వఖాన్ కారిడార్: అఫ్గానిస్తాన్‌లోని ఈ అందమైన సీమలో చైనా ఎందుకు రహదారి నిర్మిస్తోంది?

ఫొటో సోర్స్, Simon Urwin
- రచయిత, సైమన్ అర్విన్
- హోదా, బీబీసీ ట్రావెల్
మనిషికి గుండె ఎలాగో ఆసియాకు అఫ్గానిస్తాన్ అంత ముఖ్యమైనదని చైనా, ఇరాన్, పాకిస్తాన్, తజకిస్తాన్, తుర్కెమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లతో కలిసిన ఆ దేశ సరిహద్దులు చెప్పకనే చెబుతాయి.
మూడు కోట్ల 20 లక్షలకు పైగా జనాభా ఉన్న అఫ్గానిస్తాన్‌లో జనాభాలో 25 శాతానికి పైగా జనాభా మజార్-ఎ-షరీఫ్ లాంటి పెద్ద నగరాల్లో నివసిస్తున్నారు. మజార్-ఎ-షరీఫ్ దేశ రాజధాని కాబూల్‌కు ఆగ్నేయంగా 320 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
దేశంలో నాలుగో అతిపెద్ద నగరమైన దీనికి హజ్రత్ అలీ సమాధి కేంద్రంగా ఉంది. ఇది మహమ్మద్ ప్రవక్త అల్లుడు, ఇస్లాం నాలుగో ఖలీఫా చివరగా విశ్రాంతి తీసుకున్న స్థలమని స్థానికులు విశ్వసిస్తారు.
ఈ సమాధి ఇస్లాం వాస్తుకళకు ఒక అద్భుతంగా నిలిచింది. ఇది తెల్ల పావురాలకు కూడా ప్రసిద్ధి చెందింది.

ఫొటో సోర్స్, Simon Urwin
వేరే రంగులో ఉన్న పావురం ఏదైనా ఈ సమాధి పరిసర ప్రాంతాల్లోకి వచ్చిందంటే, దాని రంగు కూడా తెల్లగా మారిపోతుందని స్థానికులు భావిస్తారు.
ఈ సమాధికి దాదాపు 600 కిలోమీటర్లు తూర్పుగా వఖాన్ కారిడార్ ఉంటుంది. ఇది చాలా రకాలుగా దేశ సాంస్కృతిక, భౌగోళిక స్వరూపానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.
బదక్షాన్ ప్రాంతంలో 350 కిలోమీటర్ల పొడవున్న ఈ ప్రాంతం ప్రపంచంలోని మూడు అతిపెద్ద పర్వత శ్రేణులు హిందూ కుష్, కరాకోరమ్, పామీర్ కలిసే చోట ఉంటుంది.
ఈ ప్రాంతానికి టూర్లు ఏర్పాటు చేసే కొన్ని కంపెనీల్లో 'ఇంటెమడ్‌బార్డ్స్ డాట్ కామ్' ఒకటి. ఈ సంస్థకు చెందిన జేమ్స్ విల్‌కాక్స్ వఖాన్ కారిడార్ గురించి చెప్పారు.
"మనం అఫ్గానిస్తాన్ ట్రాఫిక్, గోల, భద్రతా సమస్యల నుంచి దూరంగా వెళ్లాలంటే ఇంతకు మించిన ప్రాంతం మరొకటి ఉండదు. ఇక్కడ ఎక్కువ జనాభా ఉండరు. కానీ, ఇక్కడికి చేరుకోవడం కూడా చాలా కష్టం. అసలు ఇక్కడ ఇలాంటి ప్రాతం ఉందని చాలా తక్కువమందికి తెలుసు. ఇది ప్రపంచంలోనే అత్యంత కఠినమైన, అందమైన ప్రాంతాల్లో ఒకటి" అన్నారు.

ఫొటో సోర్స్, Simon Urwin
గ్రామీణ జీవితం
వఖాన్ కారిడార్‌లో ఖాన్‌దద్ లాంటి చిన్న చిన్న పల్లెలు ఉంటాయి. ఆ పల్లెల్లో తెల్లటి రాళ్లు, మట్టి, చెక్కతో చేసిన ఇళ్లు కనిపిస్తాయి. కొన్ని పెద్ద గ్రామాలు కూడా ఉంటాయి. మట్టిరోడ్లు ఈ గ్రామాలన్నింటినీ ఒకదానితో ఒకటి కలుపుతుంటాయి. పంజ్ నది నీళ్ల వల్ల ఈ మట్టి రోడ్లు తరచూ ఉపయోగించడానికి అనువుగా ఉండవు.
ఈ కారిడార్‌కు పశ్చిమంగా ఒక మూల 80 కిలోమీటర్ల దూరంలో ఇష్కాషిమ్ పట్టణం ఉంటుంది. ఆజమ్ జియాయీ అక్కడే నివసిస్తున్నారు.
"వఖాన్ అనే ఈ మొత్తం ఏరియాలో వాహనాలు చాలా తక్కువ మందికే ఉంటాయి. కానీ, మాకు కమ్యూనిటీ ట్రాన్స్‌పోర్ట్ ఉంది, గాడిదలున్నాయి. ఇంకా చెప్పాలంటే మా కాళ్లు ఉన్నాయి" అన్నారు.
అయినప్పటికీ, ప్రపంచంలోని మిగతా ప్రాంతాలతో తెగిపోయినట్లు ఉంటుంది. కొన్ని గ్రామాల నుంచి ఇష్కాషిమ్ వరకూ వెళ్లాలంటే నాలుగు రోజులు ప్రయాణించాల్సి వస్తుంది.
ఇక్కడికి అత్యంత సమీపంలో ఉన్న పెద్ద పట్టణం దుషాంబే. ఇది తజకిస్తాన్ రాజధాని. అక్కడికి చేరుకోడానికి మూడు రోజులు పడుతుంది. ఇలా అన్నిటికీ దూరంగా ఉండడం వల్ల ఈ ప్రాంతం ఒక టైమ్ కాప్సూల్‌లా మారిపోయింది. ఇక్కడ నివసించేవారు ఎవరైనా సరిహద్దులు దాటి తజకిస్తాన్‌లో రోడ్లు, ఫోన్లు, కరెంటు లాంటివి చూసినపుడు తమకు భవిష్యత్తులోకి వెళ్లినట్లు ఉందని చెబుతారు.

ఫొటో సోర్స్, Simon Urwin
వఖాయీ సమాజం వారి ఇళ్లు
వఖాన్ కారిడార్ దాదాపు 2500 ఏళ్లుగా వఖాయీ సమాజానికి ఆవాసంగా ఉంది. ప్రస్తుతం ఇక్కడ దాదాపు 12 వేల మంది ఉన్నారు. ఇక్కడ ఎక్కువగా అఫ్గాన్ సంప్రదాయ సున్నీ ముస్లింలు నివసిస్తున్నారు. కానీ వఖాయీలు ఇస్మాయిలీలు. అంటే అది ఇస్లాంలో షియాలకు చెందిన ఒక సంప్రదాయం.
ఇక్కడి మహిళలు బురఖా వేసుకోవడం గానీ, ఇక్కడ ఏవైనా మసీదులు గానీ ఉండవు. ఇక్కడ వఖాయీలు అందరూ కలిసే ప్రదేశాలు ఉంటాయి. అక్కడ ప్రార్థనలు చేయడంతోపాటూ, వారు వాటిని కమ్యూనిటీ సెంటర్‌లా కూడా ఉపయోగిస్తారు.
ఇస్మాయిలీలు సున్నీలతో పోలిస్తే చాలా ఉదారంగా ఉంటారు.
ఉదాహరణకు వఖాన్‌లో పాశ్చాత్య పురుషులు ఎవరైనా అనుమతి లేకపోయినా వఖాయీ మహిళ ఫొటో తీసుకోవచ్చు. దీనిపై ఎవరూ ఆగ్రహించడం ఉండదు. కానీ, అఫ్గానిస్తాన్ మిగతా ప్రాంతాల్లో అది ఊహించడం కూడా కష్టం.
సున్నీ మిలిటెంట్లు ఇక్కడ లేకపోవడం, ఈ ప్రాంతం మిగతా దేశానికి దూరంగా ఉండడం వల్ల ఐఎస్ఐఎస్(ఇస్లామిక్ స్టేట్), తాలిబన్ లాంటి సంస్థలు ఇక్కడవరకూ చేరుకోలేకపోయాయనేది స్పష్టంగా తెలుస్తోంది. అందుకే దేశంలో మిగతా ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు ఉంటే, వఖాన్‌లో మాత్రం పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది.

ఫొటో సోర్స్, Simon Urwin
వఖాయీల జీవనశైలి
వఖాయీ రైతులు అక్కడి భూముల్లో గోధుమలు, బార్లీ, బఠాణీలు, బంగాళాదుంప, ఆప్రికాట్లు పండిస్తారు. హిమానీనదాలు కరగడం వల్ల పారే నీటిని పొలాలకు ఉపయోగిస్తారు. సంపన్న కుటుంబాల దగ్గర గొర్రెలు, మేకలు లేదా ఒంటెలు, గుర్రాలు, గాడిదలు లాంటివి ఉంటాయి.
ప్రతి ఏటా వేసవి రాగానే, వఖాయీలు జూన్‌లో తమ పశువులను తీసుకుని పచ్చదనం ఉన్న ప్రాంతాలకు వలస వెళ్తారు. అవి సముద్రమట్టానికి 4500 మీటర్ల ఎత్తులో ఉంటాయి. ఆ వలసలను కఛ్ అంటారు. ఇక ఇక్కడ పంటకోతల సమయంలో, అంటే ఆగస్టు మొదట్లో చనేర్ అనే జాతర కూడా జరుగుతుంది.
"మిగతా అఫ్గానిస్తాన్ అంతటా ఐదు సార్లు చేసే నమాజు అన్నిటినీ నిర్ణయిస్తే, ఇక్కడ మేం మాత్రం నేలనే నమ్ముకుంటాం. అందుకే మా జీవనశైలి ఎక్కువగా పొలాలు, వాతావరణం, ప్రకృతిమీద ఆధారపడి ఉంటుంది" అని ఆజమ్ జియాయీ చెప్పారు.

ఫొటో సోర్స్, Simon Urwin
ఎన్నో శతాబ్దాల పురాతన క్రీడ
అత్యంత ప్రత్యేకంగా ఉండే వఖాన్ సంప్రదాయాల్లో ఎన్నో శతాబ్దాల నాటి బుజ్‌కషీ క్రీడ ఒకటి. దీనిని గుర్రాలపై స్వారీ చేస్తూ రగ్బీలా ఆడుతారు. ఈ ఆటలో గొర్రె శరీరాన్నే బంతిలా చేసుకుని ఆడతారు.
పోలో ఆట కూడా బుజ్‌కషీ నుంచే వచ్చిందని చెబుతారు. బుజ్‌కషీలో ఎలాంటి నియమాలు, జట్లు ఉండవు. అందులో ఫెయిర్ ప్లే గురించి కూడా పట్టించుకోరు. ఆటగాళ్లు ఒకరినొకరు తన్నుకుంటూ, కొట్టుకుంటూ గొర్రె శరీరాన్ని సొంతం చేసుకోడానికి ప్రయత్నిస్తారు.
"ఈ ఆటలో చాలా మందికి ఎముకలు విరగడం అనేది చాలా మామూలు విషయం. వఖాయీ గ్రామాలు ముఖ్యంగా కొత్త సంవత్సరం రోజున ఈ ఆట ఆడుతుంటారు" అని ఆజం జియాయీ చెప్పారు.

ఫొటో సోర్స్, Simon Urwin
"కానీ అఫ్గానిస్తాన్ మిగతా ప్రాంతాల్లో ఆడే బుజ్‌కుషీలో చాలా రాజకీయాలు ఉంటాయి. అక్కడ దీన్ని ఉన్నత వర్గాల వారు తమ బలం చూపించడానికి నిర్వహిస్తుంటారు. కానీ, మా ప్రాంతంలో ఆట ఫోకస్ అంతా పోటీ, మా సమాజం మీదే ఉంటుంది. అదే వఖాన్‌ను ఇంత ప్రత్యేకంగా మార్చింది".
భద్రతా దృష్ట్యా అఫ్గానిస్తాన్ విదేశీ పర్యటకులకు అంత సురక్షిత ప్రాంతం కాదు. కానీ వఖాన్ కారిడార్ గత కొన్నేళ్లుగా శాంతికి, అందమైన ప్రకృతికి, ఆకట్టుకునే వఖాయీ సంస్కృతికి చిహ్నంగా నిలిచింది. ఎంతోమంది పర్యటకులను ఆకర్షిస్తోంది.
ఎడ్ సమర్స్ ఒక గైడ్. ఆయన తొమ్మిదిసార్లు వఖాన్‌కు టూర్ వెళ్లారు.
"మొదట్లో ఇక్కడకు చాలా తక్కువ మంది మాత్రమే వచ్చేవారు. గత పదేళ్ల నుంచీ ఇక్కడికొచ్చే పర్యటకుల సంఖ్య పెరిగింది. ఏటా ఇక్కడకు 600 మందికి పైగా వస్తున్నారు. ఎప్పుడూ వెళ్లే పర్యటక ప్రదేశాలకు దూరంగా ఇలాంటి ప్రాంతాలకు రావడం వల్ల చాలా మందికి ఒక ప్రశాంతత లభిస్తోంది" అని ఆయన చెప్పారు.
ఇక్కడ తమ సంప్రదాయ జీవనశైలిని ప్రేమించేవారు మనకు కనిపిస్తారు. మీరు వఖాన్‌లో పర్యటిస్తుంటే, అక్కడ అందమైన ప్రాంతాలు మిమ్మల్ని ఆకట్టుకోవడమే కాదు, అక్కడ మనం వేసే ప్రతి అడుగూ ఒక ఆసక్తికరమైన చరిత్ర పుస్తకం పేజీలు తిప్పిన అనుభూతిని అందిస్తుంది" అన్నారు.

ఫొటో సోర్స్, Simon Urwin
సిల్క్ రూట్‌లో భాగం
చైనాను మధ్యదరా సముద్రంతో కలుపుతూ క్రీ.శ. మొదటి, రెండో శతాబ్దంలో నిర్మించిన సిల్క్ రూట్‌లో వఖాన్ కారిడార్ ఎన్నో ఏళ్ల పాటు ముఖ్యమైన భాగంగా ఉంది.
"ఈ మార్గంలో వెళ్లే వ్యాపారులు చైనా పట్టు, రోమన్ బంగారం, ఇక్కడి అఫ్గాన్ రత్నాలు లాంటి వాటిని కొనుగోలు చేసి తీసుకెళ్లేవారు" అని ఎడ్ సమర్స్ చెప్పారు.
13వ శతాబ్దంలో మార్కోపోలో ఈ ప్రాంతం మీదుగానే చైనా వెళ్లారని, సికిందర్ కూడా ఇదే దారిలో ప్రయాణించారని చెబుతారు. మనకు ఇక్కడ ఆనాటి ప్రాచీన రహదారుల గుర్తులు, ఆ దారిలో బస చేసిన ప్రాంతాలు, బుద్ధుడి ప్రతిమల ఆనవాళ్లు కనిపిస్తాయి.

ఫొటో సోర్స్, Simon Urwin
వ్యూహాత్మకంగా కీలక ప్రాంతం
19వ శతాబ్దంలో బ్రిటన్, రష్యా మధ్య జరిగిన గ్రేట్ గేమ్‌లో వఖాన్‌ది చాలా కీలక పాత్ర అని విల్ కాక్స్ చెప్పారు.
"రష్యా, బ్రిటన్ మధ్య ఆసియా యుద్ధం జరుగుతున్నప్పుడు అఫ్గానిస్తాన్ చాలా ముఖ్యమైన ప్రాంతంగా ఉండేది. ప్రత్యర్థి దేశాల సరిహద్దులు ఒకదానితో ఒకటి కలవకుండా వఖాన్ ప్రస్తుత సరిహద్దులను అప్పట్లో ఒక బఫర్ జోన్‌లా ఉయోగించారు" అని ఆయన తెలిపారు..
"వఖాన్ గతంలో కోల్డ్‌వార్‌లో కూడా కీలకంగా నిలిచింది. ఇప్పుడు చైనా బెల్డ్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ పుణ్యమా అని ఇది మరోసారి ప్రముఖ వ్యాపార మార్గం అవుతుందేమో" అని విల్ కాక్స్ అన్నారు.

ఫొటో సోర్స్, Simon Urwin
కొత్త నిర్మాణాలు
కొంత కాలం క్రితం వరకూ ఇష్కాషిమ్ నుంచి ఉండే మట్టి రోడ్డు కారిడార్ మధ్యలో ఉన్న బ్రొగెల్ సరిహద్దు వరకే ఉండేది.
తర్వాత అక్కడ నుంచి తూర్పు వైపు పర్యటించాలంటే కాలినడకన లేదా జంతువులపై వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు బెల్ట్ అండ్ రోడ్ నిర్మించడం వల్ల ఈ దారిని 75 కిలోమీటర్లు బొజయీ గంబాజ్ గ్రామం వరకూ వచ్చేలా పొడిగించారు. అది వఖాన్ మొత్తం పొడవులో మూడో వంతు ఉంది.
"ఈ రహదారిని గతంలో కిర్గిజ్ సంచార జాతులు ఉపయోగించిన పాత దారిమీదనే నిర్మిస్తున్నారు. ఇప్పుడు బుల్‌డోజర్లు వచ్చాయి. ఒక చిన్న కాలి బాట లాంటిది నిర్మించారు. దీనిపై ఒక పెద్ద రోడ్డు నిర్మించే అవకాశాలు కూడా ఉన్నాయి" అని సమర్స్ చెప్పారు.
ఇక్కడ చైనా ఒక రహదారి నిర్మిస్తుందని, అది ఆ దేశ సరిహద్దులను బొజయీ గంబాజ్ వరకూ కలుపుతుందని చెబుతున్నారు. ఈ మార్గం పూర్తయితే మధ్యఆసియా మార్కెట్లను చేరుకోవడం చైనాకు సులువవుతుంది.

ఫొటో సోర్స్, Simon Urwin
చైనా రహదారిపై ఆశలు
చైనా నిర్మాణాలపై వఖాన్ ప్రజల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోందని ఆజమ్ జియాయీ చెబుతున్నారు.
"కొన్ని విషయాల్లో అది మాకు మంచిదే. మేం చైనా నుంచి మేకలు కొనవచ్చు. అక్కడ అవి ఇష్కాషిమ్ మార్కెట్ కంటే తక్కువ ధరకే దొరుకుతాయి. దీనివల్ల మాకు మెరుగైన ఆరోగ్య సేవలు కూడా అందుతాయని ఆశిస్తున్నాం" అన్నారు.
ప్రస్తుతానికి మాకు పరిమిత సౌకర్యాలే ఉన్నాయి. కానీ, మాకు ఎక్కువగా వఖాయీ సంస్కృతి గురించి ఆందోళన ఉంది. అది శాశ్వతంగా మారిపోతుందని ఆయన చెప్పారు.
"మాకు ఈ నిశ్శబ్దం, అందమైన ప్రకృతి దృశ్యాలంటే ఇష్టం. ట్రాఫిక్, కాలుష్యం అంటే భయం. పర్వతాల్లో మార్గాలు నిర్మించడానికి చాలా కాలం పడుతుంది. కానీ, ఇది వచ్చే ఏడాదికల్లా సిద్ధమవుతుందని అనిపిస్తోంది. చైనా, అఫ్గాన్ ప్రభుత్వాలు దీన్ని త్వరగా పూర్తి చేయాలని అనుకుంటున్నాయి. కానీ, మా భవిష్యత్తు ఏమవుతుందో కాలమే చెప్పాలి" అంటారు జియాయీ.
ఇవి కూడా చదవండి:
- వైఎస్ షర్మిల: కృష్ణా నదిపై రెండేళ్లుగా ప్రాజెక్టులు కడుతుంటే కేసీఆర్ ఇప్పుడే తెలివిలోకి వచ్చారా?
- మోదీ కేబినెట్: దళిత, ఓబీసీ మంత్రులు యూపీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించగలరా
- ప్యూ రీసెర్చ్: మతం పట్ల భారతీయుల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది
- డెల్టా ప్లస్: ఈ కోవిడ్-19 కొత్త వేరియంట్‌కు ప్రపంచం భయపడాల్సిందేనా
- అయోధ్య: రామ మందిరం ట్రస్ట్ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయా? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- టవోలారా: ప్రపంచంలోనే అతిచిన్న సామ్రాజ్యమిది.. ఇక్కడ ఎంతమంది నివసిస్తారో తెలుసా?
- మియన్మార్: ''43 మంది పిల్లలను సైన్యం చంపేసింది''
- రష్యా-అమెరికా చర్చల గురించి సైబర్ ముఠాలకు భయమే లేదా?
- కిమ్ జోంగ్ ఉన్: 'అమెరికాతో 'చర్చలకు, ఘర్షణకు' ఉత్తర కొరియా రెడీ అవుతోంది'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









