కత్తి మింగడమనే కళ వైద్య రంగాన్ని ఎలా మార్చింది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వకార్ ముస్తఫా
- హోదా, జర్నలిస్ట్, పరిశోధకులు
ఒక కత్తి గొంతు లోపలికి అలా వెళ్లిపోయి, కొన్ని క్షణాల తర్వాత బయటకు వచ్చింది. 19వ శతాబ్దంలో ఒక సాయంత్రం వేళ జర్మనీలోని హైడెల్‌బర్గ్ వీధులలోంచి డాక్టర్ అడాల్ఫ్ కుస్మాల్ వెళ్తున్నప్పుడు అక్కడ కొంతమంది గూమిగూడడాన్ని చూశారు.
అక్కడే ఈ ఆశ్చర్యకరమైన దృశ్యం కుస్మాల్ కంటపడింది.
‘ఓ వ్యక్తి కత్తిని మింగేయడాన్ని చూసిన కుస్మాల్ ఆశ్చర్యపోయారు. మానవ శరీరం లోపల ప్రయోగాలకు ఈ విధానం వాడొచ్చా? అని అనుకున్నారు" అని రాబర్ట్ యంగ్సన్ తన 'ది మెడికల్ మేవరిక్స్' పుస్తకంలో రాశారు.
కాగా, కత్తి మింగడం అనేది ఒక పురాతన నైపుణ్యమని, ఈ కళ దాదాపు క్రీస్తు పూర్వం 2000 కాలంలో భారత్‌లో మొదలైందని బారీ డె లాంగ్, హెరాల్డ్ ఎస్. పైన్ అనే పరిశోధకులు చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ నుంచి బ్రిటన్‌కు..
'కత్తి మింగడం (స్వార్డ్ స్వాలో)' అనే కళ భారత్ నుంచి బ్రిటన్‌కు చేరుకున్నపుడు ఈ నైపుణ్యాన్ని అపురూపంగా పరిగణించారని 19వ శతాబ్దం తొలినాళ్లలో ఒక పత్రిక రాసింది.
1813లో 'కత్తి మింగడం' అనేది ఆ సమయంలో లండన్‌లో భారతీయ విన్యాసాలు ప్రదర్శించిన కొత్త, ఆశ్చర్యకరమైన ఫీట్‌గా ప్రచారం అయింది.
ఇలాంటి ప్రదర్శనలు చేసేవారు యూరప్, అమెరికాల్లోనూ పర్యటించారు. మిగతా వాటితో పోలిస్తే కత్తి మింగడమనే కొత్తదనం ప్రజల దృష్టిని ఆకర్షించిందని 'ది టైమ్స్' మ్యాగజీన్ తెలిపింది
భారతీయ ఇంద్రజాలికులు ఖడ్గం మింగే ప్రదర్శనతో నగరాన్నే ఆశ్చర్యపరిచారని తెలిపింది. 19వ శతాబ్దం చివరినాటికి, కత్తి మింగడమనే నైపుణ్యం యూరప్‌తో సహా ప్రపంచమంతటా వ్యాపించింది.

ఫొటో సోర్స్, Getty Images
పేషెంట్‌గా స్వార్డ్ స్వాలోవర్
"వ్యాధి పరిశోధనల కోసం అన్నవాహిక ద్వారా శరీరంలోకి లోతుగా చొప్పించగల ఒక పరికరాన్ని స్వార్డ్ స్వాలోవర్ 'ఐరన్ హెన్రీ' సహాయంతో డా. కుస్మాల్ అభివృద్ధి చేశారు" అని పరిశోధకులైన లాంగ్, పైన్ తెలిపారు. 'ఐరన్ హెన్రీ'పై ఎండోస్కోపీ నిర్వహించారని 1868లో ఎలిజా బెర్మన్ రాశారు.
“కణితితో బాధపడుతున్న పేషెంట్ అన్నవాహికలోకి ఎక్కువ దూరం చూడలేకపోయారు కుస్మాల్. దీంతో 47 సెంటీమీటర్ల పొడవాటి ట్యూబ్‌ను ఐరన్ హెన్రీ మింగారు. అనంతరం అద్దం, నూనె దీపం సహాయంతో కడుపులోని ఆహార నాళాన్ని కుస్మాల్ గమనించారు'' అని ఎలిజా తెలిపారు.
కాగా, కత్తిని మింగడం ప్రమాదకరమైన ఫీట్, ఇది మరణానికి కూడా దారి తీస్తుంది. కత్తులు మింగిన వారి పేగులలో రక్తస్రావం అయిందని, ఆహార నాళానికి తీవ్రమైన గాయాలు అయిన సందర్భాలు ఉన్నాయని బ్రిటిష్ మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం తెలిపింది.
వైద్య ప్రయోగాలలో కత్తి మింగేవారు చాలా ముఖ్య పాత్రే పోషించారు. కానీ, ఇది చాలా ప్రమాదకరం, దీన్ని ఎవరికి వారే చేయడం ప్రాణాంతకం.
స్టీవెన్స్ అనే స్కాటిష్ వైద్యుడు కత్తిని మింగిన వ్యక్తిపై వరుస ప్రయోగాలు చేశారని ఆల్బర్ట్ హాప్కిన్స్ 1897లో తెలిపారు.
'ఎలక్ట్రో కార్డియోగ్రామ్' అనే పదం వైద్యులే ఎక్కువ తెలుసు, అప్పట్లో చాలామందికి 'ఈసీజీ' అంటేనే అర్థమయ్యేది. 1906లో ఎం క్రామెర్ అనే జర్మన్ వైద్యుడు గుండె పనితీరును రికార్డు చేయడానికి స్వోర్డ్ స్వాలోవర్ అన్నవాహికలోకి ఎలక్ట్రోడ్‌ను చొప్పించి, ప్రయోగం చేశారు.
నాకు ఎండోస్కోపీ సులభం: స్వార్డ్ స్వాలోయర్
గొంతు తీవ్రంగా దెబ్బతిన్న రోగులకు సహాయం చేయడానికి కత్తి మింగడం అనేది చికిత్సలో ఉపయోగించవచ్చో లేదో తెలుసుకోవడానికి 2007లో ఆండ్రూస్ అనే స్వార్డ్ స్వాలోవర్‌తో కలిసి జాన్ హాప్‌కిన్స్ వర్సిటీకి చెందిన డాక్టర్ షారన్ కాప్లాన్ పనిచేశారు.
తనకు ఎండోస్కోపీ సులభమని చెప్పారు టాడ్ రాబిన్స్ అనే స్వార్డ్ స్వాలోవర్. రాబిన్స్ అమెరికాలోని యేల్ వర్సిటీలో కత్తి మింగే కళ చరిత్రపై ఉపన్యాసాలు ఇచ్చారు. ఆయనను ఒలివియా బి. వాక్స్‌మాన్ అనే జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేశారు.
“నాకు ఎండోస్కోపీ చేయాల్సి వచ్చింది. సాధారణంగా ట్యూబ్‌ను చొప్పించే ముందు రోగిని అపస్మారక స్థితిలోకి పంపిస్తారు. కానీ నేను కత్తిని మింగగలను కాబట్టి, డాక్టర్ నాకు సులభంగా ఎండోస్కోప్ చేశారు'' అని రాబిన్స్ తెలిపారు.
అయితే ఇప్పుడు ఈ వృత్తి చరమాంకంలో ఉంది. ఇప్పుడు కొన్ని డజన్ల మంది స్వార్డ్ స్వాలోవర్స్ మాత్రమే ఉన్నారని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్వార్డ్ స్వాలోవర్స్ తెలిపింది.
ప్రతి సంవత్సరం ఫిబ్రవరి చివరి శనివారం అంతర్జాతీయ స్వార్డ్ స్వాలోయర్స్ డే అని జరుపుకొంటున్నారు.
ఈ పురాతన కళ దినోత్సవాన్ని జరుపుకొనే ఉద్ధేశం 'శాస్త్ర, వైద్య రంగానికి స్వోర్డ్ స్వాలోయర్ల సహకారం గురించి అవగాహన పెంచడం' అని స్వోర్డ్ స్వాలోవర్స్ అసోసియేషన్ అంటోంది.
ఇవి కూడా చదవండి:
- లాలూ ప్రసాద్ యాదవ్: ‘మోదీ ఈసారి గెలవరనే నేను అనుకుంటున్నా’
- ఉత్తరాఖండ్ యూసీసీ: 'లివ్-ఇన్ రిలేషన్షిప్'లో ఉన్నవారు రిజిస్ట్రార్‌కు సమాచారం ఇవ్వాలి, లేకుంటే శిక్ష తప్పదంటున్నకొత్త చట్టం
- తమిళనాడు అభివృద్ధి మంత్రమేంటి? ఈ రాష్ట్రాన్ని ‘న్యూయార్క్ టైమ్స్’ ఎందుకు పొగిడింది?
- ప్రధాని మోదీ పుట్టుకతో ఓబీసీ కాదని రాహుల్ గాంధీ ఎందుకు అన్నారు... బీజేపీ రియాక్షన్ ఏంటి?
- మోదీ ప్రభుత్వం పన్నుల ఆదాయం పంపిణీలో దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపిస్తోందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














