ఓర్కా: షార్క్‌లను చంపి కాలేయం తింటున్న తిమింగలాలు.. కారణమేంటి

సొరచేపపై దాడి

ఫొటో సోర్స్, CHRISTIAAN STOPFORTH/DRONE FANATICS

ఫొటో క్యాప్షన్, సొరచేపను మగ కిల్లర్ వేల్ చంపి దాని కాలేయాన్ని తినేస్తుంది.

ఒక భారీ తిమింగలం (ఓర్కా) ఆశ్చర్యకర రీతిలో గ్రేట్ వైట్ షార్క్ (తెల్ల సొరచేప)ను వేటాడి, చంపేసింది. దీనికి సంబంధించిన వీడియో రికార్డైంది.

శాస్త్రవేత్తలు ఇది అపూర్వమైన ఘటనగా అభివర్ణించారు. దీన్ని కిల్లర్ వేల్స్ (తిమింగలాలు) అసాధారణమైన వేట నైపుణ్యంగా శాస్త్రవేత్తలు అభివర్ణించారు.

దక్షిణాఫ్రికా తీరంలో సొరచేపలను వేటాడేందుకు రెండు ఓర్కాలు కలిసి పనిచేయడం శాస్త్రవేత్తలు గమనించారు.

"ఇది మా దృష్టిలో పడింది" అని షార్క్ జీవ శాస్త్రవేత్త డాక్టర్ అలిసన్ టౌన్ర్ చెప్పారు.

దక్షిణాఫ్రికాలోని గ్రాహమ్‌స్టౌన్‌లోని రోడ్స్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ టౌనర్ చాలా ఏళ్లుగా జంతువులపై అధ్యయనం చేస్తున్నారు.

టౌనర్, ఆమె సహచరులు ఆఫ్రికన్ జర్నల్ ఆఫ్ మెరైన్ సైన్స్‌లో వారి కొత్త పరిశీలనల వివరణాత్మక ఘటనలను ప్రచురించారు.

చేపల వేట

ఫొటో సోర్స్, CHRISTIAAN STOPFORTH

ఫొటో క్యాప్షన్, 2022లో రెండు మగ ఓర్కాలు గ్రేట్ వైట్ షార్క్‌లను వేటాడేందుకు చేస్తున్న ప్రయత్నాలను డ్రోన్ సాయంతో రికార్డు చేశారు.

ఎప్పుడు జరిగింది?

2023లో ఈ తిమింగలం దాడి వీడియోను చిత్రీకరించారు, దానిలో ఓర్కా సొంతంగా, వేగంగా వేటాడుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు.

సొరచేపను మగ కిల్లర్ వేల్ చంపి దాని కాలేయాన్ని తినేస్తుంది. అన్నీ రెండు నిమిషాల్లోపే జరిగిపోయాయి.

2022లో రెండు మగ ఓర్కా (తిమింగలం)లు కలిసి గ్రేట్ వైట్ షార్క్‌లను వేటాడేందుకు చేస్తున్న ప్రయత్నాలను శాస్త్రవేత్తలు డ్రోన్ సాయంతో రికార్డు చేశారు.

ఈ ఓర్కాలకు పోర్ట్, స్టార్‌బోర్డ్ అనే 'ముద్దుపేర్లు' ఉన్నాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎందుకంటే వాటి వెన్ను రెక్కలు వ్యతిరేక దిశలో కొద్దిగా వంగి ఉన్నాయి.

సొరచేపల నుంచి కాలేయాలను తినడానికే అవి ప్రాధాన్యమిచ్చాయని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఓర్కాలు

ఫొటో సోర్స్, DAVID ELLIFRIT/CWR

దాడి జరిగిన తీరు ఇదీ..

''దాడి సమయంలో సొరచేపలు కిల్లర్ వేల్‌లను చుట్టుముట్టాయి, వేట నుంచి సొరచేపను తప్పించడానికి ప్రయత్నం చేశాయి" అని టౌనర్ గుర్తుచేసుకున్నారు.

కొత్తగా జరిగిన ఈ దాడిలో స్టార్‌బోర్డ్ తనంతట తానుగానే వేటాడింది.

2.5 మీటర్ల పొడవున్న షార్క్ ఎడమ పెక్టోరల్ (వక్ష భాగం వద్ద) రెక్కను ఓర్కా ఎలా పట్టుకుందో శాస్త్రవేత్తలు వివరించారు.

ఇది మంచి పరిశీలన అని సెయింట్ ఆండ్రూస్ విశ్వవిద్యాలయానికి చెందిన సముద్ర క్షీరద శాస్త్రవేత్త డాక్టర్ ల్యూక్ రెండెల్ అన్నారు.

షార్క్‌ను పట్టుకోవడానికి ఓర్కా ప్రదర్శించిన నైపుణ్యాన్ని ల్యూక్ రెండెల్ ప్రశంసించారు.

సొరచేపను పక్కకు తిప్పి, దాని దవడల నుంచి దూరంగా ఉండటానికి పెక్టోరల్ రెక్కలను ఓర్కా పట్టుకుందని తెలిపారు.

సముద్రంలో అతి తక్కువగా ఉండే ఓర్కాలు ఆహారం కోసం సొరచేపలను ఎంచుకోవడమనేది ఆశ్చర్యమేమీ కాదని చెప్పారు.

సముద్రం

ఫొటో సోర్స్, HUW GRIFFITHS (BAS)

మనుషులే కారణమా?

ఈ భారీ తిమింగళాలు ఉండే ప్రాంతాలలో సొరచేపల జనాభా ఎలా ప్రభావితమవుతుందనే దానిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఓర్కాల దాడులకు కారణమేమిటో శాస్త్రవేత్తలకు తెలియదు.

అయితే "వాతావరణ మార్పు, ఇండస్ట్రీయల్ ఫిషింగ్ వంటి మానవ కార్యకలాపాలు మహాసముద్రాలపై ఒత్తిడి పెంచుతున్నాయని తెలుస్తోంది'' అని టౌనర్ బీబీసీ న్యూస్‌తో అన్నారు.

మరోవైపు సొరచేపల మాంసం నుంచి లభించే టాక్సిన్స్, లోహాల ద్వారా తిమింగళాలకు ఆరోగ్యకర ఉపయోగాలూ ఉండవచ్చు.

ఇలాంటి దాడులు ఇతర జాతుల బ్యాలెన్స్ ప్రభావితం చేస్తుందని టౌనర్ వివరించారు.

"అంతరించిపోతున్న ఆఫ్రికన్ పెంగ్విన్‌లు కేప్ ఫర్ సీల్స్ తెల్ల సొరచేపల వేటనూ ఎదుర్కొంటాయి" అని ఆందోళన వెలిబుచ్చారు.

తిమింగళాల ఈ ప్రవర్తన కొత్తగా ఉందా? లేదా మొదటిసారి చూస్తున్నామా? అనేది తెలుసుకోవడానికి మార్గం లేదని ల్యూక్ రెండెల్ సూచించారు.

"కానీ ఈ తిమింగలాలకు వేటలో ఎంత నైపుణ్యముందో చూడటం ముఖ్యం" అని తెలిపారు.

అయితే, తిమింగలాలు, సొరచేపల మధ్య వెలుగులోకి వచ్చే ప్రతిది ఆకర్షణీయమైనదేనని టౌనర్ అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)