అఫ్గానిస్తాన్‌: తాలిబన్‌ గురించి భారత్ సహా ఈ ఏడు దేశాలు ఎందుకు ఆందోళన చెందుతున్నాయి

అప్ఘానిస్తాన్ కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

ఫొటో సోర్స్, WAKIL KOHSAR

ఫొటో క్యాప్షన్, అప్ఘానిస్తాన్ కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
    • రచయిత, రాఘవేంద్ర రావు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

షాంఘై సహకార సంఘం(ఎస్‌సీఓ) సభ్య దేశాల విదేశాంగ మంత్రులు జులై 13, 14న తజకిస్తాన్ రాజధాని దుషన్‌బేలో సమావేశం అవుతున్నారు. ఈ దేశాలన్నింటి దృష్టి ఇప్పుడు అఫ్గానిస్తాన్ మీదే ఉంది.

రెండు రోజుల ఈ సమావేశంలో రెండో రోజు అంటే జులై 14న ఎస్‌సీఓ ప్రతినిధులు అఫ్గానిస్తాన్ ప్రభుత్వంతో సమావేశం అవుతారు. ఆ దేశంలో ఏర్పడిన పరిస్థితులు, తాలిబన్లు అధికారం చేజిక్కించుకునే అవకాశాలు, తర్వాత తలెత్తే పరిస్థితుల గురించి అందులో చర్చిస్తారు.

ఎస్‌సీఓ 'అఫ్గానిస్తాన్ కాంటాక్ట్ గ్రూప్ 2018లో ఏర్పాటుచేశారు. తీవ్రవాదం నుంచి విముక్తి కల్పించి ఒక శాంతియుత, స్థిరమైన, ఆర్థికంగా సుసంపన్నమైన అఫ్గానిస్తాన్ నిర్మాణం కోసం ప్రతిపాదనలు, సూచనలు చేయడం దీని విధి.

ఒక్కో దేశానికి ఒక్కో ఆందోళన

అప్ఘానిస్తాన్‌లో తాలిబన్ల గురించి ఆందోళన చెందుతున్న దేశాల్లో భారత్ సహా చైనా, రష్యా, పాకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్, కజఖ్‌స్తాన్, కిర్గిజ్‌స్తాన్ ఉన్నాయి.

చైనా

చైనాలో వనరులు సమృద్ధిగా ఉండే జిన్జియాంగ్ ప్రావిన్స్‌కు అఫ్గానిస్తాన్‌తో దాదాపు 8 కిలోమీటర్ల సరిహద్దు ఉంది.

అఫ్గానిస్తాన్‌లో మారుతున్న పరిస్థితులు గమనిస్తున్న చైనా ప్రధానంగా.. తాలిబన్లు అక్కడ అధికారం హస్తగతం చేసుకుంటే జిన్జియాంగ్‌లో చురుగ్గా ఉన్న వేర్పాటువాద సంస్థ ఈస్ట్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ (ఈటీఐఎం)కు అఫ్గానిస్తాన్‌లో ఆశ్రయం లభించవచ్చని, అక్కడ నుంచి సాయం అందొచ్చని ఆందోళన చెందుతోంది.

ఈస్ట్ తుర్కిస్తాన్ ఇస్లామిక్ మూవ్‌మెంట్ ఒక చిన్నఇస్లామిక్ వేర్పాటువాద గ్రూప్. పశ్చిమ చైనాలోని జిన్జియాంగ్ ప్రాంతంలో ఇది చురుగ్గా ఉందని చెబుతున్నారు. స్వతంత్ర తూర్పు తుర్కిస్తాన్ స్థాపించాలని అది కోరుకుంటోంది.

జిన్జియాంగ్ ప్రాంతంలో చైనాలో మైనారిటీలైన వీగర్ ముస్లింలు ఉంటారు. అమెరికా విదేశాంగ శాఖ 2006లో వీగర్ వేర్పాటువాద గ్రూపుల్లో ఈటీఐఎం అతిపెద్దదని చెప్పింది. దీనిని తీవ్రవాద సంస్థగా ప్రకటించింది.

గత ఏడాది నవంబర్‌లో అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపేయో దీనిపై విధించిన ఆంక్షలు తొలగించారు.

అఫ్గానిస్తాన్‌లో భారీ స్థాయిలో పెట్టుబడుల అవకాశాలపై కూడా కన్నేసిన చైనా, ఆ దేశాన్ని తమ బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్(బీఆర్ఐ)లో చేర్చడానికి కూడా ప్రయత్నాలు చేయవచ్చు

చైనాను అఫ్గానిస్తాన్‌ ఒక మిత్రదేశంగా చూస్తోందని, పుర్నిర్మాణ పనుల్లో పెట్టుబడులు పెట్టడంపై వీలైనంత త్వరగా బీజింగ్‌లో చర్చలు జరుగుతాయని తాము ఆశిస్తున్నట్లు తాలిబన్ ప్రతినిధి సుహైల్ షాహీన్ చెప్పారు.

చైనా వీగర్ వేర్పాటువాద ఫైటర్లు జిన్జియాంగ్ నుంచి అఫ్గానిస్తాన్‌లోకి రావడానికి ఇక తాము అనుమతించమని కూడా తాలిబన్లు చెప్పారు.

అఫ్గానిస్తాన్‌లో ఇస్లామిక్ మత చాందసవాదం పెరిగితే మధ్య ఆసియా మొత్తానికీ అది ఒక పెద్ద ముప్పుగా మారవచ్చని రష్యా భావిస్తోంది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌లో ఇస్లామిక్ మత చాందసవాదం పెరిగితే మధ్య ఆసియా మొత్తానికీ అది ఒక పెద్ద ముప్పుగా మారవచ్చని రష్యా భావిస్తోంది.

రష్యా

అఫ్గానిస్తాన్ గురించి రష్యాకు అతిపెద్ద భయం ఒకటే. అమెరికా సైనికులు వెనక్కు వెళ్లిన తర్వాత ఇస్లామిక్ ఛాందసవాదానికి అఫ్గానిస్తాన్ బలమైన కోటగా మారుతుందేమోనని ఆ దేశం ఆందోళన చెందుతోంది.

అఫ్గానిస్తాన్‌లో ఇస్లామిక్ మత చాందసవాదం పెరిగితే మధ్య ఆసియా మొత్తానికీ అది ఒక పెద్ద ముప్పుగా మారవచ్చని, రక్తపాతం జరిగితే అది మాస్కో వరకూ రావచ్చని రష్యా భావిస్తోంది.

తాలిబన్లు తమకు ఒక భద్రతా కవచంలా ఉంటారని భావించిన రష్యా వారితో మంచి సంబంధాలు కొనసాగిస్తోంది. రష్యా ప్రభావం ఉన్న తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ లాంటి దేశాలు అఫ్గానిస్తాన్‌తో సరిహద్దులు పంచుకుంటున్నాయి.

రాబోయే రోజుల్లో అఫ్గానిస్తాన్ సరిహద్దుల్లో మానవతా, భద్రతా సంక్షోభం ఏర్పడవచ్చని రష్యా ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇటీవల రష్యాను సందర్శించిన తాలిబన్ల ప్రతినిధి బృందం ఒకటి అఫ్గానిస్తాన్‌లో తలెత్తే పరిణామాల వల్ల మధ్య ఆసియాకు ఎలాంటి ముప్పూ ఉండదని రష్యాకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసింది.

అఫ్గానిస్తాన్ భూభాగాన్ని ఇతర దేశాలకు వ్యతిరేకంగా ఉపయోగించకుండా చూస్తామని కూడా తాలిబన్లు రష్యాకు హామీ ఇచ్చారు.

భారత్

ఒక అంచనా ప్రకారం అఫ్గానిస్తాన్‌లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, సంస్థల పునర్నిర్మాణం కోసం భారత్ ఇప్పటి వరకూ మూడు బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టింది.

అఫ్గానిస్తాన్ పార్లమెంటు భవనాన్ని భారత్ నిర్మించింది. ఆ దేశంతో కలిసి ఒక పెద్ద ఆనకట్ట కూడా నిర్మించింది. విద్య, టెక్నాలజీ రంగాల్లో సహకారం కూడా అందించింది.

దానితోపాటూ అఫ్గానిస్తాన్‌ సహజ వనరుల్లో పెట్టుబడులను కూడా భారత్ ప్రోత్సహించింది. ఇరు దేశాల మధ్య దృఢమైన బంధం ఉండడంతో, ఇప్పుడు అఫ్గానిస్తాన్‌లో తన పెట్టుబడులు గురించి భారత్ ఆందోళనతో ఉంది.

తాలిబన్ల వల్ల పాకిస్తాన్‌ మీద తమ వ్యూహాత్మక ఆధిపత్యాన్ని కోల్పోవడంపై భారత్ ఎక్కువగా ఆందోళన చెందుతోంది.

అఫ్గానిస్తాన్‌లో భారత్ బలోపేతం కావడం వల్ల పాకిస్తాన్ మీద ఒక మానసిక, వ్యూహాత్మక ఒత్తిడి పడుతుంది. ఆ దేశంలో భారత్ పట్టు కోల్పోవడం అంటే, అక్కడ పాకిస్తాన్ ఆధిపత్యం పెరుగుతుందనే అర్థం.

వీడియో క్యాప్షన్, అఫ్గానిస్తాన్‌పై పట్టు బిగిస్తున్న తాలిబన్లు.. పలు రాష్ట్రాల్లో చెలరేగిన హింస

పాకిస్తాన్

పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్‌తో దాదాపు 2611 కిలోమీటర్ల పొడవున్న సరిహద్దును పంచుకుంటోంది. తమ సరిహద్దుల్లో అఫ్గానిస్తాన్‌ నుంచి వచ్చే శరణార్థులు భారీగా చేరతారేమోనని అది ఆందోళనకు గురవుతోంది.

పాకిస్తాన్ సైన్యం ఆపరేషన్లతో అఫ్గానిస్తాన్ పారిపోయిన పాకిస్తానీ తాలిబన్(తహ్రీక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్)లు శరణార్థుల రూపంలో తిరిగి దేశంలోకి వస్తారేమోనని కూడా ఆ దేశం భయపడుతోంది.

అఫ్గానిస్తాన్‌లో అంతర్యుద్ధం జరిగితే ఆ ప్రభావం నేరుగా పాకిస్తాన్ మీద పడవచ్చని ఇటీవల పాకిస్తాన్ సైనిక ప్రతినిధి మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికార్ అన్నారు. అక్కడ అంతర్యుద్ధం జరిగే అవకాశం ఉండడంతో పాకిస్తాన్ సైన్యం ముందే సన్నద్ధంగా ఉందని ఆయన చెప్పారు.

అఫ్గానిస్తాన్ పరిస్థితి చాలా ఘోరంగా ఉందని, అది తమ నియంత్రణ నుంచి దాటి పోయిందని పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారు మెయీద్ యూసుఫ్ అన్నారు.

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లకు సాయం అందిస్తోందని పాకిస్తాన్ చాలా కాలంగా ఆరోపణలు ఎదుర్కుంటోంది. అఫ్గానిస్తాన్‌లో భారత్ ఆధిపత్యానికి గండి కొట్టడానికే అది వారికి మద్దతిచ్చిందని భావించారు.

నాటో సైనికులు అఫ్గానిస్తాన్ నుంచి వెనక్కు వెళ్లిపోవడంతోనే పాకిస్తాన్ తాము కోల్పోయిన పట్టును తిరిగి సాధించగలమనే ఆశతో ఉందని నిపుణులు చెబుతున్నారు. 2001లో తాలిబన్ల పాలన అంతమైన తర్వాత అది అఫ్గానిస్తాన్‌లో తమ పట్టు కోల్పోయింది.

ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్

ఉజ్బెకిస్తాన్‌కు అఫ్గానిస్తాన్‌తో 144 కిలోమీటర్ల సరిహద్దు ఉంటే, తజకిస్తాన్‌కు ఆ దేశంతో 1344 కిలోమీటర్ల పొడవున్న బోర్డర్ ఉంది.

అఫ్గానిస్తాన్‌లో హింసాత్మక పరిస్థితుల వల్ల తమకు శరణార్థుల సమస్య తలెత్తవచ్చని ఈ రెండు దేశాలు ఆందోళనకు గురవుతున్నాయి.

అఫ్గానిస్తాన్ సైనికులు తాలిబన్లకు భయపడి, ప్రాణాలు కాపాడుకోడానికి సరిహద్దులు దాటి ఈ రెండు దేశాల్లోకి వెళ్లి తలదాచుకున్న ఘటనలు గత కొన్నివారాలుగా ఎన్నో జరిగాయి.

తజకిస్తాన్ సరిహద్దుల్లోని అఫ్గానిస్తాన్‌లోని ఒక పెద్ద ప్రాంతం ఇప్పుడు తాలిబన్ల నియంత్రణలోకి వచ్చింది. దాంతో తజకిస్తాన్ 20 వేల మంది రిజర్వ్ సైనికులను అఫ్గానిస్తాన్‌ సరిహద్దుల్లో మోహరించింది.

ఉజ్బెకిస్తాన్, తజకిస్తాన్‌లాగే, తుర్క్‌మెనిస్తాన్‌కు కూడా తాలిబన్ల గురించి ఆందోళనలు ఉన్నాయి. తుర్క్‌మెనిస్తాన్‌‌ 804 కిలోమీటర్ల సరిహద్దును ఆఫ్గనిస్తాన్‌తో పంచుకుంటోంది.

ముందు ముందు తమ సరిహద్దుల్లో మానవతా, భద్రతా సంక్షోభం తలెత్తవచ్చని అది కూడా ఆందోళన చెందుతోంది. కానీ తుర్క్‌మెనిస్తాన్‌ షాంఘై సహకార సంస్థలో సభ్య దేశంగా లేదు.

వీడియో క్యాప్షన్, హింస మధ్యే వెనక్కి వెళ్లిపోతున్న విదేశీ బలగాలు, అఫ్గాన్‌ భవిష్యత్తు ఏంటి?

కజఖ్‌స్తాన్, కిర్గిజ్‌స్తాన్

రష్యా, చైనా లాగే కజఖ్‌స్తాన్, కిర్గిజ్‌స్తాన్ కూడా అఫ్గానిస్తాన్‌లో ఇస్లామిక్ తీవ్రవాదం గురించే ఎక్కువ ఆందోళన చెందుతోంది.

ఈ రెండు దేశాల సరిహద్దులు అఫ్గానిస్తాన్‌తో కలవకపోయినప్పటికీ, అవి తమ దేశంలో జరిగే దాడులను తరచూ అఫ్గానిస్తాన్‌కు జోడించి చూస్తుంటాయి.

కిర్గిజ్‌స్తాన్ ఇస్లామిక్ మూమెంట్ ఆఫ్ ఉజ్బెకిస్తాన్ లాంటి తీవ్రవాద సంస్థలతోపాటు ఇస్లాం తిరుగుబాటుదారుల నుంచి సవాళ్లు ఎదుర్కవాల్సి వస్తోంది.

కజఖ్‌స్తాన్ చాలా కాలంగా అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణంలో భాగంగా ఉంటోంది. ఆర్థిక సాయం అందిస్తోంది. కజఖ్‌స్తాన్ నార్తర్న్ డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్(ఎన్డీఎన్)లో కూడా అది భాగస్వామి. ఈ నెట్‌వర్క్ కింద అఫ్గానిస్తాన్‌లో రైళ్లు ట్రక్కుల ద్వారా అమెరికా, రష్యా, మధ్య ఆసియా, కాకసస్ దేశాల మధ్య సరఫరాలు జరుగుతాయి.

అఫ్గానిస్తాన్‌లో శాంతి స్థాపనతో ప్రధానంగా ఒక దానిపై ప్రభావం కనిపిస్తుంది. మధ్య ఆసియా దేశాలు తమ సహజ వాయువు, ఇంధనం, బొగ్గు లాంటి వనరులను దక్షణాసియా భారత్, పాకిస్తాన్ లాంటి దేశాలకు చేర్చవచ్చు.

అందుకే ఈ మధ్య ఆసియా దేశాల కళ్లన్నీ ఇప్పుడు అఫ్గానిస్తాన్‌లో మారుతున్న రాజకీయ పరిస్థితులపైనే ఉన్నాయి.

ఆసియా దేశాల కళ్లన్నీ ఇప్పుడు అఫ్గానిస్తాన్‌లో మారుతున్న రాజకీయ పరిస్థితులపైనే ఉన్నాయి.

ఫొటో సోర్స్, TWITTER/SECTSCO

ఫొటో క్యాప్షన్, ఆసియా దేశాల కళ్లన్నీ ఇప్పుడు అఫ్గానిస్తాన్‌లో మారుతున్న రాజకీయ పరిస్థితులపైనే ఉన్నాయి.

షాంఘై సహకార సంస్థ అంటే

1996 ఏప్రిల్‌లో షాంఘైలో జరిగిన ఒక సమావేశంలో చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్ జాతి, మతపరమైన ఉధ్రిక్తతలు ఎదుర్కోడానికి పరస్పరం సహకరించుకునేలా ఒక ఒప్పందం చేసుకున్నాయి. వీటిని 'షాంఘై ఫైవ్' అంటారు.

షాంఘై ఫైవ్‌లో ఉజ్బెకిస్తాన్ కూడా చేరడంతో ఈ గ్రూప్‌ను తర్వాత 'షాంఘై సహకార సంస్థ' అన్నారు.

2005 జులైలో అస్తానా శిఖరాగ్ర సదస్సులో భారత్, ఇరాన్, పాకిస్తాన్‌కు పరిశీలకుల హోదా ఇచ్చారు. 2015లో రష్యాలోని ఉఫాలో జరిగిన సమావేశంలో షాంఘై సహకార సంస్థలో భారత్, పాకిస్తాన్‌లకు సంపూర్ణ సభ్యత్వం ఇవ్వాలని నిర్ణయించారు.

2016లో ఎస్‌సీఓలో చేరే అధికారిక ప్రక్రియను ప్రారంభించడానికి భారత్, పాకిస్తాన్ ఉజ్బెకిస్తాన్‌లోని తాష్కెంట్‌లో మెమరాండం ఆఫ్ ఆబ్లిగేషన్‌పై సంతకాలు చేశాయి. 2017లో అస్తానాలో జరిగిన చారిత్రక శిఖరాగ్ర సదస్సులో భారత్, పాకిస్తాన్ అధికారిక హోదాలో ఎస్‌సీఓలో పాల్గొన్నాయి

మంగోలియా, బెలారుస్, అఫ్గానిస్తాన్, ఇరాన్.. షాంఘై సహకార సంస్థలో పరిశీలకులుగా ఉండగా, ఆర్మేనియా, అజర్‌బైజాన్, టర్కీ, కంబోడియా, నేపాల్, శ్రీలంకను కూడా దీనిలో డైలాగ్ పార్టనర్‌గా చేర్చారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)