హైతీ దేశాధ్యక్షుడిని ఇంట్లోకి చొరబడి ఎలా హత్య చేశారంటే...

మోస్‌ను హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధాలు

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, మోస్‌ను హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధాలు

హైతీ దేశాధ్యక్షుడు జొవెనెల్ మోస్‌ను హత్య చేసింది విదేశీ ఆగంతుకులని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఈ ముఠాలో 26 మంది కొలంబియన్లు, మరో ఇద్దరు హైతీ సంతతికి చెందిన అమెరికన్లు ఉన్నారని హైతీ పోలీసు విభాగం అధిపతి లియోన్ చార్లెస్ వెల్లడించారు.

నిందితుల్లో ఎనిమిది మంది ఇంకా పరారీలో ఉన్నారు. ఇద్దరు అమెరికన్లు సహా 17 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

మిగతా నిందితులు పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో చనిపోయారు. బుధవారం తెల్లవారుజామున దేశ రాజధాని పోర్టౌ ప్రిన్స్‌లోని మోస్‌ వ్యక్తిగత నివాసంలోకి కొందరు సాయుధులు చొరబడి ఆయనను హత్య చేసిన సంగతి తెలిసిందే.

నిరసనలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పోర్టౌ ప్రిన్స్‌ వీధుల్లో నిరసనలు

మోస్ భార్య మార్టీన్‌పై కూడా సాయుధులు కాల్పులు జరిపారు. ఆమెను చికిత్స కోసం ఫ్లోరిడా తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది.

మోస్‌ను సాయుధులు ఎందుకు హత్య చేశారో తెలియడం లేదు. అయితే, దేశంలో అధికారం కొందరి చేతుల్లోనే ఉండిపోవడానికి వ్యతిరేకంగా మోస్ పోరాటం చేస్తున్నారని, అందుకే ఆయన్ను హత్య చేయించారని దేశ తాత్కాలిక ప్రధాన మంత్రి క్లాడే జోసెఫ్ వ్యాఖ్యానించారు.

మోస్‌ను హత్య చేయడానికి ఉపయోగించిన ఆయుధాలతోపాటు కొందరు నిందితులను గురువారం మీడియాకు పోలీసులు చూపించారు. కొలంబియన్లపై తాము చేస్తున్న ఆరోపణలకు సాక్ష్యంగా కొలంబియా పాస్‌పోర్ట్‌లు కూడా వారు చూపించారు.

‘‘దేశాధ్యక్షుడ్ని హతమార్చేందుకు విదేశీ ముఠా సభ్యులు ఇక్కడికి వచ్చారు’’అని చార్లెస్ చెప్పారు.

‘‘పరారీలో ఉన్న ఆ ఎనిమిది మందిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశాం.’’

మోస్ వ్యక్తిగత నివాసం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, మోస్ వ్యక్తిగత నివాసం

వారు కొలంబియా మాజీ సైనికులు...

హైతీ అధ్యక్షుడు మోస్‌ను హత్య చేసిన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఆరుగురు తమ దేశ మాజీ సైనికులని కొలంబియా ప్రభుత్వం తెలిపింది. దర్యాప్తులో హైతీ అధికారులకు తాము సంపూర్ణ సహకారం అందిస్తామని వివరించింది.

మరోవైపు, హైతీలో అరెస్టైన వారిలో తమ దేశ సైనికులు ఉన్నారో లేదో ఇప్పుడే చెప్పలేమని అమెరికా విదేశాంగ శాఖ వ్యాఖ్యానించింది.

హైతీ విశేషాలు

ఈ హత్య వెనకున్న సూత్రధారులను కనిపెట్టేందుకు హైతీ దర్యాప్తు సంస్థలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే ఉత్తర అమెరికాలో అత్యంత పేద దేశాల్లో ఒకటైన హైతీలో ఈ హత్య అనంతరం నిరసనలు పెల్లుబికాయి.

రాజధానిలో పోలీసులు ఆపరేషన్ నిర్వహిస్తున్న చోటుకు గురువారం నిరసనకారులు తరలివచ్చారు. కొన్ని కార్లకు నిప్పు కూడా పెట్టారు. నిందితులను అరెస్టుచేసి ఉంచిన పోలీస్ స్టేషన్‌ను వారు చుట్టుముట్టారు.

దేశ వ్యాప్తంగా అత్యయిక స్థితి ఇంకా కొనసాగుతోంది.

హైతీ అధ్యక్షుడు జొవెనెల్ మోస్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హత్యకు గురైన హైతీ అధ్యక్షుడు జొవెనెల్ మోస్‌

దేశాన్ని ఎవరు నడిపిస్తున్నారు?

మోస్ హత్య అనంతరం దేశాన్ని ఎవరు నడిపిస్తారనే విషయంలో గందరగోళం ఏర్పడింది. అధ్యక్షుడు మరణిస్తే, సుప్రీం కోర్టు అధిపతి ఆ బాధ్యతలు తీసుకోవాలని ఇక్కడి రాజ్యాంగం చెబుతోంది. అయితే, కొన్ని రోజుల క్రితం హైతీ సుప్రీం కోర్టు అధిపతి కోవిడ్-19తో మరణించారు.

సుప్రీం కోర్టు అధిపతి కూడా అందుబాటులోలేని పక్షంలో ప్రధాన మంత్రి బాధ్యతలు తీసుకోవాలని రాజ్యాంగ సవరణలు చెబుతున్నాయి.

అయితే, మోస్ తన పదవీ కాలంలో ఆరుగురు ప్రధాన మంత్రులను మార్చారు. తన హత్యకు ఒక రోజు ముందు, ఏరియల్ హెన్రీని ఏడో ప్రధాన మంత్రిగా నామినేట్ చేశారు.

ఇంకా హెన్రీ ప్రధానిగా ప్రమాణం చేయలేదు. అయితే, తనకే బాధ్యతలు అప్పగించాలని ఆయన అంటున్నారు.

హైతీ భద్రతా సిబ్బంది

ఫొటో సోర్స్, Getty Images

అయితే, హెన్రీ చేస్తున్న వ్యాఖ్యలు తనలో సందేహాలను కలగజేస్తున్నాయని తాత్కాలిక ప్రధాన మంత్రి జోసెఫ్ బీబీసీతో అన్నారు.

వచ్చే ఏడాది ఎన్నికలు జరిగే వరకూ జోసెఫ్ ఇదే పదవిలో కొనసాగాలని ఐక్యరాజ్యసమితి సూచించింది.

అయితే, ఎన్నికల్లో తను అధ్యక్ష పదవికి పోటీచేయబోనని జోసెఫ్ చెప్పారు. ‘‘నేను ఎక్కువకాలం ఈ పదవిలో కొనసాగను. ఎన్నికలు నిర్వహించాలి. నా దగ్గర వ్యక్తిగత అజెండా అంటూ ఏమీ లేదు.’’

పోర్టౌ ప్రిన్స్‌లోని ఒక వీధిలో వాహనానికి నిప్పు పెట్టిన నిరసనకారులు

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, పోర్టౌ ప్రిన్స్‌లోని ఒక వీధిలో వాహనానికి నిప్పు పెట్టిన నిరసనకారులు

దాడి ఎలా జరిగింది?

దేశ రాజధాని పోర్టౌ ప్రిన్స్‌లోని మోస్‌ వ్యక్తిగత నివాసంలోకి బుధవారం రాత్రి ఒంటి గంట సమయంలో భారీ ఆయుధాలతో వచ్చిన నిందితులు చొరబడ్డారు.

దాడికి సంబంధించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. వీటిలో నిందితులు.. అమెరికా మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం ఆపరేషన్లు నిర్వహించే కమాండోల తరహాలో నల్లని బట్టలు వేసుకుని కనిపిస్తున్నారు.

‘‘అమెరికా డ్రగ్ ఎన్ఫోర్స్‌మెంట్ ఆపరేషన్.. ఎవ్రిబడీ, స్టే డౌన్!’’అని నిందితులు అరుస్తూ వీడియోలో కనిపిస్తున్నారు.

ఘటన స్థలంలోనే మోస్ ప్రాణాలు విడిచారు. ఆయన శరీరానికి 12 బుల్లెట్ గాయాలు అయ్యాయని మేజిస్ట్రేట్ కార్ల్ హెన్రీ.. పత్రిక ‘‘లే నోవులిస్ట్‌’’కు తెలిపారు.

‘‘అధ్యక్షుడి కార్యాలయం, బెడ్‌రూమ్‌లను నిందితులు చిందరవందర చేశారు. రక్తపు మడుగులో బోర్లాపడి మోస్ కనిపించారు.’’

మోస్ ముగ్గురు పిల్లలు జోమర్లీ, జొవొనెల్ జూనియర్, జోవెర్లిన్ సురక్షితంగా ఉన్నారని ఆయన చెప్పారు.

మోస్ హత్యకు ముందు కూడా ఇక్కడ పరిస్థితులు గందరగోళంగానే ఉండేవి. మోస్ రాజీనామా చేయాలంటూ ప్రజలు నిరసనలు చేపట్టేవారు.

ఇక్కడ 2019లోనే పార్లమెంటరీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, వివాదాల నడుమ ఇవి వాయిదా పడుతూ వచ్చాయి. దీంతో మోస్ తన పాలనను కొనసాగిస్తూ వచ్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)