లాలూ ప్రసాద్ యాదవ్: ‘మోదీ ఈసారి గెలవరనే నేను అనుకుంటున్నా’

- రచయిత, రూపా ఝా
- హోదా, ఇండియా హెడ్, బీబీసీ న్యూస్
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇండియా’ కూటమి మాత్రమే గెలుస్తుందని రాష్ట్రీయ జనతా దళ్ అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ అన్నారు. బీబీసీ ఇండియా హెడ్ రూపా ఝాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో లాలూ ఈ విధంగా అన్నారు.
పట్నాలోని గాంధీ మైదాన్‌లో ‘ఇండియా’ కూటమి నిర్వహించే ర్యాలీలో లాలూ పాల్గొంటారా? అని ప్రశ్నించగా, కచ్చితంగా తాను ర్యాలీలో పాల్గొంటానని చెప్పారు. ర్యాలీకి అంతా సిద్ధమవుతోందని తెలిపారు.
‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమైపోతుందనడం నిజం కాదని, అది తిరిగి క్రియాశీలంగా మారుతుందని అన్నారు. బీజేపీ గెలుస్తుందనే అంచనాలను కొట్టిపారేసిన లాలూ, మీడియా పిరికిపందగా మారిందని, అమ్ముడుపోయిందని ఆరోపించారు.
‘‘మీడియా అమ్ముడుపోయింది. వారి మనసులో కేవలం మోదీ మంత్రమే ఉంది. కానీ, ఈసారి మోదీ రారు. మోదీ రారు అనేది నా అంచనా. ఇండియా కూటమే గెలుస్తుంది’’ అని తెలిపారు.
‘ఇండియా’ కూటమిపై ఇటీవల చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ కూటమిలో ముఖ్యమైన భాగస్వాములుగా ఉన్న చాలా మంది పక్కకు తప్పుకుంటున్నారు. వారిలో ఒకరు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్.
‘ఇండియా’ కూటమిలో నితీశ్ కుమార్‌ను ముఖ్యమైన నేతగా భావించారు. కానీ, ఆయన ఇటీవల ఈ కూటమి నుంచి తప్పుకుని, బిహార్‌లో బీజేపీ మద్దతుతో తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మాత్రమే కాక, ఉత్తర ప్రదేశ్‌లోని జయంత్ చౌధరి పార్టీ రాష్ట్రీయ లోక్ దళ్(ఆర్‌ఎల్‌డీ) కూడా ఎన్డీయేలో చేరింది.
కీలకమైన విపక్షనేత అయిన లాలూ ప్రసాద్ యాదవ్ కూడా ఇటీవలి కాలంలో అనారోగ్య కారణాలతో రాజకీయాల్లో చురుకుగా కనిపించడం లేదు.
ఆయన కుమారుడు, బిహార్ మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తేజస్వి యాదవ్ రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, లాలూ ప్రసాద్ యాదవ్ తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. ‘ఇండియా’ కూటమి గురించి ప్రస్తావించారు.
‘‘అందరూ మళ్లీ ఒక తాటిపైకి వస్తున్నారు. కానీ, చాలా మంది బయటకు కూడా వెళ్లిపోయారు. బయటకు వెళ్లినవారు వెళ్లిపోయారు. కానీ, ప్రజలు మాత్రం మమ్మల్ని వదిలి వెళ్లిపోలేదు’’ అని చెప్పారు.
‘ఇండియా’ కూటమి ఏర్పాటులో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత అయిన మమతా బెనర్జీ కూడా ముఖ్యమైనవారు. కానీ, కొన్ని రోజుల కిందట బెంగాల్‌లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని ఆమె ప్రకటించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో పాల్గొనేందుకూ ఆమె నిరాకరించారు.
మమతా బెనర్జీ విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర విభాగం కూడా కఠిన వైఖరిని అనుసరిస్తోంది. సందేశ్‌ఖాలీ ఘటనపై, కాంగ్రెస్ స్థానిక నేతలు చాలా మంది మమతా బెనర్జీకి వ్యతిరేకంగా మాట్లాడారు.
విపక్షాల కూటమిలో ఒకప్పుడు ప్రధాన నాయకురాలిగా ఉన్న మమతా బెనర్జీ, ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి దిగితే ప్రభావమెంత? అని ప్రశ్నించగా.. మమతా బెనర్జీ ‘ఇండియా’ కూటమిని విడిచిపెట్టరని లాలూ చెప్పారు.
ఆమె ‘ఇండియా’ కూటమితోనే ఉంటారని తెలిపారు.
ఉత్తర ప్రదేశ్, దిల్లీలలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీలకు మధ్య సీట్ల పంపకం విషయంలో ఒప్పందం కుదరదని ఒకానొక సమయంలో అనిపించింది. కానీ, ఇటీవలి ఈ విషయంలో ‘ఇండియా’ కూటమి విజయం సాధించింది.
ఉత్తర ప్రదేశ్‌లో సీట్ల పంపకం విషయంలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ మధ్య ఒప్పందం కుదిరింది. అలాగే, దిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య కూడా సఖ్యత కుదిరింది.
ఈ కూటమిలో రాహుల్ గాంధీ ప్రధాన నాయకుడు. ప్రస్తుతం ఆయన దిల్లీలో కూర్చొని కూటమి కోసం పనిచేసేందుకు బదులు యాత్రల్లో పాల్గొంటున్నారని కొందరు విమర్శిస్తున్నారు. ఆయన అతిపెద్ద బలహీనత ఏమని మీకు అనిపిస్తోంది? అని బీబీసీ ప్రశ్నించింది.
ఈ ప్రశ్నకు స్పందించిన లాలూ.. ‘‘ఆయనలో బలహీనత ఏమీ లేదు. కేవలం కూర్చున్నంత మాత్రన పనులు కావు. ప్రజల్లో చైతన్యం కల్పించాలి. అది చాలా ముఖ్యం. అయితే, ఆయన అందరినీ కలుపుకొని వెళ్లడం లేదని కొందరు విమర్శిస్తున్నారు. అలాంటిదేమీ లేదు’’ అని చెప్పారు లాలూ.
ఆయనకు, ఇండియా కూటమికి ఒక సలహా ఇవ్వమంటే ఏం ఇస్తారు? అని ప్రశ్నించగా.. ‘‘సలహా ఇవ్వమంటే, సమయం ఎక్కువ లేదని చెబుతాను. తిరగడం ఆపేసి, అందరినీ కలుపుకొనిపోవాలని చెబుతాను. సీట్ల సర్దుబాటుపై దృష్టి పెట్టాలని చెబుతాను’’ అని తెలిపారు.
లాలూ ప్రసాద్ యాదవ్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో, నళిన్ వర్మతో కలిసి రాసిన పుస్తకం ‘గోపాల్‌గంజ్ టూ రైసీనా’పై కూడా మాట్లాడారు.
కర్పూరీ ఠాకూర్, లోహియా, జగ్దేవ్ తన ఆదర్శ నేతలని లాలూ చెప్పారు.
‘‘పీడిత ప్రజల కోసం జగ్దేవ్ ప్రసాద్ జీవితాన్నే త్యాగం చేశారు’’ అని తెలిపారు. పేద ప్రజల తరఫున మాట్లాడుతున్న సమయంలో ఆయనపై కాల్పులు జరిగాయి. దీంతో, ఆయన మరణించారని చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అడ్వాణీ రథయాత్ర
లాలూ తన పుస్తకంలో బీజేపీ మాజీ అధ్యక్షులు, మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్‌కే అడ్వాణీ చేపట్టిన రథయాత్రను, బిహార్‌లో దాన్ని ఆపేసిన తీరును వివరించారు.
ఈ ఘటన 1990 నాటికి చెందినది. అప్పుడు బీజేపీ నేత ఎల్‌కే అడ్వాణీ రథయాత్ర చేపట్టారు. కానీ, ఆయన రథయాత్ర బిహార్‌లో ఆపేశారు.
ఆ సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ బిహార్ ముఖ్యమంత్రి. లాలూ తన రాజకీయ జీవితంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయంగా దీన్ని భావిస్తారు.
ఈ సంఘటన గురించి లాలూ గుర్తుకు చేసుకున్నారు. ‘‘అది మా బాధ్యత. బిహార్‌కు, దేశానికి మేం ఒక సందేశం పంపాలని అనుకున్నాం. సెక్యులర్ సందేశాన్ని ఇవ్వాలని అనుకున్నాం. హింసను ఎట్టిపరిస్థితుల్లోనూ సహించకూడదు. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. ఎవరైనా మన రాజ్యాంగంపై దాడిచేస్తే అసలు సహించకూడదు’’ అని అన్నారు.
‘‘దాన్ని దృష్టిలో పెట్టుకొనే అడ్వాణీనీ ఒప్పించేందుకు మేం దిల్లీ వెళ్లాం. కానీ, ఆయన ఒప్పుకోలేదు. ఆయన చాలా మాటలు అన్నారు. కానీ, మిమ్మల్ని వదిలిపెట్టనని చెప్పాను. అలానే సమస్తిపుర్‌లో ఆయనను అరెస్టు చేశాం. ఆ సమయంలో దేశం మొత్తం అల్లర్లు జరిగాయి. కానీ, ఇక్కడ ఆయన్ను మేం అరెస్టు చేసినప్పుడే, కేంద్రంలో వీపీ సింగ్ ప్రభుత్వం పడిపోయింది. వారు (బీజేపీ) తమ మద్దతును వెనక్కి తీసుకున్నారు. దీంతో ప్రభుత్వం పడిపోయింది. బాబ్రీ మసీదును కాపాడే ప్రయత్నంలో మేం ప్రభుత్వాన్ని కోల్పోయాం’’ అని చెప్పారు.
ఆనాటి ప్రధాని వీపీ సింగ్ ఇలా చేయమని చెప్పారా అని ప్రశ్నించినప్పుడు.. ఏ వ్యక్తి లేదా ఏ నేత కూడా తనకేం చెప్పలేదని లాలూ చెప్పారు. అడ్వాణీని అరెస్ట్ చేసే నిర్ణయం తాను సొంతంగా తీసుకున్నట్లు తెలిపారు.
అలా చేయొద్దని అప్పటి హోం మంత్రి ముఫ్తి మహమ్మద్ సయీద్ చెప్పినట్లు మీరు మీ పుస్తకంలో ప్రస్తావించారు కదా అని ప్రశ్నించగా.. అవునని లాలూ తెలిపారు.
ఎల్‌కే అడ్వాణీ ఎప్పటికీ ప్రధానమంత్రి కాలేరని ఒకానొక సమయంలో లాలూ ప్రసాద్ అన్నారు. కానీ, ప్రస్తుతం ఆయనకు భారతరత్న ఇస్తున్నారు.
ఈ విషయంపై స్పందించిన లాలూ, ఆయనకు అభినందనలు చెప్పినట్లు తెలిపారు. అడ్వాణీ ప్రధానమంత్రి కావాల్సింది. కానీ, ఆయన స్థానంలో మోదీ వచ్చారని చెప్పారు.

‘మతతత్వ శక్తులతో అసలు రాజీపడలేదు’
రాజకీయ జీవితంలో మతతత్వ శక్తులతో ఎప్పుడూ రాజీ పడింది లేదని లాలూ చెప్పారు. భాగస్వాములుగా ఉన్న చాలా మంది రాజకీయ నేతలు, వారి పార్టీలు చాలాసార్లు తమ వ్యూహాలను మార్చుకున్నాయని తెలిపారు.
బిహార్‌లోనే చూసుకుంటే, నితీశ్ కుమార్ చాలా కాలం బీజేపీతో కలిసి ఉన్నారు. ఆ తర్వాత ఆర్‌జేడీతో కలిసి గ్రాండ్ అలయెన్స్‌లో భాగస్వామిగా మారారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. మళ్లీ బీజేపీలో చేరారు.
ఆయన మాత్రమే కాక, బిహార్‌లో జార్జ్ ఫెర్నాండెజ్, శరద్ యాదవ్, రామ్ విలాస్ పాశ్వాన్‌లు కూడా సమయానికి అనుగుణంగా బీజేపీతో రాజీపడుతూ వచ్చారు. కానీ, తానెప్పుడూ బీజేపీ వద్దకు వెళ్లలేదన్నారు.
ఈ విషయంలో మత శక్తుల ముందు తానసలు తలొగ్గేది లేదని తేల్చి చెప్పారు.
తేజస్వి యాదవ్ ఈ విషయంలో రాజీ పడతారా? అని ప్రశ్నించగా.. మత శక్తులతో తేజస్వి యాదవ్ అసలు రాజీపడరని చెప్పారు.
‘‘మేమెప్పుడూ నితీశ్ కుమార్ వద్దకు వెళ్లం. ఆయన మా వద్దకు పదేపదే వస్తారు’’ అని లాలూ తెలిపారు. నితీశ్ కుమార్ ‘ఇండియా’ కూటమిలోకి తిరిగి వస్తారా? అని ప్రశ్నించినప్పుడు, ఆయనెలా తిరిగి వస్తారు? అని చెప్పారు.
మీరు ఒక్కసారి మీ ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే, రాజకీయ నాయకుడిగా ఏ విషయాన్ని మీరు ఎక్కువ గుర్తుచేసుకుంటారని బీబీసీ ప్రశ్నించింది.
రాజకీయ నాయకుడిగా వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు, తమలాంటి కుటుంబంలో పుట్టి, ఎన్నో కష్టాలను అనుభవించి, ఈ స్థాయిలకు చేరుకోవడం ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుందని లాలూ అన్నారు.
ఇంత దూరం వస్తానని తానెప్పుడూ అనుకోలేదని చెప్పారు.
చరిత్రలో మిమ్మల్ని ఎలా గుర్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడిగా, నేను పేదలకు సాధికారత కల్పించాను. వారికి ఒక గళం ఇచ్చాను. వారి కోసమే నేను జైలుకు వెళ్లాను. చాలా వేదన అనుభవించాను. ప్రజలు దాన్ని గుర్తుపెట్టుకుంటారని సమాధానమిచ్చారు.
మీరు రాజకీయాల్లో క్రియాశీలంగా ఉన్నప్పడే కాదు ఇప్పుడు కూడా మీడియా మీకు చాలా కవరేజ్ ఇస్తోంది. దీని గురించి మీరేమంటారు? అని లాలూ ప్రసాద్‌ను బీబీసీ ఇండియా హెడ్ రూపా ఝా ప్రశ్నించారు.
‘‘మీడియా గురించి నేనేం చెబుతాను. నేను మిమిక్రీ చేస్తానని మీడియా చెప్పేది ’’ అని అన్నారు.
సమకాలీన రాజకీయాల్లో లాలూకు ఇష్టమైన రాజకీయ నేత ఎవరు? అని ప్రశ్నించగా.. తనకు ఇష్టమైన నాయకురాలు సోనియా గాంధీ అని లాలూ చెప్పారు. సోనియా గాంధీ చాలా తెలివైన, మంచి నాయకురాలని కొనియాడారు.
కానీ, ఇప్పుడు సోనియా గాంధీ రాజ్యసభకు వెళ్తున్నారు కదా? క్రియాశీల రాజకీయాలలో ఎవరికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మీరు అనుకుంటున్నారని ప్రశ్నించగా.. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్‌ల పేర్లను లాలూ ప్రసాద్ యాదవ్ చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- 'దెయ్యం సరస్సు'లోకి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయని షాక్ అవుతున్న జనం
- సీతాదేవి: రెండో పెళ్లి కోసం ఇస్లాం మతంలోకి మారిన ఈ పిఠాపురం యువరాణి కథ ఏంటి?
- పారిపోయిన ఇద్దరు పిల్లలు తిరిగి తమ ఇంటికి చేరుకోవడానికి 13 ఏళ్ళు పట్టింది... ఇన్నేళ్ళూ వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేశారు?
- దక్షిణ కొరియా మహిళలు పిల్లలను ఎందుకు కనడం లేదు, వారి సమస్యేంటి?
- గ్రీన్ అమ్మోనియా: కంపెనీలు దీని కోసం ఎందుకు పోటీ పడుతున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














