హైతీ: జైలును బద్ధలుకొట్టి 4 వేలమంది ఖైదీలను విడిపించుకుపోయిన సాయుధ ముఠాలు...

ఫొటో సోర్స్, REUTERS
హైతీ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్‌లో ఉన్న ప్రధాన కారాగారంపై సాయుధ ముఠాలు దాడి చేసి ఖైదీలను బయటికి విడుదల చేశాయి.
దీంతో, 4 వేల మంది వరకు ఖైదీలు ప్రస్తుతం జైలు తప్పించుకుని బయటకు వచ్చినట్లు స్థానిక జర్నలిస్ట్ బీబీసీ న్యూస్‌కు చెప్పారు.
తప్పించుకుని పారిపోయిన వారిలో 2021లో అప్పటి హైతీ దేశాధ్యక్షుడు జొవెనెల్ మోస్‌ను హత్య చేసిన గ్యాంగ్ సభ్యులు కూడా ఉన్నారు.
లాటిన్ అమెరికాలో అత్యంత పేద దేశమైన హైతీ రాజకీయ అస్థిరతలో ఉంది. అధ్యక్షుడి హత్య తర్వాత ఆ దేశంలో హింస తీవ్రతరమైంది.
ప్రధానమంత్రి ఎరియల్ హెన్రీని పదవిలో నుంచి దించి, పోర్ట్ ఓ ప్రిన్స్‌ను 80 శాతం తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని ఈ సాయుధ ముఠాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
కెన్యాకు చెందిన బహుళ జాతీయ భద్రతా బలగాలను హైతీకి పంపించాలని కోరేందుకు ప్రధానమంత్రి నైరోబి వెళ్లడంతో, గురువారం ఈ హింసాత్మక వాతావరణం మళ్లీ చెలరేగింది.
ప్రధానిని తొలగించాలంటూ గ్యాంగ్ నేత జిమ్మీ చెరిజియర్(బార్బెక్యూ) ఈ దాడికి పిలుపునిచ్చారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
స్థానిక పట్టణాలలోని సాయుధ బలగాలు, రాజధాని నగరంలోని సాయుధ బలగాలు తామంతా ఒకటేనని మాజీ పోలీస్ అధికారి ప్రకటించారు. పోర్టౌ ప్రిన్స్‌లో పలు హత్యాకాండల వెనుక ఆయన హస్తం ఉన్నట్లు ఆరోపణలున్నాయి.
సాయుధ బలగాల కాల్పులలో నలుగురు పోలీసు అధికారులు చనిపోగా, ఐదుగురు గాయాలు పాలయ్యారు.
హైతీలోని రాజధాని లోపల, చుట్టుపక్కల ప్రయాణాలు చేయొద్దని ఫ్రెంచ్ రాయబారి కార్యాలయం సూచనలు చేసింది. జైలును పునరుద్ధరించేందుకు సాయం చేయాలని సైన్యాన్ని హైతీలోని పోలీసు సంఘాలు కోరాయి.
ఆదివారం వరకు జైలు తలుపులు బార్ల తెరుచుకుని ఉన్నాయి. అధికారులున్నట్లు ఎలాంటి సంకేతాలు లేవని రాయిటర్స్ వార్తా ఏజెన్సీ తెలిపింది. పారిపోయేందుకు ప్రయత్నించి ముగ్గురు ఖైదీలు, జైలు ప్రాంగణంలో చనిపోయి కనిపించారని పేర్కొంది.
అధ్యక్షుడు మోస్ హత్య కేసులో జైలు పాలైన కొలంబియా మాజీ సైనికాధికారులతో సహా 99 మంది ఖైదీలు మాత్రం ఎదురు కాల్పుల్లో చనిపోతామోననే భయంతో జైలోనే ఉన్నారని రాయిటర్స్ జర్నలిస్ట్‌లకు జైలు సిబ్బందిలో ఒకరు తెలిపారు.
అధ్యక్షుడు మోస్ హత్య తర్వాత హింస తీవ్రతరమైంది. ఆయన స్థానంలో మరెవరూ నియామకం కాలేదు. 2016 నుంచి ఎన్నికలు జరగలేదు. రాజకీయ ఒప్పందం కింద, ఫిబ్రవరి 7 నాటికి హెన్రీ దిగిపోయి, ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, అవి కూడా జరగలేదు.
మరణాలు, గాయాలు పాలైన వారు, కిడ్నాపులతో సహా గత ఏడాది హైతీ గ్యాంగుల హింసలో 8,400 మందికి పైగా ప్రజలు బాధితులయ్యారని జనవరిలో ఐరాస తెలిపింది. 2022 సంఖ్యతో పోలిస్తే ఈ సంఖ్య రెండింతలు ఎక్కువ.

ఫొటో సోర్స్, AFP
హైతీ గ్యాంగుల హింసను అరికట్టేందుకు రంగంలోకి కెన్యా పోలీసులు
సాయుధ గ్యాంగుల నిరసనను అరికట్టేందుకు వెయ్యి మంది వరకు కెన్యా పోలీసు అధికారులను హైతీకి పంపించనున్నారు.
కెన్యా పోలీసుల డిప్లాయ్‌మెంట్‌ను వేగంగా చేపట్టేందుకు తనకు, హైతీ ప్రధానమంత్రి ఎరియల్ హెన్రీ మధ్యలో చర్చలు జరిగాయని, ఒప్పందంపై సంతకాలు చేసినట్లు కెన్యా అధ్యక్షుడు విలియం రుతో చెప్పారు.
కెన్యా అధికారులతో పాటు బహమాస్ దేశం కూడా 150 మంది సైనికులను పంపించనున్నట్లు తెలిపింది.
జమైకా, ఆంటిగ్వా, బార్బుడా దేశాలు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి. అమెరికా ఈ డిప్లాయ్‌మెంట్‌కు సహకరించేందుకు 200 మిలియన్ డాలర్లను ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చింది.
గత వారం ప్రారంభంలో బెనిన్ 2 వేల మంది బలగాలను అందించింది. అయితే, ఈ డిప్లాయ్‌మెంట్‌ను చాలా మంది కెన్యా ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- పొట్టలో ఏలిక పాములు ఎలా చేరతాయి, వాటిని ఎలా తొలగించాలి?
- ఝార్ఖండ్: భర్తని కొట్టి స్పానిష్ టూరిస్ట్‌పై సామూహిక అత్యాచారం.. పోలీసులు ఏం చెప్తున్నారు
- సుక్కా పగడాలమ్మ: పాతపట్నం ఎమ్మెల్యేగా ఆరేళ్ళున్నారు, ఉపాధి హామీ పథకం కింద కూలీ పనికి ఎందుకు వెళ్ళారు?
- భారత్-థాయిలాండ్ దేశాల మధ్య బియ్యం ఎగుమతుల వివాదం ఏంటి?
- ఆంధ్రప్రదేశ్: ఏడాదిలో 341 రోజులు అప్పులే, మినిమం బ్యాలెన్స్ కూడా లేకుండా ఏపీ ఏం చేస్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














