300 ఏళ్ల క్రితం భారీ సంపదతో సముద్రంలో మునిగిపోయిన యుద్ధ నౌక.. దీని వెలికితీతకు చేపడుతున్న ఆపరేషన్ ఏమిటి?

ఫొటో సోర్స్, COLOMBIAN GOVERNMENT
- రచయిత, శాంటియాగో వానెగాస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
విలువ కట్టలేనంత భారీ సంపదతో 300 ఏళ్ల కిందట కరీబియన్ సముద్ర గర్భంలో మునిగిపోయిన అతిపెద్ద యుద్ధ నౌక శాన్ జోస్ మొట్టమొదటిసారి బయటి వాతావరణాన్ని చూసేందుకు సిద్ధమవుతోంది.
ఈ యుద్ధ నౌక అవశేషాలపై విచారణ చేపట్టి, వెలికి తీసేందుకు ‘ఇన్నొవేటివ్ టెక్నాలజీ’తో హైలెవల్ ఆపరేషన్‌ను త్వరలోనే చేపట్టనున్నామని కొలంబియన్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది.
ప్రపంచంలో అత్యంత విలువైన సంపదతో వెళ్తూ సముద్రంలో మునిగిపోయిన ఈ నౌకను బయటికి వెలికితీయాలని చాలా కాలంగా భావిస్తున్నారు.
శాన్ జోస్ 40 మీటర్ల పొడవున్న యుద్ధనౌక. ఇది స్పెయిన్‌కు చెందినది. కొలంబియాలోని కార్టజినా నగరానికి సమీపంలోని ద్వీప సమూహం రొసారియో దీవుల వద్ద 1708లో బారు యుద్ధ సమయంలో ఈ నౌక మునిగిపోయింది.
ఈ నౌక 600 మీటర్ల లోతులో ఉందని 2015లో కొలంబియా కనుగొంది.
‘‘సముద్రంలో మునిగిపోయిన అత్యంత విలువైన వారసత్వ సంపద అన్వేషణలో ఇది ఒకటి. ఒకవేళ అతిపెద్దది కాకపోతే, మానవజాతి చరిత్రలో ఇది ఒకటని కొందరు అంటున్నారు’’ అని అప్పటి అధ్యక్షుడు జువాన్ మాన్యువల్ శాంటోస్ చెప్పారు.
పురాతన పత్రాలను పరిశీలిస్తే, ఈ యుద్ధ నౌక, టన్నుల కొద్ది విలువైన సరుకును, బంగారం, వెండి, విలువైన రాళ్లను తీసుకు వెళుతోందని తెలిసింది.
‘‘పెరూ వైస్రాయల్టీ, కరేబియన్ నుంచి వచ్చిన సరుకును మార్పిడి చేసుకుని, పనామాలోని పోర్టోబెలో నౌకాశ్రయం గుండా ఈ నౌక వెళ్లింది‘‘ అని కొలంబియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ, హిస్టరీ డైరెక్టర్ అల్హెనా కైసెడో చెప్పారు.
‘‘వైస్రాయల్టీల నుంచి సేకరించిన సంపదలో కొంతభాగం దీనిలో ఉందని మాకు తెలుసు. ఈ యుద్ధ నౌకలో కొంత అక్రమ వాణిజ్యం, స్మగ్లింగ్, ఇతర అంశాలు కూడా ఉన్నాయని మాకు అనిపిస్తుంది’’ అని వివరించారు.

ఫొటో సోర్స్, Reuters
కొలంబియా సాంస్కృతిక వారసత్వ సంపద
ఈ యుద్ధ నౌకను 2020లో కొలంబియా సాంస్కృతిక వారసత్వ సంపదగా ప్రకటించింది. అందుకే, దీని విలువను నగదులో లెక్కించాలని ఆ దేశ ప్రభుత్వం చెప్పింది.
ఈ నౌకలో సగం సంపద తమదని చెప్పుకునే ఒక అమెరికా అన్వేషణ కంపెనీ, దీని విలువ 20 బిలియన్ డాలర్లు ఉండవచ్చని అంచనా వేసింది.
పురాతన పత్రాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం ఈ నౌక తీసుకెళ్లే కార్గో సంపద గురించి తెలిసింది. కానీ, ఈ నౌక మునిగిన ప్రదేశంలో లభించిన తొలి ఆధారాలు మాత్రం వీటిని ధ్రువీకరించలేదు.
2022లో కొలంబియాలోని నేషనల్ నేవీ, నేషనల్ మారిటైమ్ డైరెక్టరేట్ ఆఫ్ కొలంబియా ఈ నౌక కోసం తొలిసారి అన్వేషణ చేపట్టాయి. ఈ అన్వేషణలో ఇవి నౌకలోకి వెళ్లలేకపోయాయి. ఇవి విడుదల చేసిన చిత్రాల్లో క్యాన్‌లు, కొన్ని నాణేలు, కొంత చైనీస్ టేబుల్‌వేర్ ఉన్నట్లు అర్థమైంది.
జగ్గులు, సిరంజీలు, గ్లాస్‌లు, కొన్ని నాణేలను, కొన్ని రకాల మెటీరియల్స్‌ను గుర్తించామని, ఇవి ఈ యుద్ధ నౌకలో ఉన్న వాటి పరిస్థితి గురించి చెబుతున్నాయని కైసెడో వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆపరేషన్ కోసం ప్రత్యేక టెక్నాలజీ
2024 ఏప్రిల్ నుంచి మే మధ్య కాలంలో ఈ యుద్ధ నౌక అన్వేషణను చేపడతామని సాంస్కృతిక శాఖ మంత్రి జువాన్ డేవిడ్ కొరియా చెప్పారు. స్వీడిష్ డిజైన్‌లో, బ్రిటిష్ వారు తయారు చేసిన రోబోను ఈ నౌకలోకి దింపి, కొన్ని అవశేషాలను బయటికి తీసుకురానున్నట్లు తెలిపారు. ఇది రిమోట్‌తో పనిచేస్తుందన్నారు.
నీటి నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ అవశేషాలు ఏ విధంగా స్పందించనున్నాయో తాము పరిశీలించాలనుకొంటున్నామని ఆయన చెప్పారు.
‘‘ఒకసారి నీటి నుంచి బయటికి తీసుకొచ్చిన తర్వాత, ఈ వస్తువులు చాలా అధ్వానంగా మారనున్నాయి. ఎందుకంటే, ఇవి 300 ఏళ్లకు పైగా గణనీయమైన నీటి ఒత్తిడిలో ఉన్నాయి. ఇవి కచ్చితంగా విరిగిపోతాయి’’ అని అల్హెనా కైసెడో చెప్పారు.
‘‘ఇలాంటి రకమైన వస్తువులను ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు, వాటిని ఎలా స్థిరపరిచి, భద్రపరచాలో కూడా తెలుసని మేం హామీ ఇవ్వాల్సి ఉంది. ఒకానొక దశలో మేం వీటి ప్రదర్శనను నిర్వహించాలి’’ అని తెలిపారు.
కార్టజెనాలోని ల్యాబోరేటరీలో ఈ వస్తువులను అధ్యయనం చేయనున్నారు. దీని కోసం మ్యూజియాన్ని కూడా నిర్మించనున్నారు.
ప్రస్తుతానికైతే, ఈ నౌక నుంచి పెద్ద ఎత్తున బంగారం, వెండి బయటికి తీసుకురానున్నారనే వార్తలను కొలంబియన్ అధికారులు కొట్టివేస్తున్నారు.
చైనా షిప్‌యార్డ్ నుంచి 13 మిలియన్ అమెరికా డాలర్లకు కొనుగోలు చేసిన ఏఆర్‌సీ కారిబ్ ఓడ నుంచి ఈ నౌకలోకి రోబోను పంపుతారు.
‘‘సముద్రంలో ఉన్న ఆరు దిక్కుల నుంచి వచ్చే కదలికలను, గాలులను, అలలను తట్టుకునే సామర్థ్యం మా నౌకకు ఉంది. ఏఆర్‌సీ కారిబ్ ఓడలో ఉండే ఆపరేటర్ 600 మీటర్ల లోతులోకి పంపి రోబోతో అన్వేషణ చేపట్టాల్సి ఉంటుంది’’ అని ఈఎఫ్‌ఈ ఏజెన్సీకి అడ్మిరల్ హెర్మాన్ లియోన్ వివరించారు.
సాంస్కృతిక శాఖ, కొలంబియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అండ్ హిస్టరీ, ద నేషనల్ హిస్టరీ(ఐసీఏఎన్‌హెచ్), నేషనల్ మారిటైమ్ డైరెక్టరేట్, ఇతర ప్రజాసంస్థల సాయంతో ఈ ఆపరేషన్ చేపట్టనుంది. దీని తొలి దశ పరిశీలన 2024లో నిర్వహించనున్నారు. దీనికి ప్రభుత్వానికి 4.5 మిలియన్ డాలర్లు ఖర్చు కానుంది.
నౌకలోని వస్తువుల గురించి సమాచారం సేకరించడానికి ముందు, వాటిని సముద్రపు నీటిలో నుంచి బయటకు తేవాల్సి ఉంది. ఈ అన్వేషణ కార్యక్రమానికి దీర్ఘకాలపు పురావస్తు నిర్వహణ ప్రణాళిక అవసరం. నౌక ఉన్న ప్రాంతాన్ని పురావస్తు రక్షణ శాఖ ప్రాంతంగా ప్రకటించాలి.
ఈ నౌకకు రక్షణ లేకపోతే ఇందులో వస్తువులను దోచుకుని వెళ్లే అవకాశం ఉందని కైసెడో అంచనా వేస్తున్నారు. కొంత మంది అనధికార వ్యక్తులు, సముద్రపు దొంగలు, నిధుల కోసం వేడాడేవారు దీన్ని దొంగిలించవచ్చని ఆయన ఆందోళన చెందుతున్నారు.
నౌకను కనుక్కున్న తర్వాత దానికి సంబంధించిన వ్యవహారాలను కొలంబియా ప్రభుత్వం రహస్యంగా సమన్వయ పరుస్తోంది.
సముద్రపు అడుగున ఉన్న దాని గురించి కొత్తగా తెలిసిన సమాచారం ఆధారంగా “18వ శతాబ్దంలో అమెరికా, యూరప్ మధ్య సముద్ర వాణిజ్యం ఎలా జరిగేదనే దానిపై కొన్ని సమాధానాలు లభిస్తాయని కొలంబియా భావిస్తోంది. ఈ నౌక విషయంలో శాస్త్ర, సాంకేతికంగా కొంత పరిశోధన చేయనున్నారు” అని సాంస్కృతిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఈ ఆపరేషన్‌పై విమర్శలు ఏమిటి?
యూనివర్సిటీ ఆఫ్ నెట్‌వర్క్ ఆఫ్ సబ్‌మెర్జ్‌డ్ కల్చరల్ హెరిటేజ్‌కి సంబంధించిన డజను మంది నిపుణులు ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పించారు. నౌకకు సంబంధించి పురావస్తు ప్రణాళిక లోపభూయిష్టంగా, అసంపూర్తిగా ఉందని వారు అన్నారు.
నీట మునిగిన నౌకలోని వస్తువులను బయటకు తీసుకు రావడం వెనుక సాంకేతికంగా న్యాయపరమైన కారణాలు లేవని వారు చెబుతున్నారు. పైగా ఇది సముద్రంలోని అరుదైన జీవరాశుల ఉనికికి భంగం కలిగిస్తుందని అంటున్నారు.
నౌకను బయటకు తీయడం ద్వారా శాస్త్ర, సాంకేతిక, నిర్వహణ విధానాలను మించి ఏదైనా ప్రయోజనం ఉంటే దాన్ని తప్పక బయటకు తీయాలని, అందుకు పురావస్తు ప్రణాళిక కూడా పక్కాగా ఉండాలని వారు సూచిస్తున్నారు. అవి ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కంటే బలంగా ఉండాలని చెబుతున్నారు.
“ఇప్పటి వరకు ఏ వివరాలు వెల్లడించలేదు. 2015-2016 మధ్య మారిటైమ్ ఆర్కియాలజీ కన్సల్టెంట్లు చేపట్టిన నిధుల వెతుకులాటకు సంబంధించి ఎలాంటి డేటా బహిర్గతం చెయ్యలేదు. దీని వల్ల ఈ వ్యవహారంలో జోక్యం కూడా కష్టమవుతుంది” అని వారు గుర్తు చేశారు.
నౌకలోని శిథిలాలను వెలికి తీసేందుకు మారిటైమ్ ఆర్కియాలజీ సంస్థ జువాన్ మాన్యువల్ శాంటోస్ ప్రభుత్వంతో ఒక ఒప్పందం మీద సంతకం చేసింది. తర్వాత వచ్చిన ఇవాన్ డూక్ ప్రభుత్వం ఈ ఒప్పందం విషయంలో ముందుకు వెళ్లేందుకు వీలు పడదని ప్రకటించింది.
ప్రభుత్వ న్యాయ పరిరక్షణ విభాగం సలహా ప్రకారం ఆ సమయంలో మారిటైమ్ ఆర్కియాలజీ సంస్థ చేసిన పరిశోధనను పరిగణనలోకి తీసుకోవడం లేదని ఐసీఏఎన్‌హెచ్ డైరెక్టర్ అల్హెనా కైసెడో చెప్పారు.

కోర్టులో అంతర్జాతీయ వివాదం
సముద్రం అడుగు భాగంలో యుద్ధ నౌక పరిశోధన గురించి ప్రభుత్వ ప్రకటన వెలువడిన వెంటనే సీ సర్చ్ అర్మాడా అనే అమెరికన్ కంపెనీ కోర్టును ఆశ్రయించింది. దీని మీద ప్రస్తుతం హేగ్‌లోని పర్మినెంట్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో అంతర్జాతీయ వివాదం కొనసాగుతోంది.
కొలంబియా ప్రభుత్వం కంటే ముందుగానే తాము గేలాన్ నౌకను కనుక్కున్నామని, ఇప్పుడు ప్రభుత్వానికి ఆ నౌక కావాలంటే తమకు 10 బిలియన్ల అమెరికన్ డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. నౌక మొత్తం విలువ 20 బిలియన్ డాలర్లు అనుకుంటే అందులో సగం చెల్లించాలని ఈ సంస్థ అడుగుతోంది.
ఈ కేసులో కొలంబియా తరపున వాదించాల్సిన నేషనల్ లీగల్ డిఫెన్స్ ఏజన్సీ ఆఫ్ ద స్టేట్ డైరెక్టర్ ఈ దావాను “వింతైనది, పనికిమాలినది” అని అభివర్ణించారు. అమెరికన్ సంస్థ ఇచ్చిన ఆధారాలు గేలాన్‌వి కాదని చెప్పారు.
కొలంబియన్ చట్టాలు మాత్రం ‘‘నౌక ప్రభుత్వం నుంచి విడదీయలేనిది, ఇతరులు స్వాధీనం చేసుకోలేది” అని చెబుతున్నాయి. అయితే ఆ చట్టాలు నౌకను కనుక్కున్నప్పటి నుంచి అది ఎవరికి చెందుతుందనే దానిపై కేసులు దాఖలు కాకుండా చెయ్యలేకపోయాయి.
“నౌకను స్పెయిన్ ప్రభుత్వం వదులుకోదు. ఎందుకంటే అది ప్రభుత్వానికి చెందినది” అని 2015లో స్పెయిన్ విదేశాంగ మంత్రి చెప్పారు. అప్పటి నుంచి ఈ వివాదానాన్ని సామరస్యంగా పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని రెండు ప్రభుత్వాలు చెబుతున్నాయి.
“సముద్రపు నీటిలోపల ఉన్న వారసత్వ సంపదను కాపాడేందుకు ద్వైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఈ వివాదానికి కొత్త పరిష్కారం చూపాలి” అని తమ ప్రభుత్వం భావిస్తున్నట్లు కొలంబియాలోని స్పెయిన్ రాయబారి ఫిబ్రవరి 23న చెప్పారు.
నౌక కొలంబియాకే చెందుతుందని స్పెయిన్ రాయబారి పునరుద్ఘాటించినప్పటికీ, వారసత్వం విషయంలో వేర్వేరు కోణాలను కూడా పరిశీలించాలని, అందులో సింబాలిక్ డైమన్షన్ ముఖ్యమని కైసెడో చెప్పారు.
“మేము చరిత్రను చాలా మందితో పంచుకున్నాం అనే విషయాన్ని మేము గుర్తించాం, దాన్ని మిగతా వారు కూడా గుర్తించాలి. శాన్ జోస్ చరిత్రను మేము స్పెయిన్, బొలీవియా, గ్రనాడా ప్రజలు, అనేక మంది సామాజికవేత్తలకు అందించాం. దీన్ని అందరూ గుర్తించాలని మేం కోరుకుంటున్నాం’’ అన్నారు కైసెడో.
శాన్ జోస్‌లో తమకు కూడా వాటా ఉందని బొలీవియన్ మూలవాసీ తెగ ఖారా ఖారా చెబుతోంది. ఈ నౌకలోని బంగాలం, వెండి పొటోసి మైన్స్‌లో తవ్వి తీశారని, అందుకోసం తమ తెగకు చెందిన అనేక మందిని హింసించి చంపేశారని, వారి శ్రమను దోచుకున్నారని తెగ వాసులు వాదిస్తున్నారు
“ఈ వారసత్వ సంపద గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. అందరూ ఆహ్వానితులే” అని చెప్పారు మంత్రి కొర్రేయా.
ఇవి కూడా చదవండి:
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- ఝార్ఖండ్: భర్తని కొట్టి స్పానిష్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం.. పోలీసులు ఏం చెప్తున్నారు
- సుక్కా పగడాలమ్మ: పాతపట్నం ఎమ్మెల్యేగా ఆరేళ్ళున్నారు, ఉపాధి హామీ పథకం కింద కూలీ పనికి ఎందుకు వెళ్ళారు?
- భారత్-థాయిలాండ్ దేశాల మధ్య బియ్యం ఎగుమతుల వివాదం ఏంటి?
- ఆంధ్రప్రదేశ్: ఏడాదిలో 341 రోజులు అప్పులే, మినిమం బ్యాలెన్స్ కూడా లేకుండా ఏపీ ఏం చేస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















