విశాఖపట్నం: ఖరీదైన కెమెరా కోసమే సాయి కుమార్‌ను చంపేశారా, నిందితులను సోషల్ మీడియా ఎలా పట్టించింది?

- రచయిత, లక్కోజు శ్రీనివాస్
- హోదా, బీబీసీ కోసం
ఇన్‌స్టాలో పరిచయమైన ఫ్రెండ్ ఫోటో షూట్ ఉందంటే ఫోటోగ్రాఫర్ పోతిన సాయి విజయ్ పవన్ కళ్యాణ్ కుమార్ (సాయి కుమార్) ఫిబ్రవరి 26న విశాఖ నుంచి రాజమండ్రి బయలుదేరారు.
ఆ తర్వాత సాయి కుమార్ మృతదేహాన్ని మార్చి 3న అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఆలమూరు మండలం మూలస్థానం గ్రామంలోని ఇసుక తిన్నెల్లో పోలీసులు గుర్తించారు.
ఫిబ్రవరి 26న విశాఖ నుంచి రైలులో బయలుదేరిన సాయి కుమార్ హత్యకు గురయ్యాడని మార్చి 3న తెలిసింది. అసలు ఈ వారం రోజులు ఏ జరిగింది? ఫోటో షూట్ కోసమని వెళ్లిన సాయి కుమార్ని ఎవరు చంపారు? తల్లిదండ్రులు, పోలీసులు ఏం చెప్తున్నారు?
మిస్సింగ్ కేసు నుంచి మర్డర్ కేసుగా...
సాయి కుమార్ కేసు మిస్సింగ్ కేసుగా నమోదై మర్డర్ కేసుగా మారిందని విశాఖ పోలీసులు తెలిపారు.
విశాఖ మధురవాడలోని బక్కన్నపాలెం ప్రాంతానికి చెందిన 23 ఏళ్ల పోతిన సాయి కుమార్ వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్. పెళ్లి వేడుకలకు ఫోటోలు, వీడియోలు తీస్తుంటారు.
ఆన్‌లైన్ ద్వారా ఫోటో షూట్ ఆర్డర్లు తీసుకుంటారు. ఇందుకోసం దూర ప్రాంతలకు కూడా వెళ్తుంటారు.
ఇన్‌స్టాలో Sunny_tej_666 పేరుతో అకౌంట్ ఉన్న సాయికుమార్‌ని ఈవెంట్ షూట్ కోసం ఆన్‌లైన్‌లో సంప్రదిస్తుంటారు కొందరు.
ఫోటో షూట్ల కోసం దేశంలోని పలు ప్రాంతాలకు సాయికుమార్ వెళ్తుంటాడని అతని తల్లిదండ్రులు చెప్పారు.
విశాఖ నుంచి ఫోటో షూట్ కోసం రాజమండ్రి వెళ్లి హత్యకు గురైన సాయి కుమార్ కేసులో అసలు ఏం జరిగిందో విశాఖ డీసీపీ-1 చందు మణికంఠ బీబీసీకి వివరించారు.
మిస్సింగ్ కేసు నుంచి మర్డర్ కేసుగా ఎలా మారింది? ఫిబ్రవరి 26 నుంచి మార్చి 3 వరకు వారంలో రోజులు ఏం జరిగిందనే విషయాలను డీసీపీ వెల్లడించారు.
‘‘అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన పోతిన షణ్ముఖ తేజ, నక్క వినోద్ కుమార్ అనే ఇద్దరు యువకులు మూడు నెలులుగా సాయికుమార్‌తో ఇన్‌స్టాలో టచ్‌లో ఉన్నారు. వీరిద్దరి వయసు 20 ఏళ్లే.
వీరిద్దరు ఫిబ్రవరి 16న సాయి కుమార్‌కు ఫోన్ చేసి ఫిబ్రవరి 27న రావులపాలెంలో ఫోటో షూట్‌కు రావాలని చెప్పారు. 10 నుంచి 15 రోజుల పాటు ఉండే ఈ ఈవెంట్‌కు సరిపడా ఎక్విప్‌మెంట్‌తో రావాలని కోరారు.
ఈ ఈవెంట్ సక్సెస్ అయితే సినిమా ఛాన్స్ కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పారు’’ అని డీసీపీ తెలిపారు.

‘‘ ఫిబ్రవరి 26న సాయికుమార్ అతని వద్ద ఉన్న కెమెరా, సామగ్రి తీసుకొని రావులపాలెం వెళ్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి రైలులో బయల్దేరాడు. విశాఖ నుంచి రాజమండ్రి రైల్వే స్టేషన్‌కు చేరుకున్న సాయి కుమార్‌ను షణ్ముఖ తేజ, వినోద్ కుమార్ కారులో వచ్చి రైల్వే స్టేషన్ నుంచి తీసుకుని బయలుదేరారు.
రాత్రి ఎనిమిది గంటల సమయంలో రాజమండ్రి సమీపంలోనే ఆ ఇద్దరు యువకులు సాయి కుమార్‌తో బీరు తాగించారు. ఆ తర్వాత అక్కడ నుంచి బయలుదేరారు’’ అని చెప్పారు.
‘‘కాస్త దూరం వెళ్లిన తర్వాత అప్పటికే మత్తులో ఉన్న సాయికుమార్ మెడకు బెల్ట్ బిగించి చంపేశారు. అనంతరం సాయి కుమార్ మృతదేహాన్నిఅర్థరాత్రి దాటిన తర్వాత ఆలమూరు మండలం మూలస్థానం గ్రామం ఇసుక తిన్నెల్లో పూడ్చిపెట్టారు.
సాయి కుమార్ తన వెంట తీసుకుని వచ్చిన కెమెరా, దానికి సంబంధించిన ఇతర సామగ్రిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు’’ అని ఈ కేసు వివరాలను డీసీపీ వెల్లడించారు.

తల్లికి కారు ఫోటో పంపిన సాయి కుమార్
ఫిబ్రవరి 26న విశాఖ నుంచి బయలుదేరుతూ...తనకు పెద్ద ఈవెంట్ తగిలిందని, మళ్లీ 10 రోజుల తర్వాతే ఇంటికి తిరిగి వస్తానని చెప్పారు.
సాయి కుమార్ ఈవెంట్ల కోసం వెళ్లినప్పుడు ఎక్కువ రోజులు బయట ఉండటం, ఒకటి, రెండు రోజులు ఫోన్‌కు కూడా అందుబాటులో ఉండడని సాయికుమార్ తండ్రి శ్రీనివాస్ తెలిపారు.
అయితే ఫిబ్రవరి 26 మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరిన తన కుమారుడు, సాయంత్రం 7.45 నిమిషాలకు తల్లికి ఫోన్ చేసి మాట్లాడాడని తండ్రి శ్రీనివాస్ చెప్పారు. సాయి కుమార్ తండ్రి శ్రీనివాస్ ఆటోడ్రైవర్‌గా పని చేస్తున్నారు.
రూ. 12 లక్షల విలువైన కెమెరా ఎక్విప్‌మెంట్‌తో ఇంటి నుంచి రాజమండ్రి బయలుదేరిన సాయి కుమార్, సాయంత్రం తనకు ఫోన్ చేసి మాట్లాడాడని తల్లి రమణమ్మ చెప్పారు.
“అమ్మా... నాకు పెద్దగా తెలియని వ్యక్తులతో వెళ్తున్నాను. వీరి ప్రవర్తన కాస్త అనుమానంగా ఉంది. నా ఫోన్ కలవకపోతే, ఈ నెంబర్లకు చెయ్యండి అని రెండు నెంబర్లు పెట్టాడు. అవే నాతో చివరిగా మాట్లాడిన మాటలు. ఆ తర్వాత శవమై కనిపించాడు” అంటూ రమణమ్మ కన్నీరు పెట్టుకున్నారు.
“సాయి కుమార్ ఫోన్ పెట్టేసిన తర్వాత అంతా పడుకుండిపోయాం. ఉదయం లేచిన తర్వాత ఫోన్ ట్రై చేస్తే స్విచ్చాఫ్ వస్తోంది. సాయి కుమార్ ఇచ్చిన రెండు నెంబర్లకు ట్రై చేస్తే అందులో ఒక నెంబర్ రింగ్ అవుతోంది, కానీ లిఫ్ట్ చేయడం లేదు.
మరో నెంబర్ స్విచ్చాఫ్ వస్తోంది. దీంతో అనుమానం వచ్చింది. సాయి పంపిన వాట్సాప్ మేసేజ్‌లు చూస్తే అందులో ఒక కారు ఫోటో ఉంది. దాని నంబర్ కనిపించింది. నా భర్త, బంధువులకు ఈ విషయాన్ని చెప్పాను” అని రమణమ్మ చెప్పారు.

మిస్సింగ్ కేసు నమోదు
రెండు రోజుల పాటు కొడుకు కోసం ఎదురు చూసిన సాయి కుమార్ తల్లిదండ్రులు ఫిబ్రవరి 29వ తేదీన పోతిన మల్లయ్య పాలెం పోలీస్ స్టేషన్‌లో తన కుమారుడు కనిపించకుండా పోయాడని ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
మృతుడి ఫోన్ కాల్ డేటా ఆధారంగా అతడితో ఎవరు మాట్లాడారు అనే విషయాలను సేకరించారు. అలాగే సాయి కుమార్ తన తల్లికి పంపిన కారు నెంబరు సహాయంతో ఆ కారు ఎవరిదనే విషయాలను తెలుసుకున్నారు.

‘‘ఫోటో షూట్ ఉందని పిలిచిన షణ్ముఖ తేజ నెంబరుకు ఫోన్ చేస్తే అది కూడా స్విచ్చాఫ్ వస్తోంది. దీంతో విశాఖ పోలీసుల నుంచి సమాచారం అందుకున్న మా పోలీసులు మార్చి 1న షణ్ముఖ తేజ ఇంటికి వెళ్లారు. అక్కడ షణ్ముఖ తేజ లేడు.
కానీ, సాయి కుమార్ విశాఖ నుంచి తీసుకుని వచ్చిన కెమెరా, దానికి సంబంధించిన సామగ్రి షణ్ముఖ తేజ ఇంట్లోనే ఉంది. దీంతో, అతడిపై అనుమానం వచ్చి, అతన్ని వెతకడం ప్రారంభించాం” అని ఆలమూరు పీఎస్ ఎస్ఐ ఎల్. శ్రీనివాస్ నాయక్ తెలిపారు.

షణ్ముఖ తేజ గర్ల్ ఫ్రెండ్ సహాయంతో..
‘‘షణ్ముఖ తేజ పరారీలో ఉన్నాడనే విషయాన్ని మేం గ్రహించాం. సాయి కుమార్ నెంబర్, షణ్ముఖ తేజ నెంబర్ రెండు స్విచ్చాఫ్ రావడంతో షణ్ముఖ్ తేజను పట్టుకునేందుకు సోషల్ మీడియాను ఆశ్రయించాం.
అతడు ఫేస్‌బుక్‌లో ఎవరెవరితో చాటింగ్ చేస్తున్నాడనే వివరాలను సేకరించాం. అందులో షణ్ముఖ తేజ విశాఖకు చెందిన అమ్మాయితో పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించాం. వెంటనే ఆ అమ్మాయిని సంప్రదించి విషయాన్ని తెలిపి, ఆమె సహాయం కోరాం.
ఆ అమ్మాయితో షణ్ముఖ తేజతో ఫేస్‌బుక్‌లో చాట్ చేయించాం. ఆ తర్వాత ఆ అమ్మాయి మెసేజ్‌లకు షణ్ముఖ తేజ రిప్లై ఇవ్వటం ప్రారంభించాడు. దాంతో షణ్ముఖ తేజ ఆచూకీని మేం ట్రేస్ చేయగలిగాం.
అతడు అన్నవరం సమీపంలో ఉన్నట్లు గుర్తించి, మార్చి 2న అదుపులోకి తీసుకున్నాం. అతడు ఇచ్చిన సమాచారంతో మరో నిందితుడు వినోద్ కుమార్‌ని కూడా అదుపులోకి తీసుకున్నాం. వీరిద్దరిని విచారించగా, సాయికుమార్‌ను హత్య చేసినట్లు షణ్ముఖ తేజ అంగీకరించాడు’’ అని పోలీసులు చెప్పారు.

సాయి కుమార్‌ను హత్య ఎందుకు చేశారంటే... : పోలీసులు
సాయి కుమార్ మిస్సింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న షణ్ముఖ తేజ, తన స్నేహితుడు వినోద్‌తో కలిసి సాయి కుమార్‌ని హత్య చేసినట్లు అంగీకరించాడని విశాఖ పోలీసులు తెలిపారు.
ప్రస్తుతం వీరిద్దర్ని అరెస్ట్ చేశామని చెప్పారు. అసలు సాయి కుమార్‌ను ఎందుకు హత్య చేశారో నిందితులు చెప్పారు.
“సాయి కుమార్ వద్ద ఖరీదైన కెమెరాలు, ఎక్విప్‌మెంట్ ఉన్నాయి. వాటి విలువ రూ. 10 లక్షల నుంచి రూ. 12 లక్షల వరకు ఉంటుంది. వాటిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో, ఆన్‌లైన్‌లో సాయి కుమార్‌తో నిందితులు పరిచయం పెంచుకున్నారు.
ఇన్‌స్టాలో తన కెమెరాలను సాయి కుమార్ పోస్ట్ చేసినప్పుడు వాటిపై నిందితుల దృష్టి పడింది. మూడు నెలలు పాటు దాదాపు రోజు సాయి కుమార్‌తో చాటింగ్ చేశారు. ఆ తర్వాత ఒక రోజు ఈవెంట్ ఉందని రాజమండ్రి రమ్మన్నారు. దీంతో సాయి కుమార్ కెమెరాను తీసుకుని రాజమండ్రి బయలుదేరాడు” అని డీసీపీ చందు మణికంఠ చెప్పారు.
“రాజమండ్రి చేరుకోగానే, నిందితులు ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం అతణ్ని హత్య చేసి శవాన్ని ఇసుక తిన్నెల్లో పూడ్చిపెట్టారు. తల్లిదండ్రులు ఇచ్చిన మిస్సింగ్ ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తే హత్య కేసు బయటపడింది. ఖరీదైన కెమెరా కోసమే ఈ హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది” అని డీసీపీ తెలిపారు.
షణ్ముఖ తేజ ఇచ్చిన సమాచారంతో మూలస్థానం గ్రామం ఇసుకతిన్నెల నుంచి సాయి కుమార్ మృతదేహాన్ని మార్చి 3న బయటకు తీశారు పోలీసులు.
సాయి కుమార్ మృతదేహానికి విశాఖ నుంచి వెళ్లిన వైద్య బృందం పోస్ట్ మార్టం నిర్వహించింది.
విశాఖ నుంచి మూలస్థానం గ్రామానికి వెళ్లిన సాయి కుమార్ తల్లిదండ్రులు, బంధువులు గుర్తు పట్టలేకుండా మారిపోయిన సాయి కుమార్ మృతదేహాన్ని చూసి కన్నీటి మున్నీరయ్యారు.

‘ఒంటరిగా కశ్మీర్ వెళ్లొచ్చాడు’
గత ఏడేళ్లుగా సాయి కుమార్ అనేక ఫోటో షూట్ చేశాడని అతడి బంధువులు చెప్తున్నారు. దేశంలోని అనేక ప్రాంతాలకు ఫోటో షూట్‌ల కోసమే కాకుండా వాటిని చూడటానికి కూడా వెళ్లొచ్చాడని చెప్పారు.
కశ్మీర్‌కు కూడా ఒక్కడే వెళ్లొచ్చాడని, అలాంటి వ్యక్తి రాజమండ్రికి వెళ్లి తిరిగిరాడని ఎలా అనుకుంటామని సాయి కుమార్ సోదరి కన్నీళ్లు పెట్టుకున్నారు.
సాయి కుమార్ వద్ద ఉన్న ఖరీదైన కెమెరాల కోసమే అతడి ప్రాణాలు తీశారని అన్నారు. ఆటోడ్రైవరైన తండ్రికి చిన్నవయసులోనే చేదోడు వాదోడుగా ఉన్న సాయి కుమార్ తన జీవనోపాధి కోసం కొనుక్కున్న కెమెరాల వల్లే ప్రాణాలు కోల్పోతాడని అనుకోలేదని ఆమె అన్నారు.
హత్య చేయడానికి కారణం కేవలం కెమెరాలేనా, లేదంటే మరేదైనా కోణం ఉందా, అలాగే ఇంకా ఇతరులు ఎవరైనా ఈ కేసుకు సంబంధించి ఉన్నారా అనేది విచారిస్తున్నామని విశాఖ సీపీ రవి శంకర్ చెప్పారు. ప్రస్తుతం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశామని చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- ఝార్ఖండ్: భర్తని కొట్టి స్పానిష్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం.. పోలీసులు ఏం చెప్తున్నారు
- సుక్కా పగడాలమ్మ: పాతపట్నం ఎమ్మెల్యేగా ఆరేళ్ళున్నారు, ఉపాధి హామీ పథకం కింద కూలీ పనికి ఎందుకు వెళ్ళారు?
- భారత్-థాయిలాండ్ దేశాల మధ్య బియ్యం ఎగుమతుల వివాదం ఏంటి?
- ఆంధ్రప్రదేశ్: ఏడాదిలో 341 రోజులు అప్పులే, మినిమం బ్యాలెన్స్ కూడా లేకుండా ఏపీ ఏం చేస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















