తేజస్వి యాదవ్: ఐపీఎల్‌లో నాలుగేళ్లు రిజర్వ్ బెంచ్‌కే పరిమితమైన క్రికెటర్ రాజకీయాల్లో ఎలా రాటుదేలారు

తేజస్వి యాదవ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సౌతిక్ బిస్వాస్
    • హోదా, బీబీసీ న్యూస్

ఒక క్రికెట్ ప్లేయర్‌గా తేజస్వి యాదవ్ ఓటమి పాలయ్యారు.

ఈ రాజకీయ వారసుడు క్రికెట్లో రాణించాలనే ఉద్దేశంతో స్కూల్ చదువుకు ఉద్వాసన చెప్పారు.

ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో నాలుగు సీజన్లు పాటు ఆడిన ఈయన 7 ఫస్ట్ క్లాస్ గేమ్స్ లో కేవలం 37 పరుగులే చేశారు.

2012లో యాదవ్ క్రికెట్ నుంచి తప్పుకొని సొంత రాష్ట్రమైన బిహార్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు.

తేజస్వి యాదవ్ బిహార్ ఎన్నికలలో రాణించే సమయం వచ్చిందని ఎగ్జిట్ పోల్స్అంచనా వేశాయి. యాదవ్ నేతృత్వం వహిస్తున్న రాష్ట్రీయ జనతా దళ్ కూటమి, ప్రభుత్వంలో ఉన్న జనతా దల్ యునైటెడ్ కూటమికి గట్టి పోటీ ఇచ్చి గెలుపును సాధిస్తుందని అంచనా వేశాయి.

15 ఏళ్ల పాటు బిహార్‌ని పాలించిన జనతా దల్ కూటమికి నితీష్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. దేశంలో ఉన్న ప్రాంతీయ నాయకులలో ప్రాబల్యం ఉన్న నితీష్ ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది. కానీ, ఈ కూటమి బీజేపీని కూడా ఒక కీలక భాగస్వామిగా పెట్టుకుంది. ఈ కూటమి తిరిగి విజయం సాధించేందుకు ప్రధాన మంత్రి మోదీ ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాలలో పాల్గొని ప్రసంగించారు. ఈ సభలకు ప్రజలు అధిక సంఖ్యలోనే హాజరయ్యారు.

మోదీ

ఫొటో సోర్స్, Getty Images

అయితే, యాదవ్ పార్టీకి రావడంలో కొంత ఆలస్యం జరిగింది. రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులన్నీ ఆయనకు వ్యతిరేకంగా మారాయి. అతని ప్రత్యర్ధులు అతనిని తేలికగా భావించి ఎగతాళి చేశారు.

అన్నిటి కంటే ముఖ్యంగా తేజస్వి తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ కున్న వారసత్వ ప్రతిష్టను కూడా వదిలించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

లాలు యాదవ్ అవినీతి కార్యకలాపాలకు గాను జైలు శిక్షను అనుభవించారు. 72 ఏళ్ల లాలు యాదవ్ బిహార్‌ని 15 సంవత్సరాల పాటు పాలించి అక్రమ పరిపాలనకు, అవినీతికి మారు పేరుగా నిలిచారు.

మోదీ తన ప్రసంగాలలో అక్కడ 'రాజ్యమేలిన ఆటవిక న్యాయం' గురించి ప్రజలకు మళ్లీ జ్ఞాపకం చేశారు. బిహార్ భారతదేశంలో ఉన్న పేద రాష్ట్రాలలో ఒకటి.

అయితే, చాలా మంది రాజకీయ వారసులలాగే యాదవ్ కి కూడా రాజకీయ ప్రవేశం బాగానే జరిగింది.

కుల సమీకరణలకు అత్యంత ప్రాధాన్యమున్న ఈ రాష్ట్రంలోని ఓటర్లలో మూడు వంతులు ఉండే యాదవులు, ముస్లింల మద్దతును కూడా ఆయనకు తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా అందుకున్నారు. ఈ కూటమిని లాలు ప్రసాద్ యాదవ్ చాలా కష్టపడి తయారు చేశారు.

"భూస్వామిక రాష్ట్రంలో చారిత్రకంగా వస్తున్న అగ్ర కులాల దోపిడీకి వ్యతిరేకంగా "సామాజిక న్యాయం, సమానత్వం కోసం పోరాడే ప్రయత్నమే తమ పార్టీ రాజకీయమని " ఆయన అభివర్ణించుకున్నారు.

ఈ ఎన్నికలలో యాదవ్ చాలా విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయన ప్రసంగాలను సూటిగా, క్లుప్తంగా ఉండేలా జాగ్రత్త వహించారు. కుల ప్రసక్తిని పెద్దగా తేకుండా ఉద్యోగావకాశాలు, వైద్య సదుపాయాల గురించి మాట్లాడారు. ఆయన తండ్రి తరహాలోనే సామాజిక న్యాయంతో కూడిన రాజకీయాలను కొత్తగా బ్రాండ్ చేసి ప్రదర్శించారు.

"ఆయన సాధించిన విజయం, లభించిన మద్దతు ఆయనకు వచ్చిన వారసత్వం నుంచి వేరు చేసి చూడలేం" అని బిహార్లో కుల సమీకరణాల పై అధ్యయనం చేసిన పొలిటికల్ ఆంత్రపాలజిస్ట్ జెఫ్రీ విట్సో అన్నారు.

యాదవ్ తన కుటుంబాన్ని మాత్రం ఈ ప్రచారం నుంచి దూరంగా ఉంచారు. లాలు తొమ్మిది మంది సంతానంలో తేజస్వి చిన్నవారు.

ఆయన ఇప్పుడున్న పరిస్థితులను ఎదుర్కోవల్సిన సమయం ఆసన్నమయింది.

కానీ, ఎన్నికలలో విజయానికి అవసరమైనన్ని ఓట్లను ఆయన సంపాదించుకోలేక పోయారు.

తేజస్వి

ఫొటో సోర్స్, Getty Images

తేజస్వి పార్టీ ఆర్జేడీ 144 స్థానాలలో పోటీ చేయగా అందులో 75 స్థానాల్లో విజయం సాధించింది.

బిహార్‌లో అతి పెద్ద పార్టీగా నిలిచింది. కానీ, ఆర్జేడీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ మాత్రం 70 స్థానాలలో పోటీ చేస్తే కేవలం 19 స్థానాలలో మాత్రమే గెలిచింది. దీంతో ఈ కూటమి బలం తగ్గిపోయింది. ఈ పోటీలో నితీశ్ కుమార్ నేతృత్వం వహిస్తున్న పార్టీ కూటమి విజయం సాధించింది.

"తేజస్వి పార్టీని మళ్ళీ పట్టాల పైకి తెచ్చారు. ఆయన ఓటర్లను మైమరిపించారు. అయితే ఆయన తన ప్రభావాన్ని పెంచుకోవడంలో విఫలమయ్యారు" అని దిల్లీ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ లో పరిశోధన చేస్తున్న రాహుల్ వర్మ అన్నారు.

పోటీ చేసిన 110 స్థానాలలో 74 స్థానాలను పొందిన బీజేపీ తొలి సారి కూటమిలో ప్రధాన భాగస్వామిగా అవతరించింది.

ఇది బిజెపి స్వతంత్రంగా సాధించిన విజయం కాదు.

బీహార్లో బిజెపి పాగా వేసి తనకు తానుగా గెలవడానికి ఇంకా చాలా సమయం పడుతుంది. "కానీ,సంక్షేమం పేరుతో, మతపరమైన విభజనలతో, కుల సమీకరణాల పట్ల స్పష్టమైన అవగాహన, కష్టపడి పని చేసే పార్టీ వ్యవస్థ, అధిక వనరులు, ప్రధాన సమాచార స్రవంతి మద్దతుతో బిజెపి బిహార్లో అయితే అడుగు పెట్టింది" అని విశ్లేషకులు అంటున్నారు.

మోదీ అనే బ్రాండ్ కి తగ్గని ఆదరణ వలన కూడా బిహార్ లో బిజెపి విజయం సాధించడానికి ఒక కారణమని ప్రముఖ రాజకీయ శాస్త్రవేత్త సుహాస్ పల్షికర్ అంటారు. "ఒక బ్రాండ్ లాగే దానిని ఏ రాష్ట్రంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా, ఏ పోటీని ఎదుర్కోవడానికైనా వాడుకోవచ్చు" అని ఆయన అన్నారు.

మోదీ భారతదేశంలో ఒక ప్రముఖ నాయకుడిగా ఉన్నారని బిహార్ ఎన్నికలు రుజువు చేస్తున్నాయి. అలాగే రాష్ట్రాల ఎన్నికలలో మోదీ పార్టీకి మిశ్రమ ఫలితాలున్నాయి. గత ఆరు సంవత్సరాలలో బిజెపి గెలిచిన రాష్ట్రాల కంటే ఓడిపోయిన ఎన్నికలే ఎక్కువగా ఉన్నాయి. నాలుగు సంవత్సరాల క్రితం ఉత్తర్ ప్రదేశ్లో మెజారిటీ సాధించిన తర్వాత మరే రాష్ట్రంలోనూ స్పష్టమైన మెజారిటీతో ఆ పార్టీ గెలవలేదు.

ఈ ఎన్నికలలో యాదవ్ ఇచ్చిన గట్టి పోటీ చూస్తుంటే భారతీయ ఎన్నికల చిత్రంపై ఒక ఒక కొత్త నమూనా తయారు అవుతోందని అనిపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.

"ఎన్నికలను ప్రాంతీయంగా ఉంచి, స్థానిక అంశాల పై దృష్టి పెట్టి స్థానిక నాయకులను బరిలోకి దించాలి. జాతీయ అంశాలను తెర మీదకు తెచ్చి మోదీ పై దాడి చేయకూడదు. మీ నాయకుడిని స్థానిక ప్రత్యర్థి నాయకునితోనే పోల్చండి" అని వర్మ అంటారు.

మరో విధంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలు తాము గతంలో పాలైన ఓటమి నుంచి తేరుకునే లోపు మోదీ నాయకత్వం వహిస్తున్న బిజెపి దేశమంతా తన ఉనికిని విస్తరించుకుంటూ భవిష్యత్తులో ఒక జాతీయ పార్టీగా కొన్నాళ్లపాటు కొనసాగే అవకాశం ఉందనే చెప్పుకోవచ్చు.

కానీ, రాష్ట్రాలలో ఎన్నికలలో విజయం సాధించడానికి మోదీ మీద ఆధారపడటం ఎప్పటికైనా మోదీకి భారంగా మారవచ్చనే అభిప్రాయం కేవలం పార్టీకి అవతలే కాదు, పార్టీ శ్రేణుల్లో కూడా ఉందని పల్షికర్ అంటారు. 31 సంవత్సరాల యాదవ్ కి రాజాకీయాల్లో రాణించడానికి ఇంకా సమయం ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)