బ్రిటన్ సముద్ర జలాల్లో రహస్య జీవి.. ఈ కొత్తజీవికి, చేపల సంఖ్య తగ్గిపోవడానికి సంబంధం ఏమిటి

కొత్త నత్త

ఫొటో సోర్స్, ROSS BULLIMORE

ఫొటో క్యాప్షన్, ఈ సీ స్లగ్ శరీరంపై ఒక వైపున అందమైన రెక్కలు కలిగిన మొప్పలతో కనిపిస్తుంది
    • రచయిత, హెలెన్ బ్రిగ్స్
    • హోదా, ఎన్విరాన్‌మెంట్ కరస్పాండెంట్

యూకే సముద్ర జలాల్లో ఓ కొత్త జీవిని కనుగొన్నారు శాస్త్రవేత్తలు. ఇంగ్లండ్ కు నైరుతి దిక్కున ఉన్న సముద్ర జలాల్లో ఒక పరిశోధక నౌక సహాయంతో దీని ఉనికిని కనిపెట్టారు.

ఈ ప్రాణికి ఫ్లూరోబ్రాంకియా బ్రిటానికా అనే పేరు పెట్టారు.

ఈ జీవులు వెచ్చని జలాల్లో ఉంటాయి. వాతావరణ మార్పుల కారణంగా ఇవి ఉత్తరం వైపు వలస పోతున్నాయి.

సముద్ర ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో వేడెక్కుతుండటంతో దాని ప్రభావం సముద్రజీవులపై పడుతోందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

సెంటర్ ఫర్ ది ఎన్విరాన్‌మెంట్, ఫుడ్ అండ్ అక్వాకల్చర్ సైన్స్ (సీఈఎఫ్ఏఎస్)కు చెందిన రాస్ బుల్లిమోర్ అనుకోకుండా ఈ జీవిని కనుగొన్నారు.

బ్రిటన్, ఐర్లాండ్ సముద్రజలాల్లో వంద రకాలైన సముద్ర నత్తలను (సీ స్లగ్స్)ను కనుగొన్నప్పటికీ తాజాగా కనుగొన్న ఈ నత్తజాతి ప్రాణి ప్రత్యేకమైనదని విషయం రాస్ బుల్లిమోర్‌ అంటున్నారు.

‘‘బల్బు వెలిగి, ఆరిపోతూ ఉంటే ఎలా ఉంటుందో ఇది అలా ఉంది’’ అని ఆయన చెప్పారు. సముద్ర జాతుల గురించి అద్భుతమైన అధ్యయనాలు జరిగినప్పటికీ మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉందనే విషయాన్నిఈ ఆవిష్కరణ తెలిపిందని శాస్త్రవేత్తలు చెప్పారు.

‘‘మైక్రోస్కోప్ ద్వారా కొత్త జీవిని కనుగొనడమనేది ఉత్తేజకరమే అయినా, ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని ఈ ఆవిష్కరణ గుర్తుచేస్తోంది’’ అని సీఈఎఫ్ఏఎస్‌కు చెందిన పీటర్ బారీ చెప్పారు.

సీ స్లగ్స్

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, సీ స్లగ్స్

సముద్రపు స్లగ్‌లు వాటి శరీరంపై ఎటువంటి రక్షణ కవచాలు లేకుండా మెత్తగా ఉంటాయి. ఇవి అందంగానూ, భిన్నంగానూ కనిపిస్తాయి.

ఈ జీవులు కేవలం 5 సెంటిమీటర్లు వరకు పొడవు పెరుగుతాయి. కానీ ఇవి వేటాడే జీవుల ఆహారపు గొలుసులో కీలక స్థానంలో ఉంటాయి.

వీటిని ‘దారిచూపే జీవులు’గానూ తరచూ చెపుతుంటారు. వాాతావరణ మార్పులు, మనుషుల ఒత్తిడి కారణంగా వీటిపై పడుతున్న ప్రభావాన్ని అధ్యయనం చేయడం ద్వారా సముద్ర పర్యావరణ స్థితిగతులను శాస్త్రవేత్తలు అర్థం చేసుకోగలుగుతారు.

తాజాగా కనుగొన్న ఫ్లూరోబ్రాంకియా కు చెందిన జీవులు స్పెయిన్ ఉత్తరభాగంలోనూ, సెనెగల్, మధ్యధరా సముద్రంలో కనిపిస్తుంటాయి.

‘‘ప్రస్తుతం మేం చూస్తున్న ఈ ప్రాణిని ఇప్పటిదాకా వెచ్చని జలాల్లో మాత్రమే గుర్తించారు’’ అని రాస్ బుల్లిమోర్ చెప్పారు.

‘‘ఈ జాతులు విస్తరిస్తున్నాయంటే దానర్థం వాటికి అనువైన వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని’’ అని తెలిపారు.

వేడెక్కుతున్న సముద్రజలాల కారణంగా చేపలు, వేల్స్ లాంటి సముద్రజీవుల మనుగడను దెబ్బతింటోంది. దీంతో ఆ జీవులు చల్లని నీటిని వెదుక్కుంటూ వలస పోతుండటంతో ఆహారపు గొలుసు తలకిందులవుతోంది. దీని వల్ల చేపల సంఖ్య తగ్గిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)