వీపీ సింగ్ కేబినెట్‌లోని పర్వతనేని ఉపేంద్ర దూరదర్శన్‌ను ఆయనపై ఆయుధంగా వాడుకున్నారా

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రేహాన్ ఫజల్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అవి 1989 లోక్‌సభ ఎన్నికలు.. జనతాదళ్‌కు 144 స్థానాలు లభించాయి. వామపక్షాలు, బీజేపీ మద్దతుతో ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అయితే, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్(వీపీ సింగ్) పేరుతో ఓట్లు అడిగిన జనతాదళ్ ఆయన్నే ప్రధానిని చేస్తామని ఎన్నికలకు ముందు అధికారికంగా ప్రకటించలేదు.
ఎన్నికల ఫలితాల తర్వాత ఒడిశా భవన్‌లో జరుగుతున్న సమావేశంలో వీపీ సింగ్‌తోపాటూ చంద్రశేఖర్, ములాయం సింగ్ యాదవ్, అరుణ్ నెహ్రూ, బిజు పట్నాయక్, దేవీలాల్ ఉన్నారు. అక్కడ చంద్రశేఖర్ నేరుగా వీపీ సింగ్‌తో "విశ్వనాథ్ మీరు నేతగా ఎన్నికల్లో దిగితే, నేను కూడా పోటీ చేస్తా" అన్నారు.
అప్పుడు చంద్రశేఖర్‌ను దేవీలాల్ మరో గదిలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎలాంటి ఎన్నిక లేకుండానే వీపీ సింగ్‌ను ప్రధానిని చేయాలనే ప్లాన్ రూపుదిద్దుకుంది.
ఇటీవల ప్రచురితమైన "వీపీ సింగ్, చంద్రశేఖర్, సోనియా గాంధీ అండ్ మీ" అనే పుస్తకంలో రచయిత సంతోష్ భారతీయ్ ఆనాటి ఘటనలను వివరించారు.
"అరుణ్ నెహ్రూ ఒక ప్లాన్ వేశారు. ఆయన మొదట బిజూ పట్నాయక్‌ను, తర్వాత దేవీలాల్‌ను సిద్ధం చేశారు. వాళ్ల ప్లాన్ ఏంటంటే, వీపీ సింగ్ స్థానంలో పార్లమెంటరీ పార్టీ నేతగా దేవీలాల్ పేరు ప్రతిపాదిస్తామని చంద్రశేఖర్‌కు చెబుతారు. ఆ ప్లాన్‌లో రెండో భాగాన్ని వీపీ సింగ్, చంద్రశేఖర్ ఇద్దరి దగ్గరా దాచారు. అదేంటంటే, దేవీలాల్ గెలిచినట్లు ప్రకటించిగానే, ఆయన తన తరఫున విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ పేరును ప్రతిపాదిస్తారు".
1989 డిసెంబర్ 2న పార్లమెంట్ భవనం సెంట్రల్ హాల్లో జనతాదళ్ ఎంపీల సమావేశం జరిగింది. అందులో సరిగ్గా అలాగే జరిగింది. దేవీలాల్ పేరును ప్రకటించగానే అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. కానీ దేవీలాల్ వీపీ సింగ్ పేరును ప్రతిపాదించగానే హాల్ అంతా కరతాళ ధ్వనులతో మారుమోగింది.

ఫొటో సోర్స్, Getty Images
చంద్రశేఖర్ వాకౌట్ చేశారు
కానీ, వీపీ సింగ్‌ను అలా నేతగా ఎన్నుకోవడం చంద్రశేఖర్‌కు కోపం తెప్పించింది. ఆయన హఠాత్తుగా లేచి నిలబడ్డారు. బయటకు వెళ్లే ముందు "నేను ఈ నిర్ణయాన్ని అంగీకరించను. దేవీలాల్‌ను నేతగా ఎన్నుకుంటారని నాకు చెప్పారు. ఇది మోసం. నేను సమావేశం నుంచి వెళ్లిపోతున్నా" అన్నారు.
జనతాదళ్ ప్రభుత్వం, పార్టీ విచ్ఛిన్నానికి ఆ రోజునే పునాదులు పడ్డాయి. తర్వాత చంద్రశేఖర్ తన ఆత్మకథ 'జిందగీ కా కారవాన్'లో ఆ రోజు గురించి రాశారు.
"ప్రభుత్వం ప్రారంభమే మోసపూరితంగా జరిగినట్లు నాకు అనిపించింది. అది చాలా నీచస్థాయి రాజకీయం. అందులో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ఒక అనైతిక వ్యక్తిగా ఆవిర్భవించారు. ఆయన ఆవిర్భావం రాజకీయాల్లో దిగజారుడుకు ప్రారంభం. అవినీతి అంశాన్ని వారు ఉద్వేగభరితంగా మార్చేశారు. ఒక అంశంపై ప్రజల ఉద్వేగాలను రెచ్చగొట్టినప్పుడు అక్కడ వాదనలకు అవకాశం తగ్గుతుంది. అవినీతి తగ్గించడానికి ఏయే సంస్థాగత ఏర్పాట్లు చేయాలో, వాటిని ఏర్పాటు చేయడం గురించి ప్రభుత్వం వచ్చాక వీపీ సింగ్ ఆలోచించలేదు" అని చెప్పారు.
పార్టీ నాయకుడి కోసం ఎన్నిక జరిగినా కూడా వీపీ సింగ్ మెరుగైన స్థితిలో ఉండేవారని సంతోష్ భారతీయ్ కూడా భావిస్తున్నారు.
ఎన్నికలో వీపీ సింగ్ గెలవడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది. తప్పుడు దారిలో వెళ్తే సరైన గమ్యానికి చేరుకోలేమనే గాంధీజీ మాట అక్కడ నిజమని నిరూపితమైంది. కానీ కుట్రలు చేసి వీపీ సింగ్‌ను ప్రధానిగా చేసిన వారు, భవిష్యత్తులో వీపీ సింగ్ కూడా కుట్రలతో గద్దె దించేయొచ్చని ఆలోచించలేదు. అదే జరిగింది. ఆయన్ను మరో రకం కుట్రతో తప్పించారు" అన్నారు.

ఫొటో సోర్స్, WARRIOR'S VICTORY PUBLISHING HOUSE
యశ్వంత్ సిన్హాను కేబినెట్ మంత్రిగా చేయలేదని గొడవ
వీపీ సింగ్ తన కేబినెట్ ఏర్పాటుచేసినపుడు యశ్వంత్ సిన్హాను సహాయ మంత్రిగా చేయాలనుకున్నారు.
కానీ, చంద్రశేఖర్ మాట విని యశ్వంత్ సిన్హా ఆ పదవిని తిరస్కరించారు.
దాంతో, వీపీ సింగ్ సుబోధ్‌కాంత్ సహాయ్‌ను సహాయ మంత్రిగా చేశారు.
చంద్రశేఖర్‌తో తన సంబంధాలు గాడిన పడ్డానికి ఆయన కీలక పాత్ర పోషిస్తారని అనుకున్నారు. కానీ అలా జరగలేదు.
చంద్రశేఖర్, వీపీ సింగ్ మధ్య సహాయ్ వారధి కాలేకపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
ప్రమాణ స్వీకారం రోజున ఏం జరిగిందో యశ్వంత్ సిన్హా తర్వాత తన ఆత్మకథ 'రెలెంట్‌లెస్'లో రాశారు.
‘‘నేను రాష్ట్రతి భవన్ చేరుకుని కేబినెట్ సెక్రటరీ టీఎన్ శేషన్ ఇచ్చిన కవర్ తెరిచి చూడగానే, అందులో ప్రధాన మంత్రి సలహాతో రాష్ట్రపతి నన్ను సహాయ మంత్రిగా నియమించినట్లు ఉంది.
వీపీ సింగ్ నాకు న్యాయం చేయలేదని అనిపించింది. పార్టీలో నా సీనియారిటీ, ఎన్నికల ప్రచారంలో నా పాత్ర దృష్ట్యా జూనియర్ మంత్రి పదవి తీసుకోకూడదని నిర్ణయించుకున్నాను.
పది సెకన్లలో ఆ నిర్ణయం తీసుకుని, తర్వాత నా భార్య చెయ్యి పట్టుకుని, చిన్నగా 'ఇక వెళ్తాం పద' అని చెప్పాను" అని రాశారు.

ఫొటో సోర్స్, BLOOMSBURY
దేవీలాల్ ఉప ప్రధాని అయ్యారు
1989 డిసెంబర్ 2 రాష్ట్రపతి ఆర్.వెంకటరామన్ వీపీ సింగ్‌తో ప్రధానిగా పదవికి ప్రమాణం చేయించారు. ఆయనతోపాటూ దేవీలాల్ ఉప ప్రధానిగా ప్రమాణం చేశారు. భారత రాజ్యాంగంలో ఉప ప్రధాని పదవి గురించి ఎలాంటి నిబంధనలూ లేవు. అందుకే ఉప ప్రధాన మంత్రి ప్రమాణ పత్రంలో ఆయనను మంత్రిగా రాశారు.
వీపీ సింగ్ జీవిత చరిత్ర 'ద లోన్లీ ప్రాఫెట్ వీపీ సింగ్ ఎ పొలిటికల్ బయోగ్రఫీ'లో రచయిత సీమా ముస్తాఫా ఆ విషయం రాశారు.

ఫొటో సోర్స్, RAJKAMAL PRAKASHAN
"దేవీలాల్ ముందే సిద్ధం చేసిన ప్రమాణ పత్రాన్ని చూడకుండా ఉప ప్రధాన మంత్రి అన్నారు. రాష్ట్రపతి వెంకటరామన్ ప్రమాణ పత్రంలో ఉన్నట్టు చదవాలని ఆయనకు చెప్పారు. కానీ దేవీలాల్ ఆయన మాటలు పట్టించుకోలేదు. రెండు సార్లు చెప్పి చూసిన తర్వాత వెంకటరామన్ ఆయన్ను సరిదిద్దాలనే ప్రయత్నం వదులుకున్నారు.
రుబయ్యా సయీద్ కిడ్నాప్
వీపీ సింగ్ ముస్లిం అది కూడా కశ్మీర్‌కు చెందిన నేత ముఫ్తీ మహమ్మద్ సయీద్‌ను హోంమంత్రిగా చేసి ఒక ప్రత్యేకమైన సందేశం ఇవ్వాలని ప్రయత్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఇందర్ కుమార్ గుజ్రాల్ తన ఆత్మకథ 'మాటర్ ఆఫ్ డిస్క్రిషన్'లో దాని గురించి కూడా రాశారు.
"ఈ చర్యతో వీపీ సింగ్ ఒక దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టారు. ఒకవైపు ఈ ప్రభుత్వంలో తనకు చాలా పరపతి ఉందని ఆయన మైనారిటీలకు సందేశం ఇచ్చారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి కావాలని ఆశలు పెట్టుకున్న దేవీలాల్, అరుణ్ నెహ్రూ ఇద్దరినీ పక్కన పెట్టేశారు" అని చెప్పారు.

ఫొటో సోర్స్, HAY HOUSE INDIA
"కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొన్ని రోజులకే వేర్పాటువాదులు ముఫ్తీ మహమ్మద్ సయీద్ కూతురు రుబయ్యా సయీద్‌ను కిడ్నాప్ చేయడంతో వీపీ సింగ్ ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ తగిలింది. ఆమెను విడుదల చేయడానికి బదులు ఐదుగురు వేర్పాటువాదులను విడుదల చేయాల్సివచ్చింది".
"ఇది పూర్తిగా మానవతా దృక్పథంతో తీసుకున్న నిర్ణయం. దీని దీర్ఘకాలిక ఫలితాలు సరిగా లేవు. దానివల్ల వీపీ సింగ్ మీద ఒత్తిడి తీసుకొస్తే ఏదైనా సాధించవచ్చు అనే సందేశం వెళ్లింది. ఆ ఒప్పందం చేసుకోకుండా ఉంటే చరిత్రలో ఒక విభిన్న ప్రధానిగా వీపీ సింగ్ పేరు నిలిచిపోయేది" అని సంతోష్ భారతీయ్ చెప్పారు.

ఫొటో సోర్స్, SAXENA SHARAD/THE THE INDIA TODAY GROUP VIA GETTY
ప్రభుత్వంపై అరుణ్ నెహ్రూ పట్టు
వీపీ సింగ్ హోంమంత్రి కావాలనుకున్న అరుణ్ నెహ్రూ ఆశలపై కూడా నీళ్లు చల్లారు. కానీ, ప్రభుత్వంపై అరుణ్ నెహ్రూ పట్టు అంతకంతకూ బిగుస్తూ వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, అదే అరుణ్ నెహ్రూ రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో వీపీ సింగ్‌కు బద్ధ శత్రువుగా ఉండేవారు.
కానీ, వీపీ సింగ్ పాలనాకాలంలో అరుణ్ నెహ్రూ మంత్రులందరిపై నిఘా పెట్టడమే కాదు, ప్రధానమంత్రి పేరున ఆదేశాలు ఇవ్వడం కూడా చేసేవారు.
ప్రభుత్వం ఏర్పాటు చేశాక వీపీ సింగ్ ఎక్కువగా అరుణ్ నెహ్రూను సలహాలు అడిగేవారనేది బహిరంగ రహస్యమే. మెల్లమెల్లగా అసలు అరుణ్ నెహ్రూనే ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారనే సందేశం వెళ్లడం మొదలైంది. అరుణ్ నెహ్రూ సలహాతోనే ఆయన జగ్‌మోహన్‌ను జమ్ము-కశ్మీర్ గవర్నర్‌గా నియమించారు.

ఫొటో సోర్స్, NEW AGE PUBLISHERS
సీమా ముస్తాఫా వీపీ సింగ్ జీవిత చరిత్రలో ఆ విషయం రాశారు.
"ఎమర్జెన్సీ సమయంలో దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ పదవిలో ఉన్న జగ్‌మోహన్ ముస్లిం వ్యతిరేక వైఖరిని అవలంబించారు. జమ్ము-కశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా వీపీ సింగ్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. దానిని వ్యతిరేకిస్తూ రాజీనామా కూడా చేశారు. చంద్రశేఖర్ బహిరంగంగా ఆయనను సమర్థించారు. ఈ అంశంపై ఆయన సొంత పార్టీ తీరునే వ్యతిరేకించారు".
వీపీ సింగ్ గుజరాత్ వెళ్లిన సమయంలో, జగ్‌మోహన్ జమ్ము-కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేశారు. తర్వాత కశ్మీరీ నేత మౌల్వీ మీర్వాయిజ్ ఫారూఖ్ శవయాత్రలో పోలీసులు ఫైరింగ్ జరిగింది. ఆ కాల్పుల్లో చాలా మంది చనిపోయారు. వీపీ సింగ్ చివరకు జగ్‌మోహన్‌ను తొలగించి, గిరీష్ సక్సేనాను అక్కడకు పంపించాల్సి వచ్చింది".

ఫొటో సోర్స్, RUPA PUBLICATION
వీపీ సింగ్‌కు వ్యతిరేకంగా దూరదర్శన్, పి.ఉపేంద్ర
విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ తన మంత్రులు అందరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ప్రధానమంత్రి కార్యాలయాన్ని ఒక విధంగా డమ్మీ చేశారు.
ఆ స్వేచ్ఛ ఏ స్థాయికి చేరిందంటే.. మంత్రుల మధ్య సమన్వయమే లేకుండా పోయింది.
కేబినెట్‌లో చాలా మంది ప్రధానులు ఉన్నారని అనిపించింది.
ప్రతి శుక్రవారం జరిగే పార్లమెంటరీ పార్టీ సమావేశానికి మంత్రులు రావడం కూడా మానేశారు.
వీపీ సింగ్‌కు అతిపెద్ద శత్రువు ఆయన ఇంట్లోనే ఉన్నారు. అదే దూరదర్శన్. ఎందుకంటే సమాచార, ప్రసార శాఖ మంత్రి పర్వతనేని ఉపేంద్ర మండల్ కమిషన్‌కు వ్యతిరేకం.
అప్పట్లో మండల్ కమిషన్ వ్యతిరేక నిరసనలు 75 శాతం దూరదర్శన్ వల్లే పెరిగాయి.
మండల్ కమిషన్ అంటే ఏంటి. దీనికి ఉపాధితో సంబంధం లేదని, ఇది సామాజిక న్యాయం కోసమేనని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని దూరదర్శన్ ఎప్పుడూ భావించలేదు.

ఫొటో సోర్స్, RUPA PUBLICATION
దేవీలాల్‌ను తొలగించారు
వీపీ సింగ్ ప్రభుత్వం రెండు కర్రల ఊతంతో నడుస్తోంది. అవే బీజేపీ, వామపక్షాలు. లాల్ కృష్ణ అడ్వాణీ అరెస్ట్ అయినప్పుడు 1990 అక్టోబర్ 23న బీజేపీ వీపీ సింగ్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉపసంహరించుకుంది. చివరికి నవంబర్ 7న జరిగిన విశ్వాస పరీక్షలో వీపీ సింగ్ ప్రభుత్వం మద్దతు కూడగట్టలేకపోయింది.
చంద్రశేఖర్ తన ఆత్మకథ 'జిందగీ కా కారవాన్'లో దేవీలాల్ తొలగింపు గురించి రాశారు.
"విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అంతకు ముందే దేవీలాల్‌ను ఉప ప్రధాని పదవి నుంచి తొలగించారు. దానికి చెప్పిన కారణాలు నాకు అర్థం కాలేదు. దేవీలాల్ అడుగడుగునా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని అన్నారు. అంతర్గతంగా అలా భావించారు. దానిపై ప్రధాని ఎవరి అభిప్రాయమైనా అడిగారో లేదో కూడా తెలీదు. దేవీలాల్‌తో ఆయనకు ఏవైనా అభిప్రాయ భేదాలు ఉంటే, అంత సీనియర్ నుంచి రాజీనామా తీసుకుని ఉండాల్సింది" అన్నారు.
"నిజానికి దేవీలాల్‌ను అవమానించడానికే మండల్ నినాదాలు లేవనెత్తారు. అప్పుడే, ప్రత్యామ్నాయంగా ఇప్పుడు మతం గురించి మాట్లాడదామని బీజేపీ ఆలోచించింది. రథయాత్ర ప్లాన్ వేసింది. ఈ ఘటనలతో ఎవరికి ఎలాంటి నష్టం జరిగిందనేది వేరే విషయం. కానీ, భారత రాజకీయాల్లో విధ్వంసక శక్తులు బలోపేతం అయ్యాయి".

ఫొటో సోర్స్, Getty Images
మండల్ వల్ల మద్దతు ఉపసంహరించిన బీజేపీ
ఇక్కడ, బీజేపీ తనకు చివరి వరకూ మద్దతిస్తుందని వీపీ సింగ్ ఎలా అనుకున్నారనే ప్రశ్న కూడా వస్తుంది. ఎందుకంటే రెండు పార్టీల భావజాలాలకు భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది.
ఇందిరా గాంధీ సెంటర్ ఆఫ్ ఆర్ట్స్ చీఫ్ రామ్ బహదూర్ రాయ్ తన 'మంజిల్ సే జాదా సఫర్'లో దాని గురించి రాశారు.
"బీజేపీ మీతో విడిపోతుందని మీరు ముందే అనుకున్నారా అని నేను వీపీ సింగ్‌ను అడిగాను. దానికి ఆయన 'నేను ప్రధానమంత్రిగా ప్రమాణం చేయగానే.. బీజేపీ మాతో ఎంతకాలం ఉండొచ్చనే లెక్కలేశాను. నేను కూర్చున్న పీఠంపై బీజేపీ కూర్చోవాలని అనుకుంటోందనేది స్పష్టంగా తెలుసు. వాళ్లు నన్ను వ్యతిరేకిస్తూనే ఎన్నికలకు వెళ్లాలి' అన్నారు" అని రాశారు.
"నేను బీజేపీ మా ప్రభుత్వానికి కనీసం రెండేళ్లు మద్దతివ్వచ్చు అని అప్పుడే అనుకున్నాను. మండల్ కమిషన్ సిఫారసుల అమలుతో వాళ్లు ఒక ఏడాది ముందే బటన్ నొక్కేశారు. మండల్ కమిషన్ అమలు చేయకపోతే, బీజేపీ మద్దతు కొనసాగుండేది అని వీపీ సింగ్ అన్నారు".

ఫొటో సోర్స్, Getty Images
జనతాదళ్ ఎంపీల్లో ఎక్కువ మంది మండల్ కమిషన్ కోరుకున్నారు
మండల్ కమిషన్ వీపీ సింగ్ మాస్టర్ స్ట్రోకా లేక విధిలేక తీసుకున్న నిర్ణయమా అని నేను సంతోష్ భారతీయ్‌ను అడిగాను.
"వీపీ సింగ్ సైద్ధాంతికంగా దీనిని అమలు చేయాలని అనుకునేవారు. ఆయన తన పార్టీ మ్యానిఫెస్టోను చేతిలో ఉంచుకునేవారు. ఆగస్టు 6న జరిగిన జనతాదళ్ పార్లమెంటరీ సమావేశంలో మండల్ కమిషన్ అమలు చేయాలని బలమైన డిమాండ్ వినిపించింది. ఏ సభ్యులు ఆ డిమాండ్ లేవనెత్తారో వారంతా తర్వాత పార్టీ మారారు. కానీ పార్టీ మానిఫెస్టోను అమలు చేయడానికి వీపీ సింగ్ ఈ డిమాండ్‌ను ఒక మెట్టుగా భావించారు" అని ఆయన సమాధానం ఇచ్చారు.

ఫొటో సోర్స్, SANTOSH BHARTIYA
"పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఒక్క ఎంపీ కూడా దీనిని అమలు చేయద్దని, లేదా క్రమంగా అమలు చేద్దామని అనలేదు. సామాజిక న్యాయం దిశగా వేసిన ఈ అడుగు సామాజిక న్యాయాన్ని వ్యతిరేకించే శక్తులకు షాక్ ఇచ్చింది. మండల్ కమిషన్ వల్ల ఎవరికి లబ్ధి చేకూరిందో, వారే దానికి వ్యతిరేకంగా నిరసనలు చేశారు"

రామ్ బహదూర్ రాయ్ తన పుస్తకంలో మండల్ కమిషన్ గురించి రాశారు.
"అరుణ్ నెహ్రూ, ఐకే గుజ్రాల్, రామకృష్ణ హెగ్డే మండల్ కమిషన్‌కు వ్యతిరేకమని వీపీ సింగ్ నాకు చెప్పారు. పార్టీలో ఈ అంశాన్ని లేవనెత్తింది రామకృష్ణ హెగ్డేనే. ఎందుకంటే మండల్ కమిషన్ సిఫారసుల్లో జాట్ లేరు. అందుకే అజిత్ సింగ్ కూడా ఆగ్రహించారు. కానీ, ఉత్తరప్రదేశ్, బిహార్ జనతాదళ్ ఎంపీల్లో 95 శాతం మంది మండల్ కమిషన్‌ను సమర్థించారు" అన్నారు.

ఫొటో సోర్స్, PRABHAT PRAKASHAN
మధ్యతరగతికి లక్ష్యంగా మారిన వీపీ సింగ్
మండల్ కమిషన్ అమలుతో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్‌కు వెనుకబడిన వర్గాల వారి నుంచి ప్రశంసలు లభించాయి. మరోవైపు మధ్యతరగతి వారిలో ఒక పెద్ద భాగం నుంచి ఆయన ఆగ్రహం కూడా రుచిచూడాల్సి వచ్చింది.
1990 నవంబర్ 7న రాత్రి 11 గంటల పాటు చర్చ కొనసాగిన తర్వాత 10.15కు విశ్వాస పరీక్ష జరిగింది. అందులో వీపీ సింగ్ ప్రభుత్వానికి 142, విపక్షాలకు 346 ఓట్లు వచ్చాయి.
తర్వాత రోజే జనతాదళ్‌లో చీలిక వచ్చింది. ఇద్దరు ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, చిమన్‌భాయి పటేల్ చంద్రశేఖర్ వైపు వెళ్లగా లాలూప్రసాద్ యాదవ్, వీపీ సింగ్ వైపు నిలిచారు.

ఫొటో సోర్స్, RUPA PUBLICATION
కొంతమంది ఎంపీలు చంద్రశేఖర్‌తో వెళ్లడంతో ఆయన సమాజ్‌వాదీ జనతాదళ్ పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేశారు.
కానీ, కాంగ్రెస్ బయటి మద్దతుతో ఏర్పాటైన వారి ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు నిలబడలేదు.
దాంతో, చంద్రశేఖర్ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది.
వీపీ సింగ్ 11 నెలల పాలనాకాలం గురించి, ఆయన కేబినెట్‌లో కీలక సభ్యుడైన ఇందర్ కుమార్ గుజ్రాల్ తన ఆత్మకథ 'మ్యాటర్ ఆఫ్ డిస్క్రిషన్'లో ఒక వ్యాఖ్య కూడా చేశారు.
‘‘వీపీ సింగ్ టీమ్‌లో లోపం ఉంది. ఆయన ప్రభుత్వ విధానాలు ప్రో-యాక్టివ్‌గా కాకుండా రీ-యాక్టివ్‌గా ఉన్నాయి. ఆయన తన మానిఫెస్టోపై యాంత్రికంగా ముందుకెళ్లారు. దాని సామాజిక పరిణామాల గురించి అంచనా వేయలేకపోయారు.
ఒక వ్యక్తిగా విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ అత్యుత్తమ ప్రమాణాలను అందుకున్నా, ఒక రాజకీయ వేత్తగా ఆయనకు సరైన దిశానిర్దేశం లేకుండా పోయింది. ఆయన దేశం మంచిని కోరుకున్నారు. కానీ మంచి సమన్వయకర్త, టీమ్ లీడర్ కాలేకపోయారు" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- అనకొండలు, పులులు, మొసళ్లను తప్పించుకుంటూ దట్టమైన అమెజాన్ అడవిలో 36 రోజులు గడిపాడు
- ‘కలకత్తాలోని చీకటి గదిలో 146 మంది బ్రిటిష్ సైనికులను బంధిస్తే తెల్లవారేసరికి 23 మందే మిగిలారు’
- డచ్ ప్రజలు ఎందుకంత పొడవుగా ఉంటారు? వాళ్లు వెల్లడిస్తున్న రహస్యాలేంటి
- ఇళ్ల మధ్యలో నెల రోజుల్లో వందకు పైగా భారీ గుంతలు ఏర్పడ్డాయి
- శ్రీలంక: ఆ రాతి చిత్రపటం పై విశ్వంలోకి అడుగుపెట్టే సీక్రెట్ కోడ్ ఉందా?
- ఏసీలు చల్లబరుస్తున్నాయా.. లేక వేడెక్కిస్తున్నాయా?
- ఇతను ప్రపంచంలోనే అత్యంత ఒంటరి మానవుడు
- బీరు తాగితే చల్లదనం వస్తుందా?
- తొమ్మిది కోట్ల సంవత్సరాల కిందట డైనోసార్లు తిరిగిన ప్రాంతం ఇదే..
- మైనస్ 60 డిగ్రీల చలిలో ప్రజలు ఎలా జీవిస్తారో తెలుసా!!
- సూపర్ ఫుడ్స్: ఇవన్నీ మీకు చౌకగా రోజూ దొరికేవే.. తింటున్నారా మరి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








