అమెరికా సైన్యం వెళ్లిపోవడంతో తాలిబన్, అల్-ఖైదాలు రెచ్చిపోతున్నాయా ? రాబోయే రోజుల్లో ఏం జరగబోతోంది?

ఫొటో సోర్స్, REUTERS
- రచయిత, ఫ్రాంక్ గార్డ్‌నర్
- హోదా, బీబీసీ ప్రతినిధఇ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాల మేరకు అఫ్గానిస్తాన్ నుంచి మిగిలిన భద్రతా దళాలు కూడా ఈ నెలలో వెనుదిరిగాయి. దాంతో, తాలిబన్ తిరుగుబాటు దారులు మళ్లీ ధైర్యం కూడ దీసుకునే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఇటీవలి కాలంలో ఒకదాని తరువాత ఒకటిగా అఫ్గానిస్తాన్‌లోని పలు ప్రావిన్సులను తాలిబన్లు స్వాధీనం చేసుకుంటున్నారు. అక్కడి ప్రభుత్వ అధికారులు నిస్సహాయులై లొంగిపోతున్నారు లేదంటే పారిపోతున్నారు.
ఈ పరిస్థితుల్లో అంతర్జాతీయ ఉగ్రవాదం మళ్లీ పుంజుకోవచ్చని విశ్లేషకులు అంటున్నారు.
"అఫ్గానిస్తాన్ నుంచి అమెరికా భద్రతా దళాలను ఉపసంహరించుకున్న తరువాత అక్కడ తాలిబన్లు మళ్లీ అధికారంలోకి రావడం అనివార్యం. అంతే కాకుండా, అల్-ఖైదా తమ నెట్‌వర్క్‌ను బలపరుచుకునే అవకాశం కూడా ఉంది. మళ్లీ అంతర్జాతీయ స్థాయిలో దాడులు నిర్వహించినా ఆశ్చర్యం లేదు" అని సెక్యూరిటీ అండ్ టెర్రరిజం అనలిస్ట్ డాక్టర్ సజ్జన్ గోహెల్ బీబీసీతో అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఆపరేషన్ల విస్తరణ
ఇక్కడ రెండు పరిణామాలు జరగడం ఖాయంగా కనిపిస్తోందని రక్షణ నిపుణులు అంటున్నారు. మొదటిది, తాలిబన్ల పునరాగమనం. 1996 నుంచి 2001 వరకు చేతిలో ఇనుప కొరడా పట్టుకుని మరీ అఫ్గానిస్తాన్‌ను పాలించిన ఈ అతివాద ఇస్లామిస్టులు ఏదో ఒక రూపంలో మళ్లీ అధికారంలోకి వస్తారు.
ప్రస్తుతానికైతే రాజధాని కాబూల్‌ను స్వాధీనం చేసుకునే ఉద్దేశం లేదని వారు చెబుతున్నారు. కానీ, ఇప్పటికే దేశంలో చాలా ప్రాంతాలను వారి ఆధీనంలోని తెచ్చుకున్నారు.
ఇలాగే, మొత్తం అఫ్గానిస్తాన్‌ను కఠిన నియమ నిబంధనలతో కూడిన ఇస్లామిక్ స్టేట్‌గా మార్చాలన్న తమ ఆలోచనను వారు ఎన్నడూ విడిచి పెట్టలేదు
రెండోది, అల్-ఖైదా, దాని ప్రత్యర్థి ఐఎస్‌లు ఖురాసన్ ప్రావిన్స్‌లో తమ ఆపరేషన్‌లను విస్తృతం చేసుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఇక్కడి నుంచి అమెరికా సైన్యం వెళ్లిపోవడంతో దాని నుంచి లబ్ధి పొందడానికి రెండు వర్గాలు ప్రయత్నిస్తాయి.
అల్-ఖైదా, ఐఎస్ ఇప్పటికే అఫ్గానిస్తాన్‌లో ప్రవేశించాయి.
కాగా, ఇప్పటి వరకూ అఫ్గానిస్తాన్ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ సర్వీస్ (ఎన్‌డీఎస్), అమెరికాతో, ఇతర ప్రత్యేక దళాలతో కలిసి ముప్పును కొంతమేరకు నిరోధించగలిగింది.
దాడులు, బాంబులు విసరడం అప్పుడప్పుడూ జరుగుతూనే ఉన్నాయిగానీ, చాలా సందర్భాల్లో ఇన్‌ఫార్మర్లు ఇచ్చిన సమాచారం, ఫోన్ కాల్ లీక్‌ల కారణంగా పాశ్చాత్య దేశాల దళాలు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోగలిగాయి.
అఫ్గానిస్తాన్ లోపలే భద్రాతా దళాలు స్థావరాలు ఏర్పరచుకోవడంతో, దాడి జరిగిన కొన్ని నిముషాల్లోనే హెలికాప్టర్‌లు అక్కడకు చేరుకోగలగడం, అర్థరాత్రి కూడా ప్రత్యర్థులను ముట్టడించడంలాంటివి చేయగలిగారు.
అయితే, ఇప్పుడు అదంతా గతం. అఫ్గాన్ జాతీయ సైన్యమే తాలిబన్‌లతో పోరాడాల్సి ఉంటుంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
'బ్రిటన్‌కు ముప్పు పెరగనుంది'
సెప్టెంబర్ 11 లోపల అమెరికాకు చెందిన అన్ని భద్రతా దళాలు, కాబూల్ విమానాశ్రయం, అమెరికా రాయబార కార్యాలయాన్ని కాపలా కాస్తున్న వాటితో సహా దేశాన్ని విడిచి వెళ్లకపోతే దోహా ఒప్పందాన్ని ఉల్లఘించినట్లవుతుందని ఇప్పటికే తాలిబన్లు స్పష్టంచేశారు.
వెళ్లకుండా ఇంకా అక్కడే ఉన్న భద్రతా దళాలపై దాడులు చేస్తామని కూడా హెచ్చరించారు.
మరోపక్క, బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఈ వారంలో తమ ప్రభుత్వ రహస్య జాతీయ భద్రతా మండలి (ఎన్‌ఎస్‌సీ)తో సమావేశమై, అఫ్గానిస్తాన్ విషయంలో ఎలాంటి సైనిక చర్యలు తీసుకోవాలో చర్చించనున్నారు.
"అఫ్గానిస్తాన్ నుంచి పశ్చిమ దేశాల భద్రతా దళాలు వెనుదిరిగితే బ్రిటన్‌కు ఉగ్రవాద ముప్పు పెరుగుతుంది" అని సీక్రెట్ ఇంటెలిజెన్స్ సర్వీస్ మాజీ అధిపతి సర్ అలెక్స్ యంగర్ అన్నారు.
అయితే, ఇప్పుడు ఏం చేయాలన్న విషయమై సందిగ్ధత నెలకొని ఉంది. అమెరికా సైన్యం సహాయం లేకుండా అఫ్గానిస్తాన్‌లో కొన్ని ప్రత్యేక భద్రతా దళాలను ఉంచవచ్చు. కానీ, వీరిపై తాలిబన్‌లు దాడి చేసే ప్రమాదం ఉంది.

ఫొటో సోర్స్, REUTERS
తాలిబన్ - అల్-ఖైదా సంబంధం
తాలిబన్లకు, అల్-ఖైదాకు ఎలాంటి సంబంధం ఉంది?
తాలిబన్లు ఏదో ఒక రూపంలో అధికారంలోకి రావడమంటే అల్-ఖైదా పునరాగమనానికి దారి ఏర్పడినట్టేనా? మళ్లీ వారి స్థావరాలు, ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు, కుక్కలపై విషవాయు ప్రయోగాలు అన్నీ మొదలవుతాయా?
సూటిగా చెప్పాలంటే, 2001 తరువాత అమెరికా వచ్చి వేటినైతే మట్టి కరిపించిందో అవన్నీ తిరిగి బలం పుంజుకుంటాయా ?
ఈ ప్రశ్న, పశ్చిమ దేశాల ఇంటెలిజెన్స్ అధికారులను కొన్నేళ్లుగా కలవరపెడుతోంది. తాలిబన్లు, అల్-ఖైదాకు మధ్య ఉన్న సంబంధం గురించి బ్రిటన్ కూడా ఆందోళన చెందుతోంది.
"తాలిబన్లకు, అల్-ఖైదాకు విడదీయరాని బంధం ఉంది. ఒకవేళ తాలిబన్లు, అల్-ఖైదా నుంచి దూరం జరగాలనుకున్నా సాంస్కృతిక, కుటుంబ, రాజకీయ బాధ్యతలు అలా చేయడానికి అవకాశం ఇవ్వవు" అని ఆసియా పసిఫిక్ ఫౌండేషన్‌లో పని చేస్తున్న డాక్టర్ గోహెల్ అన్నారు.

ఫొటో సోర్స్, MOI
దుశ్శకునాలు
అల్-ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ 1996లో సూడాన్ నుంచి అఫ్గానిస్తాన్‌కు తన స్థావరాన్ని మార్చుకున్నప్పటి నుంచి 2001 వరకు తాలిబన్లు ఆయనకు సురక్షితమైన స్థావరాన్ని కల్పించారు.
బిన్ లాడెన్‌ను అప్పగించడానికి తాలిబన్లను ఒప్పించేందుకు తమ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రిన్స్ తుర్కీ అల్-ఫైసల్‌ను సౌదీ అరేబియా అప్పట్లో పంపించింది.
కానీ, వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి. బిన్ లాడెన్‌ను అప్పగించేందుకు తాలిబన్లు నిరాకరించారు. పైగా, 9/11 దాడిని అల్-ఖైదా, తమ అఫ్గాన్ స్థావరం నుంచే నిర్వహించింది.
అయితే, తాలిబన్లు గతంలో చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకునే ఉంటారని బ్రిటన్ డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ జనరల్ సర్ నిక్ కార్టర్ విశ్వసిస్తున్నారు.
"మళ్లీ తాలిబన్లు అధికారంలోకి రావాలనుకుంటే, ప్రపంచం తమను అంటరానివారిగా చూడాలని కోరుకోరు" అని ఆయన అన్నారు.
అంతర్జాతీయంగా ఆమోదం పొందేందుకు తాలిబన్లు అల్-ఖైదాతో తెగదెంపులు చేసుకోవాలని కూడా అనుకోవచ్చు. కానీ, అది అంత సులభం కాదు.
అఫ్గానిస్తాన్‌లాంటి దేశంలో ఒకవేళ భవిష్యత్తులో తాలిబన్లు అధికారంలోకి వచ్చినా అల్-ఖైదాను నియంత్రించగలరనే గ్యారంటీ లేదు. అల్-ఖైదా తన మనుషులను చిన్న చిన్న గ్రామాల్లో, లోయల్లో సులువుగా దాచిపెట్టగలదు.
చివరిగా, అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూపు కూడా అస్థిరత సృష్టించేందుకే ప్రయత్నిస్తాయి. ప్రస్తుతం అఫ్గానిస్తాన్ అవే సూచనలు కనిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఒసామా బిన్ లాడెన్ తల్లి: నా బిడ్డ చిన్నప్పుడు చాలా మంచివాడు
- మోదీ మంత్రివర్గ విస్తరణ: రాజీనామా చేసిన పలువురు మంత్రులు
- ‘కాందహార్’ విమానం హైజాక్: 21 ఏళ్ల క్రితం అదంతా ఎలా జరిగింది?
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- 'ఝాన్సీ రాణి లక్ష్మీబాయిని దొంగ దెబ్బ తీసి చంపారు'
- జైష్-ఎ-మొహమ్మద్ అంటే ఏమిటి? ఈ మిలిటెంట్ సంస్థ విస్తరించడానికి కారణం ఎవరు?
- శ్రీలంక: ఆ రాతి చిత్రపటం పై విశ్వంలోకి అడుగుపెట్టే సీక్రెట్ కోడ్ ఉందా?
- ఔరంగజేబ్ నిజంగానే వేల హిందూ దేవాలయాలను కూల్చారా?
- ఏకే-47తో కాల్పులు జరిపిన ఆ అమ్మాయి చంపింది తాలిబన్లనా? తన భర్తనా?
- 'స్టాన్ స్వామి కస్టోడియల్ డెత్‌కు ప్రభుత్వానిదే బాధ్యత', వెల్లువెత్తుతున్న విమర్శల
- భీమా కోరేగావ్: హింసాత్మక ఘర్షణలు జరిగి మూడేళ్లు.. ఇప్పటి వరకూ ఈ కేసులో ఏం జరిగింది?
- ‘బిన్ లాడెన్ బాడీగార్డు’కు జర్మనీలో జీవన భృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








