమ ఉన్నారు” అని తెలిపారు.

సీఆర్పీసీ 164 సెక్షన్‌ను అనుసరించి బాధితుల వాంగ్మూలం నమోదు చేసినట్లు తెలిపారు ఎస్పీ.

అయితే, ఆ విదేశీ పర్యటకుల సందర్శన, విడిదికి సంబంధించిన సమాచారం దుమ్కా పోలీసులకు తెలియదని అన్నారు.

అసెంబ్లీలో ప్రస్తావన

బీజేపీ ఎమ్మెల్యే అమిత్ మండల్ ఝార్ఖండ్ అసెంబ్లీలో ఈ ఘటనపై ప్రస్తావించారు. పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బాబూలాల్ మరండి ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

“ఝార్ఖండ్‌లో నేరస్తులు పెట్రేగిపోతున్నారు. నేరాల సంఖ్య పెరిగిపోతోంది. ఈ ఘటనతో దేశ ప్రతిష్ట మసకబారుతోంది. దీనికి ఝార్ఖండ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలి” అన్నారు.

“సిగ్గుపడాల్సిన ఘటన ఇది” అని కాంగ్రెస్ ఎమ్మెల్యే దీపికా పాండే సింగ్ అన్నారు.

“మిగిలిన నిందితులను కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. ఈ కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిగేలా చూడాలని ముఖ్యమంత్రిని మేం డిమాండ్ చేస్తున్నాం. నిందితులను సాధ్యమైనంత త్వరగా శిక్షించాలి” అన్నారు.

స్పందించిన ఎంబసీ..

భారత్‌లోని స్పానిష్ ఎంబసీ అధికారులు సమాచారం తెలుసుకుని, ఝార్ఖండ్‌ అధికారులను సంప్రదించారు.

ఎంబసీ అధికారి దుమ్కాకు వెళ్లి బాధితురాలిని కలిసి, కేసుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుంటారని మీడియా కథనాల్లో పేర్కొన్నారు.

మహిళలపై అత్యాచారం
ఫొటో క్యాప్షన్, ఝార్ఖండ్‌లో మహిళలపై హింస పెరుగుతోందని నివేదికలు చెప్తున్నాయి.

రోజుకు నాలుగు కన్నా ఎక్కువ అత్యాచార ఘటనలు..

ఝార్ఖండ్‌లో మహిళలపై హింస రోజురోజుకీ పెరుగుతోంది.

ఝార్ఖండ్ పోలీస్ వెబ్‌సైట్‌లో పేర్కొన్న వివరాల ప్రకారం సగటున రాష్ట్రంలో రోజూ నలుగురు కన్నా ఎక్కువ మంది మహిళలు అత్యాచారానికి గురవుతున్నారు.

గడిచిన తొమ్మిదేళ్లలో అంటే, 2015 నుంచి 2023 మధ్యకాలంలో రాష్ట్రంలో 13,533 అత్యాచార ఘటనలు నమోదయ్యాయి. ఆయా కేసుల్లో నిందితులకు విధిస్తున్న శిక్షలు సంతృప్తికరంగా లేవు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)