హైతీ అధ్యక్షుడి హత్యకు అయినవారే కుట్ర పన్నారా? సమాధానం లేని 5 కీలక ప్రశ్నలు

ఫొటో సోర్స్, EPA
హైతీ అధ్యక్షుడు జొవెనెల్ మోస్ హత్య జరిగి వారం పైనే అయ్యింది. ఆయనను ఎందుకు హత్య చేశారు, కారణం ఏంటి అనే విషయంలో సమాధానాల కంటే ప్రశ్నలే ఎక్కువగా ఉన్నాయి.
జులై 7న రాజధాని పోర్టౌ ప్రిన్స్ శివార్లలో ఉన్న అధ్యక్షుడి నివాసంపై తెల్లవారుజామున సాయుధులు దాడి చేశారు. ఆయన్ను కాల్చి చంపారు.
గాయపడిన ఆయన భార్య మార్టిన్ అమెరికాలోని మియామీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ దాడి తర్వాత హత్యకు కారణమని ఆరోపణలు ఎదుర్కుంటున్న గ్రూప్‌పై హైతీ ప్రభుత్వం అణచివేత ప్రారంభించింది.
సుదీర్ఘ ఘర్షణ తర్వాత 18 మంది మాజీ కొలంబియా సైనికులను అరెస్ట్ చేశామని, వారిపై మోస్ హత్య ఆరోపణలు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
ఈ ఘర్షణలో ముగ్గురు కొలంబియా దుండగులు చనిపోగా, ఐదుగురు పారిపోగలిగారు. పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.
"ఫ్లోరిడాలో ఉంటున్న హైతీ డాక్టర్ ఇమాన్యుయెల్ సెనాన్‌ను కూడా అరెస్ట్ చేశాం. ఈ కుట్ర వెనుక మాస్టర్ మైండ్ ఆయనేనని చెబుతున్నారు" అని హైతీ నేషనల్ పోలీస్ చీఫ్ లియోన్ చార్ల్స్ చెప్పారు.
మోస్ సెక్యూరిటీ చీఫ్ దిమిత్రీ హెరాయి, హైతీ మూలాలున్న మరో అమెరికన్ జేమ్స్ సోలాజేస్‌ను కూడా అరెస్ట్ చేశారు.
మరోవైపు, హైతీకి చెందిన ఒక మాజీ మంత్రి దేశాధ్యక్షుడి హత్యకు కొలంబియాలోని కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చారని శుక్రవారం కొలంబియా పోలీసులు గుర్తించారు.
లాటిన్ అమెరికాలో అత్యంత పేద దేశమైన హైతీ రాజకీయ అస్థిరతలో ఉంది. అధ్యక్షుడి హత్య ఇప్పుడు మొత్తం దేశాన్ని ఆందోళనలో పడేసింది.
హైతీ అనిశ్చితిలో, అస్థిరతలో కొట్టుమిట్టాడుతున్న సమయంలో, జులై 7న జరిగిన హత్యకు ప్రపంచం ఇంకా కారణాలు వెతుకుతోంది.
ఈ హత్యకు సంబంధించి సమాధానం లేని ప్రశ్నలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

ఫొటో సోర్స్, STR
1. హంతకులు ఇంట్లోకి అంత సులువుగా ఎలా చొరబడ్డారు?
ఇక్కడ అత్యంత షాక్ ఇచ్చే విషయం ఒకటుంది. అదేమంటే, హంతకులు ఎలాంటి ప్రతిఘటనా లేకుండా నేరుగా అధ్యక్షుడి నివాసంలోకి వెళ్లగలగడం. ప్రభుత్వం వివరాల ప్రకారం ఆ దాడిలో పాల్గొన్నవారిలో ఎవరూ గాయపడలేదు.
దుండగులు అమెరికా డ్రగ్ నిరోధక విభాగం డీఈఏ యూనిఫాంలో ఉన్నారని, తలకు హుడ్ వేసుకుని ఉన్నారని అమెరికాలో హైతీ రాయబారి బోషిత ఎడ్మండ్ చెప్పారు.
ఇది డీఈఏ ఆపరేషన్ అంటూ దుండగులు అధ్యక్షుడి భవనంలోకి చొరబడ్డారు. అయితే డీఈఏ మాత్రం దానితో తమకు ఎలాంటి సంబంధం లేదని చెప్పింది.
అధ్యక్షుడి సెక్యూరిటీ చీఫ్ దిమిత్రీ హెరాయి మీద కూడా సందేహాలు ఉన్నాయి. అధ్యక్షుడిపై దాడి జరుగుతుంటే మీరు, మీ టీమ్ ఆయన్ను కాపాడే ప్రయత్నం చేశారా అని అధికారులు విచారిస్తున్నారు.
హంతకులు అధ్యక్ష భవనంలోకి చొచ్చుకెళ్లి, ఆయనపై 12 రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయన భార్యపై కూడా కాల్పులు జరిపారు. తర్వాత ఎలాంటి ప్రతిఘటనా లేకుండానే బయటికి వెళ్లిపోయారు.
అధ్యక్షుడి సెక్యూరిటీ టీమ్‌కు చెందిన మరో ముగ్గురిని కూడా హైతీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
2. కొలంబియా మాజీ సైనికులకు ఏం తెలుసు?
అధ్యక్షుడిని హత్య చేసింది కొలంబియా మాజీ సైనికులేనని భావిస్తున్నారు. కానీ ఈ హత్య కుట్రలో వారి పాత్ర ఏంటి అనేది ఇంకా స్పష్టంగా తెలీలేదు.
కొలంబియా మీడియా వివరాల ప్రకారం వీరందరూ మాజీ సైనికులు. వీరందరూ మాజీ సైనికులేనని కొలంబియా రక్షణ మంత్రి డియాగో మొలానే కూడా ధ్రువీకరించారు.
అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ వివరాల ప్రకారం వీరిలో చాలా మంది అమెరికాలో శిక్షణ కూడా తీసుకున్నారు.
హైతీలో ప్రవేశించడానికి ముందు వీళ్లందరూ పక్క దేశం డొమినికా రిపబ్లిక్‌లో పర్యటించారు. కొందరు తమ ట్రిప్ ఫొటోలను సోషల్ మీడియాలో కూడా షేర్ చేశారు.

ఫొటో సోర్స్, JEAN MARC HERVE ABELARD/EUROPEAN PRESSPHOTO AGENCY
3. ఒక అధ్యక్షుడి హత్య కుట్రలో భాగమైన వారు ఇలా చేస్తారా?
వీరంతా అధ్యక్షుడి నివాసం దగ్గరే ఉన్న తైవాన్ రాయబార కార్యాలయంలో ఆశ్రయం పొందారా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. అంటే, వారి దగ్గర పారిపోవడానికి ప్లాన్ సిద్ధంగా లేదా.
మరోవైపు, ఈ సైనికులు నిర్దోషులని వారి కుటుంబాలు చెబుతున్నాయని కొలంబియా ప్రభుత్వం చెబుతోంది. వీరిలో చాలా మందిని మోసంతో హైతీకి తీసుకువచ్చారని కొలంబియా అధ్యక్షుడు ఇవాన్ డూకే ఒక రేడియో ప్రకటన జారీ చేశారు.
అయితే వీరిలో కొందరికి ఈ కుట్ర గురించి తెలుసని ఆయన భావించారు. డూకే వివరాల ప్రకారం అధ్యక్షుడి హత్య కుట్ర గురించి ఒక చిన్న గ్రూప్‌కే తెలుసని, మిగతావారితి భద్రతా మిషన్ అని మభ్యపెట్టి హైతీకి తీసుకెళ్లారని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, EPA
4. ఈ మిషన్ మాస్టర్ మైండ్ ఎవరు, ఎందుకు హత్య చేశారు?
అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్న హైతీ సంతతికి చెందిన డాక్టర్ క్రిష్టియన్ సెనాన్‌ను కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. అధ్యక్షుడి హత్యకు 63 ఏళ్ల సెనాన్‌పై కిరాయి హంతకులకు సుపారీ ఇచ్చారని, అధ్యక్ష పదవి చేజిక్కించుకోవాలని అనుకున్నారని ఆరోపణలు ఉన్నాయి.
అధ్యక్షుడు మోస్ స్పెయిన్ పత్రిక ఎల్-పాయిస్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో తన హత్యకు కుట్రలు జరుగుతున్నాయని చెప్పారు.
జూన్‌లో సెనాన్ తన సెక్యూరిటీ సిబ్బందితో కలిసి హైతీ వచ్చారని, అధ్యక్ష పదవిని సొంతం చేసుకోవాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారని దర్యాప్తులో తేలింది.
మోస్ హత్యకు ఉపయోగించిన ఆయుధాలను సెనేటర్ జాన్ జోఎల్ జోసెఫ్ సమకూర్చారని, హత్య కోసం జరిగిన కుట్ర సమావేశాల్లో ఆయన పాల్గొన్నారని కూడా భావిస్తున్నారు.
పోలీసులకు ఇప్పుడు ఈ హత్యకాండ గురించి మరింత సమాచారం లభించింది.

ఫొటో సోర్స్, Reuters
అధ్యక్షుడి హత్యకు పొరుగు దేశం డొమినికా రిపబ్లిక్‌లో పథకం వేశారని హైతీ పోలీస్ చీఫ్ లియోన్ చార్ల్స్ చెప్పారు.
అక్కడ జరిగిన సమావేశాల్లో డాక్టర్ సెనాన్, అమెరికాలో ఉంటున్న హైతీకి చెందిన మరో పౌరుడు జేమ్స్ సోలాజేస్, సెనేటర్ జోసెఫ్ పాల్గొన్నారని తెలిపారు.
హైతీ దర్యాప్తు అధికారుల వివరాల ప్రకారం ఈ హత్య కుట్రలో మియామీలోని సెక్యూరిటీ కంపెనీ సీటీయూ హస్తం కూడా ఉంది. వెనెజ్యెలా సంతతికి చెందిన ఆంటోనియో ఇమాన్యుయెల్ ఇట్రియాగో దీనికి డైరెక్టర్. పోలీసులు ఇప్పటివరకూ అతడిని పట్టుకోలేకపోయారు.
అధ్యక్షుడి హత్యలో ఆయన పాత్ర ఏంటి అనేది కూడా ఇంకా స్పష్టంగా తెలీలేదు. 2018 ఆగస్టులో వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలస్ మాడురోపై డ్రోన్ దాడి జరిగింది. ఆ దాడి వెనుక ఇట్రియాగో ఉండచ్చనే సంకేతాలు లభించాయని వెనెజ్వెలా నేత జార్జ్ రోడ్రిగేజ్ అంటున్నారు.
ఇంట్రియాగో గురించి మరింత సమాచారం లభిస్తే, మోస్ హత్య గుట్టు విడిపోతుందని భావిస్తున్నారు.
మోస్ తన ఇంటర్వ్యూలో తన ఆర్థిక విధానాలతో దేశ ఆర్థిక రంగం సంతోషంగా లేదని అన్నారు. అధ్యక్షుడి హత్య వెనుక తాత్కాలిక అధ్యక్షుడు క్లాడే జోసెఫ్ హస్తం కూడా ఉండచ్చని ఈ గురువారం కొలంబియా రేడియో కారాకోల్ నెట్‌వర్క్ ఒక కార్యక్రమంలో చెప్పింది. అయితే దానికి పక్కా ఆధారాలు లేవని కొలంబియా చెప్పింది.
హత్యకు ఒక రోజు ముందు మోస్ కొత్త ప్రధానమంత్రిని నియమించారు. అయితే ఆయన ప్రమాణస్వీకారం చేయలేదు.

ఫొటో సోర్స్, Getty Images
5. ఇప్పుడు అధికారం ఎవరి చేతుల్లోకి వెళ్తుంది?
అధ్యక్షుడి హత్య హైతీ రాజకీయ సంక్షోభాన్ని మరింత తీవ్రం చేసింది.
మోస్ పదవీకాలం ఫిబ్రవరిలోనే ముగిసిందని, ఆయన కంటే ముందున్న అధ్యక్షుడు రాజీనామా చేసి ఐదేళ్లు పూర్తైందని విపక్షాలు అంటున్నాయి. అటు మోస్ మాత్రం తను 2017 ఫిబ్రవరిలో పదవి చేపట్టానని, 2022 వరకూ అది కొనసాగుతందని చెప్పారు.
హైతీలో 2019 అక్టోబర్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ రాజకీయ పార్టీల మధ్య పొత్తులు కుదరకపోవడంతో అవి జరగలేదు. అప్పటి నుంచి అధ్యక్షుడు మోస్ తన ఆదేశాల ప్రకారం పాలన సాగిస్తున్నారు. అధ్యక్షుడు మోస్ నాలుగేళ్ల పదవీకాలంలో ఆరుగురు ప్రధానమంత్రులు మారారు. హత్యకు ఒక రోజు ముందు కూడా ఆయన కొత్త ప్రధానమంత్రి పేరును ప్రకటించారు.
కానీ ఏడో ప్రధానమంత్రి ఎరియల్ హెన్రీ సమయం లేక ప్రమాణస్వీకారం చేయలేదు. ఇప్పుడు ఈ పదవి అధ్యక్షుడు క్లాడే జోసెఫ్ దగ్గరే ఉంది.
ఇప్పుడు హైతీని ఎవరు పాలిస్తారు అనే అనిశ్చితి కూడా నెలకొంది. దేశంలో ఎన్నికలు జరిగేవరకూ అధికారం తన దగ్గరే ఉంటుందని జోసెఫ్ అంటున్నారు. అటు హెన్రీ మాత్రం దేశ ప్రధానమంత్రిని తానేనని చెబుతున్నారు.
హైతీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుడి గైర్హాజరీలో దేశ సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ తాత్కాలిక పాలకుడుగా ఉంటారు. కానీ, కొన్ని నెలల క్రితమే చీఫ్ జస్టిస్ రెనె సిల్వెస్ట్రె కోవిడ్ వల్ల చనిపోవడంతో హైతీ సంక్షోభం మరింత ముదిరింది.
హైతీలో ఇదే ఏడాది ఎన్నికలు నిర్వహించాలని అమెరికా పట్టు బడుతోంది. కానీ ముందు ముందు ఏం జరుగుతుంది అనేది ఇంకా స్పష్టత రావడం లేదు.
ఇవి కూడా చదవండి:
- ఉత్తర్ ప్రదేశ్: యోగీ ఆదిత్యనాథ్ జనాభా పాలసీకి, ముస్లింలకు ఏమైనా సంబంధం ఉందా?
- గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్: 'ఇంటర్నెట్ స్వేచ్ఛపై దాడి జరుగుతోంది'
- దక్షిణాఫ్రికా: జాకబ్ జుమాను జైలుకు పంపడంపై అల్లర్లు, 72 మంది మృతి
- కోవిడ్-19: చైనా వ్యాక్సీన్లను ఇస్తున్న దేశాల్లో మళ్లీ కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
- ‘12 ఏళ్ల వయసులో పొట్ట పెరుగుతుంటే ఎందుకో అనుకున్నా, గర్భవతినని గుర్తించలేకపోయాను’
- 24 ఏళ్ల నిరీక్షణ, 5 లక్షల కి.మీ.ల ప్రయాణం-ఎట్టకేలకు కొడుకును కలుసుకున్న తండ్రి
- ‘సెక్స్ గురించి భారతీయులు మాట్లాడుకోరు, అందుకే నేను వారికి సాయం చేస్తున్నాను’
- ఆంధ్రప్రదేశ్: శ్రీశైలంలో రహస్యంగా డ్రోన్లు ఎందుకు ఎగరేస్తున్నారు ? అనుమతి లేకుండా వీటిని వాడితే ఏం జరుగుతుంది?
- బండ్ల శిరీష: రిచర్డ్ బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ ఫ్లైట్‌లో గుంటూరు అమ్మాయి రోదసి యాత్ర విజయవంతం
- పీవీ సింధు ఈసారి ఒలింపిక్ గోల్డ్ మెడల్ గెలవడం ఖాయమేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








