పార్థినోజెనిసిస్: మగ చేప లేని చోట ఆడ చేపకు గర్భం.. అలైంగిక ప్రత్యుత్పత్తే కారణమా? జీవులలో ఎందుకిలా జరుగుతోంది

ఆడ స్టింగ్రే

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ఫ్రాంకీ అడ్కిన్స్
    • హోదా, బీబీసీ ప్యూచర్

ఇటీవల ఒక ఒంటరి ఆడ స్టిం‌గ్‌రే చేప తాను ఉంటున్న ఫిష్ ట్యాంక్‌లో మగ చేపలు లేనప్పటికీ గర్భం దాల్చింది.

పరిమిత ప్రదేశంలో ఉన్న జీవులలో ఇలా ఎందుకు జరుగుతోంది? మగ తోడు లేకుండానే ఇది ఎలా సాధ్యమవుతోంది?

ఇది ప్రకృతి సూత్రాలకు విరుద్ధంగా కనిపించే సంఘటన.

2024 ఫిబ్రవరిలో అమెరికాలోని నార్త్ కరోలినాలోని హెండర్సన్‌విల్లేలోని ఒక చిన్న అక్వేరియంలో షార్లెట్ అనే ఆడ స్టింగ్‌రే చేప గర్భం దాల్చింది.

ఆ చేప ఎనిమిదేళ్లుగా ఏ మగ స్టింగ్‌రేనూ కలవకున్నా ప్రెగ్నెంట్ అయింది. ఇది ఎకో అక్వేరియం బృందం, షార్క్ ల్యాబ్‌లోని శాస్త్రవేత్తలను ఆశ్చర్యపోయేలా చేసింది.

తూనీగ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పార్థినోజెనిసిస్ ద్వారా తూనీగల్లో పునరుత్పత్తి సర్వసాధారణం

ఎలా గర్భం దాల్చింది?

తన ట్యాంక్‌లో మగ స్టింగ్ రే లేకున్నా షార్లెట్ అనే ఈ ఆడ స్టింగ్ రే గర్భం ఎలా ధరించింది అనేది ఒక రహస్యం. అయితే, స్టింగ్రే శరీరంపై కొన్ని అనుమానాస్పద గుర్తులు కనిపించాయి.

షార్లెట్‌తో పాటే ట్యాంక్‌‌లో ఉంటున్న రెండు తెల్లటి మచ్చల బాంబూ సొరచేపలే దానికి కారణంగా భావిస్తున్నారు. అలాంటి గుర్తులు సొరచేపల సంభోగ ప్రవర్తనకు సంకేతం.

కానీ ఈ కలయిక షార్క్-స్టింగ్ రే హైబ్రిడ్‌ సంతానానికి దారి తీస్తుంది. అయితే, శాస్త్రవేత్తలు మాత్రం ఈ చేపకు గర్భం 'పార్థినోజెనిసిస్' ఫలితంగా వచ్చిందని భావిస్తున్నారు

పార్థినోస్ అంటే కన్య, జెనెసిస్ అంటే సృష్టి అని అర్థం. దీనిలో అండం, స్పెర్మ్ ద్వారా ఫలదీకరణం చెందకుండా పిండంగా అభివృద్ధి చెందుతుంది.

అయితే, షార్లెట్ ఒంటరిగా గర్భం దాల్చిన మొదటి జంతువు కాదు.

మేఫ్లైస్(తూనీగ రకం) వంటి కీటకాలలో పార్థినోజెనిసిస్ చాలా సాధారణం, అయితే ఇది సకశేరుకాలలో చాలా అరుదుగా ఉంటుంది.

2001లో ఫిష్ ట్యాంకులో ఉండే ఒక బోనెట్‌హెడ్ షార్క్ జన్మనిచ్చినప్పటి నుంచి షార్క్‌లు, సరీసృపాలలో ఇలాంటి ఘటనలు చాలా వెలుగులోకి వచ్చాయి.

పార్థినోజెనిసిస్‌ ద్వారా గర్భం దాల్చినట్లు తేలిన మొదటి స్టింగ్ రే ఈ షార్లెట్ అని భావిస్తున్నారు.

అయితే, సరిగ్గా పార్థినోజెనిసిస్ ఎందుకు సంభవిస్తుంది అనేది రహస్యమే.

స్టింగ్ రే

ఫొటో సోర్స్, Getty Images

షికాగోలో ఇలాంటి ఘటనే..

"పరిణామక్రమం లక్ష్యం మీ జన్యువులను తదుపరి తరాల కోసం అందించడం" అని పరమాణు జీవశాస్త్రవేత్త కెవిన్ ఫెల్డ్‌హీమ్ చెప్పారు.

ఆయన షికాగో ఫీల్డ్ మ్యూజియంలో షార్క్ సంతతి, వాటి సంభోగం ప్రవర్తనను అధ్యయనం చేయడానికి జన్యుశాస్త్రాన్ని ఉపయోగిస్తున్నారు.

"సాధారణంగా మగవారి సహాయంతో స్త్రీ జన్మనిస్తుంది. కానీ, ఒంటరి స్త్రీకి ఆ అవకాశం లేదు" అని కెవిన్ అన్నారు.

ఫెల్డ్‌ హీమ్ 2008లో షికాగోలోని షెడ్ అక్వేరియంలో జీబ్రా షార్క్‌ పార్థినోజెనిసిస్ కేసును పరిశోధించారు.

మొదట అక్వేరియంలో ఉంటున్న ప్రాణుల మధ్య సంభోగం అవకాశాన్ని ఆయన తోసిపుచ్చారు.

"మగది ఆడ చేపతో జతకట్టినట్లు ప్రత్యక్ష సాక్ష్యం లేదు, ట్యాంక్‌లో 24/7 కెమెరాలు కూడా లేవు" అని ఫెల్డ్‌ హీమ్ తెలిపారు.

''షార్క్ తల్లిదండ్రులను గుర్తించడం చాలా క్లిష్టంగా ఉంటుంది, ఎందుకంటే కొన్ని ఆడ సొరచేపలు సంభోగం తర్వాత నెలల తరబడి స్పెర్మ్‌ను నిల్వ చేసుకోగలవు'' అని తెలిపారు.

ఫెల్డ్‌ హీమ్ మైక్రోసాటిలైట్స్ అని పిలిచే జన్యు గుర్తులను సేకరించడానికి పితృత్వ పరీక్షను అభివృద్ధి చేశారు.

"వీటిని మానవ పితృత్వ కేసుల్లో ఉపయోగిస్తారు" అని ఆయన చెప్పారు.

ఇక జీబ్రా షార్క్ సంతానంలో ఎటువంటి పితృ డీఎన్ఏ లేదని ఫలితాలు నిర్ధరించాయి, అందులో కేవలం ఆడవి మాత్రమే ఉన్నాయి.

"ఇదెలా జరుగుతుందనేదే ప్రశ్న? దానికి సమాధానం పార్థినోజెనిసిస్" అని ఫెల్డ్‌హీమ్ చెప్పారు.

ఎలా సాధ్యం?

జంతు పునరుత్పత్తికి సంబంధించిన చాలా సందర్భాలలో కణాలు విభజించబడే మియోసిస్ అనే ప్రక్రియలో గుడ్లు ఉత్పత్తి అవుతాయి.

జన్యు పదార్ధం, వాటి మధ్య ఇతర సెల్యులార్ భాగాలను పంచుకుంటాయి. ఈ ప్రక్రియ పోలార్ బాడీస్ అనే మూడు చిన్న సెల్యులార్ నిర్మాణాలను ఉత్పత్తి చేస్తుంది.

సాధారణంగా ఈ పోలార్ బాడీస్‌ను స్త్రీ తిరిగి శోషించుకుంటుంది. కానీ, పార్థినోజెనిసిస్‌లో మాత్రం ఒక పోలార్ బాడీ, గుడ్డును ఫలదీకరణం చేయగలదు, అది పిండాన్ని ఏర్పరుస్తుంది, కాబట్టి లైంగిక పునరుత్పత్తి జరుగుతుంది.

ఇది క్లోనింగ్‌కు భిన్నమైన ప్రక్రియ కానీ, దీనిలో లోపాలున్నాయని జార్జియా అక్వేరియంలో సొరచేపలు, స్కేట్స్, రేస్ చేపలను అధ్యయనం చేసే పరిశోధనా శాస్త్రవేత్త కేడీ లియోన్స్ అంటున్నారు.

"ఈ పద్దతిలో ఉపయోగిస్తున్న ఈ కణాలు తల్లిని పోలినవి కావు" అని ఆమె చెబుతున్నారు.

గుడ్డు, పోలార్ బాడీలలో తల్లి జన్యువులోని భాగాలే ఉండటంతో, సంతానం తల్లి కంటే తక్కువ జన్యు వైవిధ్యంతో పుడుతుందని లియోన్స్ అంటున్నారు.

బల్లులు

ఫొటో సోర్స్, Getty Images

మెక్సికో బల్లుల మాదిరే..

కొన్ని జాతులకు, అలైంగిక పునరుత్పత్తి ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు మెక్సికో, కాలిఫోర్నియాలోని విప్‌టైల్ బల్లుల్లోని కొన్ని పూర్తిగా ఆడవిగా మారాయి.

అలైంగికంగా పునరుత్పత్తి చేసే ఆడ ప్రాణి గుడ్లలోని క్రోమోజోమ్‌ల సంఖ్యను రెట్టింపు చేసుకొని, పార్థినోజెనిసిస్ ద్వారా ఈ జాతి తన జన్యు వైవిధ్యాన్ని కాపాడుకునే అసాధారణ మార్గాన్ని అభివృద్ధి చేసింది.

ఈ విధానంలో కొన్ని ప్రయోజనాలూ ఉన్నాయి. ఈ జాతులు కొత్త ప్రాంతాలకు వెళ్లడానికి, లైంగికంగా సంక్రమించే వ్యాధులకు దూరంగా ఉంటాయి. దీనిలో సమస్యలూ ఉన్నాయి.

సహజంగా జరగకపోవడంతో లైంగిక పునరుత్పత్తి ద్వారా చేసే దానికంటే పార్థినోజెనిసిస్ ద్వారా వారి డీఎన్ఏ మరింత హానికరమైన జన్యు ఉత్పరివర్తనాలను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పార్థినోజెనిసిస్ ద్వారా జన్మించిన సకశేరుకాలు జీవితకాలం తక్కువుంటుందని ఫెల్డ్‌హీమ్ తెలిపారు.

జీబ్రా షార్క్‌లలో కృత్రిమ గర్భధారణ ట్రయల్‌లో లియోన్స్ పాల్గొన్నారు. ఇక్కడ లైంగికంగా ఉత్పత్తి అయిన, పార్థినోజెనెటిక్ ద్వారా పుట్టిన సంతానాల మధ్య మనుగడ అవకాశాలను శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.

పార్థినోజెనిసిస్ ద్వారా పుట్టిన జీవులు, సగటున ఒక సంవత్సరం తక్కువ కాలం జీవించారని అధ్యయనం కనుగొంది. ఈత కొట్టడం, ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాయి.

మానవ జాతిలో ఈ విధమైన సంతానంపై లియోన్స్ స్పందిస్తూ.. "మహిళలు ఈ విధంగా పునరుత్పత్తి చేసే అవకాశం ఉందా లేదా? అనేది ఇప్పటివరకు తెలియదు" అని తెలిపారు.

కాగా, స్టింగ్ రేలలో పార్థినోజెనిసిస్ సాక్ష్యాలను చూసి తాను ఆశ్చర్యపోలేదని లియోన్స్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)